మెయిన్ ఫీచర్

కారుణ్యభావనారాశి శ్రీరమణులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అరుణాచలం అరుణాచలం నిత్యమూ స్మరించినా శివసాయుజ్యాన్ని లభింపచేసేది అరుణాచలం. అరుణాచలాన్ని దర్శించినా స్మరించినా ఇంతటి పుణ్యం రావడానికి కారణం అక్కడ నివసించిన రమణులే. రమణులు అంటే వేంకట రమణ.
మధురైకి 40 కి.మీ దూరంలో తిరుచిలిలో 1879లో సుందరం అయ్యర్, అలగమ్మాళ్ దంపతులకు వెంకటరమణ జన్మించాడు. తండ్రి మరణానంతరం తల్లితో కలిసి రమణుల అన్నదమ్ములు ముగ్గురూ పినతండ్రి ఇంటికి చేరుకున్నారు. రమణులకు బాల్యంలో చదువుపైన ఆసక్తి అంతగా వుండేది కాదు. చదవాలన్నా, రాయలన్నా విసుగ్గా అనిపించేది.
కాని ఎపుడూ ఎక్కడో ఆలోచనలో ఉన్నట్టు ఉండేవారు. ఏదో వెదుకుతున్నట్టుగా ఉండేవారు. ఒకసారి పదహారేళ్ల వయసులో వీరి ఇంటికి వచ్చిన ఒక అతిథి అరుణాచలం పేరును చెప్పగానే రమణునిలో కుతూహలం మొదలైంది. ఆ పేరు రమణుణ్ణి అమితంగా ఆకర్షించింది. ఇది గమనించి ఆ అతిథి పెరియ పురాణంలోని కవితల్ని వినిపించాడు. అందులోని సాధువుల సంతుల వర్ణన రమణుని మనస్సుపైన చెరగని ముద్రవేసింది. అప్పటినుంచి ఏకాంతంగా వుంటూ వౌనంగా కూర్చుని ఈశ్వరుని గురించి ధ్యానంచేస్తూ వుండేవాడు.
మరో వింత జరిగింది. అది పదిహేడేళ్ల వయసులో ఒకసారి మృత్యువును గురించి ఆలోచిస్తున్న రమణునిలో ఆత్మచింతన ప్రారంభమైంది. నేనెవరు? అని ప్రశ్నించుకునేవారు. చివరకు రమణులు నేను వేరు ఆత్మవేరు. నేను అశాశ్వతం, ఆత్మ శాశ్వతం అని తెలుసుకుని ఆత్మసాక్షాత్కారాన్ని పొందారు. లౌకిక విషయాలపట్ల ఆసక్తి తగ్గింది. ఎప్పుడూ అరుణాచలంలోనే వున్నట్లుగా భావించుకునేవాడు. అనుభూతులకు లోనవుతూ, విచిత్రంగా ప్రవర్తిస్తూ వుండేవాడు. తిరువణ్ణామలై వెళ్లాలని గట్టిగా నిర్ణయించుకున్న రమణులు, ఫీజు కట్టడానికని అన్న ఇచ్చిన ఫీజు డబ్బులను తీసుకుని ఇంట్లో ఉత్తరం రాసిపెట్టి తిరువణ్ణామలైకి ప్రయాణమైనాడు. దారిలో ఇబ్బందుల నెదుర్కొంటూ అరుణాచల మందిరం చేరుకున్నారు. అక్కడే రమణులు దీర్ఘంగా ఏకాగ్రతతో సాధనలో మునిగిపోయారు. ఆ రమణులు చూచినవారికి నిశ్చలంగా రాయ వలె కనిపించేవారు. . అక్కడ పిల్లలు ఇబ్బంది పెట్టడంతో ఆ మందిరం భూగృహాలలోని చిన్న గదిలోకి వెళ్లి ధ్యానం చేయడం మొదలుపెట్టాడు. దానిని పాతాళలింగం అని పిలుస్తారు. అక్కడ కూడా పిల్లలు రమణులను వదలల్లేదు.
శేషాద్రి అనే ఒక సన్యాసి ఇతణ్ణి కనిపెట్టుకొని వుండేవాడు. రమణులు పూర్తిగా సాధనలోనే నిమగ్నమైపోతూ వుండసాగాడు. వౌనవ్రతమేమీ పాటించకపోయినా అవసరమైనంతవరకు మాత్రమే మాట్లాడడానికి రమణులు ఇష్టపడేవారు. అక్కడనుంచి రంగస్వామి అనే భక్తుని ఇంటి తోటలో సాధన ప్రారంభించాడు. అక్కడ సమాధి స్థితిలో అనేక ప్రశ్నలకు సంతృప్తికరమైన సమాధానాలు లభించాయి. విశుద్ధమైన ఆత్మజ్ఞానం లభించిన అతడు సమాధి స్థితిలోకి వెళ్లడం మానివేసాడు. ఏకాంతవాసం మానివేసి లోకకళ్యాణానికి పనిచేయాలని సంకల్పించాడు. దగ్గరలోని మామిడితోటకు మకాం మార్చాడు. ప్రజల అజ్ఞానాన్ని, దుఃఖాన్ని పోగొట్టి వాళ్ల సమస్యల్ని తీర్చాలనుకున్నాడు. అరుణాచలాన్ని దర్శించిన భక్తులంతా తప్పనిసరిగా రమణుని దర్శించుకునేవారు.
రమణునికి దయాగుణం ఎక్కువ. ఆశ్రమంలో వుండే ఆవులు, పక్షులు, కోతులను రమణులు ప్రాణమిత్రులుగా భావించేవారు. మేత పెట్టేవారు. మరణించిన జీవులకు అంతిమ సంస్కారాన్ని జరిపించేవారు.
రమణుణ్ణి వెదుక్కుంటూ వచ్చిన తల్లితో రమణులు మొదటిసారి మాట్లాడలేదు. ఎవరి ప్రారబ్దకర్మలను వారు అనుసరిస్తూ వారి పనులను వారు నిర్వర్తిస్తూ పోవాలని, అనుకున్నవి అనుకున్నట్లుగా జరగవనీ కర్తవ్య నిర్వహణ మాత్రం విడిచిపెట్టకూడదనీ రాసి చూపారు. తల్లి వెనుదిరిగి వెళ్లిపోయింది. కాని, ఆమె తన శేష జీవితాన్ని రమణులతోనే గడపాలని కోరుకుంది. ఆ తల్లి కోరికను తీర్చారు రమణులు. జ్వరంతో బాధపడుతున్న తల్లికి సేవలు చేస్తూనే ధ్యానంలో కూడ వుండసాగారు రమణులు. తల్లి త్వరగా కోలుకోవాలని అరుణాచలేశ్వరుని స్తుతిస్తూ ఒక స్తోత్రం రాశారు. భర్తనూ, పిల్లవాడినీ కోల్పోయిన ఎచ్చెమ్మాళ్ అనే మహిళ రమణుని సాన్నిధ్యంలో శాంతిని పొందింది. ఆమె రమణుని సేవిస్తూ తన కష్టాలను మరచిపోయింది. సంస్కృతంలో ఉద్ధండ పండితులు, దేవీ ఉపాసకులైన గణపతి ముని కూడా రమణుల వద్దనే చాలారోజులు గడిపారు. ఆ సమయంలోనే సత్సాంగత్యంలో అనేక విషయాలు చర్చించారు. గణపతిమునిని ఎంతోకాలంగా వేధిస్తున్న ప్రశ్నలకు రమణులు సులభశైలిలో సరళంగా సమాధానాలిచ్చారు.
రమణుల అలౌకిక గుణగణాల కారణంగా గణపతిముని రమణులను మహర్షి అని, భగవాన్ అనీ సంబోధించారు. రమణులు రమణ మహర్షిగా ప్రసిద్ధి పొందారు. గణపతి ముని రమణుని స్తుతిస్తూ సంస్కృతంలో స్తోత్రాన్ని రచించారు. రమణుల బోధలన్నింటినీ సంకలనం చేసి రమణ గీతను ప్రచురించారు.
ఆశ్రమం దినదినాభివృద్ధి పొందుతూ అనేక విభాగాలు ఏర్పడ్డాయి. గోశాల, వేదపాఠశాల, ప్రచురణ విభాగం, భాగవతమందిరం వీటిలో ప్రధానమైనవి. రమణులు ఎప్పుడూ ఏదో ఒక పనిలో నిమగ్నమై వుండేవారు. ప్రతి చిన్న పనినీ శ్రద్ధగా పర్యవేక్షించేవారు.1950 సం.లో రమణులు నిర్యాణం చెందారు. నలభై కవితలు అనే పుస్తకంలో రమణుల కవితలు పొందుపరచబడినాయి. ఉపదేశసారాన్ని రచించారు. శంకరుల వివేకచూడామణిని తమిళంలో రచించారు. రచనలు ఎక్కువగా తమిళంలోనే రచించారు.

- మానస