మెయిన్ ఫీచర్

హైటెక్ చీకటి కోణం....

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమెరికాలో సెక్స్ రాకెట్ ఉదంతం గురించి ఇటీవల మీడియాలో వింటున్నాం. మన దిన పత్రికలు గాని, బుల్లితెరగాని నిజానిజాలు తెలుపవు. సెలబ్రెటీలు తప్పుచేసినా పూర్తి వివరాలతో బయటపెట్టవు. బుల్లితెర బతుకంతా సినీ రంగంపై ఆధారపడి మనుగడ సాగిస్తున్నది కనుక విషయాలు బహిర్గతం చేయదు. మన సినీ తారల ‘డ్రగ్ రాకెట్’ విషయం గాని, ‘శ్రీరెడ్డి’ సినీరంగ లైంగిక వేధింపుల గురించి గాని ఆరంభ శూరత్వంగా నాలుగు వార్తలు చెప్పడం, పిదప ఆ వూసే ఎత్తకుండా మరచిపోవడం మనకు తెలియంది కాదు. సామాన్యుల విషయాలైతే 24 గంటలు బ్రేకింగ్ న్యూస్ అంటూ బోర్ కొట్టిస్తుంటారు. శ్రీరెడ్డి ఆరోపణలో నిజముంది కాబట్టి అటు సినీ కళాకారులు, ఇటు ‘మా’వారు గాని ఖండించలేదు, ఎవరికివారు తేలుకుట్టిన దొంగల్లా మిన్నకుండిపోయారు. దాదాపు సినీ రంగంలో ‘చీకటి కోణం’లేదంటే ఎవరూ నమ్మరు, కాని పరువుకోసం, మర్యాద కోసం బయటపడకుండా ఉన్నారన్నది వాస్తవం. ‘నిప్పులేనిది పొగరాదన్న’ సామెత, ‘ఒక్క మెతుకుచూస్తే చాలు అన్నం వుడికిందో లేదో తెలిసుకోవచ్చు’ లాంటి సామెతలు మనం గుర్తుచేసుకోవాలి. అభిమాన నటీ, నటులు కాబట్టి ప్రేక్షకులు, అభిమానులు, సామాన్యులు నెగెటివ్‌గా ఆలోచించరు. బయటపడేవరకు అందరూ నిజాయితీపరులు, సచ్చీలురు, నీతిమంతులనుకోవలసిందే. ఎందరో నటీనటుల సహజీవనం గురించి, వివాహం వరకు వచ్చి బ్రేక్‌పడ్డ విషయాలు, వారివారి సన్నిహిత జీవితాలు పాఠకులకు తెలియందికాదు. ఇలాంటి విచిత్రాలు జరిగే సినీ రంగం.. అదీ కోట్ల రంగంలో చీకటికోణం తప్పక వుంటుంది, కాదనలేం. నాలుగు గోడల మధ్య రహస్యాలు అంతసులువుగా బయటపడవు. ‘సమ్మోహనం’ చిత్ర హీరోయిన్ ‘అదితిరావు హైదరి’సైతం తను ‘కాస్టింగ్ కౌచ్’ ఇబ్బంది ఎదుర్కొన్నట్లు ప్రకటించింది. ఆరేడు సంవత్సరముల క్రింద బెంగళూరులో స్టార్ హోటల్లో పోలీసుల రైడింగ్‌లో ‘సినీ నటి యమున’ పట్టుబడింది. అదీ వ్యభిచారం కేసులో. ఇదే జూలై మాసంలో ‘దీక్షాకాశ్య’ అనే బాలీవుడ్ నటి కూడా వ్యభిచారం చేస్తూ పోలీసులకు పట్టుబడింది. బుల్లితెర బయటపెట్టింది. క్యాస్టింగ్ కౌచ్‌లో నటి ‘శ్రీరెడ్డి’ చేసిన ఆరోపణలు నిజం కాదంటారా? చీకటి కోణం లేదంటారా? ఆమె చేసినవి ఆరోపణలు కాదు జరిగే తంతును బయటపెట్టింది. కోట్ల నోట్ల మాటున జరిగేది అదేనని నిర్భయంగా బయటపెట్టింది. ‘సంజు’ చిత్రం చూశాము. సంజయ్‌దత్‌కు దాదాపు 300 మంది పడతులతో శారీరక సంబంధం వున్నట్లు బయటపడింది, ఆ 300 మంది స్ర్తిలలో సినీ రంగ తారలు లేరనగలమా? అలా అనలేము. అంటే ‘శ్రీరెడ్డి’ ఆరోపణల్లో నిజం లేదంటామా? దొంగ కూడ దొరికేవరకు దొర, దొరికితేనే దొంగ. మనం ఈ కోణంలో సినీ రంగాన్ని గురించి గమనించాలి. తెరచాటు వ్యవహారాలు జరుగుచున్నవన్నది అక్షర సత్యం. కాని, మనం చాటుమాటు వ్యవహారాలను ఋజువు చేయజాలము. అది సెలబ్రిటీల ధైర్యం. పోతే ‘అమెరికాలో మన తారల సెక్స్ రాకెట్ విషయానికి వద్దాం. కిషన్-చంద్రకళ దంపతులు అమెరికా వెళ్లి విలాస వంతమైన జీవనం సాగిస్తున్నారు. వారికి వీసా సమయం ఏనాడో ముగిసిపోయింది. జాగ్రత్త పడుతూ మసలుకుంటున్నారు. వారికి ‘హైటెక్’ వ్యభిచారం లాభదాయకమనిపించింది. అమెరికాలో తెలుగు సాంస్కృతిక కార్యకలాపాలంటూ పేరుపెట్టి వ్యభిచారానికి తెర లేపారు. బ్రోకర్లను మన దేశం పంపించి, సినీ తారలు కలసి కోట్ల లక్షల ఆదాయం గురించి వివరించి, విమాన ఖర్చులు, స్టార్ హోటల్లో ఖర్చులు తామే చెల్లిస్తాం, అక్కడ వచ్చే ఆదాయంలో (వ్యభిచార ఆదాయంలో) తమ వాటా నిర్ధారించి, వారికి డబ్బుపై (లక్షల డాలర్లు) ఆశపుట్టించి ప్రయాణానికి సిద్ధం చేయగలుగుతున్నారు. అలా సాంస్కృతిక కార్యకలాపాల పేరిట. విదేశీ షూటింగ్ పేరిట మన స్ర్తి తారలు అమెరికా చెక్కేస్తున్నారు. గుట్టుచప్పుడు కాకుండా పనిముగించుకుని డాలర్లు మూటకట్టుకొనుచున్నారు. 007 లాంటి అమెరికన్ పోలీసుల దృష్టిలో ఈ తతంగం పడింది. కిషన్- చంద్రకళ తీగెను లాగారు, వ్యభిచార డొంక కదిలింది. వారినిద్దరిని అరెస్టుచేసి కూపిలాగారు. 40 పేజీల ఎఫ్.ఐ.ఆర్. తయారుచేసి ‘నార్త్ డిస్ట్రిక్ ఆఫ్ ఇల్లినాయిస్ ఈస్ట్రన్ కోర్టులో’ దాఖలుచేయడం జరిగింది. పోలీసు అధికారులు ఆ వ్యభిచార సంబంధముగా సేకరించిన వ్యక్తులందరికీ నోటీసులు పంపడం, సెక్స్‌రాకెట్ ఉదంతమని కోర్టు నిర్ధారించడం జరిగిపోయింది. త్వరలో వారికందరికి శిక్ష ఖరారుచేయబోతున్నారని మీడియా ప్రకటించింది. ఈ విషయంలో నిమ్మకు నీరెత్తినట్లు అటు సినీ రంగం ఇటు ‘మా’ వౌనం పాటిస్తున్నారంటే అమెరికాలో మన వారి సెక్స్ రాకెట్ నిజమనుకోవలసిందే. ఎవరు ఆ విషయం ఖండించలేదన్నది మన మిక్కడ గమనించాలి. విధిలేని పరిస్థితులలో పది పర్సంట్ చీకటి రహస్యాలు బయటపడుతున్నవే తప్ప పూర్తి మాత్రం కాదు. విలాస వంతమైన జీవితాలకు అలవాటుపడి, సినీ అవకాశాలు సన్నగిల్లి అవకాశాలు రాక అలాంటి వారంతా చీకటివైపు అడుగులు వేస్తున్నారన్నది వాస్తవం. శిక్ష ఖరారు లోపల ఈ సెక్స్‌రాకెట్ కుంభకోణంలో పాల్గొన్న వారి పేర్లన్ని బయటపెడతాం అంటున్నారు. అమెరికా పోలీసు అధికారులు. పదునులేని మొద్దు కత్తిలాంటి ‘నిర్భయ చట్టాలు’ కావు వారివి, పెరోల్ లేని, సింగిల్ రూం, జీవిత శిక్ష లేదా మరణశిక్షలే వారి చట్టాల పదును, ఆ చట్టాలకు రాజకీయం ఆమడదూరంలో వుంటుంది. సినీ రంగంలో కాస్టింగ్‌కౌచ్ మహిళా నటుల వేధింపులు నిజమని పాఠకులు-ప్రేక్షకులు- సామాన్యులు నమ్మి తీరవలసిందే. సినిమా అంటే సిగ్గు, నీతి, మానం లేనిదని పూర్వ పెద్దలు సెలవిచ్చారు, నిజమే మరి. చేసుకున్న భార్యను వదిలినవారు, చేసుకున్న భర్తలను వదిలినవారు, వదిలివేసిన నటీనటులు వివాహం చేసుకోవడం, సహజీవనం చేయడం, వివాహం చేసికోనున్నామంటూ ప్రకటించే వారు కొందరు, ప్రకటించి పెటాకులైపోయిన వారు కొందరూ, నటీనటులు వివాహం చేసికున్నా, నటి భార్య మరో నటున్ని కౌగలించుకోవడం, శరీరమంత తాకించుకోవడం, నడుము చుట్టు చేయివేయించుకోవడం, ముద్దుల వరకరు పోవడం నటన అందామా? మరో పేరు పెడదామా? ఇంత జరుగుచున్నప్పుడు సినీ రంగంలో చీకటి కోణం లేదంటే నమ్మవచ్చునా? ప్రజలకు తెలిసినవి కొనే్న ఎందుకంటే మీడియా పూర్తి వివరాలు వెల్లడించదు. సెలబ్రిటీలంటూ డబ్బాకొడుతుంటే తప్ప, వారి చీకటి తప్పులను కాస్టింగ్ కౌచ్‌లను కాయదు. అందువలన సినీ రంగం హైటెక్ చీకటి కోణం అని నమ్మి తీరవలసిందే? ఎవరూ బయటపెట్టలేరు కాబట్టి వారు ధైర్యంగా ‘అలాంటిది జరగవు’ అని మనసును చంపుకుని పచ్చి అబద్ధం చెబుతున్నారు. ఎవరిదైన పాపం పండినరోజు చీకటి కోణం అదంతటదే బయటపడుతుంది, కాదంటారా? అమెరికా సెక్స్‌రాకెట్‌లో ఎవరి పేర్లు బయటకొస్తాయో చూద్దాం.

- మురహరి ఆనందరావు