మెయిన్ ఫీచర్

పిల్లల్లో కోపం పెరుగుతోందా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆటపాటల విషయంలోనో, చదువుల విషయంలోనో, మరింకో విషయంలోనో పిల్లల్లో గొడవలు మామూలే! కానీ ఇటీవల కొంతమంది పిల్లల్లో హింసాప్రవృత్తి పెరుగుతోంది. ఇలా ఎందుకు జరుగుతోంది అని ఆరా తీస్తే.. పిల్లల్లో కోపం తెచ్చుకునే స్వభావం వాళ్ల వయసుపై, పరిసరాలపై ఆధారపడి ఉంటుందని తేలింది. 2014లో ఇండియన్ జర్నల్ ఆఫ్ సైకలాజికల్ మెడిసిన్‌లో ప్రచురించిన ఒక పరిశోధన పత్రం ఆధారంగా బాలికలకన్నా బాలల్లో కోపం ఎక్కువగా ఉంటుందట. ఈ పరిశోధన దేశంలోని ఆరు ప్రధాన ప్రాంతాల్లో మొత్తం 5,467 మంది టీనేజ్, యవ్వన ప్రాయంలోని వారిపై చేపట్టారు. వీరిలో పదహారు నుంచి పందొమ్మిది ఏళ్ల మధ్య వయసున్నవారిలో ఎక్కువ కోపం కనిపించగా, ఇరవై నుంచి ఇరవై ఆరు ఏళ్ల మధ్య వయసున్న వారిలో తక్కువ కోపం కనిపించింది. దీనిని బట్టి యవ్వన ప్రాయంలో కన్నా టీనేజ్‌లోనే ఎక్కువ కోపం ఉన్నట్లు గుర్తించారు. అదే సమయంలో బాలికలతో పోలిస్తే, బాలురలో కోపం ఎక్కువగా ఉంటుంది. ఈ పరిశోధనలో పనె్నండు నుంచి పదిహేడేళ్ల వయసు బాలికల్లో పందొమ్మిది శాతం మంది పాఠశాలలో ఏదో ఒక వివాదంలో చిక్కుకున్నారని తేలింది.
ప్రపంచంలో పది నుంచి పందొమ్మిదేళ్ళ వయసున్న 120 కోట్లమంది టీనేజర్లు ఉన్నారని యునిసెఫ్ నివేదిక వెల్లడిస్తోంది. భారతదేశం విషయానికి వస్తే, 2011 జనాభా లెక్కల ప్రకారం టీనేజర్ల సంఖ్య 24 కోట్లు. ఇది భారతదేశ జనాభాలో పాతిక శాతం. ప్రపంచంలో ఎక్కువ శాతం టీనేజర్లు అభివృద్ధి చెందుతున్న దేశాలలోనే ఉన్నారని ఈ నివేదిక చెబుతోంది.
కారణాలు
పిల్లలపై తల్లిదండ్రులు ఎంత దృష్టి పెడుతున్నారో తెలుసుకోవడం ముఖ్యం అంటారు సైకాలజిస్టులు. పెద్ద పెద్ద పట్టణాలలో తల్లిదండ్రులు తమ పిల్లలపై పూర్తిగా దృష్టి పెట్టలేరు. ఏదో పని ఇవ్వడం అనే నెపంపై వాళ్లకు మొబైల్ ఫోన్లు ఇస్తున్నారు. అలాంటి సందర్భంలో పిల్లలు మొబైల్ ఫోన్లలో హింసాత్మక ధోరణి కలిగిన ఆటలు ఆడుతున్నారని సైకాలజిస్టుల, చైల్డ్ సైక్రియాట్రిస్టుల అభిప్రాయం. వీడియోగేమ్స్ పిల్లల మెదడుపై చెడు ప్రభావాన్ని చూపుతాయి. హింసాత్మక ప్రవృత్తి కలిగిన పిల్లలంతా రోజులో కనీసం మూడు, నాలుగు గంటలు వీడియో గేమ్స్ ఆడుతున్నారని తెలిసింది. ఈ ఆటల్లో ప్రత్యర్థిని అంతమొందించినప్పుడే మీరు గెలుస్తారు అని అర్థమొచ్చేలా ఆటలు ఉంటాయి. ఇలాంటి మొబైల్ గేమ్స్ పిల్లల మనస్తత్వాన్ని మెల్లగా మార్చేస్తాయి అని సైకాలజిస్టులు వివరిస్తున్నారు.
2010లో అమెరికా సుప్రీంకోర్టు హత్యలు, లైంగిక హింస ఉన్న వీడియో గేమ్స్ ఆడడాన్ని అనుమతించరాదని సూచించింది. దీనికి ఐదేళ్ల ముందే కాలిఫోర్నియా గవర్నర్ పద్దెనిమిది ఏళ్లలోపు పిల్లలు హింసాత్మక ప్రవృత్తి కలిగిన వీడియో గేమ్స్‌కు దూరంగా ఉండాలని సూచించారు.
అమెరికా సైకాలజీ సంస్థ కూడా వీడియో గేమ్స్ మానవ ప్రవృత్తిని మార్చడంలో చెప్పుకోదగిన పాత్ర పోషిస్తాయని పేర్కొంది.
ఒక్కసారి పిల్లల చేతికి మొబైల్ ఫోన్ అందితే.. అందులో యూట్యూబ్ వీడియోల నుంచి పోర్న్ దృశ్యాల వరకు అన్నీ అందుబాటులో ఉంటాయి. డెహ్రాడూన్‌కు చెందిన ఆస్వాల్ ఐదు సంవత్సరాల కుర్రాడు. మొదట్లో ఆస్వాల్ తనకు కావాల్సిన వీడియోలను చాలా సులభంగా మొబైల్లో తనే ఆన్ చేసుకుని చూసేవాడు. ఇలా ఆస్వాల్ మొబైల్‌తో బిజీగా ఉంటే ఆస్వాల్ తల్లి చాలా సంతోషించేది. కానీ క్రమక్రమంగా వాడు మొబైల్‌లో హింసాత్మకంగా కార్టూన్ చిత్రాలు చూడటం మొదలుపెట్టాడు. దాంతోపాటు అసభ్యకరమైన చిత్రాలు కూడా లింకులుగా రావడం ప్రారంభమైంది. వాటిని క్లిక్ చేస్తే ఏం జరుగుతుందో అని తల్లి ఒకటే భయపడి సైక్రియాట్రిస్టుల దగ్గరికి పరుగులు తీయడం మొదలుపెట్టింది.
1961లో అమెరికా మానసిక శాస్తవ్రేత్త ఆల్బర్ట్ బండురా ఒక ప్రయోగం చేశాడు. దానిలో ఆయన ఒక వ్యక్తి ఒక బొమ్మను చంపుతున్న దృశ్యాన్ని పిల్లలకు చూపించాడు. ఆ తర్వాత పిల్లలకు బొమ్మలు ఇచ్చినప్పుడు వాళ్లు కూడా తమ బొమ్మలను అదేరకంగా చంపడానికి ప్రయత్నించారు. దీన్ని బట్టి ఏం తెలుస్తుందంటే.. పిల్లలకు చిన్నప్పటి నుంచి ఏది అలవాటు చేస్తామో.. చుట్టూ ఉన్న పరిసరాల నుండి ఏం నేర్చుకుంటాడో దానే్న అమలు చేస్తాడు. అలా జరగకుండా చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులదీ, గురువులదీ, సమాజానిది కూడా.. కాబట్టి పిల్లలకు చిన్నప్పటి నుండీ ప్రేమ, ఆప్యాయతలతో ఆహ్లాదకరమైన వాతావరణంలో పెంచితే వారి పెరుగుదల అత్యుత్తమంగా ఉంటుంది.
పట్టణాలతో తల్లిదండ్రులు ఇద్దరూ ఉద్యోగం చేస్తున్న పిల్లలతో సమయం వెచ్చించడం కష్టమవుతుంది. దాంతో పిల్లలు డైవర్ట్ అయ్యి టీవీ, వీడియోగేమ్స్, యూట్యూబ్‌లను చూడటంలో బిజీగా గడుపుతారు. ఇదేకాదు తల్లిదండ్రుల మధ్య ఉన్న సంబంధం కూడా పిల్లలపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది. తల్లిదండ్రులు ఎప్పుడూ గొడవలు పడుతూ పిల్లలను ప్రేమగా, సరిగ్గా ప్రవర్తించమంటే వాళ్లు మాట వినరు. వారు కూడా ఇతరులతో కోపంగా, గొడవలు పడాలని చూస్తారు. వారిలో హింస పెరుగుతుంది. పిల్లలు తమకు నచ్చినట్లుగా, స్వతంత్రులుగా ఉండాలనుకుంటారు. అలా జరగనప్పుడు వారికి తీవ్రమైన కోపం వస్తుంది.
మార్పులు
మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్, తల్లిదండ్రులు ఇద్దరూ ఉద్యోగం చేయడం.. ఇవన్నీ ఆధునిక జీవితం పర్యవసానాలు. అయతే పిల్లల్లో హింసాప్రవృత్తికి మరో కోణం కూడా ఉంది. ఇంటర్నెట్, మొబైల్స్ లేని కాలంలో కూడా పిల్లల్లో హింస ఉంది. దీనికి కారణం పిల్లల్లో శారీరకంగా వచ్చే హార్మోన్ల తేడాలు. ఆ సమయంలో వాళ్ల శరీరావయవాలు, మెదడు కూడా చాలా వేగంగా అభివృద్ధి చెందుతుంది. పదకొండు నుంచి పదహారేళ్ల వయసును కిశోరప్రాయం అంటారు. ఈ సమయంలో పిల్లలు చాలా ఎమోషనల్‌గా, పెద్ద ఆలోచనలను చేస్తారు. తీవ్ర నిర్ణయాలు తీసుకుంటారు. అందుకే ఆ సమయంలో వారిలో కోపం, హింస ఎక్కువగా ఉంటుంది. పిల్లలు బడిలో తోటి పిల్లలతో గొడవపడుతుంటే, వాళ్లను తిడుతుంటే, చదువు శ్రద్ధ పెట్టకుండా ఉన్నా, టీవీలు, మొబైల్స్ ఎక్కువగా చూస్తుంటే.. పెద్దలు పిల్లలపై దృష్టి పెట్టాల్సిన సమయం వచ్చిందని అర్థం. వారికోసం ఎక్కువ సమయాన్ని కేటాయించాలి. పిల్లలతో చాలా సహనంగా వ్యవహరించాలి. అప్పుడప్పుడు పిల్లలతో పాటు బైటికి వెళ్లి వాళ్లతో రకరకాల ఆటలు ఆడించాలి. వాళ్లతో కబుర్లు చెప్పాలి. వాళ్లు చేసే ప్రతి పనిలో తప్పులు వెదకడం మానేయాలి. వారికోసం కాస్త సమయం వెచ్చించి వారేం చెబుతున్నారో, ఎలా మాట్లాడుతున్నారో గమనించాలి. వారికి ఏది చెప్పినా తిట్టి చెప్పకుండా మంచిగా, ప్రేమగా చెప్పాలి. ఎందుకంటే వాళ్ల వ్యక్తిత్వం రూపుదిద్దుకునే సమయం ఇదే.. ఇలా చిన్న చిన్న పద్ధతుల ద్వారా పిల్లల మనసుల్లో చోటు సంపాదించుకుని వారి కోపాన్ని తగ్గించవచ్చు.. వారి వ్యక్తిత్వాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దవచ్చు.

- మహేశ్వరి