ఎడిట్ పేజీ

అసమాన పోరాట యోధుడు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆధునిక భారత దేశంలో సుదీర్ఘ కాలం ప్రజా జీవనంలో ఉండటమే కాకుండా, తాను నమ్మిన విశ్వాసాల కోసం రాజీలేని రీతిలో అసమాన పోరాటాలు జరుపుతూ, అర్ధ శతాబ్దం పాటు ఒక ప్రాంతీయ రాజకీయ పార్టీకి బలమైన భూమిక ఏర్పాటు చేసిన యోధుడు కరుణానిధి. డా. బీఆర్ అంబేడ్కర్ వలే బాల్యంలో కుల వివక్ష, వేధింపులకు గురికావడంతో 13 ఏళ్ళ వయస్సు నుండే ఆయన ఎదురు తిరగడం, పోరాటాలకు కాలు దువ్వడం ప్రారంభించారు. ఐదవ తరగతికి మించి చదువుకోలేక పోయినా తమిళ భాష పట్ల, సాహిత్యం పట్ల, రచనా వ్యాసంగం పట్ల మంచి పట్టు సంపాదించ గలిగారు. అనేక సంచలన సినిమాలకు స్క్రీన్ ప్లే రచయితగా ఖ్యాతి గడించారు. తన రచనా వ్యాసంగాన్ని కడుపు నింపుకోవడం కోసం కాకుండా, తాను నమ్మిన విశ్వాసాల పట్ల ప్రజలను ఆకట్టుకొనేలా ప్రయత్నించి, విజయం సాధించింది ఈ దేశంలో కరుణానిధి ఒక్కరే అని చెప్పవచ్చు. 14 ఏళ్ళ వయసులోనే మొదటిసారి అరెస్ట్ అయ్యారు. ద్రావిడ రాజకీయాలలో చిన్నతనం నుండి మునిగి తేలారు. అధికారంలో ఉన్నా, లేకున్నా పోరాట పటిమను విడువలేదు. దేశంలోనే అత్యంత బలమైన పార్టీగా, అంకితభావం గల కార్యకర్తలున్న పార్టీగా డిఎంకేను ఆయన తీర్చిదిద్దిన విధానం అసామాన్యం.
1984-85లలో నాటి ముఖ్యమంత్రి ఎంజీ రామచంద్రన్ కిడ్నీ మార్పిడి కోసం అమెరికా వెళ్ళినప్పుడు 13 మంది అభిమానులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. తమ దేవుడిని సురక్షితంగా తిరిగి పంపక పోతే అంతు చూస్తాం అంటూ డాక్టర్లకు బెదిరింపు లేఖలు పంపారు. డిసెంబర్, 1987లో ఎంజీఆర్ మృతి చెందినప్పుడు జరిగిన హింసలో 29 మంది మృతి చెందగా, 47 మంది పోలీసులు గాయపడ్డారు. మరో 30 మంది ఆత్మహత్యలకు పాలపడ్డారు. కానీ, కరుణానిధి మృతి చెందినప్పుడు లక్షలాది అభిమానులు చెన్నయికి చేరుకున్నా ఎటువంటు హింసాయుత సంఘటనలు జరగలేదు. మెరీనా బీచ్‌లో అంత్యక్రియలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వనప్పుడు కూడా ఉద్వేగంతో రగిలి పోయారు గాని ఎటువంటి హింసకు పాల్పడలేదు. కడసారి తమ నేతను చూసే అవకాశం చాలామందికి లభించక పోయినా ఎంతో సహనంతో వ్యవహరించారు. అంతటి క్రమశిక్షణకు ప్రేరణ కరుణానిధి అని మాత్రమే చెప్పవచ్చు.
ఒక విధంగా బలమైన విశ్వాసాలు, సైద్ధాంతిక భూమిక గలిగిన రాజకీయ నేతలలో చివరి వాడిగా కరుణానిధిని చెప్పవచ్చు. ఎన్ని సిద్ధాంతాలు చెప్పినా అధికారం కోసం అర్రులు చాస్తున్నవారే దేశం అంతా నేడు కనిపిస్తున్నారు. 2013లో కాంగ్రెస్ ముక్త భారత్ అని భాజపా ప్రధాన మంత్రి అభ్యర్థి నరేంద్ర మోదీ పిలుపు ఇచ్చారు. కానీ కాంగ్రెస్‌ను తమిళనాడు సరిహద్దుల నుండి ఆరు దశాబ్దాల క్రితమే వెళ్లగొట్టి, అప్పటి నుండి తిరిగి తలెత్తుకోలేకుండా చేయడంలో కరుణానిధి కీలక పాత్ర వహించారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా బలమైన గొంతును సుదీర్ఘకాలం పాటు వినిపించింది ఆయనే. ఆయనతో పాటు రాజీలేని పోరాట పటిమ ప్రదర్శించిన నేత అంటే స్వతంత్ర భారత దేశంలో జార్జ్ ఫెర్నాండెజ్ గుర్తుకు వస్తారు. అంత అంకితభావంతో రాజకీయాలలో పనిచేసిన, చేస్తున్న వారెవ్వరూ మనకు కనిపించరు.
అత్యవసర పరిస్థితి సమయంలో ఫెర్నాండెజ్ వంటి కొద్దిమంది రాజకీయ నాయకులు మాత్రమే ప్రభుత్వంపై ప్రత్యక్ష పోరాటాలకు దిగారు. మిగిలిన వారంతా జైళ్లలోనో, ఇళ్లలోనో ఉండిపోయారు. ముఖ్యమంత్రిగా ఉంటూ కరుణానిధి అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ పట్ల ధిక్కార ధోరణిని ప్రదర్శించారు. ఆమె 20 సూత్రాల పథకం ప్రకటిస్తే, తన ప్రభుత్వం అప్పటికే 15 సూత్రాలను అమలు చేసిందని, మిగిలిన 5 సూత్రాల అమలులో ముందడుగు వేస్తున్నదని పత్రికలలో తన నిలువెత్తు ఫొటోలతో ఆయన ప్రకటనలు ఇచ్చారు. దాంతో ఇందిర అసహనానికి గురై, ప్రధాని తప్ప మరెవ్వరి ఫొటోలతో ప్రకటనలు ఇవ్వరాదని ఆదేశాలు జారీచేశారు. అత్యవసర పరిస్థితిని వ్యతిరేకించి, తన పట్ల ధిక్కార ధోరణి ప్రదర్శించినందుకు కరుణానిధి ప్రభుత్వాన్ని రద్దు చేయించడమే కాకుండా ఆయనతో పాటు అనేకమంది డీఎంకే నేతలను ఇందిరా గాంధీ అరెస్ట్ చేయించారు. అత్యవసర పరిస్థితిలో వీరోచిత పోరాటం జరిపిన కరుణానిధితో- ఆ తర్వాత కేంద్రంలో అధికారంలోకి వచ్చిన జనతా పార్టీ పొత్తు పెట్టుకోకుండా చారిత్రాత్మకమైన తప్పిదం చేసింది. అత్యవసర పరిస్థితిలో ఇందిరతో చేతులు కలిపి, కరుణానిధి ప్రభుత్వం రద్దుకు ప్రయత్నించిన ఎంజీ రామచంద్రన్ తో అసెంబ్లీ ఎన్నికలలో పొత్తు పెట్టుకొని, ఆయన ముఖ్యమంత్రి కావడానికి జనతా పార్టీ నాయకులు దోహదపడ్డారు.
ప్రాంతీయ పార్టీ నేత అయన కరుణానిధి అంటే జాతీయ పార్టీల నాయకులు భయపడే వారు. గత్యంతరం లేక డీఎంకేతో పొత్తులు ఏర్పర్చుకున్నా వీలు చిక్కినప్పుడు ఆయనకు వెన్నుచూపిస్తూ వచ్చారు. శ్రీలంకలో తమిళులపై మారణకాండ విషయంలో కరుణ రాజీలేని ధోరణి అవలంబించారు. ఆ వంకతోనే రాజీవ్ గాంధీ హత్య అనంతరం కరుణ ప్రభుత్వాన్ని రద్దు చేశారు. ఎంజీఆర్ భార్య జానకి రామచంద్రన్ ప్రభుత్వాన్ని పడగొట్టి, జయలలిత ముఖ్యమంత్రి కావడానికి నాటి ప్రధాని రాజీవ్ గాంధీ ప్రధాన కారణం అని ఈ సందర్భంగా గ్రహించాలి. ఎంజీఆర్, జయలలిత తమ వ్యక్తిగత ఆకర్షణలతో, సంక్షేమ పథకాలతో ప్రజలను ఆకట్టుకొని ఎన్నికలలో గెలుస్తూ వచ్చినా, కరుణానిధి వలే వారిద్దరికీ బలమైన సైద్ధాంతిక పునాది లేదు. ప్రభుత్వం అంటే శాంతిభద్రతలు చూస్తూ కాలక్షేపం చేయడం కాదని, అణగారిన వర్గాల అభ్యన్నతి కోసం సంక్షేమ పథకాలు చేపట్టాలని సూత్రీకరించి, వాటిని అమలు చేయడం ప్రారంభించింది కరుణానిధియే కావడం గమనార్హం. సంక్షేమ పథకాల విషయంలో ఆయన దేశానికే ఆదర్శంగా నిలిచారు.
రాష్త్ర ప్రభుత్వాలపై కేంద్రం పెత్తనం గురించి, రాష్ట్రాల పాలనాధికారాల గురించి మొదటగా బలమైన గొంతు వినిపించింది కూడా ఆయనే. విద్యార్థి నాయకుడిగా దక్షిణాది వారిపై బలవంతంగా హిందీని రుద్దడాన్ని వ్యతిరేకిస్తూ వచ్చారు. హిందీకి వ్యతిరేకంగా బలమైన ఉద్యమాలు జరిపారు. కేంద్రంలో ఏ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చినా మమతా బెనెర్జీ, మాయావతి తదితరుల నేతల వలే ఆయా ప్రభుత్వాలను బ్లాక్ మెయిల్ చేసేలా ఎన్నడూ ఆయన వ్యవహరించలేదు.
అయితే, బీజేపీలోని కుట్రపూరిత రాజకీయాలు, కొందరు జయలలిత ప్రలోభాలకు లొంగి పోవడం కారణంగా 2004 ఎన్నికలలో కాంగ్రెస్‌తో డీఎంకే జతకట్టింది. అందుకు బిజెపి భారీ మూల్యం చెల్లిం చవలసి వచ్చింది. తమిళనాడులో డిఎంకేకు దూరం కావడం, బిహార్ లో నితీష్ కుమార్ తో పొత్తు పెట్టుకొని మరోవంక రామ్ విలాస్ పాశ్వాన్ ను రెచ్చగొట్టించి అన్ని సీట్లలో పోటీ చేయించిన నాటి ఉపప్రధాని ఎల్ కె అద్వానీ అవకాశం వాదం, చంద్రబాబు నాయుడు మాయలో పడి ముందస్తు ఎన్నికలకు సిద్ధం కావడంతో భాజపా పదేళ్ళపాటు అధికారానికి దూరంగా ఉండవలసి వచ్చింది. ఈ మూడు రాష్ట్రాలలో ఘోరంగా ఓటమి చెందడంతోనే కేంద్రంలో యుపిఎ ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం ఏర్పడింది.
సీబీఐ డైరెక్టర్‌గా పనిచేస్తూ పీవీ నరసింహారావు సహా పలువురు ప్రతిపక్ష నాయకులను పసలేని ఒక హవాలా కేసులో ఇరికించిన కె. విజయరామారావుకు మంత్రి పదవి ఇవ్వడం, నమ్మకస్తుడైన కేసీఆర్‌ను క్యాబినెట్‌లోకి తీసుకోకపోవడం వంటి నిర్ణయాలతో చంద్రబాబు ఎలాంటి తప్పులు చేశారో, కరుణానిధి సైతం ఎంజీ రామచంద్రన్‌ను పార్టీ నుండి బహిష్కరించడం ద్వారా అంతటి పొరపాటే చేశారు. బయటకు వెళ్లిన వారం రోజులకే ఎంజీఆర్ మరో పార్టీ పెట్టి, కరుణను 13 ఏళ్లపాటు అధికారానికి దూరం చేయగలిగారు. తమిళ రాజకీయాలు రెండు ద్రావిడ పార్టీల మధ్య సమీకృతం కావడంతో జాతీయ పార్టీలు ఏవీ అక్కడ బలం పుంజుకోలేదు. అప్పుడు కాంగ్రెస్, ఇప్పుడు బిజెపి ఆ రాష్ట్రంలో పట్టు సంపాదించేందుకు ఎన్ని అస్త్రాలు ప్రయోగిస్తున్నా ఫలితం ఉండటం లేదు. జాతీయ పార్టీలను తమిళ ప్రజలు అనుమానంగానే చూస్తున్నారు. పలు సందర్భాలలో జాతీయ రాజకీయాలను శాసించే విధంగా తమిళనాడు మారుతూ వస్తున్నది.
విద్యార్థి నాయకుడిగా రాజకీయాలే కాకుండా సామాజిక కార్యక్రమాల పట్ల కూడా కరుణానిధి ఆసక్తి కనబరుస్తూ వచ్చారు. అగ్రకుల ఆధిపత్యాన్ని ఎదిరించడంలో, అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేయడంలో కృషి చేశారు. జాతీయ రాజకీయాలలో ఉత్తరాదివారి ఆధిపత్యానికి వ్యతిరేకంగా పనిచేశారు. దక్షిణాదికి చెందిన తాను కొద్దిమంది ఎంపీలతో ప్రధాన మంత్రి కాగలిగానంటే కరుణానిధి పట్టుబట్టడం వల్లే అని ఆయన మృతి సందర్భంగా మాజీ ప్రధాని హెచ్‌డి దేవెగౌడ పేర్కొన్నారు. కావేరీ నదీజలాల విషయంలో కర్ణాటకతో వివాదాలు జరుగుతూ వస్తున్నా దేవరాజ్ అర్సు, దేవెగౌడ వంటి కన్నడ నాయకులకు బలమైన మద్దతు దారునిగా కరుణ నిలవడం గమనార్హం. తమిళ భాష, తన రాష్ట్రం పట్ల మొండి ధోరణులు ప్రదర్శిస్తున్నట్లు కనిపించినా, రాజకీయ ప్రత్యర్థుల పట్ల కఠిన వైఖరి చూపినా, ఆయనలో మానవీయ కోణం పలు సందర్భాలలో వెల్లడైంది. తన విశ్వాసాలు, రాజకీయాలను పూర్తిగా వ్యతిరేకించిన చో రామస్వామి వంటి వారితో సైతం వ్యక్తిగత స్థాయిలో మంచి అనుబంధం పెంచుకొంటూ వచ్చారు. తాను పెద్దగా చదువుకోకున్నా, శాస్త్ర, సాంకేతిక రంగాలలో తమిళనాడు అభివృద్ధి కావడానికి పలు ప్రతిష్టాకర సంస్థలు నెలకొల్పారు. ఆహార భద్రత గురించి దేశంలో ఎవ్వరు మాట్లాడని రోజులలోనే 60వ దశకంలో వినూత్నమైన కార్యక్రమం చేపట్టారు.
ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతిరోజూ సచివాల యానికి చేరుకొని, ప్రభుత్వ పనితీరును స్వయంగా పర్యవేక్షించిన కరుణానిధి పరిపాలనా సామర్థంలో మంచి పేరు సంపాదించుకున్నారు. తాను విశ్వసించిన నాస్తిక త్వం పట్ల కుటుంబ సభ్యులలో సడలింపు కనిపించినా ఆయనలో కనిపించలేదు. రాజకీయ వారసత్వం పట్ల కూడా చాలావరకు నిబద్ధతతోనే వ్యవహరించారు. వృ ద్ధాప్యం, అనారోగ్యం తోడైనప్పుడు కుటుంబపరంగా వచ్చిన వత్తిడులకు చివరిలో ఆయన తలొగ్గక తప్పలేదు. కరుణ రాజకీయ వారసుడైన స్టాలిన్ చిన్నప్పటి నుండి డిఎంకెలో పెరుగుతూ అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చారు. ఇతర ప్రాంతీయ పార్టీలలో వలే రాత్రికి రాత్రి పార్టీ నాయకత్వాన్ని ఆయన స్టాలిన్‌కు అప్పచెప్పలేదు. కరుణానిధి మరణంతో దేశం ఒక నిండైన ఆదర్శ మూర్తిని కోల్పోయినట్లయింది.

-చలసాని నరేంద్ర