ఎడిట్ పేజీ

వెంటాడుతున్న ‘భరత్ విభజన’ సమస్యలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెంటాడుతున్న ‘భరత్ విభజన’ సమస్యలు!
చొరబాటుదారులను గుర్తించి, అసలైన భారతీయులను అక్కున చేర్చుకునేందుకు ‘జాతీయ పౌర రిజిస్టర్’ (ఎన్‌ఆర్‌సీ) అనే మహా క్రతువును సర్వోన్నత న్యాయస్థానం పర్యవేక్షణలో అసోం ఎన్నికల సంఘం జయప్రదంగా పూర్తి చేసింది. దీంతో అసోంలో బెంగాలీలను, ఇతరులను విదేశీయులుగా ముద్రవేసి గెంటివేయడానికి మోదీ సర్కారు కుట్ర చేస్తోందని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నానా రాద్ధాంతం చేసి, ఆ తర్వాత ఆకస్మికంగా వౌనం దాల్చారు. ఎన్‌ఆర్‌సీ వెలువడిన వెంటనే ఆమె కోల్‌కతలో, ఢిల్లీలో ఓటుబ్యాంకు రాజకీయాలతో నిర్లజ్జగా ప్రకటనలు చేశారు. ఈ విషయంలో కాంగ్రెస్, ఇతర విపక్షాలు మమత మాదిరి దూకుడును ప్రదర్శించకపోవడం ఆహ్వానించదగిన పరిణామం. కాంగ్రెస్ ఎన్‌ఆర్‌సీపై ఆచితూచి వ్యవహరిస్తోంది. గతంలో తమిళనాడు, పంజాబ్ విషయంలో అత్యుత్సాహం ప్రదర్శించి, వ్యూహాత్మక తప్పిదాలకు పాల్పడి ఇద్దరు మహానేతలను కాంగ్రెస్ కోల్పోయింది.
మూలాల్లోకి వెళ్లకుండా మిడిమిడి జ్ఞానంతో రాజకీయ పార్టీలు ఓట్లమీద యావతో రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తే ప్రయోజనం శూన్యం. 1947లో జరిగిన ‘అఖండ భారత్’ విభజన గాయాలు అసోంను ఇంకా వెంటాడుతున్నాయి. అవిభక్త భారతంలో ప్రజలు ఒక చోట నుంచి మరో చోటికి వెళ్లేవారు. ప్రస్తుత బంగ్లాదేశ్ లేదా 1947 ఆగస్టు 14 కంటే ముందున్న తూర్పు బెంగాల్ లేదా 1947 ఆగస్టు 14 నుంచి 1971 డిసెంబర్ వరకు ఉన్న తూర్పు పాకిస్తాన్ ప్రాంతం నుంచి బెంగాలీలు జీవనోపాధికి వలసలు వెళ్లేవారు. బ్రిటీష్ పాలనలో అంటే 1947 ఆగస్టు 14 వరకు ఈ వలసలకు అభ్యంతరం ఉండేది కాదు. బంగ్లాదేశ్, మన ఈశాన్య రాష్ట్రాల భౌగోళిక పరిస్థితులను చూస్తే అన్నీ కలిసి పోయినట్లు ఉంటాయి. మత ప్రాతిపదికన ఏర్పడిన బంగ్లాదేశ్ చుట్టూ భారత్ విస్తరించి ఉంటుంది. బంగ్లా ముస్లింల జీవన విధానంలో హైందవ సంస్కృతి కొట్టొచ్చినట్లు కనపడుతుంది. ఇప్పుడున్న బంగ్లాదేశ్ ప్రాంతం నుంచి జీవనోపాధికి పెద్దఎత్తున వలసలు శతాబ్దాల కాలంగా సాగుతూనే ఉన్నాయి. వీటిని నియంత్రించడం సులువైన పనికాదు. భారత్, బంగ్లా సరిహద్దులు కలిసిపోయి ఉంటాయి. బీఎస్‌ఎఫ్ జవాన్లయినా ఎంత వరకని కాపలా కాస్తారు? ఈ వలసలే అసోం సంస్కృతికి, చరిత్రకు, భాషకు ముప్పుగా మారాయి. 1947లో దేశ విభజన తర్వాత బంగ్లాదేశ్ మనకు విదేశీ రాజ్యమే. ఒకేభాష మాట్లాడినంత మాత్రాన, భారతీయతత్వంలో భాగమైనా, వారిని విదేశీయులుగానే గుర్తించాల్సి ఉంటుంది. జాతీయ పౌర రిజిస్టర్‌లో చొరబాటుదార్ల పేర్లను నమోదు చేశారు. 1951లో తొలిసారిగా ఎన్‌ఆర్‌సీని నిర్వహించారు.
చొరబాటుదారులు ముస్లింలు, హిందువులైనా వారి సంఖ్య విపరీతంగా పెరిగింది. దీంతో చాలాకాలం క్రితమే అసోం ప్రజలు ఆందోళన చేశారు. ఈ ఉద్యమం ఆరేళ్లు సాగింది. దాదాపు 885 మంది అస్సామీలు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆనాటి ప్రధాని రాజీవ్ గాంధీ ఆధ్వర్యంలో 1985 ఆగస్టు 15న ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం కుదిరి 32 ఏళ్లయింది. 2014 డిసెంబర్ 17న సుప్రీం కోర్టు చొరవతో ఈ ఒప్పందానికి చలనం వచ్చింది. ఎన్‌ఆర్‌సీ రూపకల్పన ప్రక్రియ సుప్రీం పర్యవేక్షణలో ప్రారంభమైంది. 1971 మార్చి 24వ తేదీకి ముందు వచ్చి స్థిరపడిన వారందరికీ భారతీయ పౌరసత్వం ఇస్తారు. మొత్తం 3.29 కోట్ల మంది ఎన్‌ఆర్‌సీలో నమోదుకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ దరఖాస్తులను పరిశీలించాక 2.90 కోట్ల మంది పేర్లను ధ్రువీకరించారు. సరైన రుజువులు సమర్పించని 40 లక్షల మంది పేర్లను ఎన్‌ఆర్‌సీలో చేర్చలేదు. ఈ 40 లక్షల మందిలో బంగ్లాదేశ్ నుంచి సరిహద్దులు దాటి అక్రమంగా స్థిరపడిన వారిలో ముస్లింలు, హిందువులు ఉన్నారు.
అసోం ప్రభుత్వానికి చెందిన 68 వేల మంది ఉద్యోగులు మూడున్నరేళ్ల పాటు అహోరాత్రులు కష్టపడి విమర్శలకు తావులేకుండా డాక్యుమెంట్‌ను రూపొందించారు. ఆ జాబితాలో పేర్లు లేనంత మాత్రాన పౌరసత్వం రద్దయినట్లు కాదు. పౌరసత్వం కోరేవారు తగిన ఆధారాలను ఈనెల 30 నుంచి సెప్టెంబర్ 28 వరకు సమర్పించవచ్చు. ఎన్‌ఆర్‌సీ ప్రక్రియను సుప్రీం కోర్టు స్వయంగా పర్యవేక్షిస్తోంది. కేంద్రం, అసోం ప్రభుత్వాలకు ఎలాంటి సంబంధం లేదు. బంగ్లాదేశ్ నుంచి వచ్చిన చొరబాటుదారుల వల్ల అసోం జనాభా 1951 నుంచి 1961 మధ్య 36 శాతం, 1971 నుంచి 1978 మధ్య 50 శాతానికి తగ్గింది. అసోం సంస్కృతి, భాషకు ముప్పు తలెత్తింది. 1947లో భరతమాత కంటే, మతం గొప్పదని, ప్రాచీన సంస్కృతి కంటే, మతమే ఊపిరి అని విడిపోయిన (పాకిస్తాన్‌లోని ముక్క) తూర్పు పాకిస్తాన్ బంగ్లాదేశ్‌గా 1971లో ఎందుకు అవతరించింది? పాకిస్తాన్ ఉర్దూ భాషను తూర్పు పాకిస్తాన్‌పై రుద్దింది. ఉర్దూ మాట్లాడితే నిజమైన ముస్లిం అని, ముస్లింల భాష బెంగాలీ కాదంటూ సైనిక చర్యకు పాక్ దిగింది.
బంగ్లాదేశ్‌లో ముస్లింలు అధిక సంఖ్యాకులైనా వారు బెంగాలీలు. బెంగాలీ భాషను, తమ సంస్కృతిని వదిలివేసేందుకు వారు నిరాకరించారు. దీంతో పాకిస్తాన్ సైన్యం తూర్పు పాకిస్తాన్ ప్రజల ఉద్యమాన్ని అణచివేయడానికి ప్రయత్నం చేసి విఫలమైంది. దాదాపు 50 లక్షల మంది బెంగాలీలు ఈ మారణకాండకు బలయ్యారు. ఫలితంగా బంగ్లా దేశ్ అవతరించింది. విభజనకు మతం ప్రాతిపదిక కాదని, భాష, సంస్కృతి బంధం గొప్పదని బంగ్లాదేశ్ చరిత్ర నిరూపించింది. అసోంలో కూడా అంతే. అసోం ప్రజలు తమ మూలాలకే ఎసరు పెట్టేలా ఉన్న చొరబాటుదార్లను సహిస్తారా? తమ జీవనోపాధికి, ఉద్యోగావకాశాలకు ముప్పు కలిగితే వౌనంగా ఉంటారా? అందుకే భూమి పుత్రుల సిద్ధాంతం తెరపైకి వచ్చింది. చొరబాటుదారులైన బంగ్లాదేశ్ ముస్లింలు భారత వ్యతిరేక కార్యకలాపాలకు మద్దతు ఇస్తున్నారన్న ఆరోపణలు వచ్చాయి. బంగ్లా సరిహద్దుల్లో పెద్దఎత్తున ఉగ్రవాద శిబిరాలున్న విషయం విదితమే. ఇంత సున్నితమైన విషయంపై కాంగ్రెస్ పార్టీ స్పందిస్తూ- ఎన్‌ఆర్‌సీకి తాము అడ్డుకాదని, విదేశీయులను కూడా గుర్తించాలని, భారతీయులకు అన్యాయం జరిగితే ఊరుకోమని స్పష్టం చేసింది. మమతా బెనర్జీ మాత్రం ‘పౌర యుద్ధం’ తప్పదని భీకర ప్రకటనలు చేశారు. 40 లక్షల మంది చొరబాటుదారుల్లో బిహార్, యూపీ ప్రజలు ఉన్నారని చెప్పి వారిని కూడా కలుపుకునే ప్రయత్నం చేశారు. శివసేన మాత్రం బంగ్లా శరణార్థులను మతాలకు అతీతంగా గెంటివేయాలని స్పష్టం చేసింది. 40 లక్షల మంది చొరబాటుదారులు తాము భారతీయులమేనని రుజువు చేసుకునేందుకు ఇంకా గడువు ఉంది. రుజువు చేసుకోకుండా ఉండిపోయినవారు అక్రమంగా స్థిరపడినట్లే కదా! వీరి విషయంలో కేంద్రం ఏం చేస్తుందనే విషయం ఇప్పట్లో తేలేది కాదు. ఎన్‌ఆర్‌సీ రూపకల్పనకే 32 ఏళ్లు పట్టింది. అసోంలో బీజేపీ ప్రభుత్వం ఉంది గనుక- బంగ్లా ముస్లింలను వెనక్కి పంపేసి, హిందువులు మాత్రమే ఉండేలా వ్యూహరచన సాగుతోందన్న ఆరోపణలు లేకపోలేదు. అసోం ప్రజల భావోద్వేగాలను పట్టించుకోకుండా రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తే- ముస్లిం మైనార్టీల ఓట్లు తమకు పడతాయనే భ్రమలకు కొన్ని రాజకీయ పార్టీలు లోనవుతున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న ముస్లింలకు- బంగ్లా నుంచి అసోంలో స్థిరపడిన ముస్లింలు, హిందువులకు సంబంధం ఏమిటి?
మోదీ ప్రభుత్వం పౌరసత్వం విషయమై గొప్ప నిర్ణయం తీసుకున్నా, దాని అమలుకు ఎన్‌ఆర్‌సీ ఓ సవాలుగా తయారైంది. దేశ విభజన జరిగిన చాలాకాలం తర్వాత- ఇటీవల ఆఫ్గనిస్తాన్, పాకిస్తాన్‌ల నుంచి పెద్ద సంఖ్యలో హిందువులు, సిక్కులను అక్కడి మతతత్వ సంస్థలు తరిమివేస్తే వారు భారతావనిలో స్థిరపడ్డారు. వీరికి పౌరసత్వం ఇచ్చేందుకు పౌరసత్వం సవరణ బిల్లు 2016ను కేంద్రం సిద్ధం చేసింది. వీరికి పౌరసత్వం ఇస్తే, అసోంలో చొరబాటుదారులకూ ఇవ్వాల్సి ఉంటుంది. వీరిని పక్కనపెట్టి, పాకిస్తాన్, ఆఫ్గనిస్తాన్ తదితర దేశాల నుంచి వచ్చిన హిందువులు, సిక్కులు, బౌద్ధులకు ముందుగా పౌరసత్వం ఇస్తారా? అనేది తేలాల్సి ఉంది.
అసోంకు వలసలు కొత్త కాదు. అసోం తేయాకు తోటల్లో పనిచేసేందుకు, ఇతర పంటల సాగుకు, వృత్తి నైపుణ్యం పనులకు బ్రిటీష్ ప్రభుత్వం బిహార్, యూపీ ప్రజలు అక్కడికి వెళ్లి స్థిరపడేందుకు ప్రోత్సహించింది. తూర్పు బెంగాల్ (ఇప్పటి బంగ్లాదేశ్) నుంచి అప్పట్లో కూడా భారీగా వలసలు ఉండేవి. ఎన్‌ఆర్‌సీ వివాదం ఇప్పట్లో తేలేది కాదు. కాని ఎన్నికల్లో ఓట్లు రాల్చుకునేందుకు తురుపుముక్కగా రాజకీయ పార్టీలకు ఉపయోగపడుతుంది. ఇంత పెద్ద దేశం 40 లక్షల మందికి స్థానం కల్పించలేదా? అని కుహనా లౌకికవాద పార్టీలు ప్రశ్నిస్తున్నాయి. ఇదే ప్రశ్నను ఆ పార్టీలు పాకిస్తాన్, ఆఫ్గనిస్తాన్ , బంగ్లాదేశ్ ప్రభుత్వాలను ఎందుకు అడగడం లేదు? అసోం సమస్య మూలాల్లో ‘అఖండ భారత్’ విభజన మిగిల్చిన సమస్యలు అపరిష్కృతంగా దాగి ఉన్నాయి. వాటి గురించి మాట్లాడితే ఓట్లు రాలవన్న దగాకోరు రాజకీయ పార్టీలు ఇప్పటికైనా భారత జాతి ప్రయోజనాల నిమిత్తం వౌనం వహించాలి. 1947 నాటి దేశ విభజన తీరు తప్పని అసోం సమస్య రుజువు చేస్తోంది.

--కె.విజయ శైలేంద్ర 98499 98097