మెయన్ ఫీచర్

‘కేరళ విలయం’ దేశానికి గుణపాఠం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేరళలో జల విలయం అపార నష్టం కలిగించడంతో దేశవ్యాప్తంగా మరోసారి పర్యావరణ పరిరక్షణ అంశం తెరపైకి వచ్చింది. భారీ వర్షాలు, వరదల తాకిడికి కేరళలో దాదాపు 500 మంది మృతి చెందగా, సుమారు రూ. 30వేల కోట్ల ఆస్తినష్టం సంభవించింది. రమారమి 15 లక్షల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. ‘దేవభూమి’గా, అక్షరాస్యతలో అగ్రగామిగా భాసిల్లుతున్న ఈ రాష్ట్రం నుంచి లక్షలాది మంది తమ జీవనోపాధికి గల్ఫ్ దేశాలకు వలస పోతుంటారు.
కేరళ ప్రజలు ప్రగతిశీల వాదులు, విద్యావంతులు. 1958లోనే తొలిసారిగా కమ్యూనిస్టు పార్టీని గెలిపించి, వామపక్ష ప్రభుత్వం ఏర్పడేందుకు దోహదపడ్డారు. దేశమంతా కేరళను చూసి నేర్చుకోవాలని చాలామంది ఇప్పటికీ చెబుతుంటారు. అయితే, ఈ రోజు కేరళ కూడా పర్యావరణం విషయంలో కొత్త పాఠాలు నేర్చుకోవాలని తాజా విపరిణామాలు ఘోషిస్తున్నాయి. భారతీయులకు తమ దేశంలో కొన్ని రాష్ట్రాల గురించి తెలియకపోవచ్చు. కానీ, కేరళ గురించి ప్రతి భారతీయుడికి చాలా విషయాలు తెలుసు. కేరళ అంటే ప్రకృతి అందాలు, అక్కడి ప్రజల సేవాభావం, ఆంగ్లవిద్య, నర్సుల వైద్యసేవ వంటి అంశాలు మిగతా రాష్ట్రాల వారికీ తెలుసు. దేశవ్యాప్తంగా ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు కేరళ నర్సులను నియమించేందుకు ప్రాధాన్యం ఇస్తాయి. కేరళలో కాంగ్రెస్, వామపక్షాల మధ్యనే ఎప్పుడూ ఆధిపత్య పోరాటం జరుగుతుంది. కాంగ్రెస్ కూటమి, సీపీఎం ఆధ్వర్యంలోని వామపక్ష కూటమి మధ్య ఎన్నికల పోరు జరుగుతుంటుంది. ప్రతి ఐదేళ్లకోసారి అధికార మార్పిడి జరగడం ఆనవాయితీగా వస్తోంది. ఏ పార్టీకీ ఐదేళ్లకు మించి అధికారం ఇవ్వకపోవడం కేరళ వోటర్ల రాజకీయ పరిణతికి నిదర్శనం. కేరళ పేరు వింటేనే మనకు అయ్యప్ప స్వామి, గురువాయూరప్ప, అనంత పద్మనాభస్వామి ఆలయాలు గుర్తుకొస్తాయి.
నాగరికత, విద్య, సేవారంగాల్లో, ప్రగతిశీల భావాలతో దేశానికి ఆదర్శంగా ఉన్న కేరళ సైతం ప్రకృతి వైపరీత్యానికి తలవంచక తప్పలేదు. పర్యావరణ పరిరక్షణలో గత 70 ఏళ్లుగా పాలక పక్షాలు నిర్లక్ష్యం చూపడంతో, ఒక్కసారి ప్రకృతి కాటేసింది. అరేబియా సముద్ర తీరాన ఉన్న ఈ రాష్ట్రం పేరు నెల రోజులుగా ప్రపంచ మీడియాలో మార్మోగుతోంది. ఇక్కడి వరద బీభత్సంపై మీడియాలో చర్చోపచర్చలు జరుగుతున్నాయి. చదువుకున్న వాళ్లే తప్పు చేస్తే, మాలాంటి వాళ్ల సంగతేమిటని అంతతమాత్రం చదువుకున్న వాళ్లు లేదా నిర్లక్ష్యరాస్యులు వాపోతుండడం సహజం. కేరళలో ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. ఈ వైపరీత్యానికి ప్రస్తుత ప్రభుత్వం మాత్రమే కారణం కాదు. గత 50 ఏళ్లుగా పర్యావరణ పరిరక్షణ పట్ల ప్రభుత్వాలు శ్రద్ధ వహించలేదని తేటతెల్లమవుతోంది.
కేరళలో ప్రకృతి విలయం నేపథ్యంలో పశ్చిమ కనుమలపై తాజాగా చర్చ ప్రారంభమైంది. 2011లో మాధవ్ గాడ్గిల్ అనే పర్యావరణ వేత్త పశ్చిమ కనుమల పరిరక్షణపై నివేదిక ఇచ్చారు. పర్యావరణం, జీవ వైవిధ్యం పరిరక్షణకు చర్యలు తీసుకోకపోతే కేరళలో ప్రకృతి విపత్తులు తప్పవని ఆయన హెచ్చరించారు. మాధవ గాడ్గిల్ మహారాష్టల్రోని పూణె నగరానికి చెందిన వారు. పశ్చిమ కనుమలు మహారాష్టక్రు కూడా విస్తరించి ఉన్నాయి. పశ్చిమ తీరంలో ఉన్న కేరళ, కర్నాటక, మహారాష్టల్రు గాడ్గిల్ నివేదికను అమలు చేసి ఉంటే ఇంత బీభత్సం జరిగి ఉండేది కాదని నిపుణులు అంటున్నారు. పర్యావరణ పరిరక్షణ నిమిత్తం పశ్చిమ కనుమలకు హద్దులను కూడా నిర్ణయించారు. 1,29,037 చదరపు కి.మీ విస్తీర్ణంలో పశ్చిమ కనుమలు ఉన్నాయి. తమిళనాడులో 210 కి.మీ, మహారాష్టల్రో 48 కి.మీ వెడల్పున ఈ కనుమలు విస్తరించి ఉన్నాయి. 1,490 కి.మీ పొడువున ఉత్తరం నుంచి దక్షిణం వైపు ఇవి విస్తరించాయి. ఈ మొత్తం ప్రదేశాన్ని ‘పర్యావరణ సున్నిత ప్రాంతం’గా (ఈఎస్‌జడ్) ప్రకటించాలని గాడ్గిల్ సిఫార్సు చేశారు. ఇందులోనే పర్యావరణ సున్నిత జోన్లను ఏర్పాటు చేయాలన్నారు. వీటిని మూడు జోన్లుగా విభజించాలన్నారు. వీటిని 2200 గ్రిడ్స్‌గా వర్గీకరించాలి. ఈ ప్రాంతంలో వ్యవసాయాన్ని నిషేధించాలి. మూడేళ్లలో ప్లాస్టిక్ బ్యాగ్‌లను నిషేధించాలి. పశ్చిమకనుమలు, వాటి పరిసరాల్లో ప్రత్యేక ఆర్థిక మండళ్లు, హిల్ స్టేషన్ల ఏర్పాటుకు అనుమతించరాదు. ప్రభుత్వ భూముల్ని ప్రైవేట్ భూములుగా మార్చేందుకు అనుమతులు ఇవ్వరాదు. అటవీ ప్రాంతాలను ఇతర ప్రాంతాలుగా మార్చే ప్రతిపాదనలను తిరస్కరించాలి. ఈఎస్‌జడ్‌లలో మైనింగ్ లీజులు ఇవ్వరాదు. ఇప్పటికే మైనింగ్ లీజులు ఇచ్చి ఉంటే సమీక్షించాలి. కొత్తగా డ్యాంలు, థర్మల్ విద్యుత్ ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వరాదు. కాలుష్యకారక పరిశ్రమలను అడుగుపెట్టనివ్వరాదు. వచ్చే ఎనిమిదేళ్లలోగా దశల వారీగా రసాయనిక పరిశ్రమలను తరలించాలి.
గాడ్గిల్ కమిటీ నివేదికను ఆరు రాష్ట్రాలు అంగీకరించలేదు. ఈ కమిటీ సిఫార్సులను పరిశీలించి మరో నివేదిక ఇచ్చేందుకు కస్తూరిరంగన్ కమిటీని నియమించారు. ఈ కమిటీ 60 శాతం పశ్చిమ కనుమలను ‘కల్చరల్ ల్యాండ్ స్కేప్’గా గుర్తించింది. ఇక్కడ మానవ ఆవాసాలు, వ్యవసాయం, మొక్కల పెంపకం ఉన్నాయని తేల్చింది. మిగిలిన ప్రాంతం ప్రకృతి సహజ వనరులు, అందాలతో అలరారుతోందని పేర్కొంది. ఈ భాగం 60 వేల చదరపు కి.మీ మేరకు విస్తరించి ఉన్నాయి. ఈ ప్రాంతంలో మైనింగ్, ఇసుక తవ్వకాలను నిషేధించాలని, థర్మల్ ప్లాంట్ల నిర్మాణాలను అనుమతించరాదని, కాలుష్య పరిశ్రమలను అడుగుపెట్టనివ్వరాదని, టౌన్‌షిప్‌లను నిషేధించాలని పేర్కొంది. గత ఏడాది కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ 56,285 చదరపు కి.మీ ప్రాంతం పర్యావరణ పరంగా సెన్సిటివ్ ఏరియాగా ప్రకటించింది. ఇందులో 13,108 కి.మీ కేరళ పరిధిలో ఉండాలని కస్తూరి రంగన్ కమిటీ సిఫార్సు చేస్తే, దీని పరిధిని కేరళలో 9377 చ.కిమీ పరిధికి కుదించారు. కాగా, పర్యావరణ పరిరక్షణకు ఇచ్చిన నివేదికలు అమలుకు నోచుకోలేదు.
వచ్చే పదేళ్లలో కేరళ పర్యావరణ రంగంలో దేశానికి కొత్త పాఠాలు నేర్పుతుంది. మన దేశంలో తుపానులు, భారీ వర్షాలకు తరచుగా నష్టపోయే రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ అగ్ర స్థానంలో ఉంది. ఒడిశా, తమిళనాడు, పశ్చిమబెంగాల్ ఏటా తుపాన్లకు బలవుతున్నాయి. ఇటీవలి కాలంలో చెన్నై, ముంబయి నగరాల్లో వరద బీభత్సం పెను నష్టాలను మిగిల్చింది. ఉత్తరాఖండ్ 2013లో అతలాకుతలమైంది. ఏపీలో విశాఖపట్నం 2015లో హుదూద్ తుపానుకు తీవ్రంగా నష్టపోయింది. ప్రకృతి విపత్తులు జరిగినపుడే పర్యావరణ పరిరక్షణ గురించి మాట్లాడుతుంటాం. ఆ తర్వాత ఆ ఊసే ఉండదు. 1977 నాటి ఉప్పెనతో దివిసీమ తీవ్రంగా దెబ్బతింది. 1996లో పెనుతుపాను తాకిడికి కోనసీమ తీవ్రంగా నష్టపోయింది.
ఇటీవల ‘నేషనల్ సెంటర్ ఫర్ కోస్టల్ రీసెర్చి’ సంస్థ నిర్వహించిన సర్వే సైతం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. దేశంలో 7013 కి.మీ తీరంలో 6031 కి.మీ పొడవున ఈ సర్వే చేశారు. 1990 నుంచి 2016 వరకు 33 శాతం సముద్ర తీర ప్రాంతం కోతకు గురైంది. 29 శాతం మేర భూభాగంలో ఇసుక మేటలు వేసింది. కేరళలో కోస్తా తీరం 40 శాతం మేర కోతకు గురైంది. ఆంధ్రాలో 27 శాతం కోస్తా తీరం కోతకు గురైంది. తీర ప్రాంతాల్లో భారీ నిర్మాణాలు, సముద్రంలో నదులు కలిసే చోట మడ అడవులు తగ్గడం వల్ల భూమి కోత పెరుగుతోంది. దీని వల్ల కెరటాలు తీవ్రమై, సముద్ర మట్టం పెరుగుతోంది. అరేబియా సముద్రంతో పోల్చితే బంగాళాఖాతంలో అల్లకల్లోలం ఎక్కువ. అందుకే వేగంగా కోస్తా తీరం కోతకు గురవుతోంది. నదీ తీరాలను, సముద్ర తీరాలను పరిరక్షించుకునేందుకు పర్యావరణ నిపుణులు ఎన్నో సిఫార్సులు చేశారు. ప్లాస్టిక్ వాడకం తగ్గించలేకపోతున్నాం. తీరం వెంబడి హోటళ్లు, వైన్‌షాపుల్లో ప్లాస్టిక్ గ్లాస్ వాడకాన్ని నిషేధించే సాహసం ప్రభుత్వాలకు ఉందా? జనం భాగస్వామ్యం, పాలకుల్లో చిత్తశుద్ధి లేనపుడు ఏదీ సాధ్యం కాదు.
గోదావరి నదిపై లాంచీల్లో ప్లాస్టిక్ గ్లాసులు, సీసాల వాడకం నిషేధించాలి. గోదావరి లంకల నిండా వాడిపారేసిన ప్లాస్టిక్ గ్లాసులు, సీసాలే దర్శనమిస్తాయి. ఉత్తర భారతంలో వారణాసి, పాట్నా ప్రాంతాల్లో వలే- మట్టి పిడతల్లో టీ, ఇతర పానీయాలను సరఫరా చేయాలి. సాధారణ సమయాల్లో పర్యావరణ పరిరక్షణకు తగు జాగ్రత్తలు తీసుకుంటే- వరదలు, భారీ వర్షాలు వచ్చినప్పుడు వాటి తీవ్రత అంతగా ఉండదు. ప్రకృతిని ఎవరూ నియంత్రించలేరు. కానీ, నష్టాన్ని తగ్గించేందుకు పకడ్బందీ చర్యలు తీసుకోవచ్చు. కాగా, కేరళలో ప్రకృతి విపత్తుకు కొందరు మత విశ్వాసాలకు ముడిపెట్టడం హాస్యాస్పదం. కేరళలో జరిగిన తప్పిదాలు మిగతా ప్రాంతాల్లో పునరావృతం కాకుండా సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు అప్రమత్తం కావాలి.

-కె.విజయ శైలేంద్ర 98499 98097