ఎడిట్ పేజీ

భారత ఏకత్వ స్ఫూర్తికి విరుద్ధమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆర్టికల్ 35(ఎ)... దీనిపైనే దేశవ్యాప్తంగా ఇప్పుడు విస్తృత చర్చ జరుగుతోంది. జమ్మూ కశ్మీర్‌లో అత్యంత వివాదాస్పదంగాను, అంతే ప్రాధా న్యం ఉన్న ఈ అధికరణం ప్రస్తావన ఇపుడెందుకు వస్తోంది? ఇదేమైనా నిన్న మొన్న చేసిన చట్టమా? 1954 మే 14న రాష్టప్రతి ఉత్తర్వులతో అమలులోకి వచ్చిన అంశం. మరి 64 ఏళ్ల తర్వాత దీనిపై ఇపుడెందుకు ఈ రాద్ధాంతం? జమ్మూ కశ్మీర్‌లో ప్రజలకు ప్రత్యేక హక్కులను కల్పిస్తున్న 35(ఎ) ఆర్టికల్‌ను తొలగిస్తారేమోనని ఆ రాష్ట్రంలో పెద్దఎత్తున హింస ప్రజ్వరిల్లుతోంది. ఈ అధికరణంపై వివాదం అనవసరంగా చేస్తున్నారనే చెప్పాలి. వేర్పాటువాదులు మాత్రమే ఆందోళన చెందుతున్నారనేది సరికాదు, ప్రజాస్వామ్య వాదులు కూడా దీనిపై ఆందోళన చెందాల్సిన ప్రక్రియకు సర్వోన్నత న్యాయస్థానం వేదికగా మారింది.
ఆర్టికల్ 35ఎ-లో ఏముంది? అని తెలుసుకునే ముందు దానిపై తాజాగా ముసురుకున్న వివాదం ఏ మిటో ఒకసారి పరిశీలించాల్సి ఉంటుంది. గతంలో ఆర్టికల్ 35(ఎ)పై కేసు వేసినపుడు అది రాజ్యాంగ బద్ధమేనని చాలా స్పష్టంగా సుప్రీం కోర్టు చెప్పింది. తాజాగా మరోమారు అదే కోర్టులో పిటిషన్ దాఖలైంది. రాజ్యాంగ ప్రక్రియ ప్రకారం ఇది జరగలేదు, కేవలం రాష్టప్రతి ఉత్తర్వులతో మాత్రమే ఇది అమలులోకి వచ్చిందని, ఎన్నడూ ఆ అంశం పార్లమెంటు ముందుకు రాలేదని, చర్చ జరగకుండానే అమలులోకి రావడం రాజ్యాంగ విరుద్ధమని పిటిషన్‌లో పేర్కొన్నారు. రాజ్యాంగంలోని 368 ప్రకారం ఏదైనా సవరణ తేవాలంటే దానిపై పార్లమెంటులో చర్చ జరగాల్సి ఉంటుంది. రాజ్యాంగంలో ఏం పేర్కొన్నా, రాజ్యాంగంలోని అంశాన్ని అయినా సవరించే లేక మార్పు చేసే లేదా తొలగించే రాజ్యాంగబద్ధమైన అధికారం పార్లమెంటుకు ఉంటుంది. రాజ్యాంగ సవరణకు ఉద్దేశించిన బిల్లును లోక్‌సభలో లేక రాజ్యసభలో మాత్రమే ప్రవేశపెట్టాలి. ఆ బిల్లును సభకు హాజరైన వారిలో మూడింట రెండు వంతుల మంది ఆమోదించాలి. ఆ విధంగా ఆమోదించిన వారి సంఖ్య సభ మొత్తం సభ్యుల సంఖ్యలో సగం కంటే ఎక్కువై ఉండాలి. లోక్‌సభలోనూ, రాజ్యసభలోనూ ఈ విధంగానే ఆమోదించాలి. రెండు సభలూ ఆమోదించిన తర్వాత బిల్లును రాష్టప్రతికి పంపించాలి. రాష్టప్రతి ఆ బిల్లును తప్పనిసరి ఆమోదించాలి. అపుడు బిల్లులో ఉదహరించిన విధంగా రాజ్యాంగ సవరణ సరిపోతుంది. అధికరణం 54,55, 73, 162, 341 సవరణలు లేదా 5వ విభాగంలోని నాలుగో అధ్యాయం లేదా ఆరో విభాగం ఐదో అధ్యాయం, లేదా 9వ విభాగంలోని మొదటి అధ్యాయాలకు సవరణలు చేయాలంటే పార్లమెంటు ఆమోదం పొందడంతో పాటు దేశంలోని సగం కంటే ఎక్కువ రాష్ట్రాల శాసనసభలు కూడా ఆమోదించాలి. ఏడో షెడ్యూలులో మార్పులు చేయాలన్నా, రాష్ట్రాలకు పార్లమెంటులో ప్రాతినిధ్యానికి సంబంధించి సవరణలకు కూడా పార్లమెంటుతో పాటు సగానికి పైగా అసెంబ్లీల్లో ఆమోదం తెలపాలి.
కానీ, ‘ఆర్టికల్ 35ఎ’ను కేవలం రాష్టప్రతి ఉత్తర్వుల ద్వారానే రాజ్యాంగంలో చేర్చారు. ఏదైనా అధికరణాన్ని రాజ్యాంగంలో చేర్చాలంటే దానికో ప్రక్రియ ఉందని, ముందు అది పార్లమెంటుకు పోవాలనేది పిటిషనర్ వాదన. నాలుగేళ్ల కిందట ‘వుయ్ ది సిటిజన్స్’ అనే స్వచ్ఛంద సంస్థ (ఎన్జీవో) ఈ అధికరణం రాజ్యాంగబద్ధం కాదంటూ దానిని రద్దు చేయాలని సుప్రీంలో వ్యాజ్యం దాఖలు చేసింది. భారతదేశ ఏకత్వ స్ఫూర్తికి ఇది విరుద్ధమని, ఒక విధంగా ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమేనని ఇతర రాష్ట్రాల వారిని జమ్మూ కశ్మీర్‌లో ఉద్యోగం చేసుకోనివ్వకుండా, స్థిరాస్తులను కొనుక్కోనివ్వకుండా నిరోధిస్తోందని ఈ వ్యాజ్యంలో ఎన్‌జీవో పేర్కొంది. జాతీయ మహిళా కమిషన్ మాజీ సభ్యురాలు డాక్టర్ చారువాలీ ఖన్నా కూడా ఈ అంశంపై సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. కశ్మీర్‌లో శాశ్వత నివాస గుర్తింపు లేని పురుషులను స్థానిక మహిళలు వివాహం చేసుకుంటే వారి సంతానానికి శాశ్వత నివాస గుర్తింపు దక్కడం లేదు. ఫలితంగా వారు కూడా అక్కడ స్థిరాస్తులను కొ నుగోలు చేసుకునే అవకాశం లేకుండా పో తోంది. ఈ పిటిషన్లు రా గానే సుప్రీం కోర్టు 2017 జూలైలో కేంద్ర ప్రభుత్వానికి, జమ్మూ కశ్మీర్ ప్రభుత్వానికీ నోటీసులు జారీ చేసింది. ఈ అధికరణం వల్ల కశ్మీర్‌ను మిగతా దేశం నుంచి ఈ చట్టం వేరుచేస్తోందని, మహిళల హక్కులను కూడా హరిస్తోందని , దీనిని రద్దు చేయాలని కొందరు కోరుతున్నారు. ఈ చట్టాన్ని నీరు గార్చి కశ్మీర్ ప్రజలకు ఉన్న హక్కులను హరించవద్దని చట్టాన్ని కొనసాగించాలని మరికొందరు కోరుతున్నారు.
పంజాబ్ నుండి ప్రవాహంలా వస్తున్న వలసలను అడ్డుకునే క్రమంలో 1927లో కశ్మీర్ సంస్థానం మహారాజు హరిసింగ్ తొలిసారి ఒక చట్టాన్ని ప్రవేశపెట్టారు. జమ్మూ కశ్మీర్ ప్రజల హక్కులకు సంబంధించి అందులో కొన్ని సూత్రాలను పొందుపరిచారు. ఇతర రాష్ట్రాల వారు వలస వచ్చి స్థిరపడడాన్ని నియంత్రిస్తూ ఆ చట్టంలో నిబంధనలను చేర్చారు. అనంతరం 1947లో జమ్మూ కశ్మీర్ భారత్‌లో విలీనమైంది. ఇదేదో సాధారణంగా జరిగిన ప్రక్రియ కాదు. ఎట్టిపరిస్థితుల్లోనూ కశ్మీర్‌ను కైవసం చేసుకోవాలనే ఆలోచనతో పాకిస్తాన్ తన సాయుధ బలగాలను భారత్‌లోకి పంపించింది. ఇంకోపక్క కశ్మీర్ రాజు హరిసింగ్ తన ప్రాంతాన్ని స్వతంత్య్ర రాజ్యంగా ప్రకటించుకోవాలని చూశాడు. ఒకదశలో ఐక్యరాజ్యసమితిలో రిఫరెండం చేయాలనే ప్రస్తావన రావడంతో ఆనాటి ప్రజలు హరిసింగ్‌కు వ్యతిరేకంగా షేక్ అబ్దుల్లా నాయకత్వంలో వీరోచిత పోరాటం చేశారు. ఈ పోరాటానికి భారత సైన్యం మద్దతు ఇచ్చింది. ఈ సందర్భంగా కశ్మీర్ ప్రజలు భారత్‌లో విలీనం కావాలని నిర్ణయించుకున్నారు. అప్పటికింకా రాజు హరిసింగ్ బతికే ఉన్నాడు. ఆయన సైన్యం ముందు లొంగిపోయే దశలో జమ్మూ కశ్మీర్‌కు సంబంధించిన సర్వాధికారాలను ప్రభుత్వానికి స్వాధీనం చేయలేదు. సైన్యాన్ని, సమాచార వ్యవస్థను, విదేశీ వ్యవహారాల విభాగాలను మాత్రమే భారత ప్రభుత్వానికి స్వాధీనం చేశాడు. అపుడు భారత చట్టాలు కశ్మీర్‌కు కూడా వర్తించాల్సిన పరిస్థితుల్లో సంలీన ఒడంబడిక కుదరగా, దాన్ని పార్లమెంటులో ఆమోదించారు. ఆ విధంగా కశ్మీర్ సంస్థానం భారత్‌లో విలీనమైంది. ఈ క్రమంలోనే 1949లో జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రాజ్యాంగంలో చేర్చారు. ఇది జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక రాజ్యాంగంగా వ్యవహరించవచ్చు. జమ్మూ కశ్మీర్ ప్రత్యేక జెండా కలిగి ఉండే అవకాశాన్ని కూడా ఇది కల్పించింది. ఆర్టికల్ 370 కేంద్ర శాసనాధికారాలను కశ్మీర్‌లో కేవలం రక్షణ, విదేశీ వ్యవహారాలు, సమాచార ప్రసారాల వరకే పనిచేస్తాయి. మిగిలిన అన్ని విషయాలపై కశ్మీర్ ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుంది. 1954లో రాష్టప్రతి ఉత్తర్వులు ద్వారా ఆర్టికల్ 35(ఎ) ను రాజ్యాంగంలో చే ర్చారు. ఇది ఇంత వర కూ పార్లమెంటు ఆమోదాన్ని పొందలేదు. ఆర్టికల్ 368 ప్రకారం రాజ్యాంగానికి చేసే సవరణలు ఏవైనా పార్లమెంటు ఆమోదానికి పంపించాలని దీనిపై వ్యాజ్యం వేసిన ‘వుయ్ ది సిటిజన్స్ ’ ఎన్‌జీవో సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువచ్చింది. డాక్టర్ సుశీలా సాహ్నీ అనే కశ్మీర్ మహిళ వేసిన వ్యాజ్యం విచారించిన జమ్మూ కశ్మీర్ హైకోర్టు 2002లో ఒక తీర్పును ఇచ్చింది. దాని ప్రకారం శాశ్వత నివాసులు కాని వారిని వివాహం చేసుకున్న కశ్మీర్ మహిళలు వారి హక్కులను కోల్పోరని తీర్పు ఇచ్చింది. కానీ ఆ తీర్పును అక్కడి ప్రభుత్వం అమలు చేస్తూ ఆదేశాలు ఇవ్వలేదు. దాంతో వ్యవహారం మొదటికి వచ్చింది.
ఎన్‌జీవో దాఖలు చేసిన ఈ పిటిషన్లపై సోమవారం సుప్రీంలో వాదనలు ప్రారంభమయ్యాయి. ఆర్టికల్ 35ఎ రాజ్యాంగ బద్ధమా? కాదా? అన్న వాదనలు ఇంకా ప్రారంభం కాలేదు. ఈ పిటిషన్‌ను ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించాలా? వద్దా? అనే అంశంపై వాదనలు మొదలయ్యాయి. ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ముందుకు ఈ పిటిషన్ వచ్చింది. సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏ ఎం ఖాన్ విల్కర్, జస్టిస్ చంద్రచూడ్‌లతో కూడిన ఈ ధర్మాసనం చర్చ ప్రారంభించే సమయానికి జస్టిస్ చంద్రచూడ్ కోర్టుకు చేరుకోకపోవడంతో వాదనలను ఆగస్టు 27 నాటికి ధర్మాసనం వాయిదా వేసింది. ముగ్గురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం దీనిని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనానికి పంపిస్తే, ఆర్టికల్ 35(ఎ)కు ఎసరు వస్తుందేమోననే భావనలో కశ్మీర్‌లో కొంత మంది అభిప్రాయం. ఈ ఆర్టికల్‌ను రక్షించుకోవాలనే తపనతో కశ్మీర్‌లో ఉద్యమాలు జరుగుతున్నాయి. ఆర్టికల్ 35ఎ ప్రకారం కశ్మీర్ అసెంబ్లీకి కొన్ని అధికారాలు కూడా దక్కాయి. కశ్మీర్‌లో ఎవరు శాశ్వత నివాసులో నిర్ణయించే అధికారం శాసనసభకు కట్టబెట్టారు. శాశ్వత నివాసులకు కొన్ని ప్రత్యేక హక్కులు, అధికారాలు కల్పించడం శాసనసభకు కల్పించిన మరో ప్రత్యేక హక్కు.
కశ్మీర్ సర్వీసుల్లో నియామకాలకు అక్కడి శాశ్వత నివాసులు మాత్రమే అర్హులు. శాశ్వత నివాసులు మాత్రమే అక్కడ స్థిరాస్తులు కొనుగోలు చేయాలి. ఇతరులు కొనుగోలు చేసినా హక్కు మాత్రం వారికి చెందదు. రాష్ట్ర ప్రభుత్వం కల్పించే ఉపకార వేతనాలు, ఇతర ప్రయోజనాలు కూడా శాశ్వత నివాసులకే అందుతాయి. ఈ ఆర్టికల్ ప్రకారం అక్కడ శాశ్వత నివాసిగా గుర్తింపు పొందిన వ్యక్తి కుమార్తె శాశ్వత నివాసి కాని వ్యక్తిని వివాహం చేసుకుంటే ఆమె కూడా తన శాశ్వత నివాస హోదాను కోల్పోతుంది. ఆమె సంతానానికి కూడా ఆ హోదా దక్కదు. దానివల్ల వారు వారసత్వంగా తమకు ఏమైనా స్థిరాస్తి వచ్చినా దానిని చట్టబద్ధంగా పొందలేరు. విద్య,ఉపాధి అవకాశాలను కూడా ఆ రాష్ట్రంలో కోల్పోతారు. 1965లోనూ, 1971లోనూ యుద్ధ సమయాల్లో పాకిస్తాన్ నుండి కశ్మీర్‌కు వచ్చిన శరణార్థులకు కూడా అక్కడ శాశ్వత పౌరులుగా గుర్తించే వీలు లేదు. ఇంత స్పష్టమైన చట్టం 64ఏళ్లుగా అక్కడ అమలులో ఉండటం వల్లనే కశ్మీర్‌ను అప్పటి నుండి ఇప్పటి వరకూ ఒకే భూభాగంగా చూడగలుగుతున్నాం. దీనిలో ఏవిధమైన సడలింపులు ఇచ్చి ఉన్నా భూకబ్జాకారులే కాదు, ధనవంతులు కశ్మీర్ భూ భాగాన్ని తమ ఆధీనంలోకి తీసుకునే వారు. ఇదే జరిగి ఉంటే జమ్మూ కశ్మీర్ కోసం, సరిహద్దు విభజన రేఖ వెంబడి విచ్ఛిన్నకర శక్తులతో భీకరపోరు సాధ్యమయ్యేది కాదు. ప్రతి ఒక్కరూ కశ్మీర్‌కు చేరుకుని తిష్ఠ వేయడం ద్వారా అక్కడ ఉద్యోగాలను పొంది, స్థానికులలో మరింత ప్రకోపానికి కారణమయ్యేవారు.
అటవీ ప్రాంతాల్లో హక్కులను కాపాడుకునేందుకు 1/70 చట్టం అమలు చేస్తున్నపుడు లేనిది, ఆరో షెడ్యూలులోని ఆర్టికల్ 244(2), ఆర్టికల్ 275(1)లో ఉన్న నిబంధనల ప్రకారం షెడ్యూల్డు ప్రాంతాల్లోని స్థానికుల హక్కులను కాపాడుకుంటుండగా లేనిది జమ్మూకశ్మీర్‌లో హక్కులను అక్కడి ప్రజలకు ధారాదత్తం చేసి వారి ప్ర యోజనానికే పరిమితం చేయడం తప్పు అవుతుందా? రాజ్యాంగ అధికరణాన్ని మార్చే ప్రయత్నం చేస్తే ఎదురయ్యే ముప్పును కూడా పరిశీలించాలి కదా! ఎవరికి లాభం? ఎవరికి నష్టం? అనే కోణంలో కాకుండా భారత సమైక్యతకు, సమగ్రతకు పట్టం కట్టే ఆలోచన దృష్టితోనే ఎవరైనా ఆలోచించాల్సి ఉంది.

-బీవీ ప్రసాద్ 98499 98090