మెయిన్ ఫీచర్

పిల్లల్లో సృజనాత్మకత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రెండు దశాబ్దాల క్రితం పిల్లల్లో వ్యక్తిత్వ వికాసం, సృజనాత్మకత, నాయకత్వపు లక్షణాలు, విభిన్న ఆలోచనాధోరణి పెంపొందించే దిశగా విద్యా విధానం వుండేది. క్రీడలు, ఆటపాటలు, వృత్తి శిక్షణ, చిత్రలేఖనం ఇత్యాది రంగాలు విద్యాభ్యాసంలో భాగమై వుండేవి. రాను రాను కార్పొరేట్ విద్యా సంస్కృతి విస్తరించి, ర్యాంకులు, మార్కుల సాధనే ధ్యేయంగా విద్యాభ్యాసం నడుస్తోంది. జవాబులు ముక్కున పెట్టి రాయడం, అధిక మార్కు లు తెచ్చుకోవడమే విద్యార్థుల లక్ష్యంగా మారుతోంది. ఫలితంగా వారిలో సృజనాత్మకత క్షీణిస్తోంది. అమెరికాలోని సెంటర్ ఫర్ క్రియేటివ్ స్టడీస్ వారి అధ్యయన నివేదిక ప్రకారం వయస్సు పెరిగేకొద్దీ బాలబాలికలలో సృజనాత్మకత వేగంగా తగ్గుతుందని, యుక్తవయస్సు వచ్చేనాటికి వారికి ప్రత్యేక శిక్షణ ఇవ్వకపోతే ప్రవర్తన, ఆలోచనా విధానం స్థిరపడిపోతుందని తెలియజేసింది. పశ్చిమ దేశాల కంటే దక్షిణాసియా దేశాలలోని బాల బాలికలకు సృజనాత్మకత, వైవిధ్యభరిత ఆలోచనా విధానం ఎక్కువగా వుంటుందని తెలియజేసింది. అందుకే వారు యుక్తవయస్కులయ్యేనాటికి సృజనాత్మకంగా ఎదగాలంటే చిన్ననాటినుండే వారిలో విభిన్నమైన ఆలోచనా విధానం పెంపొందించేందుకు తల్లిదండ్రులు కృషి చేయాల్సి వుంటుంది. అందుకు కొన్ని సూచనలు:
- పిల్లలు సహజమైన ఉత్సుకతతో అనేక ప్రశ్నలు అడుగుతుంటారు. సాధారణంగా తల్లిదండ్రులు వాటికి నేరుగా సమాధానాలు ఇస్తుంటారు. అలా కాకుండా వారి ప్రశ్నలకు వారే సమాధానాలు వెతుక్కునేలా ప్రశ్నలను సంధిస్తుండాలి. సరైన సమాధానం కనిపెట్టగలిగితే మంచి బహుమతి ఇవ్వవచ్చు. ఈ సమాధానం సరైనదని నీకెందుకు అనిపించింది, ఇది తప్పు అయితే సరైన సమాధానం ఏమిటి లాంటి ప్రశ్నలతో వారిలో ఆలోచనా విధానం మెరుగుపర్చవచ్చు. - కొన్ని ప్రశ్నలకు అప్పటికప్పుడు ఏదో ఒక సమాధానం ఇచ్చి తప్పించుకోజూస్తాం. అలా కాకుండా వారితో కలిసి ఆ ప్రశ్నలకు సరైన సమాధానం వెదకండి. భవిష్యత్తులో ప్రతీ ప్రశ్నకు సమాధానం ఓపికతో వెదికే పద్ధతి వారికి అలవడుతుంది.
- ఒక పరీక్షలో లేక ప్రాజెక్టులో ఫెయిల్ అయితే, ఉత్తీర్ణత పొందినవారితో పోల్చి వారిపై కోపగించుకుంటాం. అలా కాకుండా వారి పరీక్షలో ఫలితాన్ని పక్కనపెట్టి, వారి ప్రయత్నాలను మెచ్చుకోండి. భవిష్యత్తులో వారు మెరుగైన ఫలితాలను ఎలా రాబట్టవచ్చో ఓపికతో వారికి వివరించండి. విదేశాలలో పిల్లలకు వంట నేర్పించడం విద్యాభ్యాసంలో ఒక భాగం. వంట చేయడం అనే ప్రక్రియలో వారికి పూర్తి స్వేచ్ఛనివ్వడంవలన వారిలో సృజనాత్మకత వృద్ధి చెందుతుంది.
- వారంలో కనీసం ఒక రోజు పిల్లలకు ఒక అంశం ఇచ్చి స్వంతంగా మాట్లాడడమో లేదా రాయడమో చేయించండి. వారి ఆలోచనలు ఎలా వున్నా వాటిని ప్రోత్సహించి ఒక క్రమ పద్ధతిలో రాసేలా చూడండి. ఈ ప్రక్రియలో మన ఆలోచనలు, భావజాలం వారిపై రుద్దకుండా జాగ్రత్తపడండి.
- పిల్లలకు ప్రేరణ, ప్రశంస, ప్రోత్సాహం, ప్రోత్సాహకాలు ఇవ్వడం, నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించడం, ప్రతి పనిని విభిన్నంగా ఆలోచించి చేసేలా స్వాతంత్రం కల్పించడం టానిక్‌లా పనిచేసి వారిలో సృజనాత్మకత పెంపొందిస్తుంది. విమర్శ, చీటికి మాటికి అరవడం, వారు చేసే పనులలో తప్పులు వెదకడం వంటివి వారి ఆలోచనా విధానాలపై దుష్ప్రభావం కనబరుస్తాయి.
- అవకాశం వున్నంతవరకు వారికి స్వతంత్రంగా ఆలోచించడం, ఎవరి సహాయం లేకుండా పనులను ఒక్కరే చేసుకోవడం, ధైర్యంగా మాట్లాడడం నేర్పించండి. స్కూలులో లేదా బయట సెంటర్లలో పబ్లిక్ స్పీకింగ్ కోర్సులలో చేర్పించడం మంచిది. వారికి ఎలా మాట్లాడాలో నేర్పించాలి కాని ఏం మాట్లాడాలో నేర్పించకూడదు.
- పిల్లలు వీడియోగేమ్స్, నెట్‌వర్కింగ్, సోషల్ మీడియా వంటి ప్రక్రియలో సమయం వృధా చేయకుండా సృజనాత్మకత పెంపొందించే పజిల్స్, పొడుపు కథలు, చిక్కుముడులు, పెయింటింగ్, వివిధ కళలలో పాల్గొనేలా ప్రోత్సహించండి. సృజనాత్మక సూచీలను అంచనా వేసే విధంగా ఆన్‌లైన్ పరీక్షలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి.
-పిల్లలకు వారికి ఇష్టమైన క్రీడలు, సబ్జెక్టులు ఆడడం/ఎంచుకోవడం చేయనిస్తే, వారికి జవాబుదారితనం, యజమాన్యత పెరిగి అందులో విజయం సాధించేందుకు మరింత సృజనాత్మకంగా తయారౌతారు.
- పిల్లలకు వారి స్వీయ విలువ యొక్క ఆవశ్యకత గురించి తెలియజేయండి. సృజనాత్మకతతో అద్భుతమైన విజయాలు సాధించవచ్చునని నిజ జీవితంలో ఉదాహరణలతో వారికి అర్థమయ్యేలా చెప్పండి. ప్రతీవారిలో ఒక ప్రత్యేకత, ఆలోచనా విధానం, యిష్టాయిష్టాలు, భగవంతుడు ఇచ్చిన విశిష్టతలు వుంటాయి. వాటిని గురించి ప్రోత్సహించడం తల్లిదండ్రులుగా మన కర్తవ్యం.
- గ్రూప్ మీటింగ్స్ ఏర్పాటుచేసి ఒక అంశంపై పిల్లలు తమ భావాలను, ఆలోచనలను స్వేచ్ఛగా వ్యక్తీకరించే అవకాశం ఇవ్వండి. మంచి ఆలోచనలను ప్రోత్సహించండి.
నేటి విద్యావిధానంలో పిల్లలకు స్వేచ్ఛగా తమకు నచ్చిన చదువులు చదివే అవకాశం, స్వేచ్ఛాసమయాన్ని తమకు నచ్చిన విధంగా గడిపే అవకాశం లేదు. పరీక్షలు, సిలబస్, ప్రాజెక్టులు వారిపై ఒత్తిడి, ఆందోళన విపరీతంగా పెంచుతున్నారు. అందువలన వారిలో సృజనాత్మకత క్షీణించి ర్యాంకులు తెచ్చుకునే యంత్రాల్లా తయారౌతున్నారు.
ఇందుకు విద్యావ్యవస్థతోపాటు తల్లిదండ్రులుగా మనమూ బాధ్యులమే!

---సి.ప్రతాప్