మెయిన్ ఫీచర్

జయహో మహిళ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఆకాశంలో సగం మాత్రమే కాదు.. పోరాటంలోనూ మేం సగమే..’ అని నిరూపించిన మహిళలు ఎందరో.. పట్టుదల, తెగువ, ధైర్య సాహసాలు చూపి, ప్రాణత్యాగాలు చేసి
చరిత్రలో చరితార్థులైనవారు ఎందరో.. అపురూపమైన భారత స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొని వెలుగులోకి రాని అనేకమందిని మహిళలను ఈ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా తలచుకుంటూ వారికిచ్చే అక్షర నివాళి..
*
మన స్వాతంత్య్ర పోరాటంలో మహిళల పాత్ర అనగానే ఝాన్సీ లక్ష్మీబాయి, సరోజినీ నాయుడు, దుర్గాబాయ్ దేశముఖ్.. ఇలా అతి కొద్దిమంది మహిళల పేర్లే ప్రముఖంగా వినపడుతూ ఉంటాయి. స్వాతంత్య్ర పోరాటంలో తెగువ, సాహసం, త్యాగం చూపిన ఎందరో మహిళామణులున్నారు. వారిలో కొంతమంది..
అరుణ అసఫ్ అలీ
భారతదేశ అత్యున్నత పురస్కారమైన ‘్భరతరత్న’ అందుకున్న స్వాతంత్య్ర సమరయోధురాలు అరుణ అసఫ్ అలీ. ఈమె ఉన్నత విద్యావంతురాలు. 1942 క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో, ముంబైలోని గవాలియా ట్యాంక్ మైదానంలో బ్రిటీష్ సైన్యం చూస్తుండగానే జాతీయ జెండా ఎగురవేసిన ధైర్యం ఆమె సొంతం. తన పోరాటాల ఫలితంగా ఎన్నోసార్లు జైలు జీవితం గడిపింది. తీహార్ జైల్లో బంధించినప్పుడు ఆమె చేపట్టిన నిరాహారదీక్ష స్వాతంత్య్ర పోరాట చరిత్రలో నిలిచిపోయింది.
అహల్యాబాయ హోల్కర్
భరతమాత దాస్యశృంఖాలల విచ్ఛేదనంతో పాటుగా దేశ సంస్కృతీ సంప్రదాయాలను కాపాడడం బాధ్యతను తలకెత్తుకున్న మహిళ అహల్యాబాయి హోల్కర్. మాల్వా సామ్రాజ్యపు హోల్కర్‌వంశరాణిగా ప్రసిద్ధిచెందినప్పటికీ తన భర్త ఖండేరావు హోల్కర్ 1754లో కుంభేర్ యుద్ధంలో అసువులు బాయగానే తాను కూడా సతీసహగమనానికి పూనుకొంది. కానీ మామగారైన మల్హర్‌రావు అడ్డుచెప్పి ఆమె ఏకైక కుమారుడినే భావి రాజ్యాధిపతిగా తీర్చిదిద్ది భారతదేశాన్ని విదేశీయుల నుంచి కాపాడమని ప్రోత్సహించాడు. ఆయనిచ్చిన ప్రోత్సాహంతోనే పతికి వీడ్కోలు పలికింది. అనేక యుద్ధవిద్యలను, రాజనీతిని, పరిపాలనా తదితర అంశాలను పట్టుపట్టినేర్చుకుంది. పాలనా వ్యవహారాలపై అవగాహన కల్పించుకుంది. కుమారుడి బాధ్యతలను భుజస్కంధాలపైన వేసుకొంది. కానీ విధి వక్రించడం వల్ల ఏకైక కుమారుడు మాళోజీరావు మృతి చెందాడు. అప్పుడు ఇండోర్ పాలనా బాధ్యతలను అహల్యాబాయి స్వీకరించింది. ఆ కాలంలో ఇండోర్ ప్రజలు థగ్గులనే దోపిడీ దారుల కబంధహస్తాల్లో చిక్కుకుని అల్లాడిపోయేవారు. అహల్యాబాయి ఆ దోపిడీ దారుల ఆటకట్టించింది. భారతదేశ సంస్కృతి అభివృద్ధికి ఈమె చేసిన కృషిని ప్రశంసిస్తూ భారత ప్రభు త్వం అహల్యాబాయి పేరిట స్ర్తి శక్తి పురస్కారాన్ని నెలకొల్పింది. ఇండోర్‌లోని విమానాశ్రయానికి దేవి అహల్యాబాయి హోల్కర్ అనే పేరుపెట్టారు.
రాణి వేలు నచియార్
1760-1796 కాలంలో మొట్టమొదటిగా బ్రిటీష్ సామ్రాజ్యాన్ని ఎదిరించి పోరాడిన మహిళ రాణి వేలు నచియార్. బ్రిటీష్ వారి నుంచి తమ రాజ్యాన్ని తాము తిరిగి దక్కించుకున్న కొద్దిమంది రాజ్యాధినేతల్లో ఒక యోధురాలిగా ఘనతకెక్కిన తమిళ మహిళ రాణి వేలు నచియార్. ఆమెకు సోదరులెవ్వరూ లేకపోవడం వల్ల చిన్నప్పటి నుండీ రాకుమారుడిలా పెరిగింది. వేలు నచియార్ భర్త శివగంగై రాజు. 1772లో ఆర్కోట్ నవాబుతో కలిసి బ్రిటీష్ దళాలు శివగంగైను ఆక్రమించడానికి చేసిన కళైయార్ కోయిల్ యుద్ధంలో శివగంగైరాజును హత్య చేస్తారు. శివగంగైకు చెందిన కొంతమంది శక్తివంతమైన సన్నిహితుల సాయంతో దిండిగల్‌లో నివసించింది. ఆ సమయంలో సంకీర్ణ సేనలను తయారుచేసింది. 1780లో మైసూర్ సుల్తాన్ హైదర్ అలీ సాయం తీసుకుని శత్రువులపై దాడిచేసింది. అప్పట్లోనే ఆమె సైన్యంలో ప్రాణాలను పణంగా పెట్టిన ‘మానవబాంబు’ కుయి లీ అనే మహిళ ఉండేది. ఆ యుద్ధంలో వేలు నచియార్ విజయం సాధించి తన రాజ్యాన్ని చేజిక్కించుకుంది. ఇప్పటికీ తమిళనాడులో జనవరి 3న రాణి వేలు నచియార్ జయంతిని వేడుకగా జరుపుకుంటారు. 2008, డిసెంబర్ 31న ప్రభుత్వం ఆమె శాశ్వత గుర్తుగా పోస్టల్ స్టాంపును విడుదల చేసింది.
రాణి చెన్నమ్మ
భారత పార్లమెంటు ఆవరణలో 2007, సెప్టెంబర్ 11న మన దేశ తొలి మహిళా రాష్టప్రతి ప్రతిభాపాటిల్ చేతుల మీదుగా రాణి చెన్నమ్మ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. కర్నాటకలోని కిట్టూర్ రాజ్యానికి రాణి ఆమె. అప్పటి బ్రిటిష్ గవర్నర్ జనరల్ డల్హౌసీ ప్రవేశపెట్టిన ‘డాక్ట్రిన్ ఆఫ్ లాప్స్’ అనే చట్టానికి వ్యతిరేకంగా చెన్నమ్మ పోరాడింది. పోరాటంలో ఆమె చూపిన తెగువ, పట్టుదల, తిరుగుబాటు చేసిన తీరు తరువాతి తరం స్వాతం త్య్ర సమరయోధులకు ఎనలేని స్ఫూర్తిని అందించింది. ఆమె యుద్ధంలో ఓడిపోయి బ్రిటీష్ వారికి పట్టుబడింది. నేటికీ కర్నాటకలో ఏటా అక్టోబర్ నెలలో బ్రిటీష్ వారిపై ఆమె సాధించిన మొదటి విజయాన్ని గుర్తుచేసుకుంటూ ‘కిట్టూర్ ఉత్సవం’ పేరుతో ఘనంగా వేడుకలు నిర్వహిస్తుంటారు. ఆమె ధైర్యాన్ని, విప్లవదళం సాయంతో పోరాడిన తీరు ఇప్పటికీ స్ఫూరివంతమైన నాటకాలుగా, జానపద పాటలుగా, కథలు కథలుగా గానం చేస్తూంటారు. ఇండియన్ రైల్వేస్ బెంగళూరు నుంచి కొల్హాపూర్‌కు ప్రయాణించే ఒక రైలుకు ‘రాణి చెన్నమ్మ ఎక్స్‌ప్రెస్’ అని పేరు పెట్టింది.
రాజ్‌కుమారి గుప్త
రాజ్‌కుమారి గుప్త ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు చంద్రశేఖర్ ఆజాద్ ఆధ్వర్యంలోని తిరుగుబాటు యోధుల బృందానికి సహకరిస్తూ ఉండేది. వారికి రహస్యంగా సందేశాలను, మారణాయుధాలను చేరవేసేది. చరిత్రలో ప్రముఖంగా చెప్పుకునే ‘కాకోరీ కాన్ స్పైరసీ’ గా పేరొందిన, లక్నోకి దగ్గరగా గల కాకొరీ ప్రాంతంలో చంద్రశేఖర్ ఆజాద్ నాయకత్వంలో ప్రముఖ పాత్ర పోషించింది రాజ్‌కుమారి గుప్త. తన దుస్తుల్లో మారణాయుధాలను దాచుకుని చేరవేస్తుండగా బ్రిటీష్ సైన్యానికి తన మూడేళ్ళ కొడుకుతో సహా పట్టుబడింది.
బేగం హజరత్ మహల్
భారతదేశం దాస్యశృంఖలాలను విడగొట్టేందుకు భారతీయులంతా విద్యావంతులు కావాలని, భారతీ యుల్లో ఉన్న దైవభక్తే దేశభక్తిని పెంపొందించే శక్తి అవుతుందని నమ్మిన బేగం హజరత్ మహల్ తాను మహారాజు తరఫున బాధ్యతలు తీసుకొన్న వెంటనే భారతదేశంలో జీర్ణావస్థలో ఉన్న ఎన్నో దేవాలయాలను, మసీదులను తిరిగి పునర్నిర్మించింది. 1857లో ఈస్ట్ ఇండియా కంపెనీపై తిరుగుబాటు చేస్తున్న నానాసాహెబ్‌ను తనకు మార్గదర్శిగా ఎంచుకుని ఆయనతో కలసి వీరోచితంగా బ్రిటిష్‌వారిని ఎదిరించింది. బిర్జిద్ కద్రాను లక్నో మహారాజుగా నియమించి తానే రాజ్య కార్యనిర్వహణా బాధ్యతలను తీసుకొన్న హజరత్ మహల్ చర్యల ను సహించలేని బ్రిటిష్ ప్రభుత్వం ఆమె రాజ్యాధికారాన్ని చేపట్టడాన్ని వ్యతిరేకించారు. హజరత్ బ్రిటిష్ వారిని ఎదిరించి లక్నో రాజ్యాన్ని నిరాటం కంగా పాలించింది. ఆ కాలంలో ఎన్నో సంస్కరణలను చేపట్టింది. హజరత్ మహల్ బేగం ఫైజాబాద్‌లో జన్మించింది. ఈమెను సంతానం లేని ముస్లిమ్ ఖాసిన్ దత్తత తీసుకొన్నారు. హజరత్ చిన్నప్పుడే యుద్ధవిద్యల్లో ఆరితేరింది. ఈమె అపూర్వ సౌందర్యాన్ని చూసి నవాబ్ అజీద్ అలీషా పరిచయం చేసుకొని ఈమెలోని శౌర్యప్రతాపాలను, రాజనీతిని చూసి అబ్బురపడి తన రెండవ భార్యగా వివాహం చేసుకొన్నాడు. విధివశాత్తు ఈమె నవాద్ అజీద్‌ను బ్రిటిష్ ప్రభుత్వం లక్నో నుంచి బహిష్కరించింది. బలవంతంగా తన రాజ్యాన్ని బ్రిటీష్‌వారు చేజిక్కించుకోగా రిక్తహస్తాలతో నేపాల్ చేరుకుంది. 1879లో ఖాట్మండులో మరణించింది. అనంతరం ఆమె సాహస పోరాటపటిమకు గుర్తుగా భారత ప్రభుత్వం 1984, మే 10లో బేగం హజ్రత్ మహల్ ఫొటో ముద్రించిన పోస్టల్ స్టాంప్‌ను విడుదల చేసింది.
మేడం బికాజీ కామ
ఈమె పార్సీ యువతి. వ్యాపారస్తుల కుటుంబంలో పుట్టింది. ఇప్పటి త్రివర్ణజాతీయ పతాకం కోసం మొట్టమొదట కృషి చేసిన ఘనత మేడం కామాకు దక్కుతుంది. స్వాతంత్య్రం కోసం శ్రమించే జాతికి ఒక జెండా ఉండాలన్న ఆలోచన మొట్టమొదట మేడం కామాకు కలిగింది. ఈ ఆలోచనను దామోదర్‌వినాయక్ సావర్కర్‌కు తెలిపింది. వీరిద్దరూ కలసి త్రివర్ణజాతీయ పతాకాన్ని రూపొందించి జర్మనీలో జరిగిన అంతర్జాతీయ సోషలిస్టు కాన్ఫరెన్స్‌లో ప్రదర్శించి భారతీయుల మనసులను దోచుకుంది. విద్యాతృష్ణతో అనేక భాషలను నేర్చుకుంది. అందులో ఆంగ్లంలో మంచి పట్టును కూడా సాధించింది. వ్యాపారరీత్యా తండ్రితో పాటుగా వీరు ముంబాయిలో నివసించేవారు. అప్పటికాలంలో అంటే 1896లో అక్కడ ప్లేగువ్యాధి వ్యాపించింది. మేడం కామాలోని సేవాదృక్పథంతో అక్కడి ప్లేగు వ్యాధిగ్రస్తులకు సేవచేస్తుండేది. ఆ కాలంలోనే మేడం కూడా ప్లేగు వ్యాధి సోకింది. కానీ అప్పుడే ఆమెకు భారత స్వాతంత్య్రోదమ కర్త శాంయజీ కృష్ణవర్మ పరిచయం అయ్యారు. కృష్ణవర్మ ప్రభావంతోనే భారత స్వాతంత్య్రం కోసం తాను శ్రమించాలని కోరుకుంది. కృష్ణవర్మ సలహామేరకు దాదాభాయ్ నౌరోజీకి సహాయకురాలిగా పనిచేసింది. అప్పుడే ఇండియన్ హోం రూల్ సొసైటిని స్థాపించింది. కాని ఇంగ్లండ్ ప్రభుత్వం బ్రిటన్‌కు వ్యతిరేక చర్యలు చేయనని హామీ ఇస్తేగానీ ఇండియాకు వెళ్లడానికి అనుమతినివ్వమని అంది. దాంతో ఆమె ఇంగ్లండ్‌ను వదిలి పారిస్‌కు మకాం మార్చుకుంది. అక్కడ్నుంచే భారత స్వాతంత్య్రం కోసం శ్రమించడం ప్రారంభించింది. ఆమె తీవ్రమైన అస్వస్థతో బాధపడుతూ 1935లో స్వాతంత్య్ర వాయువులను పీల్చుకునే భారత్‌ను చూడకుండానే కన్నుమూసింది.
రాణి అవంతీబాయి
1831-1858 మధ్యకాలంలోని మరో మొదటితరం స్వాతంత్య్రయోధురాలు రాణి అవంతీబాయి. ‘వారసులు లేనివారు తమ రాజ్యాన్ని ప్రభుత్వానికి అప్పగించి భరణం తీసుకోవాలన్న ఆదేశాల’ను ఆమె వ్యతిరేకించింది. రహస్యంగా ఆమె కొన్ని బృందాలను తయారుచేసి, బ్రిటీష్‌వారి అరాచకాలను, అకృత్యాలను వారి ద్వారా బహిరంగపరిచింది. 1857 తిరుగుబాటు సమయం లో బ్రిటీష్‌దళాలలకు వ్యతిరేకంగా పోరాడి విజయాన్ని చేజిక్కించుకుంది. కానీ ఆ విజయాలు ఎంతో కాలం నిలువలేదు. బ్రిటీష్ సైన్యం చేతికి దొరికి, చావటం ఇష్టంలేక తనే కత్తితో పొడుచుకుని ప్రాణత్యాగం చేసిన ధీరోదాత్త అవంతీబాయి.
పార్వతి గిరి
పశ్చిమ ఒరిస్సా ప్రాంతంలోని మరో మదర్ థెరిస్సాగా పేరొందిన మహిళ పార్వతి గిరి. పదహారేళ్ల ప్రాయంలోనే స్వాతంత్య్ర ఉద్యమం పట్ల ఆకర్షితురాలై అనేక పోరాటాల్లో ముందుండి నడిచింది. క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో ప్రముఖ పాత్ర పోషించింది. అందుకు ఆమె రెండు సంవత్సరాల జైలు జీవితం కూడా గడిపింది.
భోగేశ్వరి ఫుకనాని
మధ్య అసోం ప్రాంతానికి చెందిన భోగేశ్వరి ఫుకనాని అరవై సంవత్సరాల వయస్సులో ప్రాణాలను పణంగా పెట్టిన సాహస మహిళ. సాధారణ గృహిణి అయిన భోగేశ్వరి స్వాతంత్య్ర పోరాటం పట్ల ఆకర్షితురాలై స్వయంగా ఉద్యమంలో పాల్గొనటమే కాకుండా తన ఆరుగురు కొడుకులను, ఇద్దరు కూతుళ్ళను కూడా పాల్గొనేలా చేసింది. తిరుగుబాటుతో పాల్గొన్న భోగేశ్వరిని అమానవీయరీతిలో కాల్చి చంపింది బ్రిటీష్ సైన్యం.
కనకలత బారువా
అసోంకే చెందిన మరో మహిళ కనకలత బారువా. క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో ‘మృత్యువాహిని’ అనే సేనలో ప్రాణాలను పణంగా పెట్టి పనిచేసింది. 1942, సెప్టెంబర్ 20న క్విట్ ఇండియా ఉద్యమ బృందం చేపట్టిన మార్చ్‌లో జాతీయ జెండా ధరించి ముందుండి సాగి బ్రిటీష్ సైన్యం జరిపిన కాల్పుల్లో ప్రాణాలను పోగొట్టుకుంది.
మాతంగిని హజ్రా
త్యాగాలకు తగినంత ప్రాచుర్యం పొందని వీరవనిత హజ్రా. క్విట్ ఇండి యా ఉద్యమంలో చురుకైన పాత్రను పోషించింది. తన మాటల ద్వారా, చేతల ద్వారా ప్రజల్లో జాతీయతా భావాన్ని అత్యంత వేగంగా వ్యాప్తి చేసింది. ఉద్యమకాంక్షను రగిలించింది. జాతీయ జెండా ధరించి ఉద్యమ పథంలో నడుస్తున్న ఆమెను కాల్చిచంపారు బ్రిటీష్ సైనికులు. తూటా తగిలినా కూడా ధైర్యా న్ని కోల్పోక, జెండా విడువక, ముందుకు నడుస్తూనే నేలకొరిగింది హజ్రా.
*
తెలుగు మహిళలు
జాతీయోద్యమం చివరిదశలో మహాత్మాగాంధీ నాయకత్వంలో అహింసాయుత మార్గాల్లో , పురుషులతో సమానంగా మహిళలు కూడా స్వాతంత్య్ర సమరంలో పాల్గొన్నారు. ఉద్యమంలో పాల్గొన్న తెలుగు మహిళామణులు డా. దుర్గాబాయ్ దేశ్‌ముఖ్, ఆరుట్ల కమలాదేవి, ‘ఆంధ్రా అనిబిసెంటు’గా పేరుగాంచిన బత్తుల కామాక్షమ్మ, కనుపర్తి వరలక్ష్మమ్మ, చుండూరి రత్నమ్మ, సూర్యదేవర రాజ్యలక్ష్మి, సరోజినీ నాయుడు, దువ్వూరి సుబ్బమ్మ, కొల్లాకనక వల్లి తాయారమ్మ, అచ్చంట రుక్మిణి, మాగంటి అన్నపూర్ణమ్మ, ఉన్నవ లక్ష్మీబాయమ్మ, పాకుర్తి సుందరమ్మ, వేదాంతం కమలాదేవి, సంగం లక్ష్మీబాయమ్మ, దర్శి అన్నపూర్ణమ్మ, ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ, దేవులపల్లి సత్యవతి, జ్ఞానకుమారి, ఎల్లాప్రగడ సీతాకుమారి.. ఇలా ఇంకా ఎందరో.. వీరంతా తమ కుటుంబానికి దూరమై, ఖద్దరు ధరించి, స్వాతంత్య్ర సమర గీతాలు పాడుతూ, త్యాగాలు చేసి.. పోలీసుల చేతిలో లాఠీ దెబ్బలు తింటూ చిత్రహింసలకు గురై, స్వాతంత్య్ర సమరధీరలుగా చరిత్రలో నిలిచారు. వారి గురించి టూకీగా..
* బాపట్లలో జన్మించిన కనుపర్తి వరలక్ష్మి స్వయంకృషితో తెలుగు సాహిత్యం, సంస్కృతం, హిందీ భాషలను అభ్యసించారు. సహాయ నిరాకరణోద్యమం ముమ్మరంగా సాగుతున్న రోజుల్లో వరలక్ష్మమ్మ, ఆమె సహచర మహిళలందరూ ‘స్వరాజ్యం లక్ష్మీ వ్రతం’, ‘రాట్న లక్ష్మీ’ పూజలు దేసి స్వదేశీ దీక్షా సూత్రాలు కట్టుకున్నారు. అప్పటి నుండి వరలక్ష్మమ్మ గాంధీగారి సూచనమేరకు ఖద్దరు ధరించి, బాపట్లలో ‘హితైషిణీ మండలి’ని స్థాపించి మహిళలకు సాహిత్య విషయాలతో పాటు, రాజకీయ క్రియాశీలతను ప్రబోధించిన మేధావి.
* ఆంధ్రా అనిబిసెంటుగా పేరుగాంచిన బత్తుల కామాక్షమ్మ ఉన్నవ లక్ష్మీనారాయణను పెళ్లిచేసుకుని సంఘసేవలో స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్నారు. ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని ఉప్పును గ్రామాలలో వండి శాసనధిక్కారం చేశారు. 1941లో సత్యాగ్రహంలో పాల్గొన్నందుకు ఈమెను మూడోసారి అరెస్టుచేసి రాయవేలూరు జైలులో మూడు నెలలు ఉంచారు.
* గుంటూరు ఝాన్సీరాణిగా పేరొందిన సూర్యదేవర రాజ్యలక్ష్మీదేవమ్మ పత్రికా రచయిత. శాసనోల్లంఘన ఉద్యమంలో పాల్గొన్నందుకు సంవత్సరం పాటు జైలు శిక్ష విధించారు తెల్లదొరలు. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నందుకు నెల్లూరు, మద్రాసు జైళ్ళలో శిక్షను అనుభవించారు.
* చుండూరి రత్నమ్మ గాంధీజీ ప్రభోదనలకు ఆకర్షితురాలై స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొని జైలుకు వెళ్ళారు.
* మల్లు స్వరాజ్యం గురించి తెలియని వారుండరు. నిజాం నిరంకుశ పాలనపై కత్తికట్టి, కొండజాతి, కోయజాతి, అడవిజాతి వారిని పోగుచేసి వారిలో చైతన్యం కలుగజేసిన గొప్ప మహిళ మల్లు స్వరాజ్యం.
* మద్యపాన నిషేధానికి ఎంతగానో కృషిచేసి, స్ర్తిలందరికీ ఆదర్శప్రాయమైన మహిళ ఆరుట్ల కమలాదేవి.
* కులవృత్తి చేపట్టి బట్టలు ఉతికి జీవితం గడిపేవారు చాకలి ఐలమ్మ. అక్షరం ముక్క రాకపోయినా తన సాహసంతో దొరలను, రజాకార్లను ఎదిరించి, భయపెట్టి ముందుకుసాగింది ఐలమ్మ. ఆమె పోరాటమే భూపోరాటాలకు నాంది అయ్యింది.
* క్విట్ ఇండియా, ఉప్పు సత్యాగ్రహం, విదేశీ వస్తు బహిష్కరణ ఉద్యమాల్లో పాల్గొన్న మహిళ శివరాజు సుబ్బమ్మ.
* బహు భాషా కోవిదురాలు బారు అలివేలమ్మ. మహిళలు అక్షరాస్యులయ్యేందుకు ఎంతగానో కృషి చేసింది ఈమె. అలహాబాద్‌లో కమలా నెహ్రూతో కలిసి విదేశీ వస్త్ర బహిష్కరణ ఉద్యమంలో చురుకుగా పాల్గొని, కఠిన కారాగారాశిక్షను అనుభవించిన జాతీయ నాయకురాలు.
* పాలకోడేటి శ్యామలాంబ యువజన సమావేశాలు నిర్వహించి వారిలో ఉద్యమస్ఫూర్తిని నింపేవారు. విదేశీ వస్తు బహిష్కరణలో పాల్గొని పికెటింగ్ నిర్వహించారు. 1932 శాసనోల్లంఘనంలోనూ, 1941లో జరిగిన వ్యక్తి సత్యాగ్రహంలోనూ పాల్గొని కఠిన కారాగార శిక్షను అనుభవించారు.
* వర్ణవివక్షను రూపుమాపడంలో విశేష కృషి చేశారు గూడూరి నాగరత్నం. ఆ పంథాలోనే బ్రాహ్మణ కులంలో పుట్టినా రంగయ్యను వర్ణాంతర వివాహం చేసుకున్న నిరుపమాన స్వాతంత్య్ర సమరయోధురాలు. 1926 32ల్లో శాసనోల్లంఘన ఉద్యమంలో పాల్గొని చాగల్లు పరిసరాల్లో హరిజనోద్ధరణ కార్యక్రమాలు చేపట్టి ఖద్దరు ప్రచారం, స్వదేశీ ప్రచారం చేసిన వీరవనిత.
* సరోజనీనాయుడు కూతురు పద్మజా నాయుడు. ఖాదీ వస్త్రాలను వాడమని, విదేశీ వస్త్రాలను, వస్తువులను బహిష్కరించమని అందరికీ బోధించేవారు. 1942 క్విట్ ఇండియా ఉద్యమంలో జైలుశిక్షననుభవించారు.
* స్వాతంత్య్ర సమరంలో పాల్గొన్న తెలుగింటి మహిళామణి దువ్వూరి సుబ్బమ్మ. నిర్భీతికి మారుపేరుగా చెప్పుకునే సుబ్బమ్మ నాటి ఉద్యమంలో పాల్గొన్నందుకు క్షమాపణ చెప్పమని కలెక్టర్ అడిగితే ‘నా కాలిగోటికి సైతం నువ్వంటే అసహ్యం’ అని చెప్పిన సాహసి. 1922, 30, 32, 42 ప్రాంతాల్లో జరిగిన ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్న ధీరవనిత. దుర్భరమైన దారిద్య్రాన్ని అనుభవించినా తలవంచని వ్యక్తిత్వం గలవారు. రాజమండ్రిలో సనాతన స్ర్తి విద్యాలయాన్ని నెలకొల్పి ‘దేశబాంధవి’గా పేరుపొందారు.

ఇలా ఎందరో మహిళలు, పురుషులతో పాటుగా ధైర్య స్థైర్యాలతో పోరాటాలు జరిపి స్వాతంత్య్రాన్ని సాధించి పెట్టారు. అలాంటి మహిళలందరికీ వందనాలు చేస్తూ.. జయహో మహిళా.. జయహో.. *