మెయిన్ ఫీచర్

నిండు నూరేళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతా క్షేమమేనా! మొన్ననే నేను నా పుట్ట్టినరోజు. జరుపుకున్నాను. చాక్లెట్లు, బిస్కెట్లు పంచిపెట్టే వయస్సు ఎప్పుడో దాటిపోయిందిలెండి. నాది చాలా పెద్ద కుటుంబం, నా పుట్టినరోజు వేడుక ప్రతి ఇంట్లో జరుపుకుంటారు. నేనంటే అందరికీ అంత ఇష్టం, భక్తి. నాకిప్పుడు డెబ్భై ఒక్క ఏళ్ళు. ఎంతోమంది పెద్దల త్యాగఫలం వలన నేను ఊపిరి పోసుకున్నాను. నేను బతికి బట్టకట్టడానికి ఓ తల్లికాదు, ఎంతోమంది తల్లులు ప్రాణత్యాగం చేసేరు. నే చాన్నాళ్ళు అల్లారు ముద్దుగా పెరిగాను. నిజానికి నా ఉనికి ఎప్పటిదో కానీ, నియంతల పాలనలో ఉండిపోవడంవలన ఎవరూ నన్ను గుర్తించలేదు. ఎన్నో కష్టనష్టాలకోర్చి, అనేక త్యాగాలు చేసి, మహాత్ములు, మహామహులు నా పుట్టుకకు కారణమయ్యారు. డెబ్భై ఏళ్ళలో నా సంసారం ఎంతో పెరిగింది. పిల్లలు, మనుమలు, మునుమనులు - ఇలా పెరుగుతూనే ఉంది. తరాలు పెరుగుతున్నకొద్దీ నా ఆనందం అంతకంతకూ పెరుగుతూనే వుంది.
‘దీర్ఘాయుష్మాన్ భవ!’ అని దీవించబోతారేమో, ఓ క్షణం ఆగండి. నాకేం నిండు నూరేళ్ళ జీవితం వద్దు. ఇదేమిటి, ఓ నిమిషం ముందు నా కుటుంబం అంత పెద్దది, ఎంత విస్తరిస్తే అంత అమితానందం అన్న ఈ మనిషే ఇలా మాట్లాడుతోందనుకుంటున్నారా? మీరు విన్నది నిజమే, నా వయస్సు డెబ్భై ఏళ్ళే. కానీ నే చాలా పూర్వం నించి ఉన్నదానే్న. కానీ ఏనాడూ నాకిలా అనిపించలేదు. ఈమధ్యకాలంలో నా చుట్టూ జరుగుతున్న ఘోరాలను చూస్తూ ఉండలేకపోతున్నాను. ఎన్నని భరించగలను. ఓర్పుకి మారుపేరు నేను, కానీ నా సహనాన్ని కూడా పరీక్షించే రోజులు నడుస్తున్నాయిపుడు. నామీద ఎంత బాధ్యత పెరిగితే ఎన్ని జననాలు పెరిగితే అంత కడుపునిండేది నాకు. కానీ ఇపుడో, బ్రహ్మంగారు చెప్పినట్టు ఈ ప్రపంచం ఎపుడు అంతరించిపోతుందా అని ఎదురుచూసేలా ఉంది. మరలా రాతియుగం ప్రారంభమయితే ఎంత బావుంటుందో అనిపిస్తోంది.
ఒకప్పుడు బ్రిటీష్ వారి పాలనలో నా పిల్లలని పశువులకంటే హీనంగా చూసేవారు, ఎన్నో అవమానాలు చేసేవారు, హత్యలు, దోపిడీలు, అసమానత, బలత్కారాలు- ఇలా అనేక దుశ్చర్యలు జరుగుతూండేవి. వీటిని సహించలేక ‘మహాత్మాగాంధీ’ లాంటి మహోద్యమకారులు అహర్నిశలు శ్రమించి, కేవలం అహింసే ఆయుధంగా పోరాడి నియంతల నుంచి విముక్తుల్ని చేసేరు. ఏం లాభం, స్వాతంత్య్రం సాధించింది ఎందుకా అని బాధేస్తోంది నాకు. పైనించి చూస్తూ మహాత్ముడు కూడా అదే అనుకుంటున్నాడేమో. ఇంకెక్కడ పైనా, ఈపాటికి మరోజన్మత్తే ఉంటాడు అనకండి. కచ్చితంగా కిందకు పంపద్దని దేవుడిని వేడుకునుంటాడు. మనుషులే పశువుల కంటే హీనంగా మారుతున్న రోజులివి. తమతో పోలిస్తే అవమానమని పశువు కూడా భావిస్తుందేమో, అలా ఉన్నాయి రోజులిపుడు.
‘స్వాతంత్య్ర దిన శుభాకాంక్షలు’ అని తాటికాయంత అక్షరాలతో దినపత్రికలు వస్తాయి నా పుట్టిన రోజున. అబ్బా! ఎంత బావుందో అని ఆ మువ్వనె్నల జెండాను చూసి మురిసిపోయేంతలోపే ఓ పక్క బలవన్మరణం, మరోపక్క అజాగ్రత్త వలన యాక్సిడెంట్, ఇంకొకవైపు ముఠా హత్యలు, ఇంకోమూల బలాత్కారం- ఇవే వార్తలు. ఇంకెక్కడ ముచ్చటైన మూడు రంగులు, కళ్ళముందు ఎర్రటి రక్తం ఏరులై పారుతుంటే. నేను సంతోషించిన రోజులు లేకపోలేదు, గర్వపడిన క్షణాలూ లేకపోలేదు. నా పిల్లలు ఎంతోమంది దేశ విదేశాల్లో నా ఖ్యాతిని చాటి చెప్పారు, చెప్తున్నారు కూడా. సమాజానికి సందేశాన్నిస్తూ సామాజిక స్పృహను పెంచే సినిమాలు, క్రీడలు, సాంకేతిక విజ్ఞానం, కొత్త కొత్త ఉపగ్రహాల ఆవిష్కరణ- ఇలా చాలా రంగాల్లో అద్భుతంగా రాణిస్తున్నారు. రాజకీయాల్లో మహిళలు ఉన్నత పదవుల్లో వుంటూ దేశాభివృద్ధిలో ముఖ్య భూమిక పోషిస్తున్నారు. దివ్యాంగులు తమ లోపాన్ని అధిగమిస్తూ క్రీడల్లో ముందుంటున్నారు. ఆమ్ల దాడులకు గురైన అమ్మాయిలు అందాల పోటీలలో పాల్గొంటూ సాటి మహిళలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇటువంటివి చదువుతూంటే గర్వంగానే కాదు, నూరేళ్ళు కాదు, ఇటువంటి తరాలను పెంచుకుంటూ ఎనే్నళ్ళైనా జీవించాలనిపిస్తుంటుంది, ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలనిపిస్తుంది.
ఇంటిని చూసి ఇల్లాలిని చూడాలంటారు, మనకందరకు తెలియని నానుడి కాదిది. మరింత పెద్ద ఇంటికి పెద్దనైన నాకు మంచిపేరు రావాలంటే నా ఇల్లు అద్దంలా ఉండాలి కదా. కానీ ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. ప్రతి ఒక్కరూ తాము నివశిస్తున్న ప్రదేశం శుభ్రంగా ఉంటే చాలనుకునేవారే. వీధివరకెందుకు, తమ ఇంటి గేటవతల ఎలా ఉన్నా కూడా వారికి అనవసరం. ఒకప్పుడు ప్రపంచంలో గల ఏడు వింతల్లో ఒకటిగా విరాజిల్లిన, మనను యావత్ ప్రపంచం కొనియాడేలా నిర్మించబడిన అద్భుత కట్టడమైన తాజ్‌మహల్‌కు, ప్రక్కన అతి సుందరమైన యమునా నదికే దిక్కులేదు- చెత్తా చెదారం కాలుష్యం నుంచి తమను తాము కాపాడుకోవడానికి. ఇక వీధి, ఊరు, రాష్ట్రం వీటినెవరు పట్టించుకుంటారు. ‘స్వచ్ఛ్భారత్’ అని పదే పదే వినిపిస్తున్నా సరే, ‘చెవిటివాడి ముందు శంఖం ఊదినట్టే’ బతుకుతున్నారు అనేకచోట్ల జనం. ఆరోగ్యమే మహాభాగ్యం అని తమ పిల్లలకు బోధించుకుని, తమ పిల్లలు మాత్రం ఆరోగ్యంగా ఉంటే చాలనుకోకుండా పరిసరాలను పరిశుభ్రంగా ప్రతి ఒక్కరూ ఉంచితే, ప్రత్యేకంగా స్వచ్ఛ్భారత్ అని కార్యక్రమాలు పెట్టాల్సిన అవసరమే రాదు. పుట్టినరోజున నేను కూడా మీ అందరిలాగే దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. నా కుటుంబాన్ని చల్లగా చూడు, సద్బుద్ధినివ్వు, మానవ విలువలు పెంచు స్వామీ అని. దేవుడంటే గుర్తొచ్చింది, ఆయనను కూడా వదలట్లేదే జనం. మూఢ నమ్మకాలు, అసత్యపు ప్రచారాలు, అవివేకపు సూచనలు మనిషివి, పేరేమో ఏ అనె్నం పునె్నం ఎరుగని భగవంతుడిది. ముక్తి మార్గాలు, హోమాలు, పూజలు కూలంకషంగా తెలిసిన మనిషికి ఆత్మహత్య మహాపాపమని మూకుమ్మడి ఆత్మహత్యలని, ముక్తి మార్గమనీ అర్థంపర్థం లేకుండా.
మనిషిగా పుట్టడం అదృష్టమని వింటూ వచ్చాను. కానీ ప్రాణం విలువ ఇంత చౌక అయిపోయిందా అనిపిస్తోంది. ‘‘నీ ప్రాణం నువ్వు తీసుకో, నీ ఖర్మ అనుకుంటాను, మదమెక్కో, మద్యం మత్తులోనో, లేక ప్రేమకు ప్రతిరూపమనో కన్నావే ముత్యాల్లాంటి పిల్లలను, వారిని చంపే హక్కు నీకెవరిచ్చారు, వారిని పోషించలేకపోవడం ఎవరి తప్పు, ఆడపిల్ల అయి పుట్టడం ఆ చిన్నారి చేసిన తప్పా’’ అని చిన్నారుల ప్రాణాలను అనేక కారణాలు చెప్పి అంతమొందిస్తున్న తల్లులను, తండ్రులను నిలదీసి, చెంప ఛెళ్ళుమనిపించాలనిపిస్తుంది. దీనికోసమా అంతమంది త్యాగమూర్తులు బ్రిటీష్ వారి చేతులలో బలయ్యారు. ఇదేనా దేశ స్వాతంత్య్రం మనిషికి తెచ్చిపెట్టిన దుస్వాతంత్య్రం. ఇంతకంటే ఆ నియంతల పాలనలో ఉండుంటే ఆ చిన్నారులు ఊపిరితో ఉండేవారేమో.
నాకొక సందేహం, సిగ్గుచేటు నిజంగా కాని అడుగుతున్నా, పుట్టినరోజున కొత్త బట్టలు కట్టుకోవాలని ఆశగా ఉంది, ఏం కట్టుకోమంటారు? డెబ్బై ఏళ్ళు నిండినా ఈ మాటలేమిటి అంటారా? ఏం చేయమంటారు, ఆ ఆడబిడ్డల, మనుమల పరిస్థితి చూస్తుంటే ఈ సందేహమే కలుగుతోంది. పశువుకంటే హీనమైన ఓ నీచుడు ఓ అమ్మాయిని బలాత్కరిస్తే, కురచ దుస్తులు వేసుకుని మగవారిని రెచ్చగొట్టేలా ఉంటున్నారని మాట్లాడేరు ఎవరో నాయకులు. పోనీ, నిజమే అనుకుందాం- మరి ఆరేళ్ళ పసిపాప వేసుకునే బట్టల్లో ఏం లోపముందని అన్యాయంగా జీవితాన్ని నాశనం చేస్తున్నారు? ఆడది అర్థరాత్రి ధైర్యంగా తిరిగినప్పుడే స్వాతంత్య్రం అన్నారు కానీ, ఆడపిల్ల ఏ మృగాడి చూపులు తనమీద పడుతున్నాయో అని బెరకుగా, గుండెలరచేతిలో పెట్టుకుని కాకుండా ధైర్యంగా, ఆనందంగా బయట తిరిగిన రోజు నిజమైన స్వాతంత్య్రం. ఒంటినిండా చీర కట్టుకున్నా, పైనించి కిందవరకు చర్మాన్ని కనపడనీయకుండా కప్పేసుకున్నా నీచులకు ఉచ్ఛం, నీచం, వావి, వరస తెలియట్లేదు. చిన్నా, పెద్దా తేడా లేదు. కనీసం అవయవాలు సరిగా లేని దివ్యాంగులన్న కనికరం కూడా లేదే. ఎవరికి చెప్పుకోవాలి ఈ గోడంతా! కోర్టులో కేసులు, ఈ నీచులకు శిక్షలు, ఎందుకు శిక్ష పడుతుందో కనీసం ఆ దోషికైనా గుర్తుంటుందో లేదో, అంత సమయం పడుతోంది మన న్యాయ వ్యవస్థ ‘పూర్వాపరాలు’ పరిశీలించి నిర్ణయం తీసుకునేసరికి.
మహాత్ముడు కలలుకన్న స్వతంత్ర భారతం ఇదేనా. చెడు వినకు, చెడు కనకు, చెడు మాట్లాడకు అన్నట్టు ఆ మూడు కోతుల్లా మిన్నకుండాలా లేక సత్యమేవ జయతే అంటూ అశోకచక్రంపైన గర్జిస్తూ నిలబడ్డ సింహాల్లా దోషులను అక్కడికక్కడే చీల్చి చెండాడాలా. మీరే ఆలోచించండి, ఏది న్యాయం. ఈ మాట వింటే మహాత్ముడు ఒకప్పుడైతే బాధపడేవాడేమో. అహింసో పరమో ఫర్మః అన్నాడు కదా. ఇప్పుడుంటే ఆయన కూడా చేతికి పని చెప్పేవాడు. ఇన్ని ఘోరాలు జరుగుతుంటే రాజకీయ నాయకులు ఏమీ చేయలేకపోతున్నారెందుకు, లేక చేస్తున్నారా? అర్థంకావట్లేదు. ‘‘స్వాతంత్య్రం వచ్చెనని సభలే చేసి సంబరపడగానే సరిపోదోయి’’ అన్నాడు మహాకవి శ్రీశ్రీ. మన నాయకులకు ఈ మాట గుర్తుందో లేదో మరి. నా బిడ్డలిలా తల్లడిల్లిపోతుంటే నే పుట్టిన రోజులెలా జరుపుకోగలను. జెండా వందనానికని ఎగరేసిన మువ్వనె్నల జండా ఉల్లాసంగా గాలిలో ఎగరగలదా?
నాకు మల్లెపూదండలు అక్కర్లేదు, మంగళారతులు అంతకంటే వద్దు. నా కుటుంబాన్ని కాపాడుకోవాలి, నా బిడ్డల మాన ప్రాణాలను భద్రంగా చూసుకోవాలి. ఆడ, మగ, పిల్ల, పెద్ద అంతా విజయపథాన దూసుకెళ్లాలి. కొందరినే కాదు ప్రతి ఒక్క పౌరుడినీ చూసి గర్వపడాలి. కళకళలాడుతూ, పరిశుభ్రంగా ఉన్న విను వీధుల్లో ఆటపాటలతో సందడి చేస్తుంటే నా కుటుంబాన్ని చూస్తూ ఆనంద బాష్పాలతో నా కళ్ళు మసకబారాలి. సంతోషం పట్టలేక నా గుండె బరువెక్కిపోవాలి. ఇదొక్కటే ఈ ‘భారతమ్మ’ కోరుకునేది. పుట్టినరోజున నాకు కావలసిన ఆశీర్వాదం ఇదే. ఇదే జరిగితే డెబ్భై ఏమిటి, నా సంసారాన్ని పెంచుకుంటూ పోతా ‘నిండు నూరేళ్ళు’.
కోరిక నెరవేరుతుందని ఆశిస్తూ సెలవిక,
భారతి

-కౌముది ఎం.న్.కె.