ఎడిట్ పేజీ

చట్టాలు ఘనం.. విలువలు పతనం..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచం అంతా భారత్ వైపు చూస్తోంది. విభి న్న భాషలు, మతాలు, కులాలు, ప్రాంతాలు, దృక్పథాలున్నా- అధిక జనాభాతో సతమతమవుతున్నా- భారతీయులు భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రతిబింబించడాన్ని ప్రపంచం అబ్బురపడి చూస్తోంది. ఇంతటి సంక్లిష్ట సమాజం ఈ భూమిపై లేదంటే అతిశయోక్తి కాదు. విద్య, విజ్ఞానం, ఐటీ రంగం.. ఇలా ప్రతి అంశంలోనూ తనదైన ముద్ర వేసుకుంటూ ఉన్నతస్థాయికి చేరుకుంటున్న భారత్‌లో- కొన్ని సంఘటనలు అందర్నీ కలచివేస్తున్నాయి. మహిళలకు రక్షణ లేనందున భారత్‌కు వెళ్లవద్దని అగ్రదేశాలు హుకుం జారీ చేసేంత వరకూ సామాజిక విలువలు దిగజారడం విషాదకరం.
ఏటా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఉత్సాహంగా, ఘనంగా నిర్వహించుకుంటున్నాం. స్వాతంత్య్ర ఫలంగా మనకు అన్ని హక్కులు సిద్ధించినందుకు సంతోషించాలా? బాధ్యతలను విస్మరిస్తున్నందుకు బాధపడాలా? ఎన్ని చట్టాలు చేస్తున్నా నేరప్రవృత్తి పెరిగిపోతున్నందుకు కుంగిపోవాలా? ఏదైనా సంఘటన జరిగితే చాలు ప్రభుత్వాన్ని, నేతలను వ్యవస్థలనూ నిందించడం భారత సమాజానికి అలవాటుగా మారిందని సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి కేజీ బాలకృష్ణన్ చేసిన వ్యాఖ్యలు నిజమే అనిపించేలా ఇటీవలి ఘటనలు అద్దం పడుతున్నాయి. కొద్దిరోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘్భరత శిక్షాస్మృతి సవరణ బిల్లు-2018’ దేశంలోని పరిస్థితులను కళ్ల ముందు ఆవిష్కరించింది. మానవ అక్రమ రవాణా, మహిళలపై హింస, అనాగరిక చర్యలు కొత్తేమీ కాదు, ఇవి నిత్యం జరుగుతున్నవే. కాకపోతే జమ్మూ కశ్మీర్‌లోని కథువా, యూపీలోని ఉన్నావ్‌లో జరిగిన అత్యాచార ఘటనలతో కేంద్ర ప్రభుత్వం మేల్కొని అత్యవసరంగా ‘్భరత శిక్షా స్మృతి సవరణ ఆర్డినెన్స్’ను ఏప్రిల్ 21న తీసుకువచ్చింది. 12ఏళ్ల లోపుబాలికలపై అత్యాచారానికి పాల్పడే దోషులకు మరణదండన విధించడానికి ఉద్దేశించిన ఈ ఆర్డినెన్స్ స్థానే ఇటీవల లోక్‌సభ బిల్లును ఆమోదించింది.
భారత నేర శిక్షాస్మృతిలోని 16వ విభాగంలో మానవ శరీరంపై జరిగే నేరాలకు సంబంధించి సెక్షన్ 302 నుండి 377 వరకూ నేరాల్లో శిక్షలకు సంబంధించి చాలా స్పష్టత ఉంది. తాజాగా మానవ అక్రమ రవాణా నిరోధకానికి వ్యక్తుల అక్రమ రవాణా (నిరోధం, సంరక్షణ , పునరావాసం ) బిల్లును తీసుకురావడానికి కారణం ప్రస్తుతం ఉన్న తీవ్రమైన శిక్షలు సైతం చాలవని, వాటిని మరింత కఠినతరం చేయాలని, కొన్ని నేరాలు చేసేందుకే భయపడేలా ఉండాలని కేంద్రం నిర్ణయించింది. మానవ అక్రమ రవాణా, స్ర్తిలు, బాలికలపై అత్యాచారాలు, సామూహిక అత్యాచారాలు, ఇతర నేరాలకు సంబంధించి ఈ కొత్త చట్టం తీసుకురావడంతో ఇటు ఐపీసీలోనూ, సీఆర్‌పీసీలోనూ, లైంగికపరమైన నేరాలు దాడుల నుండి బాలలను సంరక్షించే చట్టం-2012(పొస్కో) లోనూ, సాక్ష్యం చట్టంలోనూ అనేక మార్పులు రానున్నాయి.
మానవ అక్రమ రవాణాకు తీవ్ర శిక్షలతో పాటు ప్రధానంగా బాలికలపై జరిగే లైంగిక దాడులకు శిక్షలను తీవ్రాతి తీవ్రంగా మార్చారు. భారత నేర శిక్షాస్మృతి (ఐపీసీ)లోని సెక్షన్ 376కు, ఫోక్సో చట్టంలోని సెక్షన్ 42కు చేపట్టిన సవరణలు లైంగిక నేరాలకు మరింత కఠిన శిక్షలకు వీలు కల్పిస్తుంది. పిల్లలపై అత్యాచారాలకు పాల్పడే వారికి మరణ దండన విధించే చట్టాలు ప్రపంచంలో 14 దేశాల్లో మాత్రమే ఉన్నాయి. నేడు ఆ జాబితాలోకి భారత్ కూడా చేరింది. వస్తువులను తేలిగ్గా అక్రమరవాణా చేసినట్టే మానవులను సైతం అక్రమ రవాణా చేయడం ఈనాటి వ్యవహారం కాదు. శతాబ్దాల చరిత్రతో ఇది ముడిపడింది. 167 దేశాల్లో మానవ అక్రమ రవాణా జరుగుతోంది. 140 దేశాల్లో అయితే ఇది అన్ని నేరపూరిత రూపాల్లో జరుగుతోంది. అన్ని సర్వేలనూ పరిశీలిస్తే ఐదు సాధారణ రూపాల్లో మానవ అక్రమ రవాణా జరుగుతోంది. శ్రమ దోపిడీ, లైంగిక దోపిడీ, పునరుత్పాదక దోపిడీ, మాదక ద్రవ్యాల రవాణా, ఆయుధాల విధ్వంసం, భిక్షాటన వృత్తి. 2017 మే 7న కేంద్రం విడుదల చేసిన నివేదిక ప్రకారం మానవ అక్రమ రవాణా బాధితులుగా బాలలు,మహిళల సంఖ్య 25 శాతం పెరిగింది.
ప్రపంచంలో 150 కోట్ల బిలియన్ డాలర్ల లాభాల పరిశ్రమగా ‘చీకటి శక్తులు’ మానవ అక్రమ రవాణాను నిర్వహిస్తున్నట్టు 2014లో అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఒ) నివేదిక తెలిపింది. రెండు కోట్ల మందికి పైగా బాధితులు ఈ బానిసత్వం ఉచ్చులో ఉన్నట్టు అంచనా. ఇందులో 68 శాతం మంది శ్రమదోపిడీలో ఉండగా, 22 శాతం మంది లైంగిక దోపిడీలో ఉన్నారు. 12 నుండి 14 ఏళ్ల వయసు బాలికలను బలవంతంగా వ్యభిచార వృత్తిలోకి దింపుతున్నారు. ఏటా వేలాది మంది వలసదారులను అత్యంత వ్యవస్థీకృత అంతర్జాతీయ నెట్‌వర్కులు, గ్రూప్‌లు అక్రమ రవాణా చేస్తుంటాయి. వీరిని ప్రమాదకరమైన, అమానవీయమైన పరిస్థితుల్లో పనిచేయించేందుకు ఉపయోగిస్తుంటారు. చాకిరీ, లైంగిక బానిసత్వం, లైంగిక వ్యాపార దోపిడీ, అవయవాలు తొలగించడం, బలవంతపు పెళ్లిళ్లు, ఇతరులకు ‘అద్దెగర్భం’ వినియోగించుకోవడం, శారీరకంగా స్వాధీనపర్చుకోవడం, అవినీతి, అక్రమ పనుల్లోకి దింపడం, సెక్స్ టూరిజంలో, మసాజ్ సెంటర్లలో వినియోగించడం జరుగుతోంది.
మానవ అక్రమ రవాణా పలు దేశాల మధ్య, ఖండాల మధ్య, ఒకే దేశంలో నగరాల మధ్య కూడా జరుగుతోంది. కొద్ది నెలల క్రితం హైదరాబాద్ పాతబస్తీలోని గాజుల పరిశ్రమల్లో పనిచేస్తున్న బాలలను రక్షించినపుడు దిగ్భ్రాంతికరమైన అంశాలు వెల్లడయ్యాయి. అక్కడ కొంతమంది బాలలు నెలల తరబడి సూర్యుడ్ని కూడా చూడలేదని వెల్లడి కావడంతో- ఆ బాలల స్థితి ఏమిటో అర్థమవుతుంది. గతంలో ప్రకాశం జిల్లాలో పలకల పరిశ్రమలో బాలల దుర్భర స్థితి ఇంతకంటే ఘోరం. తక్కువ ఆదాయం ఉన్న దేశాలకు చెందిన వారు అభివృద్ధి చెందిన దేశాలకు వెళ్లాలని ఆకాంక్షిస్తుంటారు. అలా వెళ్లిన తెలంగాణ యువకులు మధ్యప్రాచ్య దేశాల్లో ఇరుక్కుని అక్కడి నుండి బయటపడలేక విలవిల్లాడుతున్నారు. ఒక వ్యక్తి మరో దేశంలో అక్రమంగా ప్రవేశించడం నేరమైతే, మానవ అక్రమ రవాణాలో దోపిడీ కూడా ఉండటంతో అది మరింత బాధాకరమైన స్థితికి తీసుకువెళ్తోంది. నిర్బంధ కార్మికులుగా, బానిసత్వాన్ని పోలి ఉండే ఇతర పద్ధతుల్లో వీరిని వినియోగించుకుంటున్నారు. దీనికి కొనసాగింపుగా బాలికలను తీసుకువెళ్లి వేశ్యావాటికల్లోనూ, సంపన్న కుటుంబాల్లో వెట్టి చాకిరీకి వినియోగిస్తున్నారు.
వృద్ధులు సైతం ముక్కుపచ్చలారని ఆడపిల్లలను పెళ్లిళ్లు చేసుకుని వారిని అక్రమంగా రవాణా చేసి తమ దేశానికి చేరుకున్నాక హింస పెడుతున్నారు. అలాంటి పెళ్లిళ్ల వ్యవహారం ఇటీవల హైదరాబాద్‌లో బట్టబయలైంది. మానవ అక్రమ రవాణాలో వెట్టి చాకిరీ, హింస, అనాగరిక చర్యలు, లైంగిక దోపిడీ సహా అనేక అంశాలు ఇమిడి ఉన్నాయి. ఇది కంటికి కనిపించని అంతర్జాతీయ పరిణామం. మధ్య ప్రాచ్యదేశాలు ఆఫ్రికా రీజియన్‌లో బాలకార్మిక వ్యవస్థపై పోరు సాగించేందుకు ప్రత్యామ్నాయ- సుస్థిర సేవలు (ఏక్సెస్-మీనా) పేరిట నిర్వహించిన ఒక అధ్యయనంలో తేలింది ఏమిటంటే యెమెన్ దేశంలోని సరిహద్దు గ్రామాల్లో నివసిస్తున్న 30 శాతం మంది పాఠశాలల బాలలను సౌదీ అరేబియాలోకి అక్రమ రవాణా చేసినట్టు తేలింది. ఇలా అక్రమ రవాణా చేసిన బాలలపై లైంగిక వేధింపులకు పాల్పడటం, హత్య చేయడం జరుగుతోందని యాక్సిస్ మీనా నివేదిక పేర్కొంది. 2003లో ప్రచురించిన అమెరికా ప్రభుత్వ నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఏటా సరిహద్దుల్లో 15 లక్షల మంది పౌరుల అక్రమ రవాణా జరుగుతోంది.
బాలల అక్రమ రవాణాకు ప్రధాన కారణం పేదరికమే. కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రుల అనుమతితోనే బాలల అక్రమ రవాణా జరుగుతోంది. ఈ అలవాటు మధ్య ప్రాచ్య దేశాలకే కాదు, తెలుగు రాష్ట్రాల్లోనూ ఉంది. గతంలో బాలల అక్రమ రవాణా కేసులు తెలంగాణలోనూ, ఆంధ్రప్రదేశ్‌లోనూ నమోదయ్యాయి. మానవ అక్రమ రవాణాలో 50 శాతం బాలలే ఉంటున్నారు. ఫిలిప్పీన్స్‌లో 60 వేల నుండి లక్ష మంది వరకూ బాలలను వేశ్యా వాటికల్లో పనిచేయించేందుకు అక్రమ రవాణా చేస్తున్నారని తేలింది. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం బాలికల రక్షణకు నడుం బిగించింది. పదహారేళ్ల లోపు బాలికలపై జరిగే లైంగిక దాడులకు కఠినాతి కఠినమైన శిక్షలు విధించాలని, 16 ఏళ్లు పైబడిన వారిపై లైంగిక దాడి జరిగితే కనీసం పదేళ్లు కారాగార వాసం విధించాలని నిర్ణయించారు. కొత్త ప్రతిపాదనల ప్రకారం 18 ఏళ్లలోపు వారంతా బాలికలే, అయితే అందులోనూ మూడు కేటగిరిలను ప్రతిపాదించారు. 12 ఏళ్ల లోపు ఒక వర్గం, 12 నుండి 16 ఏళ్ల వరకూ ఒక వర్గం, 16 నుండి 18 ఏళ్ల వరకూ ఒక వర్గంగా నిర్ణయించారు. 12 ఏళ్ల లోపు బాలికలపై లైంగిక దాడి జరిగితే వారికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తారు. గరిష్ట శిక్ష వేయాలనుకుంటే మరణ దండన విధిస్తారు. గతంలో ఇందుకు పదేళ్ల జైలు శిక్ష మాత్రమే ఉండేది. సామూహిక అత్యాచారానికి పాల్పడితే ఉరిశిక్ష విధించే వీలును ఈ చట్టంలో కల్పించారు. 16ఏళ్ల బాలికలపై అత్యాచారానికి పాల్పడితే 20 ఏళ్ల కఠిన కారాగారంతో పాటు యావజ్జీవ శిక్ష కూడా విధించవచ్చు. 16 నుండి 18 ఏళ్ల లోపు బాలికలపై లైంగిక దాడి జరిగితే కనీసం 10 ఏళ్ల జైలు శిక్ష, నేర తీవ్రత బట్టి యావజ్జీవం విధించే వీలుంది. ఇదంతా బాలికలకే పరిమితమైంది. బాలురపై జరుగుతున్న అకృత్యాల గురించి ఈ చట్టంలో ఎలాంటి ప్రస్తావన లేదు. వెట్టి చాకిరీ, అశ్లీల చిత్రీకరణ అంశాలపై కూడా ఈ చట్టంలో ఎలాంటి స్పష్టత లేదు. జైళ్లు మార్పుకు వేదిక కావాలని, అలాంటపుడు మరణదండన వంటి తీవ్రమైన శిక్ష విధించడం మానవ హక్కులను ఉల్లంఘించడమేనని ప్రముఖ రచయిత్రి తస్లీమా నస్రీన్ వ్యాఖ్యానించారు. జస్టిస్ జెఎస్ వర్మ కూడా మరణదండనపై భిన్నమైన అభిప్రాయం వ్యక్తం చేశారు.
దేశవ్యాప్తంగా 2016లో 64,138 అత్యాచార ఘటన కేసులు నమోదయ్యాయి. వాటిలో ఐపీసీ 376 కింద 1869 మందికి మాత్రమే శిక్షలు పడ్డాయి. రిజిస్టర్ అవుతున్న కేసులను పరిశీలిస్తే 36,657 కేసుల్లో 34,650 ఘటనలకు సంబంధించి నేరాలకు పాల్పడిన వారు బాధితురాళ్లకు తెలిసిన వారే కావడం గమనార్హం. ఏటా జరుగుతున్న వేలాది ఘటనల్లో ఎంతమందిని ఉరి తీస్తారనే ప్రశ్న తలెత్తుతోంది. ఇంత కఠినమైన శిక్షలతో క్షేత్రస్థాయిలో స్థితిగతులు అమాంతం మారిపోతాయా? మనం ఎన్ని చట్టాలను చూడలేదు. వాటి అమలు తీరు ఎలా ఉంటుందో తెలియదా? బహిరంగ ప్రదేశాల్లో పొగత్రాగడం నేరమనే విషయమే మరిచిపోయాం. దానిని పట్టించుకునే నాథుడు గానీ, యంత్రాగం గానీ లేనే లేదు. నిబంధనలు ఎన్ని ఉన్నా, సుపరిపాలన కొరవడటం వల్లే చట్టాలు చట్టుబండలైపోతున్నాయి. చట్టాలున్న అభద్రతే రాజ్యమేలుతోంది. నూతన శాసన నిర్మాణం కంటే ఘోర అఘాయిత్యాలను తెరదించే మానవీయ సమాజం రావాలి. బాల్యదశ నుండి నైతిక విలువలు, సామాజిక స్పృహ అలవడేలా విద్య నేర్పాలి. రాజ్యాంగంలోని 13వ అధికరణంలోని ప్రాథమిక హక్కులకే పరిమితం కాకుండా ఆదేశిక సూత్రాలు, ప్రాథమిక విధులు, బాధ్యతలను కూడా గుర్తెరగాల్సిన బాధ్యత ఈ స్వాతంత్య్రదినోత్సవం రోజున మరోమారు మననం చేసుకుందాం.

-బీవీ ప్రసాద్ 98499 98090