మెయన్ ఫీచర్

భారత్‌కు సముచిత స్థానం లభించేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అణుశక్తిని సాధించడం దేశ రక్షణ అవసరాలలో చాలా ముఖ్యమైనది. అణ్వాయుధాలు కలిగి వున్న దేశంగా ప్రపంచ పటంలో గుర్తింపు పొందడం వ్యూహాత్మకమైన చర్య. అవి ప్రయోగించకుండానే కలిగి వున్న దేశంగా పొరుగు దేశాలకు భయం కలిగించడమే ఆ వ్యూహం లక్ష్యం. మన ఇరుగు పొరుగు దేశాలైన చైనా, పాకిస్తాన్‌లు మన దేశంపై దాడులు చేసాయి. భూభాగాలను ఆక్రమించాయి. ఇప్పటికీ వాటితో మన సంబంధాలు అంత బాగాలేవు. పాకిస్తాన్ తీవ్రవాద రూపంలో పరోక్ష యుద్ధం చేస్తుంటే చైనా కవ్వింపు చర్యలకు పాల్పడడం భారత్ దూకుడుకు ప్రపంచ వేదికలపై అడ్డుపడడం జరుగుతోంది. వీటి కుయుక్తుల నేపథ్యంలో జాతిలో ఆత్మవిశ్వాసం నింపాలంటే అణుశక్తి సాధించిన దేశంగా భారత్ గుర్తింపు పొందాల్సిన అవసరం చాలా వుంది. 1974లో ఇందిరాగాంధీ, 1998లో వాజ్‌పేయి అత్యంత గోప్యంగా అణుపరీక్షలు జరపడం విశ్వానికి ఓ బలమైన సంకేతం పంపింది. శత్రు భీకర భారత నిర్మాణంలో అవసరమైతే అణుశక్తిని ఉపయోగిస్తామని ప్రపంచ నేతలకు చెప్పకనే చెప్పినట్టు అయింది.
భారత్‌లో 1974లో అణుపరీక్షలు జరిపిన తరువాత 1975లో అణు సరఫరా దారుల బృందం (ఎన్‌ఎస్‌జి) ఏర్పడింది. అణ్వస్త్ర వ్యాప్తి నిరోధ ఒప్పందం (ఎన్‌పిటి)పై సంతకం చేసిన కొన్ని దేశాలు అణు ఇంధన పరికరాల వ్యాప్తి కొనుగోలుపట్ల కొన్ని పరిమితులను విధించాలనుకున్నారు. 1975-78 మధ్య లండన్‌లో ఈ విషయంపై వరస సమావేశాలు జరిగాయి. ఎగుమతి దిగుమతులకై సూచించిన పరికరాలు, పదార్ధాలను నిర్ధారించారు. అంతర్జాతీయ అణుశక్తి సంస్థ వీటిని ఖరారు చేసింది. వీటిని మాత్రమే అణుశక్తి దేశాలు కాని వాటికి సరఫరా చేయాలని నిర్ణయించారు. 1991 వరకు మళ్లీ ఎన్‌ఎస్‌జి సమావేశం కాలేదు. మొదట్లో ఈ బృందంలో కేవలం కెనడా, పశ్చిమ జర్మనీ, ఫ్రాన్స్, జపాన్, రష్యా, బ్రిటన్, అమెరికాలు మాత్రమే ఉండేవి. 1976-77 వరకు బెల్జియం, జెకొస్లేవేకియా, తూర్పుజర్మనీ, ఇటలీ, నెదర్లాండ్స్, పోలండ్, స్వీడన్, స్విట్జర్లాండ్‌లు కూడా ఇందులో చేరాయి. 1990 వరకు మరో 12 దేశాలు చేరాయి. 2004లో చైనా సభ్యదేశమైంది. 2016లో అర్జెంటీనా చేరింది. ఇప్పటికి 46 దేశాలు ఇందులో వున్నాయి. 1990లో జర్మనీలు రెండు ఒకటయ్యాయి. 1993లో జెకోస్లేవేకియా జెక్, స్లోవేకియాలుగా విడిపోయింది. 1990 అనంతరం ముక్కలైన రష్యానుండి ఏర్పడిన వివిధ రిపబ్లిక్‌లకు ఈ బృందంలో పరిశీలక ప్రతిపత్తి ఇచ్చారు. 2010లో భారత్ పర్యటనకు వచ్చిన అమెరికా అధ్యక్షుడు వొబామా ఎన్‌ఎస్‌జిలో భారత్ సభ్యత్వానికి మద్దతునిచ్చారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు సర్కోజీ 2010లోనే భారత్ వాదనకు మద్దతునిచ్చారు. రష్యా, సిజ్జర్లాండ్‌లు కూడా షరతులు లేని మద్దతు ప్రకటించాయి. ఆశ్చర్యంగా మెక్సికో కూడా భారత్‌ను సమర్థించింది. దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో జరిగిన ఎన్‌ఎస్‌జి తాజా సమావేశంలో ఈ విషయం చర్చకు వచ్చింది. పాకిస్తాన్ కూడా ఎన్‌ఎస్‌జి సభ్యత్వం కోరుతుండడంతో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. చైనా శిఖండిలా భారత్‌ను అడ్డుకుంటున్నది. చైనాను నిలువరించేందుకు అమెరికా భారత్‌ను సమర్థిస్తున్నది. ఎన్‌పిటిపై భారత్ సంతకం చేయలేదని చైనా వాదిస్తోంది. ఫ్రాన్స్ సైతం 1992లోగాని ఎన్‌పిటిపై సంతకం చేయలేదని భారత్ గుర్తు చేస్తున్నది. 1994 అర్జెంటీనా కూడా ఎన్‌పిటిపై సంతకం చేయకుండానే ఎన్‌ఎస్‌జిలో సభ్యదేశమైంది.
అణుశక్తిని సాధించే విషయంలో భారత్ స్వాభిమానాన్ని స్వావలంబనను ఎవరూ సవాలు చేయలేదు. 1998 మేలో అణు పరీక్షల అనంతరం నాటి భారత ప్రధాని వాజ్‌పేయి మాట్లాడుతూ ‘‘ఇరుగు పొరుగు దేశాల దాడుల ముప్పునుంచి భారతదేశానికి సకల విధాల రక్షణకై అణుపరీక్షలు జరిగాయి. అంత మాత్రంచేత భారత దేశం ముందుగా ఏదేశంపైనా అణ్వస్త్రాన్ని ప్రయోగించబోదు. ఇది ఆత్మరక్షణకై చేసిన పరీక్ష. ఇప్పుడు భారతదేశం అణ్వస్త్ర దేశమైంది. మనం శక్తిమంతులమయ్యాం. శక్తి ఉన్నప్పుడు శాంతి సంప్రదింపులకు విలువ ఏర్పడుతుంది. బలహీనుడి శాంతిమంత్రం పిరికితనంగా పలాయన వాదంగా పరిగణింపబడుతుంది’’ అని అన్నారు.
నాడు అణుపరీక్షలు జరిపిన భారత్‌ను ప్రపంచం వెలివేసింది. భారత్‌పై అమెరికా ఆంక్షలు విధించింది. కాని నేడున్న పరిస్థితి వేరు. బలమైన ప్రజాస్వామ్యదేశంగా భారత్ వినిపిస్తున్న వాణికి ప్రపంచ దేశాలు మద్దతునిస్తున్నాయి.
కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ కూడా అణుపరీక్షల అనంతరం ఈ విజయం భారతీయ శాస్తవ్రేత్తలకు చెందుతోందని వారికి అభినందనలు తెలిపింది.
1974 మే 18న బుద్ధపూర్ణిమ రోజున ఇందిరాగాంధీ హయాంలో భారతదేశపు తొలి అణుపరికరాన్ని రాజస్తాన్‌లోని పోఖ్రాన్‌లో పరీక్షించారు. నాడు భారతీయ జనసంఘ్ ఈ ప్రయోగ విజయాన్ని ఎంతగానో హర్షించింది. నిజానికి జనసంఘ్ 1965లోనే విజయవాడలో జరిగిన కార్యవర్గ సమావేశంలో అణుబాంబుని నిర్మించాలని తీర్మానించింది.
భారత అణు కార్యక్రమ పితామహుడు హోమి జె బాబా 18 నెలల్లో ఇండియా అణుబాంబును తయారుచేయగలదని ప్రకటించారు. నాటి ప్రధాని లాల్‌బహదూర్ శాస్ర్తీకూడ భూగర్భ అణు పరీక్ష సన్నాహాలకు అనుమతినిచ్చారు. బాబా, శాస్ర్తీల ఆకస్మిక మరణంతో ఆ కార్యక్రమం నిలిచిపోయింది. 1971లో మళ్లీ ఈ కార్యక్రమం ఊపిరిపోసుకుంది.
ప్రాచీన భారతంలో కణాదుడు అణుశక్తి గురించి వైదేషిక దర్శనంలో వివరించాడు. జాన్ డాల్టన్ ఆధునికంగా చెప్పిన అణుసిద్ధాంతం కూడా ఈ దర్శన సూత్రాలకు దగ్గరగా వుంది. తెలంగాణలోని గరికపాటి వాస్తవ్యుడు అన్నంభట్టు (1625) 3తర్క సంగ్రహం2 అన్న గ్రంథంలో అణు విజ్ఞానాన్ని గురించి వివరించాడు.
అణువు చిన్నదే కాని దానికి అమిత శక్తి ఉంది. ఒక గ్రాము పదార్థంలోని అణువుల్ని లెక్కించడం మొదలుపెడితే రెండు కోట్ల ఏళ్లు పడుతుందట. ఆధునిక విజ్ఞానపరంగా చూస్తే సృష్టిలో లభించే సహజమైన, కృత్రిమమైన మూలకాలు 120 వరకు ఉన్నాయి. అణువులకు భారం ఉంటుంది. ప్రోటాన్‌లు, నూట్రాన్‌ల కలయికనే అణుభారం అంటారు. అణుభారం పెరిగిపోయిన మూలకాలు స్థిరంగా వుండక శిథిలమై కొత్త మూలకాలుగా మారే ప్రక్రియలో శక్తిని విడుదల చేస్తాయి. దీనే్న రేడియో ధార్మిక శక్తి అన్నారు. మేడమ్ క్యూరీ ఈ విషయం కనుగొన్నారు. రేడియం, పోలోనియం అనే మూలకాల్ని గుర్తించారు. అణుసంయోగ, విచ్ఛేద ప్రక్రియలు అనంతర కాలంలో రూపొందాయి. సహజంగా రేడియో ధార్మిక శక్తి గల యురేనియం తగిన మూలకం అని శాస్తవ్రేత్తలు భావించారు. జర్మనీ, ఫ్రాన్స్‌లు ఈ విషయమై అమెరికా వెళ్లి పరిశోధనలు చేసారు. 1945 ఆగస్టు 6న అమెరికా జపాన్‌లోని హిరోషిమా నాగసాకిలపై అణుబాంబులు ప్రయోగించింది. అప్పటినుంచి ఇప్పటివరకు మళ్లీ ఎవరూ ఆ సాహసం చేయలేదు. ఆ బాంబు ప్రయోగం సృష్టించిన విధ్వంసం అంతా ఇంతా కాదు. ఆ తరువాతే ఎన్‌పిటి, సిటిబిటి వంటి ధర్మ పన్నాలు, చిలకపలుకులు అగ్ర దేశాధినేతల పెదాలపై నర్తించడం మొదలైంది. విజ్ఞానం ఎవరి సొత్తు కాదు. అందుకే జై జవాన్, జై కిసాన్ లతోపాటు వాజ్‌పేయి జై విజ్ఞాన్ నినాదాన్ని ఇచ్చారు. 1995లో ఫ్రాన్స్, చైనాలు అణుపరీక్షలు జరిపాయి. షరతులు, ఒప్పందాలు, నిందలు, నిషేధాలు వర్ధమాన దేశాలపై రుద్దడం ఆయా దేశాల సార్వభౌమాధికారాన్ని సవాలు చేయడమే. యుద్ధోన్మాదాన్ని సహించనక్కరలేదు. కాని విజ్ఞాన వికాసాన్ని ఎదుర్కోవడం సహేతుకం కాదు.
అధిక శక్తిగల బాంబు తయారీకి కావాల్సిన కంప్యూటర్ సిములేషన్ శక్తి కూడా ఇప్పుడు భారత్ సొంతం. వంద టన్నుల శక్తిగల అణ్వస్త్రాన్ని సైతం ఇకపై మనం నిర్మించగలం. అమెరికా వైఖరి ఈ దశకంలో మారడం హర్షించదగిన పరిణామం. 2005లో కుదిరిన పౌర అణు ఒప్పందంవల్ల 2008లో ఎన్‌ఎస్‌జి నుంచి మినహాయింపు వల్ల భారత్ కజికిస్తాన్ వంటి చిన్న దేశాలనుంచి యురేనియం దిగుమతి చేసుకునే వీలు కలిగింది. మరి కొన్ని దేశాలతో అణు ఒప్పందాలు కుదుర్చుకునే వీలు కలిగింది. ఈ నేపథ్యంలో ఎన్‌ఎస్‌జిలో సభ్యత్వం వల్ల పెద్దగా వొరిగేదేమీ లేకున్నా, స్వేచ్ఛా అణు వాణిజ్యంలో సభ్యత్వం వల్ల సాధికారత లభిస్తుందనేది భారత్ అభిప్రాయం. 48 దేశాల్లో 38 దేశాలు సమర్థిస్తున్నా మనకు సభ్యత్వం లభించకపోవడానికి కారణం చైనా అని స్పష్టంగా తెలుస్తున్నది. తన ఇటీవలి పర్యటనలో తాష్కెంట్‌లో చైనా అధ్యక్షుడు షిజిన్‌పింగ్‌తో మోదీ మరో విడత చర్చలు జరిపారు. స్వయంగా పెంచి పోషించుకున్న ఉగ్రవాద భూతంతో అస్థిర దేశమైన పాకిస్తాన్ భారత్‌కు ఎన్‌ఎస్‌జి సభ్యత్వం ఇవ్వడం దక్షిణాసియాలో సుస్థిరతకు భగ్నం కలిగిస్తుందని బూచిని చూపించే ప్రయత్నం చేస్తున్నది. ఉత్తర కొరియా, పాకిస్తాన్, సిరియా, ఇరాన్‌లకు అణుపరికరాలను, విడి భాగాలను సరఫరా చేస్తున్న చైనా భారత్‌ను అడ్డుకోవడం దౌత్యపరంగా నిలబడే విషయం కాదు.
భారత్ శాంతి కాముక దేశం. పొరుగు దేశాలతో, సత్సంబంధాలు కోరుకునే నైజం మనది. వసుదైక కుటుంబం భావన మనది. విజ్ఞానం, వాణిజ్యం, శాంతికి భంగం కలిగించకూడదని విశ్వసించిన వారసత్వం, నాయకత్వం మనదేశాన్ని ఓ అవిచ్ఛిన్న, అప్రతిహత సాంస్కృతిక ప్రవాహంగా పరిపుష్టం చేసింది. ప్రపంచానికి జ్ఞానబిక్ష నందించిన దేశం సభ్యత్వం కోసం చేయి చాచాల్సిన అవసరం రాదు. భారత్ వాదన ప్రపంచం వింటుంది. ఆ రోజు వస్తుంది. ప్రపంచ వేదికలపై సముచిత సమయంలో భారత్‌కు సగౌరవ స్థానం సంప్రాప్తిస్తుంది.

- తాడేపల్లి హనుమత్ ప్రసాద్ 9676190888