మెయిన్ ఫీచర్

హయగ్రీవ ముపాస్మహే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్లో జ్ఞానానందమయం దేవం
నిర్మల స్ఫటికాకృతీమ్
ఆధారం సర్వ విద్యానాం
హయగ్రీవ ముపాస్మహే
- అని అమరకోశంలో తొలి శ్లోకం.
వైకుంఠవాసియైన శ్రీ మహావిష్ణువు ధరించిన అవతారాలలో హయగ్రీవ అవతారం ఒకటి. గుఱ్ఱపుతల మిగిలిన భాగమంతా మానవ దేహంలాగా ఈ స్వామి జ్ఞానానికి దేవతగా తెలుపబడినాడు.
విష్ణు ధర్మోత్తర పురాణం ప్రకారం రాక్షసులు దొంగిలించిన వేదాలను తిరిగి హయగ్రీవుడు తెచ్చినట్లుగా పేర్కొన్నది. ఈ హయగ్రీవుని అవతారం శ్రావణ పౌర్ణమినాడు ఆవిర్భవించినది.
ఈ హయగ్రీవుని ఉత్పత్తి ఎంతో విచిత్రంగా ఉంటుంది. ఇది విష్ణుదేవుని లీలగా దేవీభాగవతం తెల్పుచున్నది. శ్రీహరి ఒకసారి భయంకర యుద్ధం చేసి అలసిపోయాడు. అలసి యుద్ధ్భూమిలోనే వున్నాడు. పిదప పుణ్యప్రదేశం వైకుంఠం చేరాడు. పద్మాసనంలో ఉన్నాడు. చేతిలోని ధనుస్సుకు త్రాడు బిగించబడి యున్నది. ఈ స్థితిలో స్వామి కొంచెం వంగినట్లు కనిపించారు. దానిమీదే భారం వేసి తన అలసటను తీర్చుకొనుచున్నాడు. శ్రమ వలన నిద్ర బాగా వచ్చింది. అదే సమయంలో దేవతలు యజ్ఞం ఏర్పాట్లు చేసుకుంటూ ఇంద్రుడు, బ్రహ్మ, శివుడు శ్రీహరి దర్శనార్థమై వైకుంఠం చేరారు. దేవకార్యం నిర్విఘ్నంగా కొనసాగాలంటే యజ్ఞేశ్వరుడైన విష్ణువు ఆశీస్సులు కావాలి. ఆ భావనతో వైకుంఠం చేరగా వారికి హరి దర్శనం కాలేదు. యోగ నిద్రలో చైతన్య రహితుడై పడియున్నాడు. హరిని ఎలా మేల్కొల్పవలెననే భావనతో చర్చించుకున్నారు. పరమశివుడు తన అభిప్రాయం చెబుతూ, దేవతలారా! నిద్రాభంగం చేయుట నిషిద్ధము. కానీ యజ్ఞకార్యం సంపన్నం చేయుటకు హరిని మేల్కొల్పుట తప్పదు.
వెంటనే బ్రహ్మ, శివుని పలుకులాలించి ‘వమ్రి’ అను కీటకమును సృష్టించెను. ధనుస్సు భూమిమీదనే వున్నది. ఈ పురుగు ధనుస్సుకున్న త్రాడును కొరికివేయును. త్రాడు తెగిపోవగానే వంగిన ధనుస్సు పైకి లేస్తుంది. పిదప శ్రీహరికి నిద్రాభంగమవుతుంది. బ్రహ్మ కీటకమైన వమ్రిని ఆదేశించగా ఆ పురుగు బ్రహ్మతో అయ్యా! నారాయణుడు దేవతలకు ఆరాధ్యదైవం. జగద్గురువుకు నేనెట్లు నిద్రాభంగం కావింతును. త్రాడు త్రెంచుట అసహ్యకార్యం. దీనివలన నాకేమి లాభం. ప్రాణులన్నియు ఏదో ఒక స్వార్థము నాశించియే నీచ కర్మలకు పాల్పడుతాయి. ఈ పని చేయలేనన్నది. బ్రహ్మ విని ఓ కీటకమా నా మాట విను. నీకు యజ్ఞ్భాగం యిస్తాం. దీనినే స్వలాభం అని అనుకొని మా పని చేసిపెట్టు. శ్రీహరిని మేల్కొల్పుము. యజ్ఞమునందు హవనము చేయునపుడు చుట్టుప్రక్కల ‘హవిష్యం’ పడుతూ వుంటుంది. అది నీ భాగమని భావించుకో. ఇపుడు మా పని మిగుల శీఘ్రముగా జరిగిపోవాలి. అనగానే ఆ క్రిమి వెంటనే భూమిపై నున్న అల్లెత్రాడును కొరికివేసింది. ధనుస్సు బంధం నుండి విడిపడినది. త్రాడు తెగిపోవగనే దారము సడలిపోయింది. వెంటనే భయంకర శబ్దం వెలువడింది. దేవతలందరూ భయపడ్డారు. అంధకారం వ్యాపించినది.
కర్మసాక్షి సూర్యుని కాంతి క్షీణించినది. అందరూ ఆలోచిస్తున్న వేళ విష్ణుమూర్తి మస్తకం - కుండలాలు- కిరీటము ఎక్కడికో వెళ్ళాయి. అంధకారం తొలగింది. శ్రీహరి శ్రీ విగ్రహం మస్తకం లేకుండా పడిపోయి వుండుట శివుడు, బ్రహ్మ చూశారు. విష్ణువు మొండెం మాత్రమే చూచి దేవతలు ఆశ్చర్యపడినారు. దుఃఖితులైనారు.
బ్రహ్మ దేవతలను గాంచి జగదంబికను ఆరాధించమన్నాడు. జనని భగవతిని అందరూ స్తుతించారు. శ్రీహరికి మరల మస్తకమును ప్రసాదించి లక్ష్మిని ప్రసన్నురాలిని చేయమని ప్రార్థించారు. భగవతి అందరినీ వారి స్వస్థానముకు వెళ్ళమని దీవించినది. శ్రీహరి మస్తకం తెగిపోవుటకు ఒక కారణం వున్నది.
విష్ణువు లక్ష్మితో ఏకాంతంగా వున్నవేళ ఆమెను చూస్తూ నవ్వినాడు. లక్ష్మి ఆ నవ్వును వేరుగా భావించి, ఏ కారణం లేకుండా స్వామి నన్ను చూస్తూ నవ్వుట అసంభవము అని అనుకున్నది. కోపం తెచ్చుకున్నది. సాత్త్వికభావంగల శ్రీదేవి తమోగుణం వ్యవహరించినది. వ్యాకులపడినది. భవిష్యత్ పరిణామం కూడా వాస్తవమునకు దేవతల కార్యసిద్ధికొరకే అని, హరిని గాంచి ‘‘మీ తల నేలపై పడిపోవుగాక’’ అని అన్నది. అలాగే జరిగింది. విష్ణుమస్తకం లవణ సముద్రంలో పడివుంది. దేవతల ప్రార్థన నెరవేరుటకు శాప కారణం చెప్పింది. హయగ్రీవుడు రక్కసుడు సరస్వతీ నదీ తీరంలో తపం చేస్తున్నాడు. ఆయన తపస్సుకు మెచ్చాను. దేవి ప్రత్యక్షమైనది. ఏ వరం కావాలో కోరుకో అన్నది. మృత్యువు లేని జీవితం అడిగాడు. దేవి విని జనన మరణాలు నిశ్చితమైనవి. దానిని వమ్ము చేయరాదు అన్నది. విన్న రక్కసుడు అయినచో హయగ్రీవుని చేతిలోనే నాకు మృత్యువు కలగాలి. ఇతరులెవ్వరూ నన్ను చంపరాదు అని కోరగానే తథాస్తు అని దీవించి పంపింది. దానవుడు ఆనందంతో స్వగృహం చేరాడు. ఆ రాక్షసుడే మునులను, వేదములను పీడిస్తున్నాడు. కావున సుందరమైన గుఱ్ఱము శిరస్సును తీసి హరి మొండెమునకు అమర్చినారు. ఈ పని బ్రహ్మ చేతనే సంపన్నమైనది.
ఈ మహత్కార్యము సంపన్నం చేసి బ్రహ్మదేవుడు దేవతలను దీవించాడు. భగవానుడు హయగ్రీవుడుగా రూపొంది దానవ రాజైన హయగ్రీవ రక్కసుని సంహరించాడు.
హయగ్రీవుని ఆరాధించినవారికి విద్యాబుద్ధులు లభిస్తాయి. విద్యార్థులందరూ ఈ శ్రావణ పౌర్ణమి రోజున అర్చించాలి. లౌకిక, పారలౌకిక విద్యలు సిద్ధింపచేసుకోవాలి. ఈ అవతార పురుషుని అర్చన శీఘ్ఫ్రలకారి. పౌర్ణమినాడు హయగ్రీవ దేవుని షోడశోపచారాలతో అర్చించి, నైవేద్యంగా శనగపప్పుతో చేసిన పాయసము నివేదించాలి. లక్ష్మీదేవికి ధనాధిపత్యాన్ని, సరస్వతీదేవికి అక్షరాభ్యాసాన్ని అనుగ్రహించినదీ హయగ్రీవుడే.
హయగ్రీవుని పూజించడంవలన విద్య- ఐశ్వర్యం- అధికారం- ఆరోగ్యం- ఆయువు అన్నీ లభిస్తాయి. శ్రద్ధతో మానవులు త్రికాలములలో స్తోత్రం చేయాలి. శ్రవణం చేస్తూ శాంతి, సుఖాలు పొందాలి.
ఓం శ్రీ హయగ్రీవాయనమః

-పి.వి.సీతారామమూర్తి, 94903 86015