మెయిన్ ఫీచర్

సకల సౌభాగ్య ప్రదాత(నేడు వరలక్ష్మీ వ్రతం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘సూర్యోమరీచి మాదత్తే సర్వస్మాద్భువనాదధిః
తస్యాః సాక విశేషేణ స్మృతం కాల విశేషణమ్’’
అన్నదాత, ఆరోగ్యప్రదాత అయిన సూర్యభగవానుని కిరణముల పరిపాక విశేషము వలన రాత్రింబవళ్ళు, దినము, వారము, పక్షము, మాసము ఋతువులు ఆయనములు సంవత్సరములు మొదలగు కాల భేదములు ఏర్పడుతున్నాయని యజుర్వేద తైత్తిరీయ ఆరణ్యకం పేర్కొంది.
ఆ విధంగా ఏర్పడిన కాల భేదములలో వివిధ ఋతు ధర్మములతో, ఒక ఋతువు తరువాత మరొక ఋతువు వస్తూ ఉంటాయి. అందులో దక్షిణాయనంలో, వేసవి చివరలో, వర్షఋతువు ప్రారంభంలో వచ్చేది- శ్రావణమాసం. దక్షిణాయనం అంటే, సూర్యుడు కర్కాటక రాశిలో ప్రవేశించినపుడు ప్రారంభమవుతుంది. కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. అలాగే చంద్ర నక్షత్రమైన ‘శ్రవణా నక్షత్రం’లో చాంద్రాయణం వలన ఏర్పడే తిథి పౌర్ణమి, వచ్చే మాసం శ్రావణ మాసం.
కనుక ఈ మాసంలో చంద్రుని ప్రభావం ఎక్కువ. చంద్రుడు మనస్సుకు అధిపతి. చంద్ర సహోదరి- శ్రీ మహాలక్ష్మి. ఈ విషయం లక్ష్మీ అష్టోత్తరమే చెప్పింది. అంతేకాదు, జ్యోతిష శాస్త్ర ప్రకారం చంద్రుడంటే తల్లి- జన్మనిచ్చిన తల్లి, జగన్మాత. అందుకే పవిత్రమైన శ్రావణ మాసంలో మంగళవారములలో మంగళగౌరీదేవిని శుక్రవారములో శ్రీ మహాలక్ష్మిని గురువారములలో శ్రీసూక్తపారాయణ లక్ష్మీపూజ, శనివారాల్లో కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామిని ఆరాధించి సర్వశుభములను పొందుతారు.
శ్రావణ సోమవారములు పరమవశివునికి ప్రీతిపాత్రమైనవి. శ్రావణమాసంలో వచ్చే నాలుగు శక్రవారములలో శ్రీమహాలక్ష్మి పూజల్ని చేస్తారు. ముఖ్యంగా శ్రావణపౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం (సాధారణంగా రెండవ శుక్రవారం అవుతుంది) వరలక్ష్మీదేవిగా, మహాలక్ష్మిని అత్యంత భక్తిశ్రద్ధలతో కొలుస్తారు. ఈ రోజు వరలక్ష్మీదేవిని అర్చిస్తే సిరిసంపదల్ని యిస్తుంది. లక్ష్మీదేవి సహోదరుడైన చంద్రుని అనుగ్రహం లభించటంతో, సాత్విక సాధన, పవిత్రమైన భావన, నిర్మల హృదయం, నిశ్చల మనస్సు ఏర్పడి జీవనయానం సుఖ సంతోషాలతో సాగుతుంది. ఇది శ్రావణ శుక్రవారం రోజున అర్చనలందుకొన్న శ్రీ వరలక్ష్మీదేవి మనకిచ్చే వరం.
కోటి సూర్యుల కాంతితో బంగారము వంటి వెలుగుతో ప్రకాశిస్తూ, మనకు జ్ఞాన వెలుగును ప్రసాదిస్తుంది వరలక్ష్మీదేవి. సేవించేవారిని, పాలించే తల్లి; ఆశ్రయించినవారి హృదయ మాలిన్యాన్ని పోగొట్టి, భక్తులను సులభంగా అనుగ్రహించే వరలక్ష్మీ దేవి, కేశవుని హృదయమందు నటనమాడుతుంది.
గృహమందలి ఈశాన్యగదిని గానీ, లేదా ఏ గదికైనా తూర్పు ఈశాన్యం గాని పూజాస్థలంగా ఎంచుకొని, స్థలాన్ని పరిశుభ్రంగా చేసికొని, ముగ్గులతో తీర్చిదిద్దుతారు. అమ్మవారి చిత్రపటాన్ని, లేదా కలశాన్ని పెట్టటానికి ఒక పీటను వేస్తారు. కొబ్బరికాయకు వారి వారి గృహ ఆచారాన్ని అనుసరించి మహాలక్ష్మీదేవి సాకారంగా అలంకరిస్తారు. ముందుగా ఆచమనం చేసి, దీపారాధన చేసి, పసుపుతో వినాయకుణ్ణి చేసి, పూజించి, నివేదన చేసిన తరువాత ఉద్వాసన చెప్తారు, ఎందుకంటే ‘‘ఆదౌ పూజ్యో గణాధిపః’’ అన్నారు గనుక. గణనాయకుని పూజించి అక్షతలు శిరసున దాలుస్తారు.
వరలక్ష్మీదేవికి షోడశోపచార పూజ చేస్తారు. తొమ్మిది తోరములు, తోరమునకు తొమ్మిది ముడులతో సిద్ధం చేసికొని, వాటికి తోర పూజ చేయాలి. ‘‘బధ్నామి దక్షిణ హస్తే నవసూత్రం శుభప్రదం పుత్ర పౌత్రాభి వృద్ధించ మమ సౌభాగ్యం దేహిమే రామే’’ అనే శ్లోకాన్ని చదువుతూ తోరము కట్టుకుంటారు. ముందుగా అమ్మవారికి ఒక తోరం కడతారు.
వాయనదానం యిచ్చేటప్పుడు ‘‘ఏవం సంపూజ్య కార్యాణీం వరలక్ష్మీం స్వశక్తి తః దాతవ్యం ద్వాదశాపూపం వాయనం హిద్విజాతయే’’ ఇందిరాప్రతి గృహ్ణాతు ఇందిరావై దదాతిచ, ఇందిరా తారకోభొభ్యాం ఇందిరాయై నమో నమః’’ అని యిచ్చేవారు పుచ్చుకొనేవారు చెప్తారు.
నోము నోచుకునేవారు వరలక్ష్మీదేవియే, ముతె్తైదువు రూపంలో వచ్చిందని భావించి, భక్తిశ్రద్ధలతో పూజించాలి. జ్యోతులు వెలిగించి అక్షతలు తీసుకొని శ్రీవరలక్ష్మీ వ్రతకథను చదువుతారు. కైలాసంలో పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి ఉద్దేశించి స్ర్తిలు సర్వసౌభాగ్యములను పొంది పుత్ర పౌత్రాభివృద్ధిగా తరించటానికి తగిన వ్రతమును తెలియచేయవలసినదిగా కోరింది. పరమశివుడు ఆనందించి, స్ర్తిలను ఉద్ధరించేవ్రతం- శ్రీ వరలక్ష్మీవ్రతమని చెప్పి, వ్రతవిధానాన్ని చెప్పారు. ఆ విషయములను సూత మహాముని శౌనకాది మహర్షులకు విశదపరచారు.
పూర్వము మగధ దేశంలో కుండిన నగరంలో చారుమతి అనే సుగుణవతి, సాత్విక భక్తురాలు, యోగ్యురాలు ఉండేది. వరలక్ష్మీదేవి ఆమెకు కలలో దర్శనమిచ్చి శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారంనాడు తనను అర్చించమని, కోరిన వరాలను సర్వసంపదలను మోక్షాన్ని యిస్తానని చెప్పింది. ఈ విషయాన్ని తన తోటి స్ర్తిలందరకూ చెప్పి, తనొక్కతే వరలక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందటం కాదు, స్ర్తిలందరూ ఆ తల్లి అనుగ్రహాన్ని పొందాలన్న స్వార్థరహిత విశాల సమిష్ట్ధిర్మంతో, వారిచేత కూడా వరలక్ష్మీవ్రతాన్ని తన యింటికి పిలిచి ఆచరింపజేసింది.
‘త్యాగేవైకే అమృతత్త్వ మానసుః’’ అన్నదానికి స్ఫూర్తిగా నిలిచింది చారుమతి.
‘‘లక్షయతీతి లక్ష్మీః’ అని లక్ష్మీ శబ్దానికి వ్యుత్పత్యర్థం. లక్షింపచేసేదేదో అది లక్ష్మి. జగన్మాత లక్ష్మీదేవి ఎంత దారి చూపేదైనా, ఆ మూలతత్త్వాన్ని అందుకొందామనే దీక్ష మనకి ఉండాలి. ఐహికమైన కోరికలు ఉంటే, వరలక్ష్మీ పరమైన కాంక్ష, ముముక్షువులై సేవిస్తే మోక్షలక్ష్మి. అందుకే సిద్ధి లక్ష్మి నుండి మోక్ష లక్ష్మి వరకు-
‘‘సిద్ధ లక్ష్మీ మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతీ
శ్రీ లక్ష్మీ ద్వారలక్ష్మీ శ్చ ప్రసన్నా మమ సర్వదా’’
అని చెప్పబడుతోంది శ్రీమహాలక్ష్మి, వరలక్ష్మీదేవి.
‘‘చంద్రాం హిరణ్మరుూం..’’ చంద్రుడిలా స్వచ్ఛమైనది, సౌమ్యమయినది, ఎటువంటి నామ రూప వాసనా మాలిన్యము లేనిది ఆ తల్లి. ఆ జగన్మాతను నా మనసులో ప్రవేశపెట్టి, మహాలక్ష్మీ దేవిని ఉపాసించేటట్లు చేయమని ప్రార్థిస్తున్నాం మనం. ఎవరిని? అగ్నిదేవుణ్ణి.
‘‘అశ్వపూర్వాం రథ మధ్యాం హస్తినాద ప్రబోధినీమ్
శ్రీయం దేవీ ముపహ్యయే శ్రీర్మా దేవీ ర్జషతామ్’’
-శ్రీసూక్తం.
గుఱ్ఱాలు ముందుంటే రథాలు మధ్యలో, ఏనుగులు ఘీంకారం చేస్తూ వాటి వెనకాల నడుస్తుంటాయి. ‘‘ఇంద్రియాణి హయనాహః’’ కఠోపనిషత్. ఇంద్రియాలే అశ్వాలు. ‘‘ఆశుగచ్ఛతేతి అశ్వః’’ అతివేగంగా పరుగెత్తేదేదో అది అశ్వం. అవి ఇంద్రియాలే. రథమంటే మన శరీరం. ‘‘శరీరం రథమేవతు’’- ఇంద్రియాలనే గుఱ్ఱాలీడ్చుకుపోతుంటే, ఇది కదిలిపోతుంది. అందుకే వాటి వెనకాలే మధ్యలో ఉంటుంది- శరీరం. ‘హస్తినాద ప్రబోధినీం’- ఆ శరీరం కన్న వెనకాల ఉన్నది- హస్తి అనగా ఏనుగు- మన అహంకారం. శరీరాన్ని మమకారంతో చూస్తోంది. దానికంటె ముందున్న ఇంద్రియాలనే అశ్వాలు దాన్ని రుూడ్చుకుపోయి విషయానుభవమిస్తున్నాయి జీవుడికి. ఇది జీవుడికి వున్న సంసార బంధం.
అహంకారమనే ఏనుగు ఆక్రందన చేస్తుంటే, దాన్ని ప్రజ్వలింపచేస్తుంది మాయాశక్తి. అదే ‘హిరిణి’. మనలను సంసారాభిముఖంగా హరిస్తుంది. అలా కాకుండా, సాయుజ్యం వైపు తీసుకెళ్లాలి. దీనికి ‘శ్రీ’ కావాలి. ఆ శ్రీదేవినే ‘ఉపహ్యయే’ మనలోకి ఆవాహనం చేసికోవాలి. శరీరమనే రథమధ్యస్థయగు లక్ష్మియే చైతన్యలక్ష్మి. చెవులు మూసికొంటే వినపడు నాదమే హస్తినాదం. అదే వేణునాదం-వీణానాదం- వేదనాదం- శంఖధ్వని. ఆ నాదము చేత నిరంతరం బోధింపబడుతున్న చైతన్యలక్ష్మిని ఆరాధిస్తే పరమాత్మను చేరుకునే సన్నిధి చూపిస్తుంది. ఈ ఆరాధనతో మానవుడు ఇంద్రియాలను, తను చెప్పినట్లు నడుచుకొనేటట్లు చేసికొని, మనస్సును అదుపులో ఉంచుకొని, తన శరీర రూప రథాన్ని భగవంతునివైపు త్రిప్పుకొని సన్మార్గంవైపు మరలి పవిత్రులు అవ్వాలని హితవు చెపుతోంది వర మహాలక్ష్మీదేవి.
పుణ్యాత్ములైన దేవీభక్తులకు, క్రోధం గాని, మత్సరం గాని, లోభం గాని, మలినమైన మనస్సుగాని, స్వార్థం గాని ఏ అవగుణాలూ ఏర్పడవు. భక్తి ఒక్కటే వాటన్నింటినీ దూరంగా పారద్రోలగలదు. నిత్యము ముఖ్యంగా శ్రావణ శుక్రవారాలలో లక్ష్మీస్తోత్రం, శ్రీసూక్తం, వరలక్ష్మీ పూజ చేసుకోవటం శ్రేయోదాయకం, సౌభాగ్యప్రదం అని చెప్తుంది శ్రీసూక్తం.
‘‘్ధనమగ్నిర్థనం వాయ్ధుఃనం సూర్యోధనం వసుః ధనమింద్రో బృహస్పతిర్వరుణం ధనమష్నుతే’’ అన్నది శ్రీసూక్తం. అగ్ని, వాయువు, సూర్యుడు, వసువు, ఇంద్రుడు, బృహస్పతి వరుణుడు అను ఏడుగురు ‘్ధన’ శబ్దముచే చెప్పబడ్డారు. ‘్ధన’ శబ్దానికి అధిపతి శ్రీమహాలక్ష్మి. లౌకికమైన ధనంతోపాటు, అగ్ని మొదలగు వారి తేజోరూపమున ధనాన్ని కూడా ప్రసాదించే శక్తి శ్రీ మహాలక్ష్మి. ‘ఆయుర్దా అగ్నే’, ‘‘అగ్నిర్మే వాచిశ్రీతః’’ అనే వేద వాక్యముల వలన, అగ్నిదేవుడు, ఆయుర్దాయాన్ని, ఐశ్వర్యమును, బలము, వాక్కును చేకూర్చేవాడు. ‘‘‘వాయుర్మే ప్రాణేశ్రీతః’’- వాయువు ప్రాణశక్తిని ప్రసాదిస్తాడు. ‘సూర్యోమే చక్షుషేశ్రీతః’- సూర్యుడు దర్శనశక్తిని హృదయ శక్తిని ప్రసాదిస్తాడు. ‘వసువు’ శారీరక తేజస్సును యిస్తాడు. ‘ఇంద్రేమో బలేశ్రీతః’ ఇంద్రుడు బలాన్నిస్తాడు. బుద్ధికి అధిపతి బృహస్పతి. బుద్ధిబలంతో జ్ఞాన సంపదను అనుగ్రహించేవాడు, బృహస్పతి. వరుణుడు- జలాధిపతి, శత్రుసంహారకుడు. కనుక వరుణుచే జలశక్తి శత్రుసంహారశక్తి లభిస్తాయి. ఈ అగ్ని, వాయు, సూర్య, వసువు, బృహస్పతి వరుణులందరూ- ఆ శ్రీ మహాలక్ష్మి అంశ. కనుక శ్రీ మహాలక్ష్మి కటాక్ష సిద్ధితో ఇవన్నీ లభిస్తాయి. ఆ దేవి అనుగ్రహమును పొందినవాడే అసలైన ధనవంతుడు.
సర్వదేవతా స్వరూపుడు, కలియుగదైవం- శ్రీ వేంకటేశ్వరస్వామి. ఆయన వక్షస్థలంలో నివసించే జగన్మాత శ్రీదేవి, అలర్మేల్మంగ. అలరంటే పద్మం, మేర్ అంటే మీద- పద్మం మీద నివసించే ‘మంగై’ అంటే మాత. పద్మావతీదేవి- శ్రీ మహాలక్ష్మి- వరలక్ష్మీదేవి. ఆ పద్మాలేవో కావు- మన శరీరంలో వున్న మూలాధారాది షట్చక్రాలే. వాటిలోవి హరిస్తూ ఉంటుంది. చివరకు ఏడవదైన సహస్రారంలో తనకాశ్రయమైన పరమాత్మతో సాయుజ్యాన్ని భజిస్తుంది. అమృతధారలు వర్షిస్తుంది. అవే ఏడుకొండలు- వృషభాద్రి నుండి వేంకటాద్రి దాకా, చివరిదే ఆనంద నిలయం. భక్తుల పాపాలను పోగొట్టి, సర్వశుభములను కటాక్షించే శక్తివంతునిగా చేసే శక్తి- జగన్మాత. శ్రీరూపిణి అయిన ఈ శక్తి శ్రీ చక్ర రూపంగా ఐక్యమయి ఏకరూపంగా భక్తుల అభీష్టాలను నెరవేరుస్తుంది. ఆయనే తిరుమలవాసి, ‘తిరు’ అంటే ‘శ్రీ’, మల అంటే ‘గిరి’, శ్రీగిరీశుడు- వేంకటేశుడు.
‘‘శ్రీవరలక్ష్మి నమస్త్భ్యుం, వసుప్రదే, శ్రీసారసపదే రసపదే, సపదే, పదే పదే.. శ్రావణ పౌర్ణమిం పూర్వస్థ శుక్రవారే చారుమతీ ప్రభృతిభిః పూజితా కారే.. అన్న సర్వమంగళప్రదమైన శ్రీరాగంలో ముత్తుస్వామి దీక్షితులు వ్రాసిన అద్భుతమైన కీర్తన, వరలక్ష్మీ వ్రత విధానం, కథాభాగంతోపాటు విశేషమైన ఆధ్యాత్మిక విషయాలను విశదపరుస్తుంది. ప్రతి ఒక్కరూ ఈ కీర్తనను వరలక్ష్మీ వ్రతం రోజున తప్పక జ్ఞప్తి చేసికోవాలి.
స్వార్థరహితంగా, ఉన్నతోన్నత భావాలతో, జీవితాన్ని గూర్చిన వివేచన, కాలాన్ని గూర్చిన అవగాహనతో, నలుగురికీ ఉపకరించే ఏ కార్యాన్నైనా సంకల్పిస్తే, దానికి తన ఆశీస్సులు, కటాక్షం ఎప్పుడూ ఉంటుందని చెప్తోంది - వరలక్ష్మీదేవి.

-పసుమర్తి కామేశ్వర శర్మ 94407 37464