మెయన్ ఫీచర్

రసకందాయంలో తెలుగు రాజకీయం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇటీవల ఒక కాంగ్రెస్ ప్రతినిధి బృందం తెలంగాణ నుండి ఢిల్లీ వెళ్లి తమ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిసింది. ఈ సందర్భంగా కొందరు నాయకులు అధిష్ఠానం వద్ద పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షునిగా ఉత్తమకుమార్ రెడ్డిని కొనసాగిస్తే వచ్చే ఎన్నికల్లో 20 అసెంబ్లీ సీట్లు కూడా రావని, అందుకని వెంటనే అట్టడుగు వర్గాలకు ప్రాతినిధ్యం వహించే భట్టివిక్రమార్కకు పార్టీ పగ్గాలు అప్పగించాలని మొరపెట్టుకున్నారట! దీంతో కాంగ్రెస్ అధిష్ఠానం ఏమీ చేయలేని స్థితిలో పడింది. ఎందుకంటే తెలంగాణలో బలమైన రెడ్డి సామాజిక వర్గాన్ని దూరం చేసుకుంటే ఇక్కడ ఆ పార్టీకి అస్తిత్వమే ఉండదు. కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలున్నాయి. అది సహజమే. కొత్తగా పార్టీలో చేరిన నాగం జనార్దన రెడ్డిని పార్టీ నాయకులు అక్కున చేర్చుకోవటం లేదు. ‘నేనే కాబోయే ముఖ్యమంత్రి’ని అంటూ హడావుడి చేసిన రేవంత్‌రెడ్డిపై కాంగ్రెస్ శ్రేణులు మండిపడ్డాయి. జానారెడ్డి చాలా సీనియర్ నాయకుడు. అయినా ఆయన టిఆర్‌ఎస్ పట్ల కఠినంగా వ్యవహరించటం లేదని కాంగ్రెస్ వారే ఆరోపిస్తున్నారు. జైపాల్‌రెడ్డి మేధావి వర్గానికి చెందినవాడే అయినా వృద్ధుడైనాడు. ఆయన ఎంతసేపూ బిజెపిని, మోదీని తిట్టడానికే సమయం కేటాయిస్తున్నారని, పార్టీ నిర్మాణం గురించి ఆలోచించడం లేదన్నది కొందరి వాదన.
తెలంగాణలో కాంగ్రెస్‌కు ఎన్నికల సంవత్సరంలో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. టీపీసీసీ అధినేత ఉత్తమ్‌కుమార్ రెడ్డి నిర్వహించిన బస్సుయాత్ర విజయవంతమై పార్టీ శ్రేణులలో కొత్త ఉత్సాహం నింపింది. కాగా, కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో మరొక ఇబ్బంది వచ్చి పడింది. అది ధర్మపురి శ్రీనివాస్ కుమారుడైన అరవింద్ నుండి రావడం గమనార్హం. డి.శ్రీనివాస్ ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో సోనియా గాంధీకి నమ్మకమైన నాయకుడు. ఎన్నో పదవులు అనుభవించిన వాడు. ఉన్నట్లుండి కాంగ్రెస్‌ను వీడి టిఆర్‌ఎస్‌లో చేరారు. ఆయన కుమారుడు అరవింద్ ప్రస్తుతం బిజెపిలో ఉన్నాడు. 2019 సార్వత్రిక ఎన్నికలలో నిజామాబాద్ లోక్‌సభ స్థానం నుండి పోటీ చేయాలని అరవింద్ రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. ఆ స్థానం నుంచి తెరాస అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవిత ప్రస్తుతం లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత ఎన్నికల్లో ఆమె రెండు లక్షలకు పైగా ఓట్ల మెజారిటీతో ఆ స్థానం గెలుచుకున్నది. ఇప్పుడు అరవింద్ పోటీచేస్తే ఆమెకు ఇబ్బందులు తప్పవన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అరవింద్ బీసీ వర్గానికి చెందినవాడు. సంస్థాగతంగా బిజెపికి ఆ జిల్లాలో బలమైన క్యాడర్ కూడా ఉంది. ఎన్నికలకు పది నెలలముందే అరవింద్ తన ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టాడు. ‘బతుకమ్మ చీరల’ పంపిణీలో అక్రమాలు జరిగాయని అరవింద్ ఆరోపిస్తున్నాడు. స్థానికంగా ఉన్న పరిస్థితుల దృష్ట్యా అరవింద్ తండ్రి డి.శ్రీనివాస్ టిఆర్‌ఎస్‌లో ఉండటానికి వీలులేదంటూ కవిత తన తండ్రి కేసీఆర్‌కు ఫిర్యాదు చేశారట! దీంతో నిజామాబాద్ జిల్లా రాజకీయాలు వేడెక్కాయి.
మరోవైపు తెలంగాణ బిజెపి అధ్యక్షుడు కె.లక్ష్మణ్ జనచైతన్య యాత్ర విజయవంతమై పార్టీ శ్రేణులలో ఉత్సాహాన్ని నింపింది. నిన్నటివరకూ టిఆర్‌ఎస్‌కు, బిజెపికి లోపాయికారీ ఒప్పందం ఉందని అనుకున్నవారికి జనచైతన్య యాత్ర కనువిప్పు కలిగించింది. టిఆర్‌ఎస్ మీద బిజెపి నిప్పులు చెరిగింది. ఏయే ప్రాజెక్టుల్లో ఎంతెంత అవినీతి జరిగిందో గణాంకాలతో లక్ష్మణ్ వివరించారు. ఇప్పుడు ప్రజలు ఎవరి మాటలను నమ్మాలి? తెలంగాణలో మజ్లిస్ పార్టీ కాంగ్రెస్‌కు కాకుండా టిఆర్‌ఎస్‌ను బలపరుస్తున్నది. ఇది రాజకీయంగా టిఆర్‌ఎస్‌కు కలిసివచ్చే అంశం. షాదీ ముబారక్, హజ్‌యాత్రలో సబ్సిడీలు, ముస్లింలకు పనె్నండు శాతం రిజర్వేషన్లు, మసీదుల పునర్నిర్మాణానికి నిధులు వంటి అంశాలతో టిఆర్‌ఎస్ ముస్లిం ఓటర్లను ఆకర్షిస్తోంది.
టిఆర్‌ఎస్ ప్రధానంగా ఉద్యమ పార్టీ. జల వనరులపై సీఎం కేసీఆర్ ప్రధానంగా దృష్టి సారించారు. ఆయన చేపట్టిన మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టులు తెలంగాణకు ఎంతో మేలుచేసేవే. ఇది కాదనలేని సత్యం. ఐతే కేసీఆర్ భారీగా అప్పులు చేసి ఆర్థిక దుబారాకు పాల్పడుతున్నట్టు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అప్పులను ఆస్తులుగా చూపించి ‘కాగ్’ ముందు అసత్య నివేదిక సమర్పించారనేది ప్రతిపక్షాల ఆరోపణ. ఇక ప్రొఫెసర్ కోదండరాంకు తెలంగాణలోని వామపక్షాలన్నీ మద్దతునిస్తున్నాయి. దీంతో గ్రామీణ స్థాయిలో టిఆర్‌ఎస్‌కు కొంత ప్రతిఘటన తప్పదంటున్నారు. కాగా, తెలంగాణ ఉద్యమకాలంలో కీలక పాత్ర పోషించిన ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయాల విద్యార్థులు కేసీఆర్ పాలనలో తమకు ఉద్యోగాలు రాలేదని కోపంగా ఉన్నారు. ఈ కష్టాలను తెరాస అధినేత ఎలా ఎదుర్కొంటారో చూడాలి. జమిలి ఎన్నికలకు కేసీఆర్ సుముఖంగానే ఉన్నారు. ఈసారి టిఆర్‌ఎస్ ఎన్ని లోక్‌సభ స్థానాలను గెలుచుకోబోతున్నదనే విషయం ఆసక్తికరంగా మారింది. 2019లో అవసరమైతే ఎన్‌డిఏకు మద్దతునిచ్చి కేంద్రంలో మోదీ ప్రభుత్వాన్ని తెరాస ఆదుకుంటుందా?
తెలంగాణలో కంటే సీమాంధ్రలో బిజెపి పరిస్థితి దయనీయంగా ఉంది. ప్రధాని నరేంద్ర మోదీని పాపాల భైరవునిగా చిత్రించటంలో తెదేపా అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు విజయం సాధించారు. సీమాంధ్రలోని సమస్త కష్టాలకూ మోదీయే కారకుడని ఆయన ప్రజలను నమ్మించారు. విశాఖకు ప్రత్యేక రైల్వేజోన్ రాలేదు, కడప ఉక్కు ఫ్యాక్టరీకి అనుమతి లేదు. ఏపీకి ప్రత్యేక హోదా లేదు. ఇవ్వవలసిన నిధులు విడుదల చేయలేదు. అన్ని విషయాల్లో కేంద్రం మోసం చేసిందని నారా వారి ఆరోపణలు. దేశంలోని ముఖ్యమంత్రులందరిలోనూ అత్యంత ధనికుడైన సీఎం చంద్రబాబు. కార్యదక్షుడు కూడా. నాలుగేళ్లు కేంద్రంతో దోస్తి చేసి పదవులు అనుభవించి ఎన్నికలకు ముందు- కొత్త నాటకం మొదలుపెడితే ఎలా? నిజానికి చంద్రబాబు బలహీనతలే వైకాపా అధినేత జగన్మోహన్‌రెడ్డికి వరాలుగా మారాయి. కమ్మ- కాపు-రెడ్డి కులాల సంగ్రామ వేదికగా ఆంధ్రప్రదేశ్ మారింది. ఇది తెలుగుజాతికి మంచిదికాదు. ఎక్కడ నిరంతర సంఘర్షణలు, ఉద్యమాలు, పోరాటాలు ఉంటాయో అక్కడ అభివృద్ధి కుంటుపడుతుంది. తెలుగువారు దురదృష్టవంతులు. ఎప్పుడూ ఏదో ఒక దరిద్రం వారిని కుంగదీస్తూనే ఉంది.
హైదరాబాద్ స్థాయిలో ఏపీ రాజధాని అమరావతి నగర నిర్మాణం ఎప్పటికి జరిగేను? తెలుగుదేశం పార్టీ అవతరణే కాంగ్రెస్ వ్యతిరేకత అనే ప్రాతిపదికపై జరిగింది. 2014 ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ దాదాపు అంతరించిపోయింది. ఇప్పుడు చంద్రబాబు కాంగ్రెస్ పార్టీతో దోస్తీ అంటూ కాంగ్రెస్‌కు ప్రాణప్రతిష్ఠ చేయాలని ప్రయత్నిస్తున్నాడని ఆయన ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు. 2019లో చంద్రబాబు ఓడిపోతే ఆయన రాజకీయ జీవితం ఇబ్బందుల్లో పడ్డట్టే. తెదేపాపై ఆరోపణలకు స్వస్తి పలికి, ఏపీలో బిజెపి ఇప్పుడు కొంత చొరవ తీసుకోవాలి. పోలవరం ప్రాజెక్టుతోబాటు అమరావతి రాజధాని నిర్మాణ వ్యయం మొత్తం కేంద్రం భరించాలి. విశాఖ రైల్వేజోన్, కడప ఉక్కు ఫాక్టరీ, దుగరాజపట్నం పోర్టు వంటి సీమాంధ్రుల కోర్కెలు సమంజసమైనవే. గన్నవరం విమానాశ్రయాన్ని అంతర్జాతీయ స్థాయిలో నిర్మించాలి. సీమాంధ్రకు సువిశాలమైన సాగర తీరం ఉంది. ప్రకాశం జిల్లాలోని మోటుపల్లి కొత్తపట్నం వంటి ఓడరేవులు అత్యంత ప్రాచీనమైనవి గనుక వాటిని పునరుద్ధరించాలి. ఏపీ ప్రజలను బిజెపి రక్షించి తీరాలి. దీనికి ప్రత్యామ్నాయం లేదు. కుంటిసాకులు చూపి మోదీ ప్రభుత్వం తప్పించుకోజాలదు. నరేంద్ర మోదీకి ఆంధ్రుల ‘నాడి’ బొత్తిగా తెలియదు. కొన్ని సామాజిక వర్గాలను బిజెపి దూరం చేసుకోవటం ఆత్మహత్యా సదృశం.

-ప్రొ. ముదిగొండ శివప్రసాద్