మెయిన్ ఫీచర్

దానంతోనే సంతృప్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మానవ జన్మ ఉత్కృష్టమైందని చెబుతాము. అయితే మనిషి జీవించి వుండాలన్నా, ఆరోగ్యంగా వుండాలన్నా ఆహారం తీసుకోవటం ఎంతో అవసరం. జానెడు పొట్టలో భగవంతుడు ఒక విచిత్రమైన ఆకలిని పెట్టిమరీ పుట్టించాడు. ఈ ఆకలి బాధ భరించరానిది. ఆకలిని తీర్చుకోడానికై మానవుడు- ఎన్నో బాధలు భరించాల్సి వస్తోంది. అయితే అనాదికాలంగా భారతీయులు తాము ఆర్జించుకోవడమేగాక, తోటి వారిని కూడా ఆదుకోవటం ఒక గొప్ప సంస్కారంగా నిలిచిపోయింది. తాను కడుపునిండా తినడమేగాక మరొకరికి కూడా పెట్టడం భారతీయ సంస్కృతిలో భాగం అయిపోయింది. వేదకాలంనుండీ అన్నాన్ని దానంచేయడం ఆచారంగా వచ్చింది. పక్కవాడికి పెట్టందే పట్టెడు అన్నమైనా ముట్టని ఆచారం మనది. ఇతిహాసాలూ, పురాణాలూ, కావ్యాలూ, ప్రబంధాలూ, శాసనాలూ అన్నదానం గూర్చి పేర్కొన్నాయి. ఆది మానవుడి కాలంలో కూడా ఈ విధంగా సాటివారికి పెట్టడమనేది వుంది. భారతీయుల్లో మొదటినుండీ దయాధర్మాలూ, నీతి నియమాలూ, ప్రేమ, సానుభూతి, న్యాయవర్తనం, మంచితనం, పరోపకారం వంటివి చోటుచేసుకున్నాయి. అంతేకాదు ఈ గుణాలన్నింటినీ తమ మతానికి ముడిపెట్టారు. ఆపదలో వున్నవాడిని ఆదుకోవటం, ఆకలితో అలమటించే వారికి అన్నం పెట్టడం ముఖ్యంగా భావించారు.
తాము తింటూ ఇతరుల ఆకలిదప్పులు తీర్చగలిగితే భగవంతుడు తమకు మరో రూపంలో సాయపడతాడని హిందువుల నమ్మకం. ఇతర మతాలవారు కూడా దానధర్మాలకు ఎంతో ప్రాముఖ్యాన్నిచ్చారు. పండుగల్లో పబ్బాల్లో అన్నదానాన్ని ఒక ముఖ్య అంశంగా పేర్కొన్నారు. నలుగురిచేత చేతులు కడిగిస్తే అది ఎంతో పుణ్యాన్నిస్తుందని నేటికీ నమ్మకం. వివాహాలప్పుడూ, వ్రతాలు, నోములు, యజ్ఞయాగాదులైనా సరే ఈ అన్నదానాలకు ప్రాధాన్యం ఎంతగానో వుంది. సాటి మానవుల ఆకలి తీర్చడమేగాక జంతువులకు ఆహారాన్ని కూడా పెట్టడం మనకు ఒక అలవాటుగా మారిపోయింది. ఈనాటికీ చాలామంది తాము భోజనం చేసేముందు భగవంతుని స్మరించుకుంటూ, ఒక పిడికెడు అన్నాన్ని కంచంముందు పెట్టిమరీ తింటారు. ఈ అన్నాన్ని ఏ పిల్లికో, కుక్కకో పెడతారు.
ఈనాటి లోకంలో చాలామంది దంపతులు తామే స్వయంగా వండి, మధ్యాహ్నం పూట, ఆసుపత్రుల వద్దకూ, దేవాలయాల వద్దకూ, పాఠశాలలకూ, వయోధికులుండే వాసాలకూ వెళ్ళి దాన్ని పంచిపెట్టి వస్తారు. ఇక దేవాలయాల్లో అన్నదానంకోసం ఎంతోమంది విరాళాలివ్వటం వింటూనే ఉన్నాం. క్షేత్రాలకు వచ్చిన యాత్రికులకు ఎంతోమంది ఆహారాన్ని సరఫరాచేసి ఎంతగానో సంతృప్తి చెందుతున్నారు. ఈ విధమైన ఆనందం పరమాద్భుతమైనదని అనుభవించిన వారు చెబుతుంటారు. ఆహార సమృద్ధితో దీవించమని మనం మన ప్రార్ధనల్లో భగవంతుని కోరుకుంటూ వుంటాము. అన్నం మనకు సమృద్ధిగా సమకూర్చడానికి ఒక దేవతనే అన్నపూర్ణాదేవిగా పూజించుకుంటున్నాము.
ఆకలి వేస్తున్న వానికి ఇంత ఆహారం పెడితే చాలు, పంచభక్ష్య పరమాన్నం పెట్టే అవసరం లేదు. ఏ దానంలో లేని సంతృప్తి అన్నదానంలో లభిస్తుంది. మీరు ఏ దానం ఇచ్చినా చివరకు బంగారాన్నిచ్చినా, ఇక చాలు అనరు. అంటే ఏ దానంతో లభించని సంతృప్తి పుచ్చుకున్న వారికీ, ఇచ్చిన వారికీ లభిస్తుందన్నమాట. ఈ అన్నం అన్నివర్గాల వారికీ అవసరమే. అటు కడు పేదలైనా, గొప్ప ధనవంతులైనా ఆకలికి దాసులేమరి. ఒక్కోసారి ఎంత సంపదవున్నా గుక్కెడు మంచినీళ్ళు లేక, పట్టెడు అన్నం దొరకక బాధపడిన సంఘటనలు చాలామంది జీవితాల్లో చోటుచేసుకున్నాయి. అలాంటి వారికి ఆ భగవంతుడే మానవ రూపంలో ఆదుకున్న కథలూ మనం నిజ జీవితంలో వింటూనే వున్నాము. అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారు. అయితే ఆహారాన్ని వృద్ధాచేసేవారు ఈనాటి రోజుల్లో చాలామంది కనిపిస్తూ వున్నారు. ఒకరు అన్నమో రామచంద్రా అంటూ అలమటిస్తుంటే మరొకరు గొప్పలకుపోయి ఆ అన్నానే్న వృధాగావిస్తున్నారు. ఇది మహాపాపం. ఎంతో కష్టపడి, చెమట చిందిస్తేనే ఆ ఒక్క గింజ మనకు అందిందని గ్రహించాలి. అందుకే తమిళంలో వేదంతో సమానమైన గ్రంథాన్ని రచించిన తిరువళ్ళువర్, నియమబద్ధమైన జీవితాన్ని గడిపేవారట. అందరికీ ఆదర్శంగా వుండేవారట. ఆయన భోజనం చేసేటప్పుడు ఒక సూదినీ, నీళ్ళ చెంబునీ ప్రక్కన పెట్టుకునేవారట. ఆయన భార్యకు ఒకరోజున సందేహం కలిగింది. అసలివి అన్నం తినేటప్పుడు ఎందుకు? వింతగా వుందే! అనుకోవడమే తడవుగా తిరువళ్ళువర్‌ను అడిగింది. అందుకు ఆయన చెప్పిన సమాధానం వింటే మనకు ఆశ్చర్యం వేయకపోదు. ‘్భజనం చేసేటప్పుడు- ఒక్క మెతుకు కూడా వృథాచేయడం నాకు ఇష్టంలేదు. అందువల్ల ఎప్పుడైనా పొరపాటున ఒక్క మెతుకు కిందపడితే, సూదితో గుచ్చి నీటితో కడుక్కుని తినాలని అనుకుంటాను. కానీ ఆ అవసరం ఈనాటివరకూ నాకు రాలేదు. ఒక్క మెతుకుకూడా క్రింద పడకుండా నేటివరకూ జాగ్రత్తపడుతూ వచ్చాను’ అన్నారట.
ఈ విధంగా మహాత్ములైనవారు పదే పదే ఆహారాన్ని వృథాచేయవద్దని చెబుతూనే, చేతనైతే ఇతరులకు అన్నం పెట్టండని మరీమరీ చెప్పారు.

- డా.పులిపర్తి కృష్ణమూర్తి