మెయిన్ ఫీచర్

ఆత్మవిశ్వాసమే అందం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆమె ఓ జర్నలిస్ట్
ఆమె ఓ ఆర్జే
ఆమె ఓ వాయిస్ ఓవర్
ఆమె ఓ వ్యాపారవేత్త..
అబ్బా ఎంత మంది ‘ఆమె’ల గురించి చెబుతున్నారు అని విసుక్కుంటున్నారా? ఇదంతా చెబుతోంది ఒకే ఒక వ్యక్తి గురించి.. ఆమే చంద్ర వదన. ఒకే వ్యక్తి ఆర్జేగా, వాయిస్ ఓవర్‌గా వ్యవహరిస్తూనే వ్యాపారవేత్తగా అందలాలు ఎక్కుతోంది. పైగా యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్‌మెంట్ వారు ప్రతిష్టాత్మకంగా అందించే ఎంపెట్రెక్ (ఈఎంపీఆర్‌ఈటీఈసీ) అవార్డుకు ప్రపంచవ్యాప్తంగా అర్హత సాధించిన వ్యాపారవేత్తల తుదిజాబితాలో మనదేశానికి చెందిన చంద్ర వదన కూడా స్థానం సంపాదించుకుంది. కేరళకు చెందిన బహుముఖ ప్రజ్ఞాశాలి చంద్ర వదన ఓ వైపు ఆర్జేగా ఉద్యోగం చేస్తూనే నాలుగు సంస్థలను నడుపుతోంది. ఎంప్రెటెక్ ద్వారా వ్యాపారరంగంలో శిక్షణ పొందిన ఆమె మహిళలను సాధికారత దిశగా పోత్సహించేందుకు తనదైన ప్రయత్నం చేస్తోంది. వివరాల్లోకి వెళితే..
కేరళలోని కక్కనాడ్ ప్రాంతంలో జన్మించింది చంద్ర వదన. తరువాత త్రివేండ్రంలోని హాలీ ఏంజెల్స్ కానె్వంట్ హయ్యర్ సెకండరీ స్కూల్‌లో ప్రాథమిక విద్యను అభ్యసించింది. తదనంతరం కేరళ యూనివర్శిటీ నుంచి బీఎస్సీ (కెమిస్టీ ), తరువాత కొచ్చిన్ యూనివర్శిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి ఎంబీఏ పూర్తిచేసింది.
జీవితంలో ఇన్ని విజయాలు సాధించిన చంద్ర వదన చిన్న వయసు నుంచీ అడుగడుగునా అవమానాలను ఎదుర్కొంది. కారణం వర్ణవివక్ష. నల్లగా ఉన్న చంద్ర వదన యుక్తవయస్సుకు వచ్చినప్పటి నుంచీ అందరూ తన రంగును ఎగతాళి చేసేవారట. నల్లగా ఉన్న అమ్మాయిని ఎవరు పెళ్ళి చేసుకుంటారు? అనేవారట. తెల్లగా ఉంటేనే అందంగా ఉన్నట్లు లెక్క. కాబట్టి ఆ ముఖానికి ఏవైనా క్రీమ్స్ వాడొచ్చు కదా.. అంటూ ఎద్దేవా చేసేవారట.. పైగా చంద్ర వదన తల్లిదండ్రులతో మీ కూతుళ్ళు చాలా నల్లగా ఉన్నారు. కట్నం ఎక్కువ ఇవ్వాలి. కాబట్టి ఎక్కువగా కూడబెట్టండి అనే సలహాలు ఇచ్చేవారని ఓ ఇంటర్వ్యూ సందర్భంగా మీడియాకు తెలిపింది చంద్ర వదన. ఈ మాటల వల్ల తనలో ఆత్మన్యూనతా భావం పెరిగిపోయిందని, దాంతో జీవితంలో నేను అనుకున్నది సాధించలేనేమో అని కుంగిపోయానని కూడా చెప్పుకొచ్చింది. కానీ చంద్ర వదన తల్లి మాత్రం ఆమె బాధపడుతున్న ప్రతీసారి చంద్ర వదనతో ‘అందం అనేది బయటకు కనిపించే రూపం మీద కాదు.. నిన్ను నువ్వు సమాజంలో ఎలా నిరూపించుకుంటావో.., నీకున్న సామర్థ్యాలు, కమ్యూనికేషన్ స్కిల్స్, సామాజిక గుర్తింపు, నాయకత్వ లక్షణాలు, తోటివారికి ఎంత సహాయపడగలుగుతావో.. అనేదానిపై ఆధారపడుతుంది’ అని చెప్పిందట.
ఆమె మాటలకు ప్రభావితమైన చంద్ర వదన తరువాత సానుకూలంగా ఆలోచించడం నేర్చుకుంది. తన బలాలకు మరిన్ని మెరుగులు దిద్దుకుంది. దానికోసం ఆమె చాలా శ్రమించింది. తన విజ్ఞాన పరిధిని విస్తరించుకుంది. ఎంతలా అంటే ఒకప్పుడు స్టేజి ఎక్కి మాట్లాడాలంటే భయపడే యువతి, ఇప్పుడు వేదికలెక్కి నిండైన ఆత్మవిశ్వాసంతో అనర్గళంగా మాట్లాడుతోంది. ఇప్పుడు చంద్ర వదన అందం రెట్టింపు అయింది. ఇప్పుడు ఆమె ఆత్మవిశ్వాసం తొణికిసలాడే అందగత్తె.
2008లో ఓ టీవీ ఛానెల్లో జర్నలిస్ట్‌గా తొమ్మిది నెలలపాటు పనిచేసింది. ఈ క్రమంలోనే ఆమె ‘బెస్ట్ సిటిజన్ జర్నలిస్ట్’ అవార్డును కూడా అందుకుంది. 2009లో యూనివర్శిటీ ఆఫ్ మద్రాస్ నుంచి ఎంఎస్సీ సైకాలజీ పట్టాను అందుకుంది.
తదుపరి ఏడాది ఓ ప్రముఖ రేడియో స్టేషన్‌లో ఆర్జేగా కెరీర్‌ను ప్రారంభించింది. అలా అలా ఎదిగి నేడు ఆర్జేగా పనిచేయడంతో పాటు ప్రముఖ సినీనటులకు వాయిస్ ఓవర్‌గా కూడా మారింది. ఆర్జే, వాయిస్ ఓవర్‌గా బాగా బిజీగా ఉన్న చంద్ర వదన వ్యాపార నిర్వహణ, కెరీర్ ఎడ్యుకేషన్‌కు సంబంధించిన కోర్సులను కూడా పూర్తిచేసింది. ఇలా చదివేటప్పుడే ఆస్ట్రేలియాలోని అసోసియేషన్ ఆఫ్ విక్టోరియా నుంచి కెరీర్ ఎడ్యుకేషన్‌లో గ్రాడ్యుయేషన్‌లో చేరింది. అలా ప్రతిష్టాత్మకమైన యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలెప్‌మెంట్ (యూఎన్‌సీటీఏడీ) ఆధ్వర్యంలో వ్యాపార నిర్వహణలో శిక్షణ పొందింది.
‘4 ట్యూన్ ఫాక్టరీ’ పేరిట సొంతంగా మేనేజ్‌మెంట్ కన్సల్టింగ్ సంస్థను స్థాపించింది చంద్ర వదన. తరువాత కేరళలోని వ్యాపారవేత్తలను ప్రోత్సహించే ఉద్దేశ్యంతో పనిచేస్తున్న ‘విజరుూభవ’ అనే సంస్థలో జాయింట్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వహించేది. ఆ సమయంలోనే కొచ్చిన్‌లో 4 ట్యూన్ ఫాక్టరీలో భాగమైన ‘టీ4 టై నర్.కామ్’ అనే మరో సంస్థను కూడా మొదలుపెట్టింది. ఆన్‌లైన్‌లోనే సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సేవలు అందించడమే దీని లక్ష్యం. దీనిద్వారా ట్రైనర్లకు అవసరమైన నైపుణ్యాలు నేర్పించడంతో పాటు సమర్థమైన వ్యాపార నిర్వహణకు లేదా కెరీర్‌కు బాటలు వేసుకునేందుకు యువతకు అవసరమైన శిక్షణను అందిస్తోంది.
ట్రైనింగ్ అండ్ డెవలప్‌మెంట్ విభాగంలో ఒక సరికొత్త ఒరవడిని సృష్టించాలనే ఉద్దేశ్యంతో చంద్ర వదన ‘ట్రైనోపీడియా’ అనే ఓ పత్రికను ప్రారంభించింది. దీనిద్వారా ప్రొఫెషనల్ ట్రైనర్స్‌ను, శిక్షణను అందుకోవాలనే అభ్యర్థులను ఒకేతాటిపైకి తీసుకురావాలనేదే ఈ సంస్థ ఉద్దేశ్యం. నిపుణులు, శిక్షకుల నుంచి వచ్చే కథనాలు, పారిశ్రామిక ఠంగంలోని ప్రముఖ వ్యాపారవేత్తల ఇంటర్వ్యూలతో పాటు వివిధ రంగాల కెరీర్‌కు సంబంధించిన విషయాలు, పాఠకులకు అవసరమైన సమాచారం.. ఇలాంటివే ఆ పత్రిక ముడిసరుకు.
ఈ మూడు సంస్థలతో పాటు మహిళా వ్యాపారవేత్తలను ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో ‘ప్రయాణ’ అనే సంస్థను స్థాపించింది చంద్ర వదన. ప్రపంచంలో తన ఉనికిని చాటుకోవాలనుకునే మహిళలకు కెరీర్ కౌన్సిలింగ్, ట్రైనింగ్, మెంటరింగ్.. వంటి సేవలను అందించడంతో పాటు వారికి ఉపాధి, ఉద్యోగావకాశాలను కూడా అందిస్తోందీ సంస్థ. ఇలా మహిళలకు ఉపాధిమార్గాలకు చూపించడం, వ్యాపార నిర్వహణలో శిక్షణ ఇప్పించడం వంటివి చేస్తూ అందరికీ ఆసరాగా నిలుస్తోంది చంద వదన.
అలా అందరూ సూటిపోటిమాటలతో అందంగా లేవని, నల్లగా ఉన్నావని దెప్పిపొడిచే చంద్ర వదన.. ఇప్పుడు బహుముఖ ప్రజ్ఞాశాలి చంద్ర వదనగా మారింది. ఆర్జే, వాయిస్ ఓవర్, స్థానిక మహిళను సాధికారికత దిశగా అడుగులు వేయిస్తోంది. ఉపాధి నైపుణ్యాలు నేర్పించేందుకు నైపుణ్యాభివృద్ధి, కెరీర్ మేనేజ్‌మెంట్‌కు సంబంధించిన నాలుగు సంస్థలను స్థాపించి వాటిని విజయవంతంగా నడిపిస్తూ అంతులేని ఆత్మవిశ్వాసపు అందమైన వదనంతో కాంతులీనుతోంది చంద్ర వదన.

--ఉమామహేశ్వరి