మెయిన్ ఫీచర్

ఆరోగ్యం.. సౌభాగ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆషాఢమాసం వచ్చిందంటే చాలు.. గోరింటాకు, మునగాకు గుర్తుకొస్తాయ. ఆషాఢం గడిచేలోగా ఏదో ఒకరోజున గోరింటాకు పెట్టుకుని తీరమంటూ పెద్దలు పోరుతూ ఉంటారు. అలాగే ఆషాఢమాసంలో ఒక్కరోజైనా మునగాకు తినమని చెబుతూ ఉంటారు పెద్దలు. ఎందుకని వివరాల్లోకి వెళితే..
జ్యేష్ఠ మాసంలో కురవడం మొదలైన వర్షాలు ఆషాఢం నాటికి ఊపందుకుంటాయి. అలా తరచూ వర్షపునీటిలో నానక తప్పదు. ఇక పొలం పనులు చేసుకునేవారు ఏరు దాటాల్సి వచ్చేది.. ఈ కాలంలో కాళ్లూ, చేతులను తడపకుండా రోజు గడపలేరు. అలాంటి సమయంలో చర్మవ్యాధులు రావడం, గోళ్లు దెబ్బతినడం సహజం. గోరింటాకు ఈ ఉపద్రవాన్ని కొన్నిరోజుల పాటు ఆపుతుంది. ఆషాఢమాసం నాటికి గోరింటచెట్టు లేత ఆకులతో కళకళలాడుతూ ఉంటుంది. ఆ సమయంలో గోరింటని కోయడం వల్ల చెట్టుకి ఏమంత హాని కలగదు. పైగా లేత ఆకులతో చేతులు ఎర్రగా పండుతాయి.
ఆషాఢం నాటికి వాతావరణం ఒక్కసారిగా చల్లబడిపోతుంది. ఇలా వాతావరణంలో అకస్మాత్తుగా వచ్చే ఈ మార్పు వల్ల శరీరంలో కఫసంబంధమైన దోషాలు ఏర్పడతాయి. గోరింటాకుకి ఒంట్లోని వేడిని తగ్గించే గుణం ఉంది. అలా బయట వాతావరణానికి అనుగుణంగా మన శరీరాన్ని కూడా చల్లబరిచి దోషాలబారిన పడకుండా చేస్తుంది గోరింట.
ఆషాఢంలో కొత్త పెళ్లికూతుళ్లు తమ పుట్టింటికి చేరుకోవడం ఆనవాయితీ. ఆ సమయంలో తమ చేతులకు పండించుకునే గోరింట, వారికి తమ సౌభాగ్యాన్ని గుర్తుచేస్తుంది. పుట్టింట ఉన్న మనసు, మెట్టినింట ఉన్న భర్త ఆరోగ్యాన్ని కాంక్షిస్తుంది. వేళ్లకి గోరింట పెట్టుకోవడం వల్ల కంటికి నదరుగానే కాకుండా గోళ్లు పెళుసుబారిపోకుండా, గోరుచుట్టు వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి.
ఆయుర్వేదం ప్రకారం గోరింట ఆకులే కాదు.. పూలు, వేళ్లు, బెరడు, విత్తనాలు.. అన్నీ ఔషధయుక్తాలే.. గోరింట పొడిని మందుగా తీసుకోవడం, గోరింటతో కాచిన నూనెని వాడటం మన పెద్దల చిట్కావైద్యంలో ఉన్నదే! కేవలం ఆషాఢంలోనే కాదు.. అట్లతద్దినాడూ, శుభకార్యాల సందర్భంలోనూ గోరింటాకు పెట్టుకోవాలని పెద్దలు సూచిస్తూ ఉంటారు. అలా ఏడాదికి కొన్నిసార్లైనా గోరింట అందించే ఆరోగ్యాన్ని అందుకోవాలన్నది పెద్దల ఉద్దేశం కావచ్చు.
ఆషాఢంలో గోరింట పెట్టుకోమన్నారు కదా అని చాలామంది ఎక్కడపడితే అక్కడ దొరికే కోన్లపై ఆధారపడుతూ ఉంటారు. గోరింట మన శరీరానికి తాకినప్పుడు అందులో ఉండే లాసోన్ అనే సహజమైన రసాయనం వల్ల ఎరుపురంగు ఏర్పడుతుంది. కానీ చాలా రకాల కోన్లలో, కత్రిమంగా ఎరుపు రంగును కలిగించే రసాయనాలు కలుపుతుంటారు. వీటివల్ల ఆరోగ్యం మాట అటుంచితే అలర్జీలు ఏర్పడే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఆషాఢంలో పుష్కలంగా లభించే గోరింటాకుని వాడుకునేందుకే ప్రాధాన్యతని ఇవ్వాలి.
మునగాకు
వంటలకు ఘుమఘుమలు అందించి రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం కలిగించడంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న వాటిలో చెప్పుకోతగ్గది మునగ. మునగకాడల్ని చారు, సాంబారు, కూర, పచ్చడి, సూప్ వంటి ఎన్నో రకాల వంటల్ని చేయడానికి ఉపయోగిస్తుంటారు. కాడల్ని కాకుండా ఆషాఢంలో మునగ ఆకుని వంట చేసుకుని తినడం వల్ల మరింత ఆరోగ్యం కలుగుతుందని మన పెద్దలు చెబుతారు. వాతావరణ మార్పులు జరిగే ఈ కాలంలో మునగ ఆకును తినడం వల్ల వాత, కఫ దోషాలు తగ్గి శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. లేత మునగ ఆకులు కూరగాను, పువ్వును ఆకుకూర వండినట్లుగా వండవచ్చు. మునగాకు కాలేయంలో చేరిన విషపదార్థాలను హరిస్తుంది. ఇంకా మూత్రాశయంలోని రాళ్లను కూడా కరిగిస్తుంది. కానీ మునగ ఆకును వంట చేసుకుని తింటారని ఈ తరంలో చాలామందికి తెలియకపోవడం ఆశ్చర్యకరం.
గృహవైద్యంలో మునగ ఆకు ఎంత ప్రధానమైనదో మన బామ్మలకు, అమ్మమ్మలకు, గ్రామీణ ప్రజానీకానికి బాగా తెలుసు. మునగాకుతో పోలిస్తే మునక్కాయల వల్ల ఉపయోగం చాలా తక్కువ. మునగాకు వైద్య సంబంధమైన గొప్ప ఔషధి. మునగాకులో ఉన్నంతగా ఎ, సి విటమిన్లు మరే ఇతర ఆకుకూరల్లోనూ లేవు. ఇందులో కాల్షియం, సల్ఫర్, ఐరన్ తగినంతగా ఉంటాయి.
వందగ్రాముల మునగాకుల్లో పోషక విలువలు ఇలా ఉంటాయి.
పిండిపదార్థాలు: 13.4 గ్రా.
కొవ్వు పదార్థాలు: 1.7 గ్రా.
మాంసకఋత్తులు: 6.7 గ్రా.
కాల్షియం: 440 మిల్లీగ్రాములు
సల్ఫర్: 70 మిల్లీ గ్రాములు
ఐరన్: 7 మిల్లీ గ్రాములు
పీచుపదార్థం: 0.9 మిల్లీగ్రాములు
ఇన్ని అద్భుత గుణాలున్న మునగాకు అనేక ఆరోగ్యసమస్యలకు దివ్యౌషధంగా చెప్పవచ్చు. మునగాకు పొట్ట సంబంధ వ్యాధులు ఉన్నవారికి అద్భుతమైన ఉపశమనకారి. అలాగే మధుమేహం ఉన్నవారికి మధుమేహం అదుపులో ఉండేలా చేస్తుంది. వ్యాధినిరోధకతను పెంచడానికి, అధిక రక్తపోటును అదుపులో ఉంచడానికి కూడా మునగాకు ఎంతగానో ఉపయోగపడుతుంది. మునగాకులో కాల్షియం ఉన్నందువల్ల ఇది ఎముకలను బలోపేతం చేస్తుంది. కీళ్లనొప్పులను నివారిస్తుంది. అంతేకాదు మునగాకు లైంగికవాంఛను పెంచుతుంది. నపుంసకత్వాన్ని పోగొట్టడానికి ఇది అద్భుతమైన మందుగా పనిచేస్తుంది. అందుకే ఆషాఢమాసంలో పెళ్ళైన అబ్బాయిలకు తప్పనిసరిగా మునగాకును తినిపిస్తారు. మునగాకు శరీరంలోని ఉష్ణాన్ని తరిమేసి శరీరాన్ని సమతల ఉష్ణోగ్రతలో ఉంచుతుంది. మునగాకును తీసుకోవడం వల్ల గర్భిణుల్లో రక్తహీనత తగ్గుతుంది. అలాగే తల్లిపాలు కూడా ఎక్కువ వచ్చేలా చేస్తుంది. ఇందులో అధికమైన యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి కాబట్టి ఇది జీర్ణశక్తికి, శరీరంలోని మలినాలను బయటకు పంపించడానికి చక్కగా పనిచేస్తుంది. మునగాకు తరచూ అంటే నెలకు కనీసం రెండుసార్లన్నా తినడం వల్ల పిల్లల్లో మెదడు ఎదుగుదల చాలా బాగుంటుంది. అంతేకాకుండా బయట నుంచి వచ్చే ఇన్‌ఫెక్షన్స్ నుంచి పిల్లలను రక్షిస్తుంది. ఎందుకంటే మునగాకులో యాంటీబాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి గొంతు, ఛాతి, చర్మ రోగాల నుంచి పిల్లలను చక్కగా రక్షిస్తాయి. కాబట్టి వాతావరణ మార్పునకు గురైన ఈ మాసంలో పిల్లలకు తరచూ జలుబు, దగ్గు, జ్వరం వేధించకుండా మునగాకును తినిపిస్తే మంచిది. ఇన్ని రకాలుగా శరీరానికి ఆరోగ్యాన్ని కలిగించే మునగాకును కనీసం నెలకు రెండుసార్లు తీసుకోవడం మరిచిపోకండి.

- ఉమా మహేశ్వరి