మెయిన్ ఫీచర్

అమ్మా! ఆలోచించు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆద్య, అభిషేక్‌లకు పెళ్లయి రెండు సంవత్సరాలయింది. ఇద్దరూ ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో మంచి జీతాలతో స్థిరపడ్డ ఉద్యోగస్థులు. అపార్ట్‌మెంట్ కోసం కంపెనీలో తీసుకున్న లోన్ కూడా ఈమధ్యనే తీర్చి హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకున్నారు. ఇద్దరూ చెరొక కారుమీద ఆఫీసులకెళతారు. మూడవ పెళ్లి రోజున దంపతులిద్దరూ తమ వాళ్ళకు, తామిద్దరం ముగ్గురవబోతున్నామని శుభవార్త చెప్పారు. తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఆద్య ఆఫీసు పని కొనసాగిస్తోంది. ఐదవ నెల వచ్చేక అలసట పెరగడం వలన ఇంటి పనికి పనిమనిషిని మాట్లాడుకున్నారు.
ఆమె అడిగిన జీతానికి అవాక్కయినా, అత్యవసరమని అంగీకరించారు. తొమ్మిదో నెల నిండిన పదిహేను రోజులకి ఆద్య పండంటి పాపకు జన్మనిచ్చింది. పాపను చూడటానికి, ఆద్య తల్లిదండ్రులు, అత్తమామలు వచ్చారు. బోసినవ్వులతో, బుడి బుడి అడుగులతో ఇల్లంతా కళకళలాడింది. పాపను చూసుకోవడానికి ఆద్య ఏడాది సెలవు తీసుకుంది. అవని మొదటి పుట్టినరోజుకు బంధువులను, స్నేహితులను పిలిచి ఘనంగా చేసేరు ఆద్య, అభిషేక్‌లు. ఆద్య తల్లిదండ్రులు, అత్తమామలు ఎవరిళ్లకు వారు వెళ్ళారు. అప్పటికే ఏడాది విరామం తీసుకున్న ఆద్య, పాప బాగోగులు చూసుకోవటానికి మనిషిని వెతకటం మొదలుపెట్టింది. తెలిసిన వాళ్లద్వారా వాకబు చేసి ఒక పెద్దామెను ఇంటికి పిలిపించింది. ఆమె పేరు సంతానమ్మ, వయసు 50పైనే ఉంటుంది.
‘‘అమ్మా! మీరు ఈ వయసులో ఇంత చంటిపాపని సాకగలరా?’’ కాస్త ఆత్రుతగా, కొంచెం బెంగగా అడిగింది ఆద్య. ‘‘నాకిది వృత్తికదమ్మా. ఇంతే వయసున్న నా మనమరాలు విదేశాల్లా ఉంటోంది. అక్కడికి వెళ్ళే శక్తి నాకు లేదు, వచ్చే అవకాశం వాళ్లకిలేదు. అందుకే నేను ఇలా చంటిపిల్లలతో గడపాలని నిర్ణయించుకున్నాను’’ అంది సంతానమ్మ. ఆ మాట విని సమాధానపడింది. ‘‘సరేమ్మా! రేపటినుంచి వచ్చేయండి. ఇంట్లో మీకు అన్ని సదుపాయాలు ఉంటాయి, ఏది కావాలన్నా నాకు ఫోన్ చేయండి’’ అని చెప్పింది. మర్నాడు పొద్దునే్న వచ్చింది సంతానమ్మ, పిల్లను వదిలి వెళ్ళలేక బెంగగానే అప్పగించింది ఆద్య, పెద్దామెను చూడగానే బోసి నవ్వులు నవ్వుతూ బుగ్గలు నిమిరింది అవని. ‘‘ఇక ఏం ఆలోచించకుండా బయలుదేరమ్మా! పాపను కంటికి రెప్పలా చూసుకుంటా’’ అని పంపింది సంతానమ్మ.
నెలలు గబగబా గడుస్తున్నాయి. సంతానమ్మ అవనికి బాగా అలవాటయిపోయింది. ‘‘అవ్వ, అవ్వ’’ అంటూ వెంట తిరుగుతుంది. అమ్మమ్మ, నాన్నమ్మలు బంధువుల రాకపోకలన్నీ బాగానే సాగుతున్నాయి. ఆద్య, అభిషేక్‌లు అడపా దడపా పాపని తీసుకుని పుట్టింటికి మెట్టింటికి వెళ్ళొస్తున్నారు. పాపకి అవ్వ బాగా అలవాటయింది కనుక మొగుడు పెళ్ళాలిద్దరూ అప్పుడప్పుడూ సినిమాలకి, షికార్లకూ తిరిగొస్తుండేవారు. ఇంట్లో ఓ గదంతా ఖరీదైన ఆట వస్తువులతో కలర్‌ఫుల్‌గా చేయించేరు,. ప్రతి పండగుకి పాపకి ఓ బంగారు వస్తువు చేయించారు. లేటెస్టు ఫ్యాషన్ బట్టలు కొన్నారు. మొగుడూ పెళ్ళాలిద్దరికీ ప్రమోషన్లు వచ్చాయి. జీతాలు పెరిగాయి. అవ్వ దగ్గర అన్ని పన్లు చేయించుకోవడం అలవాటయి, శనిఆదివారాలు ఆద్య చేయాలని ప్రయత్నించినా అవని బాగా అల్లరి పెట్టేది. ఎలాగా అయిదు రోజులు పాపని మిస్ అవుతుంది కనుక ఆద్య, ఆనే అన్నీ దగ్గరుండి చూసుకునేది. అభిషేక్ కూడా అంతే, పాపతో బాగా ఆడుకునేవాడు.
చూస్తుండగానే అవనికి నాలుగేళ్ళు నిండాయి. దగ్గరున్న స్కూల్లో జాయిన్ చేశారు. రోజూ అవ్వ తీసుకెళ్లి, ఇంటికితీసుకొచ్చి అన్నీ తనే చూసుకునేది. ఓ రోజు అవ్వకి ఒంట్లో సరిగాలేక రానని చెప్పడంతో సెలవు పెట్టి అవనిని తీసుకురావడానికి స్కూలుకెళ్లింది ఆద్య. బయటకు రాగానే కూతుర్ని స్కూలు యూనిఫారమ్‌లో చూసుకుని మురిసిపోయింది. ‘‘హాయ్! తల్లీ, దా’’ అని చేతులు చాచింది. పరిగెత్తుకుంటూ వచ్చి తల్లిని హత్తుకుని ‘‘హాయ్! అమ్మా, అవ్వ ఏదీ?’’ అడిగింది అవని. ‘‘అవ్వకి ఒంట్లో బాలేదు తల్లీ, అందుకే రాలేదు’’ అంది. ‘‘అవనీ! దా అన్నం తిందూగాని’’ ఇంటికెళ్లిన కాసేపటికి లంచ్‌కి పిలిచింది ఆద్య. అన్నం తింటూ, ‘‘ఇలా కాదమ్మా, చిన్న చిన్న ముద్దలు చేసి పెట్టు. అవ్వ అయితే కథలు చెప్తూ పెట్టేది’’ అంది. ఎదురుగా మనిషి కనపడకపోవడంవలన అడుగుతోందనుకుందే కానీ ఇంత మిస్ అవుతోందనుకోలేదు. ప్రతీ పూట అవ్వ ఎప్పుడొస్తుందని అడుగుతూనే వుంది అవని. తాను బయటకెళుతున్నానని చెప్పినపుడు ‘‘అమ్మా ఎప్పుడొస్తావ్’’ అని తనను కూడా ఇన్నిసార్లు అడిగేది కాదు. ఎందుకో మనసు చివుక్కుమన్నట్టయింది ఆద్యకు. కళ్లలో నీళ్ళు తిరిగాయి.
మర్నాడు అమ్మకు ఫోన్ చేసింది ఆద్య. ‘‘అమ్మా!’’ గొంతు బొంగురుపోయింది. ‘‘ఏం తల్లీ! పిల్లకు ఏమయినా ఒంట్లో బావులేదా, బాగానే ఉందా, స్కూలుకు వెళ్లిందా లేదా’’ అమ్మమ్మ వరసపెట్టి ప్రశ్నలు సంధించింది. ‘‘అబ్బా! అదేం కాదమ్మా, అవని హ్యాపీగానే ఉంది. అవ్వ ఊరినించి వచ్చేస్తారు కదా’’ కాస్త గంభీరంగా చెప్పింది. ‘‘ఏమయిందే తల్లీ! అర్థమయ్యేలా చెప్పు’’. ‘‘నేను ఉద్యోగానికి రాజీనామా ఇచ్చేద్దామనుకుంటున్నానమ్మా!’’ అంది ఆద్య. ‘‘అదేమిటమ్మా! ఉన్నట్టుండి? నువ్వు ఉద్యోగం మానేస్తావా, నమ్మలేకపోతున్నానే. ఆర్థిక స్వాతంత్య్రం ఆడవాళ్ళకు ఎంతో అవసరం. నేను సంపాదించాలి, నాకు కెరీర్ ఎంతో ముఖ్యం అని ఏదేదో చెప్పేదానివి కదా’’.
ముందురోజు జరిగినదంతా చెప్పి భోరున ఏడ్చేసింది ఆద్య. ‘‘ఇవాళ కాలింగ్ బెల్ మోగిన ప్రతీసారీ అవని కళ్ళలో ఓ మెరుపమ్మా, అవ్వ వచ్చేసిందంటూ పరిగెత్తుకెళ్లింది గేట్ వరకూ. నేను ఆఫీస్ నుంచి వచ్చినపుడు కూడా సంతోషంగానే ఉండేది కానీ ఈ మెరుపు నాకు కనబడలేదు. నాకది అర్థమయిన దగ్గరనుంచి మనసు మనసులో లేదమ్మా. నా బంగారు తల్లికి నేను దూరమైపోతున్నానేమో అని ఒకటే కంగారుగా ఉంది.
వేరేవాళ్ళకు అప్పజెప్పి వృత్తి, సంపాదన, ఆర్థిక స్వాతంత్య్రం అని పెద్ద పెద్ద వాటి వెంట పరిగెడుతూ నా చిట్టి తల్లి వల్ల కలిగే చిన్న చిన్న ఆనందాలని ఎన్ని కోల్పోయేనో అనిపిస్తోంది. సెలవు పెట్టి నే ఇంట్లో ఉన్నపుడు, స్కూల్ నించి రాగానే దాని చేతులు నన్ను చుట్టుకునున్నా, కళ్ళు మాత్రం అవ్వను వెతికేవి. నే బాధపడతానేమో అనే ఒకే ఒక్క కారణానికి పలకరిస్తుందేమో అనిపిస్తుంది, అంత పెద్దదయిందా నా చిన్నిపాప అని బాధేస్తోందమ్మా. తప్పు నాదే. పిల్ల భవిష్యత్తుకోసం అన్నీ సమకూర్చడానికనీ, పోటీ ప్రపంచంలో నే వెనకబడిపోకూడదు అనీ, వీటన్నిటితో నా బిడ్డను నే దూరం చేసుకున్నాను ఇన్నాళ్ళూ. ‘పాపకోసం’ అన్నీ చేయాలనే తపనలో పాపతో గడపవలసిన, మళ్లీ తిరిగిరాని అపురూపమైన క్షణాలను ఎన్నింటిని పోగొట్టుకున్నానో అర్థమవుతోంది.
సంతానమ్మగారిని పెట్టుకోవడం ఓ రకంగా నాకూ బుద్ధి తెప్పించింది. పాపను ఆమె ఎంత బాగా చూసుకున్నారో కనిపించింది, నేను ఇంకెంత బాగా చూసుకోవాలో తెలిసొచ్చింది. అందుకే ఆమెను ఇక సెలవు తీసుకోమని చెప్పి, నా పాపకు అన్నీ ఇక నేనే చేస్తా. వెళ్ళేసరికి అవ్వ ఉంటుంది, కథలు కబుర్లూ చెప్తూ ఆడిస్తుందని తలచుకుంటూ ఇంటికొస్తున్న నా చిట్టి తల్లి, ఇకనుంచి ఇంట్లో అమ్మ నాకోసం వేయికళ్ళతో, తన ప్రాణం ఎప్పుడు తిరిగొస్తుందా అని ఎదురుచూస్తుంది. వెళ్లి హాయిగా ఆడుకోవాలి, హత్తుకోవాలి, కబుర్లు చెప్పాలి అనుకునేలా చేస్తాను. పాప కాస్త పెద్దదయ్యాక, ఇక తను నాతో ఎక్కువ సమయం గడపలేదనిపించాక మళ్లీ నేను కెరీర్ గురించి ఆలోచిస్తా.
ఇంటినుంచి కూడా ఎన్నో పన్లు చేసి సంపాదిస్తున్నవారు లేకపోలేరు. నా చదువును అందుకు ఉపయోగిస్తా. నిన్న రాత్రే ఇదంతా అభిషేక్‌కి కూడా చెప్పానమ్మా. నీ తృప్తికోసం ఉద్యోగం చేస్తానంటే కాదనలేదు, ఇప్పుడైనా అంతే నీకెలా అనిపిస్తే అలానే చేయి ఆద్య. నా సహకారం ఎప్పుడూ నీకుంటుంది. పాపను దగ్గరుండి చూసుకుంటానంటే అంతకంటే కావలసిందేముంటుంది’’ అన్నారు. అని తన మనసులో ఉన్న బాధ, ఆనందం, ఆలోచన అంతా అమ్మకు చెప్పేసుకుంది ఆద్య.
‘‘నీతో ఎలా చెప్పాలా అని తటపటాయిస్తుంటే, నా మనసులో మాట నువ్వే చెప్పావ్ తల్లీ, చాలా సంతోషం. నేనే కాదు ఏ అమ్మమ్మలు, నాన్నమ్మలయినా ఇదే చెప్తారు. ఏ పిల్లలకైనా బాల్యం చాలా విలువైనది. పుట్టాక ఐదారేళ్ళలో వాళ్ళు గమనించే విషయాలు కానీ, గడిపే మధుర క్షణాలు కానీ వారి మనసుల్లో చెరగని ముద్రవేస్తాయి. పిల్లకే కాదు, తల్లిదండ్రులకు కూడా ఈ సమయం తీపి జ్ఞాపకంగా ఎప్పటికీ నిలిచిపోతుంది. సంతోషంగా ఉండటానికి తగినంత ఆర్థిక స్థోమత ఉందా లేదా అన్నది చూసుకుంటే చాలు కదా. నీ చేత్తో నువ్వు గోరుముద్దలు తినిపిస్తుంటే ఆ చిలిపి కళ్ళు చూసే చూపులని, చేసే చేష్ఠలని వదిలేసి, పాతికేళ్ళకు తన పెళ్ళికోసమని (లేక కొడుకైతే కష్టపడకూదని) ఆస్తులు కూడబెట్టి తనతోపాటు అత్తారింటికెళుతున్నపుడు అప్పచెప్తే ఆ కళ్ళల్లో నీకు ఈ ఆనందం కనిపిస్తుందా తల్లీ? అమ్మమ్మ దగ్గరో, నాన్నమ్మ దగ్గరో పెట్టచ్చు పిల్లని, మనవాళ్ళు ఉన్నారులే ఏం కాకుండా చూసుకుంటారనే నిశ్చిత ఉండచ్చు తప్ప, తనకు మధురానుభూతులుగా నిలిచిపోయే అపురూపమైన అనుభవాలను అందించే, తిరిగి దొరకని అవకాశాన్ని నువ్వు కోల్పోతావ్. వేరొక దారిలేక పిల్లలను బైట అప్పగించి వెళ్ళేవారి బాధను చూస్తూనే ఉంటాం, అలాంటప్పుడు అంత అవసరం లేదని తెలిసినా కూడా పాపకు నువ్వు దూరమయి ఏం సంపాదిస్తావే.. ఇప్పటికైనా మంచి నిర్ణయం తీసుకున్నావ్. ‘పిల్లల గురించి’ ఆలోచించే ప్రయత్నంలో పిల్లలతో గడపాల్సిన సమయాన్ని విస్మరించకూడదు. ఎంత సంపాదించినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ సమయం తిరిగిరాదు. ఆలోచించమ్మా!

-కౌముది ఎం.ఎన్.కె