మెయిన్ ఫీచర్

స్నేహం విలువ ఎంచలేనిది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్నేహితులు లేని వారు అరుదుగా ఉంటారు. ఒకరోఇద్దరో స్నేహితులందరికీ ఉంటూనే ఉంటారు. కాస్త నడక, మాట వస్తే చాలు స్నేహం కోసం ఆ ప్రాణి ఎదురుచూస్తుంది. కేవలం మనుషులకే కాదు జంతువుల్లో కూడా స్నేహాన్ని చూస్తుంటాం. నోరు లేని ప్రాణులే ఇంతగా స్నేహం కావాలనుకొంటే ఇక మనసు, నోరున్న మనం స్నేహం కోసం అర్రులు చాస్తాం అంటే వింతేమ్తుం? విచిత్రమేముంది? స్నేహమేరా జీవితం స్నేహమేరా శాశ్వతం అని పాడుకున్నదే అందుకుకదా.
స్నేహం అనేది ఒక మధురమైన అనుభూతి. 98 ఏళ్ల వృద్ధునికి తన చిన్ననాటి స్నేహితుడు ఎదురైతే చాలు అప్పటిదాకా కదలలేక పడి ఉన్నా సరే దిగ్గున లేచి కూర్చుంటాడు. చిరునవ్వుతో పలుకరిస్తాడు. అంతటి శక్తి సంపన్నం ఒక్క స్నేహానికే ఉంది.
స్నేహం గురించి కేవలం చిన్న పిల్లలు, పెద్దవాళ్లు అంటే లౌకికంగానే కాదు ఆధ్యాత్మిక ప్రపంచంలో వాళ్లు కూడా మాట్లాడుతారు.
చెడు మార్గంలో వెళ్లేవారిని మంచి మార్గంలో తెప్పెంచే శక్తి ఒక్క స్నేహానికి మాత్రమే ఉంది. కుటుంబంలో ఉన్న బంధుత్వాల దగ్గర మొదలయ్యే బాధను స్నేహితులకు చెప్పి దూరం చేసుకొంటారు. అమ్మనాన్న, ఉపాధ్యాయులు , అన్నదమ్ములు, అక్కచెళ్లెళ్లు ఆఖరికి దాంపత్యబంధం కన్న గొప్పది స్నేహబంధం.
ఎటువంటి సమస్యనైనా స్నేహితునితో పొరపొచ్చాల్లేకుండా చర్చించుకోవచ్చు. అహానికి అక్కడ చోటే ఉండదు. స్నేహంలోనే ఎక్కువతక్కువలుండవు. పేదవాడు గొప్పధనవంతునితో స్నేహహస్తాన్ని కలుపవచ్చు. బాగా చదువుకున్నవారు అసలు చదువే లేని పామరునితో అత్యంత గాఢంగా స్నేహం చేయవచ్చు.
స్నేహానికి కాలంతో కూడా పట్టింపుండదు. వయస్సు తేడా రాదు. ఎవరి హృదయమైనా స్నేహం అనే మాటను పలికితే చాలు ఆ స్నేహమాధుర్యాన్ని ఆ హృదయకోశమంతా నిండిపోతుంది. స్నేహం ఒక్క తరానితో ఆగిపోదు. తరతరాలకు తరగని గనిలా అందుతుంది.
మంచిస్నేహితుడు కష్టనష్టాల్లో అండగా ఉంటాడు. స్నేహానికి ఎల్లలు ఉండవు. బుద్ధి వికాసానికి బాటలు వేయగలిగే శక్తికూడా స్నేహానికే ఉంది. నిస్వార్థమనేది కేవలం స్నేహంలోనే ఉంటుంది అన్నా అతిశయోక్తికాదు.
జీవితమనే ఉద్యావనంలో స్నేహమనే పూవు పూస్తే చాలు ఆ జీవితం ధన్యమైనట్లే. స్నేహానికి గురించి మాటల్లో చెప్పలేం.అది ఒక అనుభవైకవేద్యమే. ఎవరికి వారు అనుభవించి తీరాల్సిందే.
‘శత్రువు ఒక్కడున్నా ఎక్కువే. వందమంది మిత్రులున్నా వారు తక్కువే’అన్నారు వివేకానందులు. స్నేహితుల విలువ ఎంచలేనిది అంటే ఇదే కదా. ‘కష్టకాలంలో స్నేహితులెవరో మనకు బాగా తెలుస్తుంది’అని గాంధీ అంటారు. నిజమే కదా. కష్టనష్టాల్లో నీకు నేను తోడున్నాననే మిత్రుడే మిత్రుడు కాని సుఖాల్లో మనతో ఉంటూ కష్టం రాగానే కనుమరుగైనవాడ్ని మిత్రుడని అనం కదా. ఇట్లాంటి అర్థం చేసుకోమని తులసీదాసు మంచి స్నేహాన్ని వెలుగుతున్న దీపంతోను చెడు స్నేహాన్ని కొడిగట్టుతున్న దీపంతోను పోల్చారు.
ఎవరితోనైనా ఇట్టే స్నేహం చేయవచ్చు. అది కొద్దికాలం మాత్రమే. ఎక్కువ కాలం సాగేది నిజమైన స్నేహం. అట్లా స్నేహాన్ని నిలబెట్టుకోవాలంటే నీతి నిజాయితీలుండాలి. స్వార్థరహితంగా ఉండాలి. అబద్ధాలుచెప్పకూడదు. దాపరికాలు ఉండకూడదు. ఇలాంటి నిబంధనలు పెట్టుకుంటే ఆ స్నేహం పదికాలాలు మన్నుతుంది. అందరికీ ఆదర్శవౌతుంది.
రామాయణం, భారతం, భాగవతం ఇలా మన పురాణాలు సైతం స్నేహవిలువ చెప్పినవే. రామాయణంలోని రాముడు కేవలం గుహుడు, విభీషణుడు, సుగ్రీవులతో స్నేహం చేయలేదు. జంతువులతోకూడా స్నేహం చేసినట్టు రామాయణం చెబుతుంది. ప్రకృతి లేనిదే మానవులు మనలేరు కనుక ప్రకృతిలోని ప్రతి చెట్టు పుట్టా తోపాటుగా జంతువులతో కూడా మనిషి స్నేహాన్ని చేయాల్సిందే. అపుడే ప్రకృతి మనిషిని ఎల్లవేళలా కాపాడుతుంది. స్నేహాన్ని మరిస్తే పర్యావరణం భయకర రూపం దాలుస్తుంది.
కృష్ణుడు కూడా కుచేలునితో స్నేహం చేశాడు. ద్రోణుడు, ద్రుపదునితో స్నేహం చేశాడు. కానీ, ద్రోణద్రుపదులు ఎలాంటి స్నేహం చేయకూడదో మనకు చెబితే కుచేలకృష్ణులు స్నేహమంటే ఎలా ఉండాలో చెబుతారు. స్నేహంలో హెచ్చుతగ్గులుండవు. ఒకరికి లేకుంటే వారు అడగలేదు కదా అని ఇవ్వకుండా ఉండలేరు నిజమైన స్నేహితులు. ఈవిషయాన్ని చెప్పటానికే కృష్ణుడు కుచేలుడు అడగకపోయినా ఆయన దారిద్య్రం దూరమవడానికి సంపదను ఇచ్చాడు.
ఒక్క మనదేశంలోనే కాదు ‘స్నేహం కన్నా గొప్పది ఈ లోకంలో లేదు ’అని -రెవస్థ్ ఛొవ్దరీ , ‘మాటలకే పరిమితమయ్యే మిత్రుడెప్పుడు నీ మిత్రుడుగా ఉండలేడు ’ అని లియోటాల్ స్టాయ్, ‘అహంకారి కి మిత్రులుండరు’అని అస్కార్ వైల్డ్ అనేవారు చెప్పారు.
స్నేహాన్ని కావాలని కోరుకునేవారు ప్రపంచం అంతా ఉంటారు.
కాని, ఈ మధ్య కొన్ని స్నేహాలు తప్పుదారిన నడుస్తున్నాయి. స్నేహం అనే ముసుగులో అమాయకులను దోచేస్తున్నారు. అందుకే పిల్లలు స్నేహాలు చేసేటపుడు వారిని నొప్పించకుండానే పెద్దలు వారు ఎటువంటి స్నేహానికి దగ్గరవుతున్నారో ఓ కంట కనిపెట్టాలి. లింగభేదం స్నేహానికి లేదు. కాని లేత వయస్సులో ఉండే వారి స్నేహంలో అపశ్రుతులు జరగకుండా ఉండాలంటే స్నేహం విలువను, స్నేహం అంటే ఏమిటో వారికి తెలియపర్చాలి. స్నేహం అనే ముసుగు ధరించిన చెడు స్నేహితులు మంచివారిని రొంపిలోకి దింపే ప్రమాదం ఉంది. అందుకే చెడు స్నేహితులను గుర్తించాలి. వారిని దూరంగా పెట్టాలి. అపుడే స్నేహం పరిమళం జీవితాన్ని మంచి సువాసనలు ఇచ్చేట్టు చేస్తుంది. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కూడా స్నేహం విలువను చిన్నప్పుడే పిల్లలకు తెలియచెప్పాలి. అవసరమైతే వారి స్నేహాల వల్ల వారు పొందినది ఏమిటో వారికి తెలియచెప్పాలి. స్నేహం ఎంత గొప్పది అంటే ‘ఇచ్చింది మరిచిపోయి పుచ్చుకున్నది జ్ఞాపకం ఉంచుకోవాలని చెప్పేదే స్నేహం’అంటారు గాంధి. స్నేహితుడు అంటే తప్పును, తెలివి తక్కువ తనాన్ని మొహమాటానికి పోకుండా తెలియచెప్పి వారిని ఒప్పుల బాటలో నడిపించేవాడే మంచి స్నేహితుడు అవుతాడు.

- మానస