మెయిన్ ఫీచర్

ముక్తి ప్రదాత కాశీవిశే్వశ్వరుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాశీ విశాలాక్షి అన్నపూర్ణ అనే నామాలతో విశ్వనాధస్వామి సహచర్యంతో నిత్యం జ్ఞానాన్ని, అన్నప్రసాదాన్ని భక్తులకు అందించే జగన్మాత దర్శనం అలౌకిక ఆనంద ఆధ్యాత్మిక వరం అని భక్తుల ప్రగాఢ విశ్వాసం. పరమేశ్వరుడు కాశీ నగరాన్ని దర్శించి రమ్మని యోగులను పంపారని, కాశీనగర శోభకు వారందరూ అక్కడే ఉండిపోయారని, ఆ తరువాత బ్రహ్మ, గణపతిని పంపగా కాశీపుర సుందర మనోహర ఆధ్యాత్మిక శోభకు వారు కూడా అక్కడే ఉండిపోయారని తెలుసుకొని వారినందరిని పిలుచుకురమ్మని విష్ణుమూర్తిని పంపిస్తే, ఆయన కాశీనగరంలో శివలింగ ప్రతిష్ఠ చేసి అర్చనలు చేయిస్తూ ఉండిపోయాడు. అంతటి మహత్మ్యం వున్న కాశీ క్షేత్ర దర్శనంతో కైలాసంలోని పార్వతీ పరమేశ్వరులను దర్శించినంత ఫలం దక్కుతుందని పురాణాలు చెప్తున్నాయి.
ఎందుకంటే కాశీనగరానికి వెళ్లిన దేవతలందరూ అక్కడ స్థిరపడిపోతున్నారని తెలిసి శివుడు కూడా కాశీనగరానికి బయలుదేరాడు. అంతకుమునుపే కాశీలో గిరిజాదేవిగా ఉన్న ఆదిపరాశక్తి శివుని రాకను గమనించి విశాలమైన నేత్రాలతో ఆనందంతో ఎదురుచూడసాగింది. అందుకే ఆనాటినుండి ఆమెను కాశీ విశాలాక్షిగా దేవతలు స్తుతించారు. ఒకానొక సందర్భంలో పార్వతీదేవి శివుని కళ్ళను తన చేతులతో మూసేసింది. సూర్యచంద్రులు శివుని కళ్లుగా ప్రకాశిస్తున్నందువలన పార్వతీదేవి ఆ కనులు మూసివెయ్యడంతో జగత్ మొత్తం చీకట్లు కమ్ముకొని లోకం చీకటిమయమైంది. ఎంతటివారికైనా తప్పులకు శిక్ష తప్పదన్నట్లు లోకాలు చీకటి కావడంతో పార్వతీ దేవి శరీరం నల్లగా మారిపోయి కాళికాదేవిగా మారిపోయింది. చేసిన పొరపాటుకు ప్రాయశ్చితంగా కాశీపుర వాసులకు నిత్యం అన్నదానం చేస్తూ కాలక్రమేణా కాశిపుర వాసులచే అన్నపూర్ణగా కొలబడింది.
కాశీనగరం మహాపుణ్యక్షేత్రం. ఎందుకంటే కాశీలో అత్యధిక దేవాలయాలు వుండటమే కాకుండా విశ్వనాధుని ఆలయానికి సమీపంలోనే అన్నపూర్ణ, విశాలాక్షి ఆలయాలున్నాయి. ఈ నగరానికి ఇరువైపులా వరుణ అనే నదితోపాటు అసి అనే నది కూడా ప్రవహిస్తోంది. ఈ కారణంగా కాశీని వారణాసి అని కూడా పిలుస్తుంటారు. కాశీ విశ్వనాధుని స్మరణతో కైలాస దర్శన ప్రాప్తి కలుగడమే కాకుండా చేసిన పాపాలు నశించి జ్ఞానోదయమవుతుందని ఒకానొక గ్రంథంలో భృగమహర్షి చెప్పినట్లుగా పేర్కొన్నారు. కాశీకి దక్షిణ భాగంలో ఆసియాలోకెల్లా అతి పెద్ద విశ్వవిద్యాలయం బెనారస్ విద్యాలయంతోపాటు కాశీ విద్యాపీఠం, సంస్కృత విశ్వవిద్యాలయం వున్నాయి. మూడువేల సంవత్సరాల చరిత్రవున్న కాశీనగరంలో ప్రవహిస్తున్న గంగానదికి హరిశ్చంద్రా ఘాట్, ఆనందమాయ ఘాట్‌లలో ప్రధానంగా భక్తులు స్నానం చేస్తుంటారు. కాశీపురాన్ని అష్ట్భైరవ మూర్తులు కాపలా కాస్తుంటారు.
వీరిలో కాలభైరవస్వామి ఆలయం ప్రధానంగా భక్తులు దర్శిస్తుంటారు. గంగానదికి అవతల వైపున వ్యాసముని తపస్సు చేసాడు. అందుకే ఆ ప్రాంతాన్ని వ్యాసకాశిగా పిలుస్తూంటారు. యజుర్వేదం ప్రకారం ప్రపంచమంతా పరాశక్తి వ్యాపించి వుంది. ఈ శక్తికి ప్రతీక శివుడు. అందుకే ఆ ఇద్దరి కలయిక అర్థనారీశ్వరం. అందుకే ఈ శక్తులను విడతీయుట అసాధ్యం. ఎక్కడ శక్తిపీఠం వుంటుందో అక్కడ మహోన్నత శక్తి కలిగిన లింగ రూపంలో పరమేశ్వరుడు వుంటాడు. జగత్‌కు జన్మదాత ప్రకృతి. ఈ ప్రకృతి స్వరూపమే జగన్మాత. ఈమెలో ఇమిడి వున్నాయి లక్ష్మీ, సరస్వతులు. అందుకే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అంటూ జగన్మాతను పూజిస్తాము. శివుని తలపైనుండి భూమిపై ప్రవహిస్తున్న గంగమ్మ నెలకొన్న కాశీ పట్టణంలో అన్నపూర్ణ, విశాలక్షి సమేత విశ్వనాధ స్వామి దర్శనం చేసుకుంటే సకల పాపాలు నశించి స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. కాశీ కాశీ కాశీ అని మూడు సార్లు స్మరించినా సరే మహాశివుడు మహాపుణ్యాన్ని ప్రసాదిస్తాడు. ఇహపరసుఖాలనిచ్చి అంత్యంలో శివసాయుజ్యాన్ని ఇస్తాడు.

మురళీధర్