మెయిన్ ఫీచర్

రామాయణానికి అర్థం తెలుసా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామాయణం మీకు తెలుసా అంటే చాలు ఎవరైనా రామాయణమంటే మాకు తెలియకపోవడమేమిటి? అది సూర్య వంశస్థుల కథ. దశరథ మహారాజుకు ముగ్గురు భార్యలు. నలుగురు పుత్రులు. వారే, రామలక్ష్మణ భరత శత్రుఘు్నలు. రామలక్ష్మణులు విశ్వామిత్ర ఋషి వెంట వెళ్ళి అతని యాగ సంరక్షణగావించారు. హరివిల్లును విరిచి, రాముడు సీతను పెళ్ళాడాడు. కైకేయి కోరికతో సీతాలక్ష్మణులతో వనవాసం చేశాడు. రావణాది రాక్షసులను సంహరించి సీతను ఏలుకున్నాడు. ప్రజారంజకంగా వేల సంవత్సరాలు భారతదేశాన్ని పరిపాలించాడు... ఇదేకదా రామాయణం... కాదంటారా? అంటూ ఎదురు ప్రశ్నవేస్తారు.
అవును. ఇదే రామాయణం. కానీ, ఇదొక పిట్టకథ. ఇంకా చెప్పాలంటే ఒక పొడుపుకథ. లేదా ఒక మహాప్రహేళిక, ఈ పొడుపుకథకి విడుపు మనకు తెలుసా? అంటే తెలీదనే చెప్పాలి. నూటికొకనికికాదు కోటి కొకనికి తెలీదు.
నిజానికిది విశ్వకథ. లేదా విశ్వశక్తుల కథ. మరో విధంగా పంచభూతాల కథ. రాత్రింబవళ్ళ కథ. ఆకాశం, సూర్యుడు, చంద్రుడు నక్షత్రాలు, నలుపు, తెలుపు మేఘాలు... ఇలా ఇవే ఇందలి పాత్రలు. పాత్రధారులు. విశ్వవ్యాపారమే రామాయణం. విశ్వకళ్యాణమే దాని ధ్యేయం... అవునా? అంటూ ఎదురుప్రశ్న వేస్తారు మీరు.
నిజమే కానీ, ‘దశరథు’డంటున్నాం కదా? మరి ‘దశరథుడం’టే ఎవరు? పది రథాలున్నవాడేనా? లేక పది రథికుల్ని ఎదుర్కొనేవాడా? ఐదే, పదకొండు, పదిహేను, వంద, వేయి రథాలున్నవాడో? ... ఇతనికన్నా ఘనుడా? మహావీరుడా?... కాదండీ? అదికాదు దానర్థం. ఇక్కడ రథమంటే గుర్రాలబండి కాదు. రథమంటే అనేక అర్థాలున్నాయి. రథమంటే విశ్వం, రథమంటే శరీరం. అందువల్ల దశరథుడంటే దశదిశల్లో విస్తరించిన శరీరం (రథం) కలవాడు. లేదా దశదిశలే అతని శరీరంగా కలవాడని అర్థం చెప్పుకోవాలి. అనగా అతడొక మహావిశ్వ ప్రతీక. ... విశ్వం గుండ్రంగా మలుపుతిరిగి తనలోకితాను ముడుచుకొంటుందని ‘ఐన్‌స్టీన్’కూడా చెప్పాడు కదా? ఇక మన పెద్దలేమో ‘అండ, పిండ, బ్రహ్మాండా’లన్నారు. అనగా విశ్వం అండాకారంగా ఉంటుందని ఉవాచ.
దశరథుడు మహావిశ్వమైతే అతని భార్యలైన కౌసల్యా, సుమిత్రా, కైకేయిలెవరు?... ముల్లోకాలే! అనగా వరసగా స్వర్ణ, మర్త్వ, పాతాళాలే. అందుకే రామాయణాన్ని క్షుణ్ణంగా, పరిశీలనాదృష్టితో చదవండి. వారి చరిత్రలు ఈ ముల్లోకాలకు సంబంధించిన సాత్విక, రాజసిక, తామసిక గుణాలతోనే(వరసగా) ముడివడి ఉంటాయి! ఎంత చోద్యం?!’’
ఐతే, ఈ మహావిశ్వం(దశరథుడు)గారి సంతానమేమిటి?...
సూర్యచంద్రులే! వారే రాముడు, భరతుడూను. వారిని నీడలా అనుసరించే సూర్యచంద్ర ప్రకాశాలే, వరసగా లక్ష్మణుడూ, శత్రుఘు్నడూను. అందుకే రామాయణంలో వారిని అంటిపెట్టుకొని ఉన్నారు. ఇంకా చోద్యమేమిటంటే లక్ష్మణుడు భరతుని వెంటా, శత్రుఘు్నడు రాముని వెంట ఎన్నడూ తిరగలేదు. అదే వాల్మీకి మహాప్రణాళిక! మరి ఈ విశ్వం కోడలెవరు? ఇంకెవరు భూజాని సీత! అనగా భూమియే! ఐతే ఆయన గురువులెవరు? నక్షత్రాలే!... రామాయణంలో ఈ నక్షత్రాలే మహర్షులు. నక్షత్ర సమూహాలే అనగా పాలపుంతలో ఆశ్రమాలు. పరిత్యజించబడిన సీత విశ్వామిత్రుని ఆశ్రమంలో ఉందంటే- పాలపుంత మధ్యలో ఉన్నదనే దాని అంతరార్థం.
మరి ఈ దశకంఠ రావణుడెవరు? వాడొక మహాకాలమేఘ ప్రతీక. (పిల్ల మేఘాలు పిల్లరాక్షసులు) చీకటి లేదా నలుపు తామసికతకు, అజ్ఞానానికి, పాపానికీ ప్రతీక, అందుకే రావణుడు దుష్టుడు. రావణుడనగా రావం చేసేవాడు. అది దశకంఠరావం. అనగా అనంత రావం. ‘దశ, శత, సహస్ర’ శబ్దాలు అనంత సూచికలు. ఆ మహాకాలమేఘంలో అక్కడక్కడ కొంత తెలుపుకూడా ఉంది. తెలుపు విజ్ఞతకు, సాత్వికతకు ప్రతీక. కాబట్టి రావణుడు వేద పండితుడని ప్రతీతి. అందువల్ల దశకంఠుడంటే పది తలలవాడని కాదు. వాల్మీకి అలా ఎక్కడా చెప్పలేదు. అందుచేత రావణునికి పది తలలున్నాయని నమ్మితే మనకు ఒక్క తలకూడా లేనట్లే!
ఐతే, ‘అయోధ్య’అంటే ఏమిటి? ‘లంకానగర’మంటే ఏమిటి? ఎవరూ జయించలేనిది అయోధ్య. అనగా ‘ఆధ్యాత్మిక’ దృక్కోణంలో మనస్సు, ఆది భౌతిక దృక్కోణంలో ఆకాశం. (రామాయణానికి నాలుగు దృక్కోణాల్లో నాలుగర్థాల్ని చెప్పుకోవచ్చు) ఇక ‘లంకానగర’మంటే ‘కాలనగరం’ అనగా చీకటి కొండ. వాడే చీకటికి ప్రతీక. వాడుండేదీ చీకట్లలోనే! గమ్మత్తుగా లేదూ? ఐతే స్వర్ణలంకకు అర్ధం? సూర్యచంద్ర ప్రకాశాల్లో బంగారు రంగులో మెరిసే కాలమేఘమే స్వర్ణలంక! అలాగే ‘స్వర్ణమృగం’కూడా ఇలాంటిదే!
సీత పగలంతా రాముని అర్ధ సింహాసనంమీద కూర్చొని అత్యంత వైభవోపేతంగా రాజ్యంచేస్తుంది. రాత్రయాక చీకటి చెరసాలలో మ్రగ్గుతుంది. మళ్ళీ ఉదయమే సూర్యుడు ఆమెను చీకటి చెరనుండి విముక్తం చేశాడు. ఒక్క మాటలో ఇదే రామాయణం.
ఇంతకీ ‘రామాయణ’మనే శబ్దం ఎలా వచ్చిందో తెలుసునటండీ?... సూర్యుడు రాముడు కాబట్టి ‘సూర్యాయణమే’ రామాయణం. సూర్యునికి రెండు మార్గాలు. 1) ఉత్తరాయణం 2) దక్షిణాయనం. ఉత్తరాయణం శుభప్రదం. సౌఖ్యప్రదం. అలాగే రామునికె రెండు మార్గాలు అతడు కొంతకాలం ఉత్తర భారతంలో తిరిగాడు. అప్పుడతడు సుఖంగా సంతోషంగా ఉన్నాడు. ఆపై అతడు దక్షిణమార్గం పట్టాడు. రాజ్యాన్నీ రమనూ కోల్పోయాడు. రాక్షసులతో పోరాడాడు. కంటికిమింటికి ఏకధారగా విలపించాడు.
సరి, బాగుంది. కానీ మిగతా పాత్రల మాటేమిటి? అవి వేనికి ప్రతీకలు?... హనుమ వాయువు. సుగ్రీవుడగ్ని, వాలి ఒక తుఫాను. పరశురాముడు, గుహుడు, గౌతముడు, విభీషణుడు, చంద్ర ప్రతీకలు. శబరి, ఊర్మిళలు కమలప్రతీకలు. వానరసేన సూర్యకిరణాలు. కుశుడు కిరణ(రేఖా) స్వరూపుడు. లవుడు బిందు స్వరూపుడు. లవణాసురుడు లవణ సముద్రం. ఇలా ఇవి ప్రధాన పాత్రలకు ప్రతీకలు...
ఇలా విశ్వశక్తుల ఆరాధన వేదమైతే, విశ్వశక్తుల కథ రామాయణం. అందువల్ల అన్నిటికీ మూలం వేదమే. వేదం లేక రామాయణంలేదు. రామాయణం లేక భారత భాగవతాదులు లేవు. పురాణాలు లేవు. (వివరాలకు చూడుడు: నా పరిశోధన రాముడంటే ఎవరు? రామాయణమంటే ఏమిటి?)
కానీ, అత్యంత విచారకరమైన విషయమేమిటంటే నేటి ఆధునికులు వేదోపనిషత్తుల్నీ, రామాయణ భారత భాగవతాదుల్నీ ఎడంచేత ముట్టరు. వాటిల్లోని రహస్యాల్ని తెలుసుకునే ప్రయత్నం చేయరు. పైగా వెక్కిరిస్తారు వానిని. దూషిస్తారు. నాబోటి వాడెవడైనా చెబితే వినిపించుకోరు. అర్ధంచేసుకోరు. ఇంతకన్నా శోచనీయం మరొకటుంటుందా? చివరికి పత్రికలూ, టీవీలూ, రేడియోలు సైతం పిట్టకథల్నీ ప్రచారం చేస్తున్నాయి. అజ్ఞానాన్ని పెంచి పోషిస్తున్నాయి. ప్రపంచం తల్లక్రిందులుగా నడుస్తోంది. మన అజ్ఞానమే మన మూలధనమై పోతోంది.
ఐనా మనం ఆశాజీవులం కదా? ఒకటికి పదిసార్లు చెప్పాల్సిన బాధ్యత మనపై ఉంది. చీకట్లించి మరింత చీకట్లలోకికాక వెలుగుల్లోకి పయనిన్దాం! వెలుగులమై పయనిద్దాం! ప్రపంచాన్ని జ్యోతిర్మయం చేద్దాం!

-గన్ను కృష్ణమూర్తి