మెయిన్ ఫీచర్

ప్ర‘పంచ తంత్ర’ కథా నిపుణులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పర పీడనం మానేస్తే పుణ్యం వస్తుందనేది పెద్దల మాట. సమాజ జీవనంలో రుజువర్తనం అధిక సంఖ్యాకుల జీవన రీతి. కొందరు కథా నైపుణ్యాత్ములు, ప్రపంచ ప్రజలకు జంతువుల మీద కీటకాల మీద పెట్టి నడవడిక కథలు చెప్పారు. వారిలో ఆద్యుడు విష్ణుశర్మ మాస్టారు. పంచతంత్రం జంతువుల పాత్రలకు మానవ స్వభావాలు అంటగట్టి, మొద్దులైన రాజకుమారులకు, కొద్దినెలల్లో లోక వ్యవహారం, పాలనా వివేకం కలిగించేందుకు, అప్పటికే వయసు ముదిరిన రాచ కుమారులూ, రేపటి రాజులూ అయిన వారికి విష్ణుశర్మ వేల ఏళ్లకిందట నేర్పిన అనియత విద్యాపద్ధతి బోధన. ఇది విజయం సాధించింది. అలాగే సాహిత్యం అనియత విద్య. కథానైపుణ్యాలు ప్రతి కాలంలో, వౌఖికంగా సంచార గాయక బృందాలనుంచి మొదలై, వాల్మీకి శాసనంగా ‘కంఠేచ గేయేచ పాణ్యేచ మధురం’గా నిలుస్తాయి. ఇరవయ్యో శతాబ్దంలో అలాంటి ఆధునిక కథా నైపుణ్యాత్ములు రావిశాస్ర్తీ, కొలకలూరి ఇనాక్.
విశాఖలో శాస్ర్తీగారి సోదరులు రాచకొండ నరసింహశర్మగారు, కుమారులు, కుటుంబ సభ్యులు, కొందరు రచయితలు కలిసి ఏర్పాటుచేసిన రావిశాస్ర్తీ లిటరరీ ట్రస్ట్ నిర్వహిస్తున్న రావిశాస్ర్తీ అవార్డ్, 2018 సంవత్సరానికి కొలకలూరి ఇనాక్‌గారికి జూలై 30న, రావిశాస్ర్తీగారి 97వ జయంతి వత్సర సందర్భంలో ప్రదానం చేస్తున్నారు. ఆ నేపథ్యంలో వీరిరువురూ నిర్వహించిన కథా నైపుణ్యాలపై కొంత కాంతి ప్రసారం, ఈ కథానుశీలనం.
ప్రతి కథా నీతి కథే- జీవన నీతి, రీతి కథ, ఒక సమాజాన్ని, అందులో జీవితాన్ని, అక్కడి ప్రజల ఎరుకని, వారి ముందున్న ఎంపికలను పరిచయం చేస్తుంది. ఉపాయం మీద ఆధారపడ్డ పంచతంత్ర కథల్లో, ఒక సమస్య, దానికో పరిష్కారం లేకుండా ఆ కథలు కనిపించవు. అలాంటి కథలకు, గడిచిన శతాబ్దాల్లో ఏర్పడ్డ జీవన సంప్రదాయస్ఫూర్తి బలంగా ఉంటుంది.
సంప్రదాయ సారవంత భూమినుంచి ‘ప్రతిభా నవ నవోనే్మష శాలినీ’ అంటూ వికసిస్తుందని మన పెద్దలు, పాశ్చాత్య పెద్దలు కూడా (‘ట్రెడిషన్ అండ్ ఇండివిడ్యువల్ టాలెంట్’ అంటూ టి.ఎస్.ఎలియట్ వంటివారు) ముక్త స్వరాలతో చెప్పారు. దీనికి లక్ష్య లక్షణాలుగా నిలిచే రెండు కథలను చూద్దాము. ఒకటి రావిశాస్ర్తీ రాసిన పిపీలికం. రెండోది ఇనాక్ రాసిన నల్లులు. రెండు కథలమధ్య దాదాపు మూడు దశాబ్దాల తేడా ఉన్నది.
పిపీలికాది బ్రహ్మపర్యంతం- శాస్ర్తీగారి కథ నడుస్తుంది, ఒక చీమ తానెవరో తెలుసుకోవాలనుకుంటుంది. కోహం అనే ఈ విస్తార చర్చలో అందరూ దానికి పలు వేదాంత విషయాలు చెప్తారు, తప్ప జీవితం భౌతికం అని చెప్పారు. తనలోని భగవత్పదార్థాన్ని వెతుక్కుంటూ విచికిత్సలో, సదసత్సంశయంలో దేశాలు తిరిగి, తనలోతానే వాదులాడుకుంటూ, సంతృప్తిచెందక తన ఇంటికి వచ్చేసరికి, ఒక పెద్ద ఆకారం తమ చీమల పుట్టని ఆక్రమించుకుని హాయిగా పడుకుని ఉంటుంది. అప్పుడు చీమ వినయంగా అడిగిన ప్రశ్నకి ఆ పాము చెప్తుంది, ‘‘నువ్వు చీమ వెధవ్వి, యుగయుగాలుగా మీకు నిర్మాణ కౌశలమున్నది, అందుకు మెచ్చుకుంటాను కానీ మీరు కట్టిన ఈ పుట్టలన్నీ మావే. అందుకే నువ్వు ఎవరు అంటే కష్టజీవివి, పో ఇక్కడనుంచి’’ అని గద్దించి నిశ్చింతగా ఉంటుంది.
ఇన్ని దేశాలూ తిరిగి, బ్రహ్మజ్ఞానం కూడా పొందిన చీమ, ఇలా బతుకు ఎరుకని పొంది, ఎందరెందరో నేను ఫలానా, ఫలానా అని చెప్పేరు కానీ, ఎవరూ కష్టజీవివి అని గుర్తుచేయలేదు. అందుకు నీకు ఋణపడి ఉన్నాను, అంటూ కొంత కాలానికి, సుమతీ శతక పద్య భాగంగా తన కర్తవ్యం నిర్వహిస్తుంది ‘‘బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి చావదె సుమతీ’’ ఇదీ శాస్ర్తీగారికి ఈ కథ రాస్తున్నప్పుడు మనసులోని ఎరుక. ‘‘చీమలు పెట్టిన పుట్టలు పాముల కిరవైనయట్లు’’ అన్నది లోకోక్తి అయినా, లోకంలో సామాన్యులు చీమల వంటివారు, అయినా వారు చరిత్ర తిరగరాసిన ఉత్పాతాలు, రాజులను మందలించిన ఉదంతాలు, అందుకు తమ ప్రాణాలను ఎరగాపెట్టిన అనేకానేక ఘట్టాలతో చరిత్ర ఘూర్ణిల్లుతున్నది. అలా వేదాంత వీధుల్లో తన చీమ కథ మొదలుపెట్టి, దానికి జ్ఞానం అనే శివుడాజ్ఞ అయ్యాక, ఏం చేస్తుందో, ఎందుకు చేస్తుందో, ఎందుకు కుడుతుందో, ప్రజాపక్ష చైతన్యంతో, రావిశాస్ర్తీ, బద్దెన రాసిన నాలుగు పంక్తుల పద్యాన్ని పెద్ద కథగా విస్తరించి చెప్తారు. పిపీలికం కథల పద్ధతి చెప్పి ఒక మంచి పాఠ్యాంశం కూడా.
ఇక ఇనాక్ 1997లో నల్లుల గురించి కథ చెప్తారు. సమాజం నల్లులు నిండిన మంచంలా ఉన్నది. దాన్ని గిరాటేస్తారు, ఎగిసి తన్ని దులుపుతారు. కథ నల్లుల మంచానికి జరిగే చికిత్సతో మొదలు. ఇది ఘాత వైద్యం. ఈ వైద్యం చేసే పల్లె మొద్దు, మొరటూ, సుబ్బడు. రావిశాస్ర్తీ వాక్యం అలంకారాల సోపాన పంక్తి మీదుగా పైకి, పైపైకి లేస్తుంది, ఇనాక్ మాటలు, చిన్న వాక్యాలై, ‘‘షార్ట్ బరస్ట్స్ ఆఫ్ ఎ రైఫిల్’’లాగా పేలుతాయి. ఎటుబడితే అటు తుపాకీ తిప్పి కాల్చగలరు ఇనాక్. నల్లుల మంచం ఇతివృత్తం, నయవంచన చేసే మునసబు కథ కలిపి చెప్తూ, ఎగిసి మంచాన్ని తన్నిన సుబ్బడు, కథలో చివరికి తనను చేయని నేరాలకు దొంగగా పోలీసులకు పట్టించే మునసబూ, అతని రౌడీ అనుచరులు, ఈసారి ఏకంగా ఎవర్నో చంపి, ఆ హత్యానేరంలో తనని ఇరికించదలిచారని తెలిసాక, ఇంట్లో బంధించి పిల్లిని కొడితే, ఏంచేస్తుందో, ఎలా కళ్ళుపీకుతుందో, అదే చేస్తాడు. సుబ్బడికి కలిగిన జ్ఞానమూ, చీమకి కలిగిన జ్ఞానమూ, చరిత్రలో కీలకం అయినవి. అవి విప్లవాలను సృష్టిచేశాయి. అణచివేత, పీడన, ఎలా ప్రజాగ్రహంచేత రద్దుచేయబడతాయో, చుట్టుముట్టే వాక్యాలతో చెప్తారు ఇనాక్. కథ, ఒకే స్థల, కాల, స్వభావ నిర్దిష్టతలో ఎలా మూలవిరాట్‌లా సుబ్బడి ప్రవర్తన, దాన్ని గ్రహించే తాత అవగాహన, దుష్టశిక్షణ చేసిన అవతార మూర్తి వలె సుబ్బడు సేద తీరడం- ‘‘నరసింహమూర్తిని, నిన్ను నంజుకు తింటనురా’’ అనే కొండ పాట ప్రస్తావితం కాకపోయినా, ఎక్కడో నేపథ్యంలో, పల్లెగాలిలా వేస్తూ ఉంటుంది. నల్లుల బాధ లేకుండా మంచాన్ని, మునసబు బాధలేకుండా పల్లెని, తీర్చగలిగిన ప్రజాదేవతల సైన్యాధ్యక్షుడు సుబ్బడు - (సుబ్రహ్మణ్యస్వామి లేదా కుమారస్వామి పురాణాల ప్రకారం దేవతల సేనాని). ఇనాక్ రచనా పాటవంలో కథల బడి పాఠం ఇది.
ఈ కథల్లో జరిగిన దుష్టశిక్షణ ప్రపంచం ఎరగనిది కాదు. అయినా ఆధునిక కథారూపాలుగా, నైపుణ్యాత్ములైన రావిశాస్ర్తీ, ఇనాక్‌గార్ల చేతుల్లో ఎలా సామాజిక న్యాయం జరుగుతుందో చిత్రితమైన లఘు కళారూపాలు ఈ రెండు కథలు. బడుగు, బలహీన, అణగారిన, ప్రజల తరఫున మాట్లాడే శతాబ్దంలో తెలుగు కథ సామాజిక నిష్టకు, నినాదప్రాయం కాకుండా జరిగే గాఢ శిల్పానికి, తీసుకున్న జీవన కాన్వాస్ పైన విస్తార రచనోద్యోగానికి నిలువెత్తు నిదర్శనాలు వీరిద్దరూ. అలంకార జలపాతం రావిశాస్ర్తీ సాహిత్యంకాగా, నిరలంకార సలిలం ఇనాక్ అక్షరం. వీరి పలు రచనల్లో పెనవేసుకున్న సామాజిక ఇంగితం, ఇంకా విస్తారంగా చెప్పే అవసరం ఉందని గుర్తిస్తూ, మంది బతుకుకోసం, వివేక భ్రష్టత్వం లేకుండా జీవితంలో నిలబడిన మహనీయులు రావిశాస్ర్తీ పేరిట వ్యవస్థాపితమైన అవార్డ్, ఇనాక్ గారికి ప్రదానం అవుతున్న సందర్భంలో అభినందన చందన లేపనం ఇది.

- రామతీర్థ, 9849200385