ఎడిట్ పేజీ

రాహుల్ ఎదిగితే.. మేం మునుగుతాం..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మోదీని ఓడించేందుకు బీజేపీయేతర పక్షాలు ఏకతాటిపైకి వస్తాయనుకోవడం ఎండమావి లాంటిదే. ఇటీవల లోక్‌సభలో అవిశ్వాస తీర్మానం సందర్భంగా విపక్ష పార్టీల డొల్లతనం బయటపడింది. వాటి బలహీనతలు బహిర్గతమయ్యాయి. సాధారణంగా అవిశ్వాస తీర్మానం వల్ల అధికార పార్టీ లొసుగులు బయటపడాల్సి ఉంది. మోదీ సర్కారును ఇరుకున పెట్టడంలో కాంగ్రెస్ సహా విపక్షాలన్నీ విఫలమయ్యాయి. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక ఉత్కంఠ భరితంగా జరిగినా, ఎన్డీఏ అభ్యర్థి గెలుపొందారు. ఇక్కడ కూడా మోదీ ఎత్తుగడల ముందు విపక్షాలు చిత్తయ్యాయి. పార్లమెంటు ఉభయ సభల్లో నెల రోజుల వ్యవధిలో చోటుచేసుకున్న ఈ పరిణామాలే వచ్చే ఎన్నికల్లో పునరావృతం కావు. ప్రజల ‘మూడ్’ అతి వేగంగా మారుతుంటుంది.
లోక్‌సభ ఎన్నికలు వచ్చే ఏప్రిల్, మే నెలల్లో జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే అన్ని పార్టీలకూ ఎన్నికల జ్వరం పట్టుకుంది. ఎన్నికల్లో బీజేపీని ఓడించడం కంటే మోదీ ప్రభుత్వాన్ని ప్రజలు తిరస్కరించేలా బీజేపీయేతర పార్టీలు వ్యూహరచన చేస్తున్నాయి. ఈ వ్యూహరచన ఇంకా తొలిదశలోనే ఉంది. బీజేపీని వ్యతిరేకించే సమాజ్‌వాదీ, బహుజన సమాజ్, తృణమూల్ కాంగ్రెస్ పార్టీల ధోరణి విచిత్రంగా కనపడుతోంది. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రతిష్ఠ పెరిగితే తమ ఉనికికి దెబ్బ తగులుతుందనే భయం ఈ పార్టీలను వెంటాడుతోంది. ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ, బీఎస్పీలు కాంగ్రెస్‌ను దూరంగా పెట్టి మెజారిటీ ఎంపీ స్థానాల్లో పోటీ చేయాలని భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ తరహా పొత్తుల వల్ల కాంగ్రెస్ పార్టీకి వచ్చే నష్టం కన్నా, బీజేపీకి ఎక్కువ లాభం చేకూరుతుందని యూపీ పీసీసీ మాజీ అధ్యక్షుడు సల్మాన్ ఖుర్షీద్ అన్నారు. బీజేపీని ఓడించాలంటే తప్పనిసరిగా కాంగ్రెస్‌ను పొత్తులో భాగస్వామిని చేయాల్సిందేనని ఆయన చెప్పిన మాట నిజం. కాంగ్రెస్‌కుకు ఓ పది సీట్లు ఇస్తే- అది గెలవని పక్షంలో బీజేపీ నెగ్గే అవకాశం ఉంటుందని ఎస్పీ, బిఎస్పీలు భయపడుతున్నాయి. యూపీలో కాంగ్రెస్ సొంతంగా గెలిచే సీట్లు రెండే రెండు ఉన్నాయి. అవి అమేథీ, రాయబరేలి స్థానాలు. కాంగ్రెస్‌కు 10 శాతం ఓటు బ్యాంకు ఉంది. బీఎస్పీ,ఎస్పీలు కాంగ్రెస్‌ను దూరంగా పెట్టి, 80 సీట్లలో రెండు పార్టీలూ పోటీ చేసి కనీసం 60 వరకు సీట్లు కైవసం చేసుకోవాలని భావిస్తున్నాయి.
కాగా, కాంగ్రెస్ లేని బీజేపీ వ్యతిరేక కూటమి విఫల ప్రయోగమే అవుతుంది. ఎవరు అవునన్నా కాదన్నా బీజేపీని ఓడించేందుకు ప్రాంతీయ పార్టీలు మాత్రమే చేతులు కలిపితే ప్రయోజనం శూన్యం. కాంగ్రెస్ సారథ్యంలో కూటమి ఏర్పడినా బీజేపీని ఓడించడం అంత సులువుకాదు. ఈ పరిస్థితుల్లో యూపీలో తాజా పరిణామాలు- బీజేపీని అధికారం నుంచి తొలగించాలన్న శక్తులకు నిరాశ కలిగిస్తున్నాయి. ఎస్పీ, బీఎస్పీ పార్టీలు సొంతంగా గెలుచుకునే సీట్లు యూపీలోనే ఎక్కువగా ఉన్నాయి. బిహార్‌లో ఆర్జేడీ, కాంగ్రెస్‌ల మధ్య పొత్తు ఖరారవుతుంది. బిహార్ సీఎం నితీశ్ కుమార్ సారథ్యంలోని జేడీయూకు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవిని ఇవ్వడం ద్వారా ఆ రాష్ట్రంలో బీజేపీ తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది.
తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇటీవల కొన్ని అనాలోచిత ప్రకటనలు చేసి ‘సెల్ఫ్‌గోల్’ చేసుకుంటున్నారు. అస్సాంలో ‘జాతీయ పౌర రిజిస్టర్’ (ఎన్‌ఆర్‌సీ) రూపకల్పన ఫలితంగా అంతర్యుద్ధం తప్పదని ఆమె అన్నారు. ఆ తర్వాత ఆకస్మికంగా వౌనం దాల్చారు. ఎన్‌ఆర్‌సీ పట్ల మమత ధోరణిని కాంగ్రెస్ విభేదిస్తోంది. బెంగాల్‌లో కాంగ్రెస్, వామపక్ష పార్టీలతో పొత్తుకు మమత సిద్ధంగా లేరు. బెంగాల్‌లోని మొత్తం 42 లోక్‌సభ సీట్లను తృణమూల్ గెలిచినా, బీజేపీ వ్యతిరేక కూటమి నుంచి ప్రధాని అభ్యర్థిత్వానికి మమతను అంగీకరించడం సాధ్యం కాదు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, తెలంగాణ, కేరళ, ఒడిశా, అస్సాం, గుజరాత్ తదితర రాష్ట్రాల్లో కాంగ్రెస్ సొంతంగా పోటీ చేస్తుంది. మధ్యప్రదేశ్, పంజాబ్ తదితర రాష్ట్రాల్లో తనకు పట్టు ఉన్నందున ఒకటి, రెండు సీట్లు మాత్రమే బీఎస్పీకి ఇచ్చేందుకు కాంగ్రెస్ సుముఖత చూపుతుంది.
ఈ ఏడాది చోటు చేసుకున్న కొత్త రాజకీయ పరిణామం రాహుల్ గాంధీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ తన వేగాన్ని పెంచారు. ఆయన ఉపన్యాసాల తీవ్రత పెరిగింది. వాక్చాతుర్యాన్ని సైతం మెరుగుపరుచుకున్నారు. దూకుడు పెంచారు. తాను రాజకీయంగా నిలదొక్కుకుంటున్నాననే నమ్మకాన్ని ఆ పార్టీ కేడర్‌కు రాహుల్ కలిగించారు. ఒక జాతీయ పార్టీలో మంచి నాయకుడు తయారవుతున్నాడంటే- కాంగ్రెస్‌ను వ్యతిరేకించే ప్రజలకు కూడా ఆనందం కలిగిస్తుంది. బీజేపీకి మోదీతో పాటు అనేక మంది సమర్ధత ఉన్న నాయకులున్నారు. మోదీ ప్రజాకర్షణ ఇంకా తగ్గలేదు. జనానికి మోజు తగ్గితే పల్లకీని మోయరు. మోదీకి దీటుగా కాకపోయినా ఆశాజనకమైన నేతగా రాహుల్ ఎదుగుతున్నారు. ఆయన నాయకత్వం బలపడితే తమ ఉనికికి ప్రమాదమని కొన్ని ప్రాంతీయ పార్టీలు భావిస్తున్నాయి. అందుకే ఉత్తర భారతంలో ఎస్పీ, బీఎస్పీలు కాంగ్రెస్‌ను కలుపుకోవడానికి, రాహుల్ నాయకత్వంలో పనిచేసేందుకు వెనకాడుతున్నాయి.
బీజేపీని వ్యతిరేకించే పార్టీలకు రాహుల్ ఇటీవల పెద్ద ఆఫర్ ప్రకటించారు. ‘మీరు కూటమిని ఏర్పాటు చేయండి. కాంగ్రెస్ చేరుతుంది. అందరం కలసి పనిచేద్దాం. మోదీ ప్రభుత్వాన్ని సాగనంపుదాం. ప్రధాని అభ్యర్థి ఎవరన్నది ఎన్నికల తర్వాత చర్చిద్దాం’ అని ఆయన అంటున్నారు. కానీ రాహుల్ సవాల్‌ను స్వీకరించే స్థితిలో బీజేపీ వ్యతిరేక పక్షాలు లేవు. కర్నాటకలో తనకు ఎక్కువ సీట్లు వచ్చినా, 38 సీట్లున్న జేడీఎస్‌కు కాంగ్రెస్ మద్దతు ఇవ్వడానికి కారణమేంటి? ముందు చూపుతోనే కాంగ్రెస్ వ్యవహరించింది. కర్నాటక ప్రయోగం ద్వారా తమకు పదవుల కంటే బీజేపీని అధికారంలోకి రానివ్వకుండా ఉండడమే లక్ష్యమని ఆచరణలో చూపింది. అయితే, కర్నాటక రాజకీయాలకు, ఉత్తర భారత రాజకీయాలకు చాలా తేడా ఉంటుంది.
తెలంగాణ సీఎం, టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు రాజనీతిజ్ఞతతో వ్యవహరించి ఫెడరల్ ఫ్రంట్ ప్రతిపాదనను ప్రస్తుతానికి అటకెక్కించి, వచ్చే ఎన్నికల్లో మళ్లీ అధికారంలోకి రావాలనే ఆలోచనలకు పరిమితమయ్యారు. ఓటర్ల నాడి ఎలా ఉంటుందో తెలియదు. ఎప్పటికైనా టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీనే. రాహుల్ బలపడుతున్న తరుణంలో దాని ప్రభావం వెంటనే పడే రాష్ట్రాల్లో తెలంగాణ మొదటి స్థానంలో ఉంటుంది. మాయావతి, ములాయం సింగ్, మమతా బెనర్జీ, నవీన్ పట్నాయక్, శరద్ పవార్ లాంటి నేతలు ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో ఊహించడం కష్టం. ఫెడరల్ ఫ్రంట్ ప్రయోగంతో- వీరి తోక పట్టుకుని ఈదితే.. ‘గోదావరి ఈత, లంక మేత’లా తయారవుతుందని కేసీఆర్ గ్రహించి ఉంటారు.
ఇక ఆంధ్రాలోనూ కాంగ్రెస్ పుంజుకుంటుందని రాహు ల్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో వైకాపా అధికారంలోకి రాకపోతే, 2024 ఎన్నికల నాటికి కాంగ్రెస్ మళ్లీ బలపడుతుంది. బీజేపీకి దూరమైన టీడీపీ గురించి రాహుల్ ఏమీ మాట్లాడడం లేదు. దేశ రాజకీయాల్లో ఎన్నికల పొత్తుల, ఎత్తుగడల ఆట మొదలైంది. ఈ ఆటలో కాంగ్రెస్‌కు పెద్ద పీట వేయకపోతే, విపక్ష పార్టీలు ఏకతాటిపైకి రాలేవు. ఒక వేళ వచ్చినా, ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రావు. బీజేపీ తాను బలపడే క్రమంలో గత రెండు దశాబ్దాల్లో ప్రాంతీయ పార్టీలను మింగలేదు. అదే బీజేపీకి ప్లస్ పాయింట్. కాంగ్రెస్ ఈ రోజు చతికిలపడినట్లు అనిపించవచ్చు. దేశంలో చోటుచేసుకుంటున్న రాజకీయ మార్పులు చూస్తే కాంగ్రెస్‌కు ఇప్పటికిప్పుడు కాకపోయినా, 2024 నాటికి సొంతంగా పోటీ చేసి 250కి పైబడి ఎంపీ సీట్లు తెచ్చుకునే అవకాశం ఉంది.
కాంగ్రెస్ బలపడితే ప్రాంతీయ పార్టీలకు చోటు ఉంటుందనుకోవడం భ్రమ. కాంగ్రెస్ వ్యతిరేకతతో పుట్టిన ఎస్పీ, బీఎస్పీ, తృణమూల్, టీడీపీ, జేడీఎస్, జేడీయూ, ఎన్సీపీ పార్టీలు కాంగ్రెస్ పునరుజ్జీవనాన్ని సహించలేవు. రాహుల్ తిరుగులేని నేతగా ఎదిగితే, ఈ పార్టీలు అనివార్యంగా బలహీనపడతాయి. శత్రువుకు శత్రువు తన మిత్రుడు అన్నట్లుగా చంద్రబాబు ఈ రోజు కాంగ్రెస్ పట్ల మెతకధోరణితో ఉన్నారు. కాంగ్రెస్‌తో పరోక్ష, ప్రత్యక్ష సంబంధాలు టీడీపీకి కలిసి వచ్చే అంశం కాదు. రాజకీయ చతురుడైన చంద్రబాబు ఈ విషయంలో ఎటూ జాగ్రత్తపడతారు. టీఆర్‌ఎస్‌కు కాంగ్రెస్‌తో బద్ధవైరం 2014 తర్వాత తలెత్తింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు టీఆర్‌ఎస్‌కు కాంగ్రెస్ శత్రువు కాదు. కాంగ్రెస్‌లో టీఆర్‌ఎస్ విలీనమవుతుందనే ప్రచారం జరిగింది. రాజకీయంగా ఎదగాలనుకునేవారు, అధికారాన్ని నిలబెట్టుకోవాలన్నా- ముందుగా తమ శత్రువులు ఎవరో గుర్తించాలి. ఈ విషయంలో కేసీఆర్ ముందున్నారు. అనేక రకాల ప్రయోగాలు, చర్చలు, మేధోమథనం చేసిన తర్వాత కేసీఆర్ తెలంగాణలో తనకు రాజకీయ ప్రత్యర్థి కాంగ్రెస్ మాత్రమేననే నిర్ణయానికి వచ్చారు. దేశ రాజకీయాల్లో ప్రధానపాత్ర పోషించాలంటే బీజేపీ లేదా కాంగ్రెస్ పార్టీల సారథ్యంలో ఏదో కూటమిని ఎంపిక చేసుకోవాల్సిందే. ఈ రెండూ కాదనుకుంటే మధ్యే మార్గంగా ఒడిశా సీఎం, బీజేడీ అధినేత నవీన్ పట్నాయక్‌లా, తమిళనాడులోని ద్రవిడ పార్టీల్లా వ్యవహరించాలి.

-కె.విజయ శైలేంద్ర 98499 98097