మెయన్ ఫీచర్

ప్రధాని పదవికి అప్పుడే పోటీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి విభజన బిల్లులో ఇచ్చిన హామీలతో పాటు, రాజ్యసభ సాక్షిగా అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రకటన మేరకు ప్రత్యేక హోదా కల్పించడంలో మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న నేరమయ నిర్లక్ష్యాన్ని దేశప్రజల దృష్టికి తీసుకు రావడానికి తెలుగుదేశం పార్టీ లోక్‌సభలో ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానం దేశ రాజకీయాల గమనాన్ని వేగవంతం చేసింది. వాస్తవానికి తెలుగుదేశం పార్టీ ఆశించిన్నట్లు రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై కన్నా- 2019 ఎన్నికలను లక్ష్యంగా చేసుకొని ఈ సందర్భంగా జరిగిన చర్చలు ఆకట్టుకున్నాయి. ప్రతిపక్షాలు లేవనెత్తిన ఒక్క అంశంపై కూడా నేరుగా సమాధానం ఇవ్వలేని ప్రధాని మోదీ ఎదురు దాడులతో, భావోద్వేగాలను రెచ్చగొట్టడం ద్వారా మాత్రమే- వచ్చే ఎన్నికలలో తిరిగి ప్రజల మద్దతు కూడదీసుకొనే ప్రయత్నం చేసినట్టు స్పష్టమైనది. ఒక విధంగా అదనపు బలాన్ని సమీ కరించుకోవడంలో అటు అధికార పక్షం, ఇటు ప్రతిపక్షాలు కూడా విఫలమయ్యాయి. ఈ సందర్భంగా ప్రధాని మోదీని దీటుగా ఎదుర్కోగల నేతగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గుర్తింపు పొందారు. నిజానికి ప్రధాని ప్రసంగం కన్నా రాహుల్ ప్రసంగమే ఉద్వేగంగా, దూకుడుగా సాగింది.
ఆ ఉత్సాహంతోనే రెండు రోజుల తర్వాత జరిగిన పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశంలో తమ ప్రధాన మంత్రి అభ్యర్థి రాహుల్ గాంధీ అంటూ కాంగ్రెస్ స్పష్టమైన సంకేతం ఇచ్చింది. రాహుల్‌ను ప్రధాని అభ్యర్థిగా గుర్తించడానికి- కాంగ్రెస్ మద్దతుతో కుమారుడు కుమా రస్వామికి ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టిన మాజీ ప్రధాని దేవెగౌడ తప్ప మరెవ్వరూ ముందుకు రాలేదు. చివరకు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ సైతం- ప్రతిపక్షాలలో ప్రధాన మంత్రి అభ్యర్థులు చాలామంది ఉన్నారంటూ తేలికచేసి చెప్పారు. ఎన్నికల అనంతరమే ప్రతిపక్షాలు కలసి ప్రధాని అభ్యర్థిని ఎంచుకొంటాయని అంటూ ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ స్పష్టం చేశారు. ప్రధాని పీఠం కోసం తాను ప్రాకులాడటం లేదని అంటున్నప్పటికీ తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ రాజకీయాలలో రాహుల్ తన కన్నా చాలా జూనియర్ అని, అతనితో కలసి ఎప్పు డూ పనిచేయలేదని అంటూ పరోక్షంగా ప్రధాని పదవికి రాహుల్ తగిన అభ్యర్థి కాదంటూ కొట్టివేశారు. ప్రధా నమంత్రి పదవికి పోటీలో మమతా బెనర్జీ ముందున్నారని టీఎంసీ నేత డెరెక్ ఓబ్రెయిన్ పేర్కొనడం ద్వారా ఆమె తమ వ్యూహాన్ని బహిర్గతం చేశారు. 2019 ఎన్నికలకు పశ్చిమ బెంగాల్ దారి చూపుతుందని గత వారం మమతా స్వయంగా ప్రకటించారు. విపక్షనేతలతో త్వరలో కలకత్తాలో భారీ సభ జరుపుతున్నట్లు తెలిపారు.
ఇక- బిజూ జనతాదళ్, తెలుగు దేశం, ఎన్సీపీ వంటి ప్రతిపక్షాలు కూడా ఇప్పుడు రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా అంగీకరించడానికి సుముఖంగా లేవు. ప్రతి కూల పరిస్థితులను ముందుగానే అంచనా వేసి, ప్రత్యర్థులు ఊహించని విధంగా వ్యూహాత్మకంగా ముం దడుగు వేయడంలో ఈ మధ్య రాహుల్ ఆరితే రినట్లున్నారు. కర్ణాటక ఎన్నికలలో కాంగ్రెస్ గెలిచే ప్రసక్తి లేదని గ్రహించి, కుమారస్వామిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రతిపాదించి బిజెపికి ఆయన కోలుకోలేని షాక్ కలిగించారు.బిజెపిని అధికారంలోకి రాకుండా చేయడమే తమకు ముఖ్యమని, బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌లతో సంబంధం లేని వారెవరినైనా ప్రధాన మంత్రి అభ్యర్థిగా నిలబడితే తాము మద్దతు ఇవ్వడానికి సిద్ధమని ఆయన స్పష్టమైన సంకేతం ఇచ్చారు. తద్వారా వచ్చే ఎన్నికలలో బిజెపికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ఉమ్మడి అభ్యర్థులను అత్యధిక నియోజక వర్గాలలో నిలబెట్టడానికి సానుకూల పరిస్థితులను కల్పించారు. పైగా, ప్రధాని అభ్యర్థిగా ఈసారి మహిళ అయితే బాగుంటుంది అంటూ మమతా బెనర్జీ, మాయావతి పేర్లను తెరపైకి ఆయన తీసుకొచ్చారు. ఆ విధంగా ప్రతిపక్షాలలో కాంగ్రెస్ పట్ల సానుకూల పరిస్థితులు కల్పించేందుకు సమాయత్తం అవుతున్నారు.
ఉమ్మడి అభ్యర్థులను నిలబెట్టడం ద్వారా ఉత్తర ప్రదేశ్, బిహార్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు వంటి చోట్ల బిజెపిని మట్టి కరిపించవచ్చని ప్రతిపక్షాలు అంచనా వేస్తున్నాయ. బీజేపీ అధికారంలో ఉన్న రాజస్థాన్, మధ్య ప్రదేశ్, హర్యానా, ఛత్తీస్‌గఢ్ వంటి ప్రాంతాలలో అక్కడి ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నాయి. అందుచేత బిజెపిని ఓడించడం సాధ్యమే అని విపక్ష నేతలు నిర్ణయానికి వస్తున్నారు. ఇటువంటి ఎత్తుగడలు మాటలకు గమ్మత్తుగా ఉన్నా క్షేత్రస్థాయిలో అంత సులభం కావు. కాంగ్రెస్ బలహీనంగా ఉన్న ఉత్తర ప్రదేశ్‌లో ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవాలంటే ఆ పార్టీ బలంగా ఉన్న మధ్యప్రదేశ్, రాజస్థాన్ వంటి చోట్ల తమకు తగినన్ని సీట్లు కేటాయించాలని బీఎస్పీ, ఎస్పీ పట్టుబడుతున్నాయి. పశ్చిమ బెంగాల్‌లో కాంగ్రెస్‌లోని రెండు బలమైన వర్గాలు సిపిఎం, తృణమూల్‌తో పొత్తు పెట్టుకొనే విషయంలో పరస్పరం భిన్నమైన ధోరణులు అవలంబిస్తున్నాయ. కాంగ్రెస్ వ్యతిరేక రాజకీయాల నుండి ఆవిర్భవించిన తెలుగు దేశం పార్టీకి తెలుగు రాష్ట్రాలలో కాంగ్రెస్‌తో పొత్తు ఏర్పరచుకోవడం ఇబ్బందికరమే. అవిశ్వాస తీర్మానం సందర్భంగా తటస్థంగా ఉన్న బిజెడి, టిఆర్‌ఎస్ వంటి పార్టీల మద్దతును కాంగ్రెస్ కూడదీసుకోలేక పోయింది. బిహార్‌లో నితీష్ కుమార్ ను మహా కూటమిలోకి తీసుకు వచ్చే ప్రయత్నాలను ఆర్జేడీ నాయకులు సాగనీయడం లేదు.
లోక్‌సభలో అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా మొత్తం 129 ఓట్లు రావలసి ఉండగా 125 ఓట్లు రావడంతో ప్రతిపక్ష శిబిరం కలసి ఉన్నట్లు కనిపించినా ప్రధాని మోదీని ఓడించడం కోసం మరింత బలం సమీక రించుకొనక తప్పదు. అవిశ్వాస తీర్మానం సందర్భంగా అధికార, ప్రతిపక్షాల మధ్య జరిగిన బలప్రదర్శనే- రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక సందర్భంగా మరింత దూకుడుగా జరిగే అవకాశం ఉంది. తమ పార్టీ అభ్యర్థి గాని లేదా తాము చెప్పిన అభ్యర్థి గాని గెలుపొందే అవకాశం ఉన్నంత వరకు ఈ ఎన్నిక జరపడానికి అధికార బిజెపి ఆసక్తి చూపడం లేదు. ఈ ఎన్నికను పార్లమెంట్ శీతాకాల సమావేశాల నాటికి వాయిదా వేయాలని చూస్తున్నది. అప్పటికి రాజస్థాన్, మధ్య ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికలు ముగిసి, రాజకీయ పరిస్థితులలో చెప్పుకోదగిన మార్పులు రాగలవు.
మరోవంక ఎన్డీయేను పటిష్ట పరచుకోవడంతో పాటు, నూతన మిత్రులను అనే్వషించ వలసిన అవసరాన్ని కూడా బిజెపి గుర్తించింది. తెలుగు దేశం ఎన్‌డీఏ నుంచి బయటకు వెళ్లిపోగా, జమ్మూ కశ్మీర్ లో పిడిపిని స్వయంగా బైటకు పంపారు. బిహార్ లో జెడియు తిరిగి రావడం, ఈశాన్య రాష్ట్రాలలో కొన్ని చిన్న పార్టీలు వచ్చి చేరినా మరింతగా విస్తృత పరచుకోవలసి ఉంది. ఎంతగా అర్థించినా శివసేన పార్టీ వోటింగ్‌లో పాల్గొనక పోవడమే గాకుండా నిత్యం మోదీ ప్రభుత్వంపై విమర్శలు కురిపిస్తూ, వచ్చే ఎన్నికలలో ఒంటరిగా పోటీ చేస్తామని చెబుతూనే ఉంది. అకాలీదళ్ అవిశ్వాసానికి వ్యతిరేకంగా వోటు వేసినా ఆ పార్టీ నేత తెలుగు దేశం పార్టీ లేవనెత్తిన అంశాలకు లోక్‌సభలో మద్దతు తెలిపారు.
అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా 350 వరకు ఓట్లు రావలసి ఉన్నా, ఎన్డీయేలో భాగస్వామి కాని అన్నా డిఎంకెకు చెందిన 37 మంది అండగా ఉన్నా, మొత్తానికి 25 ఓట్లు తక్కువగా వచ్చాయి. మొదటిసారిగా పార్లమెంట్ లో రాహుల్ గాంధీ ఎంతో ఆత్మవిశ్వాసంతో కనిపించారు. సోనియా గాంధీ నుండి పార్టీ నాయకత్వం సజావుగా ఆయనకు మారినట్లు స్పష్టమైనది. జూన్ 22న జరిగిన పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశంలో కాంగ్రెస్‌కు వోటు వేయని వారిని గుర్తించి, వారి విశ్వాసం తిరిగి పొందే ఎత్తుగడను రూపొందించుకోవాలి అంటూ పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌కు మిత్రులను తీసుకు రావడంలో కీలక పాత్ర వహించనున్న సోనియా గాంధీ వ్యక్తిగత ఆకాంక్షలను ప్రక్కకు నెట్టి ప్రతిపక్షాలు వ్యూహాత్మక పొత్తులకు సిద్ధపడాలని కోరారు.
2004లో రాజకీయ పరిస్థితులు ఇప్పటివలెనే ఉన్నప్పటికీ సోనియా గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వడానికి సిద్ధపడిన మమతా బెనర్జీ, శరద్ పవార్, మాయావతి వంటి నేతలు ఇప్పుడు రాహుల్ నాయకత్వంలో పనిచేయడానికి సిద్ధంగా లేరు. మరోవంక ఆమ్ ఆద్మీ పార్టీ, తెలుగు దేశం, జాతీయ లోక్‌దళ్ పార్టీలు, రజనీకాంత్ వంటి వారితో వివిధ కారణాల వల్ల చేతులు కలపడానికి కాంగ్రెస్ సిద్ధంగా లేదు. ఇటువంటి పరిస్థితులలో మోదీ ఆధిపత్యానికి గండి కొట్టడం రాహుల్‌కి అంత సులభం కాబోదు.
అవిశ్వాస తీర్మానానికి రెండు రోజుల ముందు వోటింగ్‌లో పాల్గొనబోమని చెప్పిన అన్నా డిఎంకె ఎంపీలు విప్ జారీ చేయడంతో మూకుమ్మడిగా మోదీకి మద్దతుగా నిలబడడంతో తమిళనాడులో తమ ప్రభు త్వాన్ని కాపాడుకునేందుకు మోదీ ఆడించినట్లు ఆడుతున్నారని స్పష్టమైనది. అయితే తమిళ ప్రజలలో తమకు చెప్పుకోదగిన మద్దతు లేకపోవడం, రజనీకాంత్ ఏ మేరకు కలసి వస్తారో చెప్పలేని పరిస్థితులు నెలకొనడంతో ఆ రాష్ట్రంలో బిజెపికి ఎటువంటి ఆధారం దొరకడం లేదు. ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్‌లను బిజెపి ఆడిస్తున్నట్లు ఇప్పటి వరకు చెబుతూ వస్తున్నా, ఇప్పుడు మోదీ వ్యతిరేక ధోరణి అవ లంబించనిదే రాజకీయంగా రాష్ట్రంలో నూకలు చెల్లుబాటు కావని ఈ నేతలు గ్రహించారు. అందుకనే మోదీకి వ్యతిరేకంగా జగన్ రాష్త్ర బంద్ జరపడం, రాష్ట్రంలో ఒక్క సీట్ కూడా గెల్చుకోలేని బీజేపీతో పొత్తా? అంటూ పవన్ ఎగతాళి చేయడం జరిగింది. తెలంగాణలో బిజెపి అనుకున్న విధంగా బలం పుంజుకోలేక పోతు న్నట్లు స్వయంగా ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా అసంతృప్తి వ్యక్తం చేశారు. అందుకనే ఉత్తరాదిన తగ్గే సీట్లను భర్తీ చేసుకోవడం కోసం అమిత్ షా ఇప్పుడు వ్యక్తిగతంగా పశ్చిమ బెంగాల్, ఒడిశా వంటి రాష్ట్రాలపై దృష్టి కేంద్రీకరించారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న హర్యానా, అస్సాం తదితర రాష్ట్రాలలోనూ బిజెపి బలహీన పడటం స్పష్టంగా కనబడుతున్నది. బిజెపి ఎంత గా బలహీనపడితే కాంగ్రెస్ అంతగా బలపడుతున్నట్లు భావించవలసి ఉంటుంది. ఉత్తర ప్రదేశ్, బిహార్ లను మినహాయిస్తే బీజేపీకి ఎక్కువగా ఎంపీ సీట్లు గెలుపొందిన రాష్ట్రాలు అన్నింటిలో కాంగ్రెస్ ప్రధాన ప్రత్యర్థి కావడం గమనార్హం.
ఇప్పటి వరకు ముందస్తు ఎన్నికలు, జమిలి ఎన్నికలు అంటూ హడావుడి చేసిన బిజెపి ఇప్పుటు అటువంటి సాహసం చేసే స్థితిలో కనబడటం లేదు. మొన్నటి వరకు ముందస్తు ఎన్నికలు జరపడానికి తాము సిద్ధమే అంటూ చెప్పిన ఎన్నికల సంఘం ఇప్పుడు తన స్వరాన్ని మార్చి వేసింది. ముందుగానే ఎన్నికల నిర్వహణకు అవసరమైన సరంజమా సిద్ధంగా లేదన్నట్టుగా సమాచార హక్కు చట్టం ద్వారా అడిగిన ఓ ప్రశ్నకు భారత ఎన్నికల కమిషన్ ఇచ్చిన సమాధానంలో వెల్లడించింది. దాంతో ఇప్పుడు రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల పైనే దృష్టి సారిస్తున్నారు.
రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా ఆమోదించడానికి ఇతర ప్రతిపక్షాలలో ఉన్న అభ్యంతరాలు బిజెపికి వరంగా మారే అవకాశం లేకపోలేదు. మొన్నటి వరకు 350 సీట్లు గెల్చుకోవడం లక్ష్యంగా చెప్పుకొంటూ వస్తున్న అమిత్ షా ఇప్పుడా సంఖ్యను పెద్దగా ప్రస్తావించడం లేదు. ఏదో విధంగా అధికారం నిలబెట్టుకొంటే చాలానే ధోరణి బిజెపి నాయకత్వంలో కనిపిస్తున్నది. బిజెపికి సొంతంగా మెజారిటీ దక్కని పక్షంలో మోదీని ప్రధానమంత్రి అ భ్యర్థిగా ఎన్‌డీఏ మిత్రపక్షాలు ఆమోదించక పోవచ్చు. అటువంటప్పుడు రాహుల్ ప్రధానమంత్రి కాకుండా- బిజెపి మరొకరిని ఆ పదవికి ముందుంచక తప్పదు. అందుకనే మోదీ తర్వాత ఎవరనే చర్చ ఇప్పటికే సంఘ్ పరివార్‌లో ప్రారంభమైంది. తెదేపా వంటి పార్టీలు రాహుల్ కన్నా బిజెపి నుండి మోదీకి బదులు మరొకరు ప్రధాని కావడానికి సుముఖత వ్యక్తం చేసే అవకాశం లేకపోలేదు. రాహుల్ గాంధీకి బహి రంగంగా మద్దతు తెలిపిన దేవెగౌడ పరోక్షంగా బిజెపికి సానుకూల సంకేతాలు పంపుతున్నారు. తద్వారా తన కుమారుడి ప్రభుత్వాన్ని బిజెపి అస్థిరత్వం పాలు చేయకుండా జాగ్రత్త పడుతున్నారు. రాజనాథ్ సింగ్, నితిన్ గడ్కరీ వంటి నేతలు ఇతర ప్రతిపక్షాల మద్దతును సునాయాసంగా కూడగట్టుకోగలరు. అందుకనే 2019లో ప్రధాని పదవికి జరిగే పోటీ అనూహ్యమైన మలుపులు తిరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

-చలసాని నరేంద్ర