మెయిన్ ఫీచర్

ఏది భావ స్వేచ్ఛ? ఏది అహంభావ స్వేచ్ఛ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ ప్రశ్నద్వయాన్ని ఇంకాస్త సాగదీయాలంటే ఏది దుర్భావ స్వేచ్ఛ? ఏది విషభావ స్వేచ్ఛ? అని కూడా కలపవచ్చు. రచయితనని తాననుకొనే వ్యక్తికి, అధవా ఇతరులు అంటున్న వ్యక్తికి, సమాజానికి ఉద్వేగం కలిగించకూడదు! హాని తలపెట్టకూడదు! అనే ఇంగితం ఉండాలి. దానినే వివేకమంటారు. వివేకం లేకపోతే తనకేకాక, తన పరిధిలో ఉండే సమాజానికి హాని లేదా ప్రకోపం సంభవిస్తుంది. భావస్వేచ్ఛ అంటే తన ఇంటి మురికిని, కశ్మలాన్ని ఊడ్చి పొరుగువాని ఇంట్లో, పెరట్లోనే కాదు, బరితెగించి ఇంటి వరండాలోనే ఎగచిమ్మడం కాదు.
మన భారతదేశంలో ప్రతి రోజూ ఒక కోటి మంది అయినా దేవాలయాలు సందర్శిస్తారు. తెలిసో తెలియకో వాటిని పుణ్య (పణ్య?) క్షేత్ర యాత్రలంటారు. అటువంటివారి మనసు నొప్పించటం, గాఢోద్విగ్నభరితులను చేయటం, ఆ విగ్రహాలపై మూత్ర విసర్జన చేస్తాననటం, ఒక రామాయణమే కాదు, నూట ఎనిమిది రామాయణాలున్నాయనటం, ఆ మాటకు వస్తే అంతకు పది రెట్లు సీతలు, రాములు ఉన్నారనటం హేతువాదమా? బూతువాదమూ? అసంబద్ధ ప్రలాపవాదమా! భావస్వేచ్ఛగా రాజ్యాంగ హక్కు అని కల్లుతాగి నిప్పుతొక్కి తేలుకుట్టిన కోతిలా ఉచ్చాటన మంత్రాలు జోలికి పోవచ్చా? పోకూడదు. ఇట్లా ఒక అధిక సంఖ్యాక దేశీయుల ప్రధాన ప్రజావర్గానికి ఖేదం, విషాదం, ఉద్రేకం, పండ్లు (దంతఘట్టన) పటపట లాడించటంవల్ల సంఘానికి ఏమి మేలు ఆశించినట్లు? తమ సోదర సోదరీనీకానికి ఏమి జ్ఞానోదయం, ఏమి హితబోధ సాధించగలిగినట్లు? నా మేధావికట భృకుటీచాలనం వల్ల ఎక్కడైనా మర్రిచెట్టుకు మొక్కుకుంటే పిల్లలు పుడతారా? బంగారు పాత్రలో పాయసం సుజాత ఎందుకు తెచ్చి ఉండవచ్చు. న్యగ్రోధం పాయసం తాగుతుందా? దానిని గౌతమబుద్ధుడి కోసమే తెచ్చిందంటే ఎంత పరిభ్రష్ట మానసిక పరమోన్మాద విజృంభణ! అప్పటికే సుగ్రతుడు, జ్ఞానభాస్కరుడు శరీర తోషణం, పోషణం కోసం, మధ్యేమార్గం అవలంబించాడు కదా! మధ్యేమార్గమంటే శరీర శోషణంకాదు కదా! ‘యుక్తాహార విహారస్య’ అని శ్రీకృష్ణ భగవానుడు ప్రబోధించినట్లు శాక్యముని కూడా విహార పధికుడు కాకూడదా? అయినట్లు నేను వాగితే ఎంత తప్పు? ఎంత ముప్పు? భీష్మాచార్యుడు అంబతో మూడునెలలు సంసారం చేశాడు. అందువల్లనే సాల్వుడు ఆమెను నిరాకరించాడని హేతువాద బూతుతర్క భావస్వేచ్ఛను వినియోగించవచ్చా ఎవరైనా? ద్రౌపది దిగంబర సౌందర్యం అయ్యో! ఏ జన్మలో ఏం పాపం చేసుకున్నానో తిలకించలేకపోయినాను అని ధృతరాష్ట్రుడు లబలబలాడినట్లు నేను రాయవచ్చా?
అబ్బా! చంద్రవంశపు రాజులంతా వ్యభిచార సంజనిత మూలవంశీకులు అంటే ‘్భరతీ’యులు సహిస్తారా? ఇవన్నీ తర్కంకోసం, రాజ్యాంగం ప్రసాదించిన భావస్వేచ్ఛ దృష్ట్యాను కుతర్క మేధోల్బణం అయినా అంగీకరిస్తే వేల, లక్షల సంవత్సరాల, ఏండ్లు, పూండ్లుగా ఒక విశ్వాసాన్ని పాటిస్తున్న అధిక మతీయులు ఒప్పుకుంటారా? భారతీయ సమాజానికి ఆ రచయిత, ఆ కళాకారుడు, ఆ హేతువాద దుర్మాన ఏమి సన్మానమార్గాన్ని, ఏమి సమాజ చైతన్యాన్ని బోధిస్తున్నట్లు? ఏమి సాచరణ విశ్వాస వికాసాన్ని ఉద్దేశిస్తున్నట్లు?
మంత్రాలు, తపస్సు, వౌనం మాకొద్దు అంటే మీ ఇష్టం. కల్లంగడిలో శివాభిషేకం చేయకుండా శవపూజ ఎంత ఘనంగా ఆచరించినా మృతుడు మిమ్ములను అభినందించడు. వార్తామాధ్యమాలకు, భావప్రసరణ సంస్థలకు స్వయం నియంత్రణ, బుద్ధీజ్ఞానం లేకపోతే ఎట్లా? ఒక మతాధిక అనుసరులు, విశ్వాసులు- మీ మతంలో ఈ దోషాలు లేవా? ఈ అపభ్రంశతలు లేవా? అని సవాలు చేయటం వివేక విహీనత? అంటే తమ లోపాలను చూసీచూడనట్లు ఒప్పుకోవటం కాదా? అది బలహీనమైన వాదం. హిందూ మతం తక్కిన మతాలన్నింటికన్న పరమోత్కృష్టమైనది అని చెప్పుకోగలగాలి, నిరూపించుకోవాలి. కాని మీ మతంలో ఈ రోత లేదా అని ప్రశ్నించటం బలహీనవాదం. హిందూ మతంలో ఒకప్పుడు చాలా ఘోరాలు జరిగాయి. కాని వాటినే బూతు నినాదాలుగా వల్లించి ఏం ప్రయోజనం?
జయచంద్రుణ్ణి, మీర్జ్ఫారును సుప్రీంకోర్టులో విచారించి ఉరిశిక్ష విధించగలమా ఇప్పుడు! ఇందిరాగాంధీని నిందిస్తే కాంగ్రెస్‌వారికి రావణాసురుడి కోపం ఎందుకు రావాలి? ప్రజాస్వామ్య విలువలను కాంగ్రెసువారు నడి బజారున వివస్ర్తికరణ చేయలేదా? అట్లా అంటే ఉద్వేగ, ఉద్రిక్త క్రోధఘార్ణమాన, చూర్ణమాన వివశమనస్కులు కావటం ఎందుకు? ఆధునిక భారతీయ సమాజానికి ఈ పిచ్చివేషాలు, పిశాచ నర్తనలు ఎందుకు? ఇవి సాధించే సాంఘిక ప్రయోజనం ఏమిటి? బుద్ధ్భగవానుడికి అశ్లీలతా పాదకం జరిగినప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ మహాశయుడు ఎంతకోపం తెచ్చుకుంటాడో, శ్రీరామచంద్రుడి పట్ల, ఆయన ఇల్లాలి పట్ల నోరు పారేసుకుంటే గాంధీ మహాత్ముడు (సమాధిలో) తల్లకిందులు కాడా? తులసీదాసు, రామదాసు, త్యాగయ్య, రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, రాజాజీ, రాష్ట్రానికి, భాషకు దశాధిక రామాయణ రచయతలు ఉద్విగ్న నిశ్వాసాలు విడువరా? వాళ్ళ ఉసురు సాంఘిక విద్రోహులకు తగలదా? ఈంత వార్తకనుడు ‘ది హిందూ పత్రిక’లో (నేతి బీరకాయ) ఈ ఘోషంతా భరించి సహించి ఈ వార్తోదంతం పరికించండి.
"Author of Kannada novel Dhundi arrested under 295A IPC (Deliberate and malicious acts, intended to outrage religious feelings or any class by insulting its religion, or religious beliefs) and 298 IPC (uttering words etc., with deliberate intent to wound religious feeling) - August-30, 2013- Bengalure. ఈ నవల రచయిత పేరు- యోగేష్ మాస్టర్ అట. క్షుద్రోపాసన తాంత్రికుడేమో! పేరులో యోగీశ్వరుడని ఉంది కదా!
ఎంతకూ అర్థంకాని ఇంకొక భేతాళ ప్రశ్న ఉంది. ఇంక్లూజివ్ (అపరిధికము) ఎక్స్‌క్లూజివ్ (సపరిధికము), సెక్యులర్ (మత నిరపేక్ష సమగ్ర లౌకిక) అని డాండ డడాండ భీషణలు సాయిస్తుంటారు కదా మార్క్సిస్టులు, వారి సగోత్రీకులు, అది వారికొక్కరికే వర్తిస్తుందా? ఇతరులకు వర్తించదా? ఆ విశాల ఉదాత్త ఉదార అంబర చుంబి ఆశయం హిందూ మతాభిమానుల పట్ల చూపరా? అపరిధిక దృక్పథంలో హిందూ సమాజమని చెప్పుకుంటున్నవారు చేరరా? చేర్చుకోలేరా? అప్పుడు వారి దృష్టి సపరిధికం కాదా? వారికా వెలివాడ ఎందుకు? రోమిలాధాపర్, అరుంధతీరాయి, వెండీ డోనింగర్, సతీశ్‌చంద్ర, కన్హయ్యకుమార్‌లది ఇంక్లూజివ్ (అపరిధి) దృష్టిఅయితే ఆర్.ఎస్.ఎస్, హిందూ సంఘటనల ఆశయం ఆక్రోశం, అభిమతం, అభివాంఛ ఏమిటో అపరిధి‘కిస్టులు’ కాస్త ఆలోచించవచ్చుకదా! వారిని కూడా భారతదేశమనే భూలోక గృహంలో కలుపుకొని జీవించనివ్వవచ్చును కదా! అప్పుడే అది ఇంక్లూజివ్ తాత్త్విక చింతన కాగలదు. లేకపోతే డొల్ల, హుళక్కి, దబ్బర, పూర్ణానుస్వారం. ఇంకో శేషప్రశ్న ఉంది. కర్ణాటకలో 2013లో ఉన్నది కాంగిరేసు గద్దె. ధూండి నవల ఏం పాపం చేసింది? నిషేధమేల? రచయిత జైలుపాలు ఏల?
వేటకుక్కలతో (ఉసిగొల్పి) వేటాడుతూ కుందేళ్ళతో (సానుభూతి) పరుగులు తీయటం అంటే ఇదే కాబోలు. రేషనలిస్టుల, సెక్యులరిస్టుల, మార్క్సిస్టుల బోలుతనం. గోలతనం!!

- డాక్టర్ అక్కిరాజు రమాపతిరావు