సంపాదకీయం

చట్టంతో ‘మూక దాడుల’కు ముకుతాడు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమ్మాయిని ప్రేమించాడనో, గోవులను అక్రమ రవాణా చేస్తున్నాడనో, దొంగతనానికి వచ్చాడనో.. ఏదో ఒక నెపంతో సామూహికంగా భౌతిక దాడి చేయడం, చివరికి- ఆ వ్యక్తి మరణానికి దారితీయడం ఇటీవల మనం రోజూ చూస్తున్నదే. ఒకరు లేదా ఇద్దరు ఏమైనా చేస్తే దానినో అల్లరిగా చూసేవాళ్లం. ఒకరిద్దరి అల్లరి కాస్తా సామూహిక అంశంగా.. మూకగా మారింది. మూకలు ఇంత కాలం హెచ్చరికలతోనో, దాడులతోనే సరిపెడితే అది కాస్తా విషమించి ఇప్పుడు హత్యల వరకూ దారితీస్తున్నాయి. దేశంలో ఏదో ఒక ప్రాంతంలో మూకల దాడి సంఘటనలు అనునిత్యం జరుగుతున్నాయి.
అనుమానిత వ్యక్తులపై దాడి చేయడం తరతరాలుగా ఉన్నా, ఇటీవలి కాలంలో ఆగ్రహావేశాలతో దాడులు చేయడం పరిపాటిగా మారింది. దీనినే మూక దాడిగా, మూక హింసగా, మూకల హత్యగా వ్యవహరిస్తున్నాం. కవులపై, రచయితలపై, సమాచార హక్కు చట్టం కార్యకర్తలపై, పాత్రికేయులపై కూడా మూక దాడులు జరిగిన సంఘటనలు లేకపోలేదు. మనదేశంలో మూక దాడులను అరికట్టేందుకు ఎలాంటి ప్రత్యేక చట్టం లేదు. అయితే మూక పాల్పడే వివిధ నేరాలకు సంబంధించి భారత శిక్షా స్మృతి-ఐపీసీలో ప్రస్తావన ఉంది. ఒక బృందం నేరాలకు పాల్పడినపుడు ఆ బృందంలోని సభ్యులందర్నీ ఉమ్మడిగా ఆ నేరంపై విచారించాలని నేర శిక్షా స్మృతి -సీఆర్‌పీసీ సెక్షన్ 223 నిర్దేశిస్తోంది. భిన్నమైన రూపాల్లోని విద్వేషపూరిత హింసను అరికట్టేందుకు మరికొన్ని చట్టాలు కూడా ఉన్నాయి. మూక దాడులను ని యంత్రించేందుకు ఒక చట్టాన్ని తీసుకువచ్చే అంశాన్ని పరిశీలించాలని తాజాగా సర్వోన్నత న్యాయస్థానం సూచించడంతో కేంద్రం ప్రభుత్వంలో కదలిక వచ్చింది. అల్లరి మూకలు చేసే దాడులను, హత్యలను సమర్ధంగా ఎదుర్కొనేందుకు కొత్త చట్టాన్ని చేసే అంశాన్ని పరిశీలించాలని సుప్రీం పార్లమెంటుకు సూచించింది. ప్రజలే సొంతంగా పాలనను, చట్టాలను తమ చేతుల్లోకి తీసుకుని శిక్షలు విధించే భయానక పద్ధతిని అనుమతించరాదని సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఎఎం ఖాన్ విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌లతో కూడిన ధర్మాసనం ఇచ్చిన 45 పేజీల తీర్పులో పేర్కొంది. శాంతి భద్రతలను కాపాడటంతో పాటు చట్టాలు అమలయ్యేలా చూడటం రాష్ట్రాల బాధ్యతనేనని సుప్రీం స్పష్టం చేసింది.
మూక దాడుల వంటి హింసాత్మక సంఘటనలు నిరోధించేందుకు మార్గదర్శకాలు జారీ చేయాల్సిందిగా మహాత్మా గాంధీ ముని మనవడు తుషార్ గాంధీ, తేహ్సీన్ పునావాలా తదితరులు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారించి న్యాయస్థానం ఈ ఆదేశాలు ఇచ్చింది. చట్టాన్ని తారుమారు చేసే భయంకరమైన మూకస్వామ్యాన్ని తాము అనుమతించలేమని, గ్రీకు పురాణాల్లోని టైఫన్ లాంటి రాక్షసుల మాదిరి ఈ తత్వం పెరిగిపోయే పెనుముప్పు ఉందని కోర్టు అభిప్రాయ పడింది. ఈ సందర్భంగా కేంద్రం కొత్త చట్టం చేయదల్చుకుంటే అందులో ఉండాల్సిన కనీస అంశాలను కూడా సర్వోన్నత న్యాయస్థానం సూచన ప్రాయంగా చెప్పింది.
మూక దాడులను నిరోధించేందుకు ప్రతి జిల్లాలోనూ ఎస్పీ లేదా ఆ పై స్థాయి అధికారిని నోడల్ అధికారిగా నియమించాలి. దాడులు చేసే అవకాశం ఉన్న వ్యక్తులను ముందే పసిగట్టడానికి ఒక నిఘా బృందం ఉండాలి, దానికి డిఎస్పీ స్థాయి అధికారి నాయకత్వం వహించాలి. గతంలో మూక దాడులు జరిగిన జిల్లాలు, ప్రాంతాలు, గ్రామాలను గుర్తించే పనిని రాష్ట్రాలు తక్షణమే ప్రారంభించాలి. మూడు వారాల్లోగా అందుకు సంబంధించిన నివేదికలను సిద్ధం చేయాలి. డీజీపీ లేదా హోం శాఖ కార్యదర్శులు నోడల్ అధికారులతోనూ, పోలీసు నిఘా విభాగంతోనూ నిత్యం సమీక్షలు నిర్వహించాలి. మూక దాడులు జరిగేందుకు అవకాశం ఉండేలా ఎక్కడైనా గుంపులు కనిపిస్తే వారిని చెదరగొట్టాల్సిన బాధ్యత పోలీసులదే. మూక దాడులకు పాల్పడేవారు తీవ్ర పరిణామాలను ఎదుర్కోవల్సి ఉంటుందని ప్రభుత్వం ప్రకటనల రూపంలో హెచ్చరించాలి. పొలీసు అధికారి లేదా జిల్లా అధికారి ఎవరైనా కోర్టు జారీ చేసిన ఆదేశాలను పాటించకపోతే నిర్లక్ష్యం, దుష్ప్రవర్తనగా భావించి వారిపై తగిన చర్యలకు కూడా ఈ చట్టంలో అవకాశం ఉండాలి. ఈ సలహాలతో సమగ్రమైన చట్టాన్ని చేయాలని సుప్రీంకోర్టు పేర్కొంది.
మూక దాడులపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న సమయంలోనే నాలుగైదు సంఘటనలు జరిగాయి. ఝార్ఖండ్‌లో సామాజిక కార్యకర్త స్వామి అగ్నివేష్‌పై మూక దాడి జరిగింది. ఇటువంటి దాడులు జరిగినపుడల్లా ఆ కారణాలకు సాధికారిత కల్పించే ప్రయత్నాన్ని ఉన్నత స్థానాల్లో ఉన్నవారు చేసినపుడు, దాడులకు పాల్పడిన వారు బెయిల్‌పై విడుదలైన సందర్భాల్లో వారికి ఘనస్వాగతం లభించినపుడు అదేదో ఘనకార్యం సాధించామని వారు భావించినపుడు మూక దాడుల సంస్కృతికి కొత్త భాష్యాన్ని దిద్దే ప్రయత్నం ప్రతిసారీ జరుగుతోంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో చట్టం ముందు అంతా సమానులే, ఎవరూ చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడానికి వీలు లేదు. తప్పు చేసిన వారికి శిక్షలను ఖరారు చేసేందుకు న్యాయస్థానాలున్నాయి, శిక్షలు అమలు చేసేందుకు పరిపాలనా యంత్రాంగం ఉంది. వారి అధికారాలను చేతుల్లోకి తీసుకుని తామే శిక్షించాలని మూకలు ప్రయత్నించినపుడు వారిని అదుపు చేయాల్సిన బాధ్యత కూడా పాలనా యంత్రాంగంపై ఉంటుందే తప్ప ఏదో చోద్యం చూసినట్టు వ్యవహరించడం తగదు.
దేశంలో ప్రతి తప్పుకూ చట్టాలు, శిక్షలు చాలా స్పష్టంగానే ఉన్నాయి. చట్టంపై అవగాహన పెంచుకుంటున్న నేరస్థులు అక్కడక్కడ వాటిని అమలు చేయడంలో ఉన్న లొసుగులను చూపించి తప్పించుకుంటున్నారు. ఇన్ని చట్టాలు ఉన్నపుడు కొత్తగా మూకల దాడులను నియంత్రించడానికి మరో చట్టం అవసరమా? అనే వారూ లేకపోలేదు. దేశంలో మూకస్వామ్యం సరికొత్త నియమంగా మారినట్టు కనిపిస్తోందని సుప్రీం చేసిన వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకోవల్సిందే. దీనికి కారణం గత రెండు మూడేళ్లుగా జరుగుతున్న సంఘటనలే. దేశవ్యాప్తంగా ఇలాంటి సంఘటనలు లక్షకుపైగా జరిగినట్టు అంచనా. ఇదేదో దేశంలో ఒకపార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అకస్మాత్తుగా మొదలైన వ్యవహారంగా చూడాల్సిన పనిలేదు. అలాగని మూక దాడులకు ఫలానావారే కారణం అని కూడా చెప్పనక్కర్లేదు, అయితే అధికారంలో ఉన్న నేతలకు ఇలాంటి హింసను నిరోధించాల్సిన బాధ్యత ఉంటుంది కనుక తప్పనిసరిగా ఎవరైనా పాలకులను నిందించడం సహజం. దీనిని అనుకూల అంశంగానే పాలకులు చూడాలే తప్ప ఇదేదో విపక్షాల కుట్రగా చూడకూడదు. ప్రభుత్వాన్ని విమర్శించడం అంటే ఏదో దేశానే్న విమర్శించినంత విపరీత ధోరణి ప్రదర్శించాల్సిన అవసరం అంత కంటే లేదు.
దళితులు, ఆదివాసీలపై జరిగే నేరాల నియంత్రణకు ఎస్సీ,ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం ఉండనే ఉంది. వాస్తవానికి ఆదివాసీలపై గ్రామాల్లో దాడులు జరుగుతున్నా, ఎస్సీలపై దాడులు జరుగుతున్నా అవి కేసుల రూపం వరకూ వస్తున్నవి చాలా తక్కువ. పట్టణ ప్రాంతాల్లో ఉన్న చైతన్యంతో పోలీసు స్టేషన్ల వరకూ వస్తున్నా గ్రామాల్లో మిగిలిన వారి భయంతో దాడులపై ఫిర్యాదు చేసేందుకు ఎవరూ ముందుకు రాలేకపోతున్నారు. సహచర కుటుంబ సభ్యులకు జరిగింది అన్యాయమే అని తెలిసినా బాధితులకు మద్దతు కూడా ఇవ్వలేకపోతున్నారు. చివరికి కేసులు కూడా పెట్టలేని పరిస్థితి ఉన్నపుడు ఇక వారికేం న్యాయం జరుగుతుంది?
ఎవరైనా సాహసించి కేసులు నమోదు చేసినా, నిందితులకు ఈ చట్టాల కింద శిక్షలుపడుతున్న శాతం చాలా తక్కువ. 2017 గణాంకాల ప్రకారం 47,338 కేసులు నమోదయ్యాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్సు బ్యూరో లెక్కల ప్రకారం ఈ సంఖ్య 40,774 మాత్రమే. 78.3 కేసుల్లో చార్జిషీట్ దాఖలైంది. 25.8 శాతం మంది దోషులకు మాత్రమే శిక్ష పడింది. ఇందులో ఎస్సీలపై అత్యాచార ఘటనలుగా నమోదైన కేసులు 6564. కాగా అందులో చార్జిషీట్ వరకూ వెళ్లినవి 81.3 శాతం కాగా, శిక్ష పడినవి 20.3 శాతం కేసులే. ఇక 2015 గణాంకాలు చూస్తే 38,564 కేసులు ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద నమోదు కాగా, 73.8 శాతం కేసుల్లో చార్జిషీట్ దాఖలు కాగా, 27.2 శాతం మాత్రమే శిక్షలు పడ్డాయి. అత్యాచార నిరోధక చట్టం 1995 నిబంధనలు చాలా స్పష్టంగా ఉన్నా వాటిని ఎవరూ నూరు శాతం పాటించడం లేదన్నది నిర్వివాదాంశం. దిగ్భ్రాంతికరమైన అంశం ఏమంటే దాడులకు పాల్పడిన వారి పేర్లు బాధితులు చెప్పినా చాలా సందర్భాల్లో అవి ఎఫ్‌ఐఆర్‌లలో నమోదు కావు. నేరాలకు పాల్పడేవారు డబ్బు, పలుకుబడి ఉన్న వారైతే బాధితులకు న్యాయం ఎలా జరుగుతుంది?
తాజాగా రాజస్థాన్‌లోని అల్వార్‌లో ఆవులను అక్రమంగా రవాణా చేస్తున్నారనే ఆరోపణపై ఒక వ్యక్తిని కొట్టి చంపిన సంఘటనపై కేంద్రం రాజస్థాన్ ప్రభుత్వాన్ని నివేదిక కోరింది. రాజస్థాన్‌లో ఇలాంటి సంఘటన జరగడం ఈ మధ్య కాలంలో ఇది నాలుగోది. మూకలు హింస, హత్యలకు పాల్పడే సంఘటనలను ఉన్న మార్గాలను, చట్టపరమైన చర్యలను సూచించేందుకు కేంద్రప్రభుత్వం రెండు ఉన్నతస్థాయి కమిటీలను ఏర్పాటు చేసింది. ఒక కమిటీకి కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్, మరో కమిటీకి కేంద్ర హోం శాఖ కార్యదర్శి రాజీవ్ గౌబా నేతృత్వం వహిస్తారు. రాజీవ్ గౌబా కమిటీలో జస్టిస్, న్యాయ వ్యవహారాల శాఖ కార్యదర్శి, శాసన విభాగం కార్యదర్శి, సామాజిక న్యాయ శాఖల కార్యదర్శి సభ్యులుగా ఉంటారు.హోం మంత్రి నేతృత్వం వహించే కమిటీలో విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్, రవాణా మంత్రి నితిన్ గడ్కరీ, న్యాయశాఖా మంత్రి రవిశంకర్ ప్రసాద్, సామాజిక న్యాయ శాఖా మంత్రి థావర్ చంద్ గెహ్లాట్ సభ్యులుగా ఉంటారు. అధికారుల స్థాయి కమిటీ చేసే సిఫార్సులను మంత్రుల స్థాయి కమిటీ పరిశీలించి, అవసరమైన సమాచారాన్ని రప్పించుకుని ప్రధాని మోదీకి ఒక నివేదికను సమర్పిస్తుంది. ఈ నివేదిక ఆధారంగా కొత్త చట్టాన్ని రూపొందించేందుకు కేంద్రం సిద్ధం కాబోతోంది. అవసరమైతే శీతాకాల సమావేశాల్లో దీనికి చట్ట రూపాన్ని ఇస్తారు.
మూక దాడులు అమానవీయ సమాజానికి ప్రతీక. ఉన్న చట్టాలే సక్రమంగా అమలుకాని పరిస్థితుల్లో కొత్త చట్టాలు తీసుకువస్తే అవైనా అంత పటిష్టంగా అమలవుతాయనే నమ్మకం ఉందా? కనీసం బాధితుల్లో గట్టి నమ్మకాన్ని, విశ్వాసాన్ని కల్పించేందుకైనా కొత్త చట్టాలు అవసరమే కదా! మూక దాడులు సమాజాన్ని ఎంత అమానవీయంగా మారుస్తాయో, విద్వేషాలు పురిగొల్పి సమాజాన్ని ఎలా చీలుస్తాయో చైతన్యం కలిగించడం చాలా అవసరం. చట్టం తీసుకువచ్చినపుడు దానిని నిర్బంధంగా అమలు చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉంటుంది. ఇలాంటి దాడుల సమయంలో నిర్లిప్తంగా వ్యవహరించే అధికార గణాన్ని సైతం కఠినంగా శిక్షించే నిబంధనలు ఈ చట్టంలో ఉంటే దానికి ఒక పరమార్థం ఉంటుందేమో. రాజకీయంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు ఎంతటి ఉన్నత స్థాయిలో ఉన్న వారినైనా ఈ చట్టం విడిచిపెట్టదనే గట్టి భరోసా కల్పించాలి. లేకుంటే దేశంలో ఉన్న అనేక చట్టాల మాదిరి ఇది మరో కొత్త చట్టం అవుతుందే తప్ప దాని వల్ల సమాజానికి ఏం మేలు జరగదనేది సుస్పష్టం. ఈ అనుమానాలకు పాతర వేసి ప్రభుత్వం నిజాయితీగా వ్యవహరిస్తే అది దేశ సౌభాగ్యానికి, పౌరుల మధ్య సౌభ్రాతృత్వానికి దోహదం చేస్తుంది.

-బీవీ ప్రసాద్ 98499 98090