మెయన్ ఫీచర్

ఉమ్మడి పౌరస్మృతి ఇంకెంత దూరం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాల్లో 44వ ఆర్టికల్ గురించి మరోసారి దేశవ్యాప్తంగా విస్తృత చర్చ మొదలైంది. ‘ఇదిగిదిగో.. ఉమ్మడి పౌరస్మృతి వచ్చేస్తోంది..’ అని ఒక పక్క కేంద్ర ప్రభుత్వం చెబుతున్నా, మరో పక్క ‘లా కమిషన్’ మాత్రం ఇది ఇప్పట్లో సాధ్యమయ్యేలా కనిపించడం లేదంటోంది. ఉమ్మడి పౌరస్మృతికి రాజ్యాంగాన్ని సవరించాల్సిందేనా? దేశం యావత్తూ ఆసక్తిని రెకేత్తిస్తున్న ఉమ్మడి పౌరస్మృతి ఒక రూపానికి రావాలంటే ఇంకా చాలా కాలం పట్టేలా ఉంది. అది ఒక రూపానికి వచ్చాక, అమలులోకి రావాలన్నా ఎన్నో మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. ఉమ్మడి పౌర స్మృతికి ఒక రూపం ఇచ్చే బాధ్యతను స్వీకరించిన 21వ న్యాయ కమిషన్ ఆ పని పూర్తిచేసేలా కనిపించడం లేదు. దీనికి అనేక కారణాలున్నాయి. అందులో మొదటిది కమిషన్ చైర్మన్ జస్టిస్ బి.ఎస్ చౌహాన్ త్వరలోనే పదవీ విరమణ పొందనున్నారు. గిరిజన ప్రాంతాల్లో వ్యక్తిగత చట్టాలకు రాజ్యాంగంలోని ఆరో షెడ్యూలులో రక్షణ కల్పిస్తున్నప్పుడు- మత సంబంధమైన విశ్వాసాలు, ఆచారాలు, సంప్రదాయాలు, ఆకాంక్షలకు అనుగుణంగానే ఏర్పడిన చట్టాలను ‘సమానంగా’ (ఉమ్మడిగా) ఉండేలా మార్చాలని భావించడం సబబా? అనే ప్రశ్న ఉదయిస్తోంది.
నిజానికి సంక్షేమ, ఉత్తమ ఆదర్శ రాజ్యంగా భారతదేశాన్ని నిర్మించడానికి రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాలను చేర్చారు. తద్వారా ఆర్థిక, సాంఘిక ప్రజాస్వామ్యాన్ని సాధించాలని రాజ్యాంగ నిర్మాతలు భావించారు. ఆర్టికల్ 36 నుండి ఆర్టికల్ 51 వరకూ ఆదేశిక సూత్రాలు ఉన్నాయి. ఏ ప్రభుత్వమైనా పాలనలో ఈ సూత్రాలు తప్పకుండా దృష్టిలో ఉంచుకోవాలి. అయితే ఈ సూత్రాలను కోర్టుల్లో అమలు పరిచే వీలులేదని చెప్పడం జరిగింది. సాంఘిక, ఆర్థిక సమానత్వం తీసుకురావాలని, ప్రకృతి వనరులు, సంపదలు ప్రజలందరికీ సమానంగా అందేలా చూడాలని, పంచాయితీ రాజ్ వ్యవస్థను బలపరచాలని, ప్రభుత్వ శాఖల నుండి న్యాయశాఖలను వేరు చేయాలని, ప్రపంచశాంతికి కృషి చేయాలని ఇందులో సూచించడం జరిగింది. వీటిలో అత్యంత వివాదాస్పదమైనది ఉమ్మడి పౌరస్మృతిని నిర్బంధం చేసే ఆర్టికల్ 44.
దేశంలో అమలులో ఉన్న శాసనాలు, చట్టాలు చాలావరకూ పౌరులందరికీ ఒకే విధంగా అమలు జరుగుతున్నాయి. అపకృత్యాల న్యాయశాస్త్రం, సంస్థలకు సంబంధించిన న్యాయశాస్త్రం, పౌరవిధాన నిర్ణయ న్యాయ శాస్త్రం, నేర సంబంధమైన న్యాయశాస్త్రం, తగాదాల పరిష్కార చట్టం, కంపెనీ చట్టం, ఒప్పందాల చట్టాలు కూడా చాలావరకూ కొద్దిపాటి తేడాలు మినహా అన్ని మతాల వారికీ ఒకే విధంగా అమలు అవుతున్నాయి. కానీ ఉమ్మడి పౌరసత్వం అనేది మతానికి సంబంధించింది. మతం అంటే అది వ్యక్తిగతమైన స్వేచ్ఛకు సంబంధించింది. అది కట్టుబాట్లతో ముడివడిన అంశం. ఆ విధంగా చూస్తే మత స్వేచ్ఛను మినహాయించి మిగిలిన అన్ని అంశాల్లో భారతీయులు అంతా ఒక్కటే అనే భావన కల్పించాలంటే ఉమ్మడి పౌరస్మృతి అవసరమనేది రాజ్యాంగ నిర్మాతల భావన. రాజ్యాంగం అమలులోకి వచ్చింది మొదలు ఉమ్మడి పౌరస్మృతిపై ప్రయత్నాలు మొదలయ్యాయి.
ప్రపంచంలోనే భారతీయ సంస్కృతి, ధర్మం చాలా పురాతనమైనవి. సుమారు ఐదువేల ఏళ్ల క్రితం పుట్టిన వేదాలు భారతీయ ధర్మాన్ని తెలియజేస్తాయి. ఆ తర్వాత వచ్చిన మనుస్మృతి, యజ్ఞవల్కస్మృతి, నారదస్మృతి మొదలైన సూత్రాలు కొందరు మహారుషులు రెండు వేల ఏళ్ల క్రితం రూపొందిచారని చరిత్ర చెబుతోంది.క్రీ.పూ 200 సంవత్సరంలో చాణక్యుడు రాసిన అర్థశాస్త్రంలో ఎన్నో ధర్మసూత్రాలు ఉన్నాయి. ఇవి ఇప్పటికీ అమలులో ఉన్నాయి. అలనాడు రూపొందించి, భాష్యం చెప్పిన ‘మితాక్షర’, ‘దయాభాగ’ సూత్రాలు నేటికీ అమలు జరుగుతున్నాయి. హిందువులందరికీ ఇవి వర్తిస్తున్నాయి. ఇందులో ‘దయాభాగ’ బెంగాల్‌కు మాత్రమే వర్తిస్తుంది. క్రీశ 1600 సంవత్సరంలో బ్రిటిష్‌వారు భారత్‌ను ఆక్రమించడం మొదలుపెట్టడంతో ఇక్కడ చట్టాలపై వారి ప్రభావం పడింది. వారు తమ న్యాయశాస్త్రాలనే ఇక్కడా అమలు చేయడం మొదలు పెట్టారు. 1947లో మనకు స్వాతంత్య్రం రావడంతో అవే న్యాయశాస్త్రాలను, చట్టాలను యథాతథంగా అమలులోకి తెచ్చాం. ఆ తర్వాత వాటిని దేశీయ అవసరాలకు అనుగుణంగా సవరించుకుంటూ వస్తున్నాం. 1860లో బ్రిటిష్ పార్లమెంటులో తయారైన భారత శిక్షాస్మృతి ,1882లో తయారైన ఆస్తి బదిలీ చట్టం, 1881లో తయారైన బదలాయింపు పత్రాల చట్టం మొదలైనవన్నీ ఇంగ్లీషు వారు తయారుచేసినవే. అయితే హిందూ ధర్మశాస్త్రాలను గానీ, ముస్లిం న్యాయశాస్త్రాలను గానీ వారు తాకలేదు. వాటినే అమలుపరిచారు. లండన్ లోని ప్రీవీ కౌన్సిల్ జడ్జీలు సంస్కృతం నేర్చుకుని మన పురాతన హిందూ ధర్మాలకు భాష్యం చెప్పి అమలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.
న్యాయం వేరు,్ధర్మం వేరు. ఏది మంచి? ఏది చెడు? అనేది చెప్పడం ధర్మం అయితే- చట్టాలు, తీర్పులు, ఆచార వ్యవహారాలు న్యాయం పరిధిలోకి వస్తాయి. న్యాయానికి మంచి, చెడు, పుణ్యం, పాపం అనే మాటలతో నిమిత్తం ఉండదు. ‘మూడేళ్లు గడిచింది కనుక బాకీ తీర్చనక్కర్లే’ని చెప్పడం న్యాయం అయితే, ‘ఎన్నాళ్లైనా బాకీ తీర్చాల్సిందే అనడం’ ధర్మం అవుతుంది. న్యాయం అమలులో ఉన్నపుడు ధర్మానికి తావుండదు. ఉమ్మడి పౌరస్మృతి అనేది ఈ రెండింటి మధ్య సమతుల్యం చేయాల్సిన విషయం. ఉమ్మడి పౌరస్మృతి సాధించాలని రాజ్యాంగం చెబుతున్నా, దీనిని ప్రతిపాదించడానికి బదులు వ్యక్తిగత చట్టాలకే సవరణలు చేపట్టాలని ‘లా కమిషన్’ చెబుతోంది. ఉమ్మడి పౌరస్మృతి అనేది చాలా సంక్లిష్టమైన అంశమని న్యాయ కమిషన్‌కు అర్థమైంది. తాము రాజ్యాంగాన్ని అతిక్రమించకూడదని దాని పరిధిలోనే ఎవరైనా నడుచుకోవాలని , స్వల్పవ్యవధిలో ఉమ్మడి పౌరస్మృతిని రూపొందించడం సాధ్యం కాదని కమిషన్ చెబుతోంది. ఉమ్మడి పౌరస్మృతి సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయాలని 2016 జూలైలో న్యాయ కమిషన్‌ను కేంద్ర న్యాయశాఖ ఆదేశించింది. దీంతో అన్ని మతాలకు సంబంధించిన కుటుంబ చట్టాలను సవరించడంతో పాటు సంస్కరణలు చేపట్టడంపై కమిషన్ ప్రజాభిప్రాయాన్ని కోరింది. అందరి సూచనలతో కూడిన కార్యాచరణ పత్రాన్ని ఈనెలాఖరుకు న్యాయ కమిషన్ ప్రజల ముందుకు తీసుకువచ్చే అవకాశం ఉంది. మతాల వారీ కుటుంబ చట్టాలకు సవరణలు చేసేలా సిఫార్సు చేసేందుకు తాముప్రయత్నిస్తామని న్యాయ కమిషన్ చైర్మన్ చౌహాన్ చెబుతున్నారు. ఇందులో మచ్చుతునకగా ముమ్మారు ‘తలాక్ బిల్లు’ను కేంద్రం తీసుకువచ్చింది. నిజానికి మూడు దశాబ్దాల క్రితమే షాబానో కేసులో దేశ సర్వోన్నత న్యాయస్థానం తన సుప్రసిద్ధ తీర్పును వెలువరించింది. ఒక ముస్లిం వ్యక్తి తన భార్యకు విడాకులు ఇచ్చి మనోవర్తి చెల్లించడం మానేయడంతో, ఆ అన్యాయాన్ని న్యాయస్థానంలో ఆమె ప్రశ్నించింది. భర్త తనకు భరణం చెల్లించాలని ఆమె కోరింది. అంతిమంగా 1985 ఏప్రిల్ 23న భారత ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల సుప్రీం కోర్టు ధర్మాసనం ఆమె అభ్యర్థన న్యాయసమ్మతమేనని తీర్పు వెలువరించింది. అంతకుముందు మధ్యప్రదేశ్ హైకోర్టు ఈ మేరకు ఇచ్చిన తీర్పు కూడా సరైందేనని సుప్రీం పేర్కొంది.
భిన్న భావజాలాల ప్రాతిపదికన ఉన్న వ్యక్తిపరమైన శాసనాల స్థానంలో ఉమ్మడి పౌరస్మృతి తీసుకురావడం దేశ సమగ్రత, సమైక్యతలకు దోహదం జరుగుతుందనే విశ్వాసాన్ని కూడా సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. ప్రజలూ, ప్రభుత్వమూ ఆసక్తి చూపని రాజ్యాంగ అధికరణ 44 ఒక ఆదర్శంగా మాత్రమే ఎందుకు మిగిలిపోయిందని సుప్రీం ప్రశ్నించింది. డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ తదితర రాజ్యాంగ నిర్మాతలు దేశం తప్పకుండా ఉమ్మడి పౌరస్మృతిని రూపొందించుకుంటుందనే నమ్మకాన్ని ఆనాడు వ్యక్తం చేశారు. సువిశాల భారతదేశం ఒకే శాసనాన్ని అనుసరించడం సాధ్యమా? అని ప్రశ్నించినపుడు ఇప్పటికే దేశప్రజలందరికీ వర్తించేలా ఉమ్మడి శిక్షా స్మృతి ఉంది కదా? అని అంబేద్కర్ ప్రశ్నించి అపుడే దశాబ్దాలు గడిచింది. మత చట్టాలను సంస్కరించకుండా వదిలేస్తే సామాజిక వ్యవహారాల్లో మనం పురోగతిని , సామరస్యాన్ని సాధించలేమని కూడా అంబేద్కర్ స్పష్టం చేశారు. షాబానో కేసు ద్వారా పరోక్షంగా సుప్రీం ఉమ్మడి పౌరస్మృతిపై చర్చను పున:ప్రారంభించింది. ఆ తీర్పు వెలువడిన కాలంలో ఆధునిక భావాలున్న రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నారు. అయినా భారతీయ పౌరులు అందరికీ వర్తించేలా సుప్రీం కోర్టు సమకూర్చిన అవకాశాన్ని ఆయన ఉపయోగించుకోలేకపోవడానికి కారణం రాజకీయాలే. అవే రాజకీయాలు నేడు కేంద్రంలో ఉన్న ప్రభుత్వాన్నీ నడిపిస్తున్నాయా? అనే అనుమానాలు కలగడం సహజం. నిజానికి ఆనాడు రాజీవ్ గాంధీ తొలుత షాబానో కేసులో తీర్పును హృదయ పూర్వకంగా స్వాగతం పలికారు. సంప్రదాయబద్ధులైన ముస్లిం ఎంపీలు ఆ తీర్పుపై పార్లమెంటులో ధ్వజమెత్తారు. రాజీవ్ మంత్రిమండలిలోని సభ్యుడైన ఆరిఫ్ మహ్మద్ ఖాన్ ఆ విమర్శలను స్ఫూర్తిదాయకంగానే తిప్పికొట్టారు. ఇంత జరిగి 33 ఏళ్ల తర్వాత కూడా అధికరణ 44 ఉపేక్షిత రాజ్యాంగ ఆదర్శంగానే మిగిలిపోయింది. అప్పుడపుడూ ఉమ్మడి పౌరస్మృతిపై చర్చ పెట్టడం, మూడు అడుగులు ముందుకు, ఆరు అడుగులు వెనక్కు అన్న చందంగా వ్యవహారం నడుస్తోంది. ఉదారవాదులు అనుకునే నేతలు సైతం ఉమ్మడి పౌరస్మృతికి అనుకూలంగా మాట్లాడటానికి, వాదించడానికి కూడా వెనుకాడుతున్నారు. చట్టం ముందు సమానత్వం అనే వౌలిక ఉదారవాదం ధర్మసూత్రంగా ఉన్నా, అమలులో మాత్రం మహిళల పట్ల వివక్ష చూపే చట్టాలను రూపుమాపలేకపోవడం దారుణం కాదా? ‘టూ వార్డ్సు ది యూనిఫాం సివిల్ కోడ్’ పేరిట సామాజిక కార్యకర్త వసుధా ధగమ్వార్ రాసిన పుస్తకంలో ఉమ్మడి పౌరస్మృతికి అంతా ఎందుకు వెనుకంజ వేస్తున్నారో , దానికి రాజకీయాలు, మత పరమైన ఓట్లు ఎలా ఆజ్యం పోస్తున్నాయో బాగానే వివరించారు.
ఎవరు ఎన్ని చెప్పినా ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకునే చట్టాలను రూపొందిస్తారు. చట్టాలను చేసేది ప్రజాప్రతినిధుల సభలే అయినా అందులో అభిప్రాయాలు మాత్రం ప్రజలవే, వాటినే సంలీనం చేసి చట్ట రూపంలో తీసుకువస్తారు. చట్టం అనేది ఒక చట్రం. దాని అమలుకు నియమ నిబంధనలు ఇచ్చిన తర్వాత సంబంధిత ఉన్నత న్యాయస్థానాల ఆమోదంతో అమలు చేస్తారు. కొన్ని మార్లు జాప్యం జరిగినా, ప్రజాకాంక్షను ఎవరూ అడ్డుకోలేరు. ఒకే విధమైన ఉమ్మడి పౌరస్మృతి ఉండాలనేది ప్రజలందరి ఆకాంక్ష. ఈ చట్టం ద్వారా మాత్రమే భారత జాతీయ సమైక్యతకు సైతం రాజ్యాంగబద్ధమైన హోదాను ఇవ్వగలుగుతాం. ఉమ్మడి పౌర స్మృతి తీసుకురావడం అంటే హిందూ చట్టాలను వేరే మతస్థులపై రుద్దడం కాదు, అలాంటి వాదన కూడా సమంజసమైనది కాదు. ఉమ్మడి పౌరస్మృతి బ్రిటన్, జర్మనీ, చైనా, ఇంగ్లాండ్, కెనడా, అమెరికా, స్విట్జర్లాండ్ చివరికి రష్యా లాంటి దేశాల్లో అమలు జరిగినపుడు మనదేశంలోనే ఎందుకు కాదు? అంటే దానికి ఒక్కటే కారణం. రాజకీయ చిత్తశుద్ధి లేకపోవడం. నేతలు అధికారంలో ఉన్నపుడు ఒక మాట. అధికారంలో లేనపుడు ఇంకో మాట మాట్లాడటమే. ఇది దురదృష్టకరమే. వివాహం,విడాకులు, వారసత్వం అనే సామాజిక ఆచారాలను క్రమబద్ధీకరించాలనేది సూత్రబద్ధ ఉదారవాదవైఖరే. ఆ దిశగా అడుగులు వేసినపుడే ఏ ప్రభుత్వానికైనా సమత్వ భావన ఉన్నట్టు.

-బీవీ ప్రసాద్ 98499 98090