మెయిన్ ఫీచర్

అన్నమయ్య కీర్తనల్లో తత్త్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీ వేంకటేశ్వరుని వేడుకుంటూ ఆదినుంచీ ఆశ్రయించిన భక్తాగ్రగణ్యుడు, సంక్తీర్తనాచార్యుడు అన్నమయ్య. తాళ్ళపాక కవులన్నా, శ్రీ వేంకటేశుని భక్తులన్నా అందరికీ ముందుగా గుర్తుకొచ్చేది అన్నమయ్యే. తను రచించి గానం చేసిన 32వేల సంకీర్తనల్లో పద సాహిత్యం పరవళ్ళు త్రొక్కింది. సగుణ భక్తికి నీరాజనాలనందించి, సామ్రాజ్యాధిపతిని చేసింది. తరతరాలకు తరగని పెన్నిధిగా నిల్చింది. వాటిలో మధురభక్తి, ప్రశంస, నిందాస్తుతి, చమత్కార చాతుర్యం, ఆనందమకరందం, సరస శృంగారం, తత్త్వచింతన, భావ పారవశక్యం వంటి పరంపరలెన్నో విస్తారంగా వెల్లడౌతాయి, భక్తులను ఓలలాడిస్తాయి.
సాహితీ విలువలున్న కీర్తనల్లో ఆధ్యాత్మిక అంతరంగం, తాత్త్విక చింతనల, తరుణోపాయం, తేటతెల్లవౌతాయి. భక్తుల హృదయాలను తట్టి తరింపజేస్తాయి.
‘‘వెనె్నలలు, చీకట్లు వెలది, సుఖ దుఃఖాలు’’- కీర్తనలో ప్రాపంచిక విషయాలపై మమకారాన్ని మోసాన్నీ మట్టుబెట్టాలని, జీవితంలో ద్వంద్వాలను సమత్వబుద్ధితో ఎదుర్కోవాలని, భక్తిలో దృఢత్వం, స్థిర చిత్తం, స్థిత ప్రజ్ఞతా, సాధనలావశ్యకతల సంకేతం కానవస్తుంది.
‘‘ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు, దిద్దరాని మహిమల దేవకీ సుతుడు’’- కీర్తనలో ఇద్దరి తల్లుల ముద్దుల తనయుడు సామాన్య బాలుడుకాదని, చిన్నతనయుడులా తిరుగాడే యోగీశ్వరేశ్వరుడని, అతనిని శరణువేడి తరించాలిగాని, మరో మార్గంలేదని, ధ్వనింపజేసే ప్రబోధం ఇమిడుంది.
‘‘జ్ఞానము జ్ఞేయమం జ్ఞానగమ్యమును
పూని తెలియుటే యోగము’’-అన్న కీర్తనలో పరమాత్మను తెలుసుకున్న జ్ఞానమే జ్ఞానమని, అదే జీవుని గమ్యానికి చేర్చునిన, మిగిలినవన్నీ బంధాలేయని, ఓ మనసా! సాధనతో సాధించాలని ప్రబోధించాడు.
‘‘నానాటి బ్రతుకు నాటకము, కానక కన్నది కైవల్యము’’-అన్న కీర్తనలో చావుపుట్టుకల మధ్య జీవుడు నలగడమేకాని కైవల్య చింతన ఉండదు కదాయని నిట్టూరుస్తాడు. జీవితం, ఓ నాటకమని అందులోనే జీవితం మునిగిపోతుందని, కావున జీవితధర్మాన్ని, లక్ష్యాన్ని పసిగట్టాలని, తదనుగుణంగా ఇంద్రియాలను మనస్సును, నిగ్రహించుకొని సాధన సాగించాలని, అప్పుడే తరుణోపాయం, తటస్తించునని తెలియజేశాడు.
‘‘పుట్టుటయు నిజము, చచ్చుటయూ నిజము’’అంటూ జీవుడికి చావుపుట్టుకలు సత్యమని, రుూ చక్రబంధంలో చిక్కుకోకుండా ప్రతి మానవుడూ, తన మోక్షానికై తానే ప్రయత్నించుకోవాలి గాని, మరో మార్గమేదీ లేదని ఈ రహస్యాన్ని తెలుసుకొనే జ్ఞాని కావాలని మార్గదర్శనం గావించాడు.
రాజు నిద్ర, బంటు నిద్రయు ఒక్కటేయని, పండితుడుకి, చండాలునికి, చివరి మజిలీ ‘శ్మశానస్థలి’ ఒక్కటేయని, అక్కడ ఏ తేడాలుండవని జీవించిన కాలంలోనే రుూ భేదాలు తేడాలని దేవుని దృష్టిలో అంతా ఒక్కటేయని ప్రబోధించాడు.
‘‘నిండార రాజు నిద్రించు
నిద్రయు నొకటే, అండనే బంటు
నిద్ర అదియునొక్కటే,
మెండైన బ్రాహ్మణుడు మెట్టు
భూమియొకటే,
చండాలుండేటి సరిభూమి యొక్కటే’’
అంటూ వేదాంత రహస్యాన్ని తాత్త్విక చింతనను చేకూర్చాడు.
‘యోగి’కాదలచువాడు, అంతర్ముఖుడుగా వెలుగొందాలని, అందుకు సాధనయే ముఖ్యమని, శరణాగతియే శరణ్యమని సూచించాడు అన్నమయ్య.
‘‘రుూవల నావలవ నెనయ, తిరుగుటెల్ల శ్రీ వేంకటేశ్వరు జేరుటకొరకే’’- అన్న కీర్తనలో.
‘‘ఇన్ని జన్మములేటికి, హరిదాసులున్న వూర దానుండిన చాలు’’ - అంటూ హరిభక్తులున్నచోట ఉన్నవారు నిత్యముక్తులని, నిర్మల చిత్తులని, ధన్యజీవనులని, భాగవతోత్తముల సాంగత్యాన్ని మించింది లేదని చెప్పిన అన్నమయ్య సందేశం, శ్రీ శంకరులు వెలిబుచ్చిన ‘సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే- నిర్మొహత్వం, నిర్మొహత్వే-నిశ్చలతత్వం, నిశ్చలతత్వే- జీవన్ముక్తిః’’-అన్న నిర్వచనాన్ని ప్రతిబింబింపజేస్తుంది. ఆధ్యాత్మిక జీవనానికి సత్సాంగత్యం, తప్పని సరియన్న భావాన్ని బలపరుస్తుంది.
‘‘ఇన్నిటాను శ్రీ వేంకటేశ నీవు గలవని, వెనె్నల శరణనే- వాక్యమే చాలు’’-అన్న కీర్తనలో భగవత్ప్రాప్తికి శరణాగతినొందుటే, అనువైన మార్గమని వెల్లడించాడు. నామస్మరణం, సంకీర్తనం, భక్తునకు ముఖ్యమని, సదా సర్వకాల సర్వావస్థలలో సర్వేశ్వరుని స్మరణయే మేలని అంత భగవంతుడే భక్తుల చెంత నుంటాడని, అలా దైవసాక్షాత్కారం సంప్రాప్తించునని అన్నమయ్య తన కీర్తనల్లో తత్వచింతనను ఆపాదించాడు.
‘‘ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన అంతమాత్రమే నీవు’’చేసిన వారికి చేసుకున్నంత’’ అన్నట్లు ‘‘మనిషి దైవానికెంత దగ్గరైతే- దైవం అంత చేరువౌతాడన్న’’సత్యాన్ని వెల్లడించి భక్తులకు కొంగుబంగారమై నిల్చి లోకానికి అన్నమయ్య ఆధ్యాత్మికతత్వాన్ని అందించాడు. అమరుడై ఆరాధ్యుడయ్యాడు.

- చెళ్ళపిళ్ళ సన్యాసిరావు