ఎడిట్ పేజీ

సయోధ్యతోనే సమస్యలకు మోక్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏ రాజకీయ పార్టీ అయినా ప్రజల ఆకాంక్షలను, చరిత్రను గౌరవించాలి. గత తప్పిదాలు పునరావృతం కాకుండా చూసుకోవాలి. సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోనపుడు, ప్రాప్తకాలజ్ఞత లోపించినపుడు తీవ్ర పరిణామాలను ఎదుర్కొనాల్సి ఉంటుంది. చరిత్రను గౌరవిస్తూనే, వాస్తవాలను ప్రజల ముందు చర్చకు ఉంచాలి. ఆత్మస్తుతి, పరనింద వల్ల ప్రయోజనం శూన్యం. ఈ వైఖరి వీడకుంటే శత్రువుల సంఖ్యను పెంచుకున్నట్టే. తాజాగా లోక్‌సభలో టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం సందర్భంగాను, రాజ్యసభలో విభజన సమస్యలపై చర్చ సమయంలోను ఉభయ తెలుగు రాష్ట్రాలకు భరోసా ఇవ్వడంలో బీజేపీ, కాంగ్రెస్‌లు విఫలమయ్యాయి. రాష్ట్ర విభజనతో అన్ని విధాలా నష్టపోయిన ఏపీ ప్రజలకు ఊరట ఇచ్చేందుకు అధికార పక్షం ఎలాంటి హామీ ఇవ్వలేదు. విభజన చట్టంలోని హామీల అమలుకు కేంద్రంపై వత్తిడి తేవడంలో కాంగ్రెస్ విఫలమమైంది. ఏపీని ఆదుకోవాల్సిన అవసరం ఉందంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఒక మాట మాత్రం అన్నారు. అవిశ్వాస తీర్మానంపై చర్చలో ఆయన రాఫెల్ ఎయిర్‌క్రాఫ్ట్‌ల కొనుగోలులో అక్రమాలు జరిగాయని ఎక్కువ సేపు మాట్లాడారు. ప్రధాని మోదీని ఆకస్మికంగా ఆలింగనం చేసుకోవడం, సభలో కన్ను గీటడం వంటి రాహుల్ చేష్టలతో అవిశ్వాస తీర్మానం తీవ్రత తగ్గిపోయింది.
తెలుగు రాష్ట్రాల ప్రయోజనాలకు జాతీయ మీడియా అంతగా ప్రాధాన్యత ఇవ్వలేదు. రాహుల్ ‘కౌగిలింత’ ఉదంతం హాట్ టాపిక్‌గా మారింది. మిగతా అంశాలపై మోదీ తన ప్రసంగంలో ఘాటుగా బదులిచ్చినా, ఆంధ్ర, తెలంగాణ ఎంపీల డిమాండ్లకు సరైన సమాధానం ఇవ్వలేదు. మోదీ ప్రసంగంలో విభజన హామీలపై ఏదైనా ప్రకటన వెలువడుతుందని ఏపీ ప్రజలు ఆశించారు. అయితే, రాజకీయ కోణంలో ఆలోచించడంతో భాజపా నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. కేంద్రం ఏమి చేసినా టీడీపీ ఖాతాలోకి పోతుందనే అనుమానం బీజేపీకి ఉంది. ప్రత్యేక హోదా అసాధ్యమని తేలిపోవడంతో ఇక మిగిలిందల్లా ప్యాకేజీ మాత్రమే. సార్వత్రిక ఎన్నికలకు నియమావళి అమలు కావడానికి ముందు- విశాఖ రైల్వే జోన్, కడప ఉక్కు ఫ్యాక్టరీ వంటి విభజన హామీలపై కేంద్రం ఓ ప్రకటన చేసే అవకాశం ఉంది.
రాజ్యసభ చర్చలో కూడా ఇదే పరిస్థితి కొనసాగింది. అవిశ్వాస తీర్మానం, నేతల ప్రసంగాలు, ఏపీ సమస్యలపై ప్రస్తావన.. ఇవన్నీ రాజకీయ ఎత్తుగడల్లో భాగమే. నాలుగేళ్ల పాటు ఎన్డీఏలో భాగస్వామిగా ఉండి, పదవులను అనుభవించిన టీడీపీ ఇప్పుడు బీజేపీ పట్ల బద్ధశత్రువుగా మారినంత మాత్రాన ఉపయోగం లేదు. టీడీపీ అజెండా ఎలా ఉన్నా, లోక్‌సభలో అవిశ్వాస తీర్మానం పెట్టడం ద్వారా- మోదీ చేత సమాధానాలు రాబట్టకలిగింది. వైకాపా ఎంపీలు రాజీనామాలు చేయడం వ్యూహాత్మక తప్పిదం. రాజీనామాల సిద్ధాంతానికి ఇప్పటికే కాలదోషం పట్టింది. ఎంపీలు పార్లమెంటు సమావేశాలకు హాజరై తమ గళం విన్పించాలి. రాజీనామాలు చేసినందున లోక్‌సభలో వైకాపా వాణి రికార్డు కాలేదు. బహిరంగ సభలు, ర్యాలీలు, దీక్షల్లో ఎంత గట్టిగా మాట్లాడినా ఉపయోగం ఉండదు. ‘సెల్ఫ్ గోల్’ చేసుకోవడం వైకాపాకు అలవాటుగా మారింది. లోక్‌సభ వేదికగా టీడీపీ పోరాడిందనే సంకేతాన్ని చంద్రబాబు ప్రజల్లోకి పంపించారు.
తెలుగు రాష్ట్రాల ఎంపీలు ప్రజల ఆత్మాభిమానాన్ని కించపరిచే విధంగా మాట్లాడే ధోరణిని విడనాడాలి. అశాస్ర్తియంగా రాష్ట్ర విభజన జరిగిందనే పాతపాటను ఏపీ ఎంపీలు ఇంకా పాడడం ఎందుకు? తెలంగాణ ప్రజల ఆరు దశాబ్దాల ఆకాంక్షలు, సుదీర్ఘ ఉద్యమాలు ఫలించి కొత్త రాష్ట్రం ఏర్పడింది. తెలంగాణ ప్రజలు తమకు ఏమి కావాలో స్పష్టంగా తెలుసుకుని, అనుకున్న దానిని సాధించుకున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్‌కు అనేకసార్లు టీఆర్‌ఎస్ ఎంపీలు మద్దతు ఇచ్చారు. తెలంగాణకు కూడా విభజన చట్టంలోని హామీలను నెరవేర్చాలని ఆంధ్రా ఎంపీలు ఒక్కసారైనా కోరారా? ఏడు ముంపు మండలాల గురించి టీఆర్‌ఎస్ మాట్లాడితే, ఈ మండలాల పూర్వ చరిత్ర గురించి ఏపి ఎంపీలు బదులివ్వలేకపోయారు. సరైన నాయకత్వం లేనందునే విభజన సమయంలో ఏపీ ప్రజలు తమ ఆకాంక్షలను వ్యక్తం చేయలేకపోయారు. ఈ వైఫల్యం ముమ్మాటికీ తెదేపా, వైకాపా, కాంగ్రెస్ పార్టీలదే. భాజపా కూడా ఈ విషయంలో సాధించిన ఘనతేమీ లేదు.
టీఆర్‌ఎస్ ఎంపీలు ఏడు ముంపు మండలాలను ఆంధ్రాలో అన్యాయంగా విలీనం చేశారని పదే పదే ప్రస్తావిస్తున్నారు. చరిత్రలోకి వెళితే- 1956 నవంబర్ 1న ఆంధ్ర రాష్ట్రం, మిగులు హైదరాబాద్ ప్రాంతం ( తెలంగాణ)లో విలీనమై ఆంధ్రప్రదేశ్ అవతరించే సమయంలో భద్రాచలం రెవెన్యూ డివిజన్ ఆంధ్రలో భాగంగా తూర్పు గోదావరి జిల్లాలో ఉండేది. పరిపాలనా సౌలభ్యం కోసం భద్రాచలం రెవెన్యూ డివిజన్‌ను ఖమ్మం జిల్లాలో కలిపారు. 1959 వరకు తూర్పు గోదావరి జిల్లాలో భద్రాచలం డివిజన్ అంతర్భాగమే. ఏపీలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ఆటంకాలు తలెత్తకుండా చివరి నిమిషంలో మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అనేక మార్పులు చేసింది. అవగాహన లేని వారి సలహాలను పాటించి గందరగోళంగా వ్యవహరించింది. ఈలోగా ఎన్నికల కోడ్ రావడంతో ఆర్డినెన్సు ఇవ్వలేకపోయింది. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఏడు మండలాలను ఆంధ్రాలో విలీనం చేశారు. వీటిలో నాలుగు మండలాలు మొదటి నుంచి ఆంధ్రాలో ఉన్నాయి. కుక్కునూరు, వేలేరు పాడు, బూర్గంపహాడ్ మండలాలు మాత్రం హైదరాబాద్ సంస్థానంలో ఉండేవి. బూర్గంపహాడ్‌లోని రెండు గ్రామాలను మాత్రమే ఏపిలో విలీనం చేశారు. చింతూరు, భద్రాచలం, కూనవరం, విసిపురం ప్రాంతాలు తూర్పు గోదావరిలో 1959 వరకు ఉన్నవే. ఈ జిల్లాలోనే 1959 వరకు ఉన్న చర్ల, దుమ్ముగూడెం, వాజేడు, వెంకటాపురం మండలాలను 2014లో తెలంగాణలో విలీనం చేశారు. మార్పులు, చేర్పుల్లో భాగంగా భద్రాచలం దేవాలయం ఉన్న గ్రామం, నాలుగు మండలాలు తెలంగాణకు దక్కాయి. ఆంధ్రాకు కుక్కనూరు, వేలేరుపాడు మండలాలు పూర్తిగా, బూర్గంపహాడ్‌లో పాక్షికంగా వెళ్లాయి.
భద్రాచలం రెవెన్యూ డివిజన్‌లోని నూగూరు- చర్ల-వెంకటాపురం ప్రాంతాలు 1909 వరకు నాగ్‌పూర్ కేంద్రంగా ఉండే బ్రిటీష్ వారి సెంట్రల్ ప్రావిన్స్‌లో ఉండేవి. 17వ శతాబ్దం చివరిలో నిజాం ఈ ప్రాంతాలను బ్రిటీష్ వారికి అప్పగించారు. 1909లో సెంట్రల్ ప్రావిన్స్ బ్రిటీష్ ప్రభుత్వం నూగూరు-వెంకటాపురం- చర్లను పరిపాలనా సౌలభ్యం దృష్ట్యా మద్రాసు ప్రెసిడెన్సీలో విలీనం చేసింది. ఈ అంశాలను మద్రాసు ప్రెసిడెన్సీ గెజిట్‌లో స్పష్టంగా ప్రకటించింది. ఈ ప్రాంతాల్లో తెలుగు మాట్లాడే ప్రజలు ఉండడం, మంచి పంటలు పండడం, గిరిజనుల తిరుగుబాట్లు ఉండడంతో మద్రాసు ప్రెసిడెన్సీలో విలీనం చేస్తూ రాజమండ్రి పోలీసు అధికారుల అధీనంలోకి తెచ్చారు. ఇదంతా గత చరిత్ర. ఈ ముంపు మండలాల ప్రజలకు మెరుగైన వైద్యం, విద్య అందించేందుకు, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల నిర్వాసితులయ్యే వారికి పునరావాసం కల్పించేందుకు రెండు తెలుగు రాష్ట్రాలు ఉమ్మడిగా కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఆదీవాసీల సంక్షేమం, వారి సముద్ధరణ బాధ్యత రెండు రాష్ట్రాలకు ఉంది.
ప్రపంచ చరిత్రలో విభజనలెప్పుడూ గాయాలనే మిగుల్చుతాయి. ఇబ్బందులు లేకుండా మూడు కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేసిన ఘనత మాజీ ప్రధాని వాజపేయికి మాత్రమే దక్కుతుంది. దేశ విభజన సమయంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో కాంగ్రెస్ తీరు ఒకేలా ఉందని ప్రధాని మోదీ విమర్శించారు. ఇది వాస్తవమే. కాని అదే సమయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ రాజకీయ పరిణతిని మోదీ మెచ్చుకుంటే తప్పేంటి?
సిద్ధాంతపరంగా బీజేపీ, టీఆర్‌ఎస్ పరస్పర విరుద్ధమైనా, కేసీఆర్ మొదటి నుంచి బీజేపీని విమర్శిస్తూనే జీఎస్‌టీ నుంచి దివ్యాంగుల హక్కుల పరిరక్షణ వరకు అసెంబ్లీలో చట్టాలు చేసి దేశానికి ఆదర్శంగా నిలిచారు. పార్లమెంటు వేదికగా రెండు తెలుగు రాష్ట్రాల ఎంపీలు పరస్పరం విమర్శించుకునే పద్ధతిని మానుకోవాలి. దీని వల్ల జాతీయ స్థాయిలో పలుచన కావడం తప్పించి ప్రయోజనం ఏమీ లేదు. చారిత్రక సత్యాలను, భౌగోళిక సరిహద్దులను, ప్రజల ఆకాంక్షలను, ఆత్మాభిమానాన్ని, ఔన్నత్యాన్ని గుర్తించి, గౌరవించుకుంటూ సయోధ్యతో మెలగాలి.

-కె.విజయ శైలేంద్ర 98499 98097