ఎడిట్ పేజీ

విలక్షణ వ్యక్తిత్వం వాజపేయి సొంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజపేయి మృతి చెందడంతో భారత రాజకీయ రంగంలో ఒక శకం ముగిసినట్లు అందరూ భావించారు. రాజకీయాలకు, విశ్వాసాలకు అతీతంగా ఆయనకు మొత్తం జాతి ఘనమైన వీడ్కోలు పలికింది. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ వంటి నేతలు మృతి చెందినప్పుడు ఒకవిధమైన భావోద్వేగంతో మొత్తం జాతి ప్రతిస్పందించింది. అప్పట్లో వారు కీలక పదవుల్లో ఉన్నారు. తమ పార్టీలో తిరుగులేని ఆధిపత్యం వహిస్తున్నారు. కాని వాజపేయి విషయం వేరు. సుమారు దశాబ్ద కాలంగా ఆయన క్రియాశీల రాజకీయాలలో లేరు. అందుచేత నవతరానికి, ముఖ్యంగా మొదటిసారిగా ఓటు హక్కును వినియోగించుకోబోతున్న నేటి యువతకు ఆయన గురించి పెద్దగా తెలియదు. పైగా వాజపేయి క్రియాశీలంగా ఉన్న సమయంలో సోషల్ మీడియా పెద్దగా ప్రాచుర్యంలోకి రాకపోవడంతో నేటి నెటిజన్లకు ఆయన దాదాపుగా పరిచయస్తుడు కానేకారు. 2004 తర్వాత భాజపాలో గాని, ప్రభుత్వంలో గాని ఆయన ఎటువంటి హోదాలోనూ లేరు. దశాబ్దకాలంగా భాజపా, సంఘ్ పరివార్‌లపై ఆయన ఎటువంటి ప్రభావం చూపలేదు. ఆయన ప్రధానమంత్రి పదవిలో ఉన్నప్పుడే ‘తప్పనిసరి’ కాబట్టి గాని లేని పక్షంలో మరొకరిని ఆ పదవిలో ఉంచేందుకు వారంతా సిద్ధంగా ఉన్నారు.
ఎన్నికల గడువు వరకు వేచి ఉండలేక బలవంతంగా దేశంపై మధ్యంతర ఎన్నికలను తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడుతో కలసి ఎల్‌కే అద్వానీ రుద్దడం కూడా ప్రధాని పదవి కోసం మరింక వేచి ఉండలేని అసహనంతోనే కదా. ఆ ఎన్నికలలో బిజెపి గెలిచి ఉంటే అద్వానీ ప్రధాని పదవి చేపట్టి ఉండేవారు. ప్రధానిగా ఉండగానే మధ్యలోనే తాను రాజీనామా చేస్తే, తనకు అవకాశం ఇవ్వమని స్వయంగా ఆర్‌ఎస్‌ఎస్ అధినేత వాజపేయకి చెప్పినట్లు తాజాగా అద్వానీ వెల్లడించారు. సొంత పార్టీలోనే ఒకవిధంగా వాజపేయి ఏకాకిగా గడిపారు. బిజెపి సామాజిక పరిధిని విస్తృతం చేయడానికి బంగారు లక్ష్మణ్‌ను పార్టీ అధ్యక్షుడిగా చేస్తే అద్వానీ నుండి మొత్తం పార్టీ నాయకత్వం ‘సహాయ నిరాకరణ’ ఏ విధంగా చేసిందో చూసాము.
ఎన్నో హోదాలు, ప్రసంశలను మాత్రమే కాదు అవమానాలను కుడా వాజపేయి ఎదుర్కోవలసి వచ్చింది. రాజకీయ రంగం నుండి తెరమరుగైన ఒక వ్యక్తి మృతి చెందితే దేశ, విదేశాలలో ఇంతటి ఘనమైన నివాళులు అర్పించడం స్వాతంత్య్ర భారత దేశంలో జరగలేదని చెప్పాలి. ఏ పదవీ లేకుండా ఉన్నప్పుడు జనం మన గురించి మంచిగా చెప్పుకొంటేనే అది మన ఘనత అని ఈ సందర్భంగా గుర్తించాలి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పినట్లు వాజపేయి పొగడ్తలకు పొంగిపోలేదు, అవమానాలకు కుంగిపోలేదు. నిండుకుండ వలె ఒక తాత్విక స్వరూప జీవనం గడిపారు. ఇప్పుడు ఆయన గురించి అందరూ గొప్పగా మాట్లాడుతుంటే అటువంటి ‘మహాపురుషుడు’ భారత రాజకీయాలలో సుదీర్ఘ కాలం ఉన్నారా? అంటూ నేటి యువత ఆశ్చర్యపోతున్నది.
1984లో నాటి ప్రధాని ఇందిరా గాంధీ మృతి చెందడానికి రెండు వారాలకు ముందు పుణెలో బిజెపి జాతీయ మండలి సమావేశాలు జరిగాయి. పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎల్‌కే అద్వానీ సమర్పించిన రాజకీయ నివేదికలో- తక్షణం ఎన్నికలు జరిగితే బిజెపి 200 సీట్లతో అతి పెద్ద పార్టీగా ఆవిర్భవిస్తుందనే అంచనాను పార్టీ ముందు ఉంచారు. మరో వంక పార్టీ కార్యకర్తలు ‘‘్ఢల్లీ సింహాసనం వాజపేయి కోసం ఎదురు చూస్తున్నది’’ అంటూ నినాదాలు ఇస్తున్నారు. సొంత పార్టీ వారే కాదు అనేక రాజకీయ పార్టీలు, మీడియా, వివిధ వర్గాల ప్రజలు వాజపేయిని కాబోయే ప్రధానిగా చూస్తున్నారు. అంత మాత్రం చేత ఆయన పొంగిపోలేదు. ఎన్నికల సభలలో ఆయన మాట్లాడుతూ, దేశంలో ప్రధాని పదవికి అనేకమంది నేతలు ఉన్నారని, కాని ఒక బృందంగా పని చేసే నేతలు తక్కువగా ఉన్నారని చెప్పారు. ఒక బృందంగా పనిచేస్తేనే ప్రజాస్వామ్యానికి పరిపుష్టి కలుగుతుందని పేర్కొంటూ, అలా చేయకుండా ప్రధాన మంత్రి పదవి కోసం కొట్లాడుకోవడం వల్లననే జనతా పార్టీ ప్రభుత్వం కూలిపోయిందని చెప్పుకొచ్చారు. ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగితే తను బృందంలో ఒకరిగా ఉండాలని అనుకొంటున్నాను గాని కెప్టెన్‌గా మాత్రం కాదని స్పష్టం చేసారు.
తన ప్రభుత్వ మనుగడకు మితపక్షాల మద్దతు కీలకమైనదే అయినా వారి ఒత్తిడులకు వాజపేయ లొంగిపోలేదు. 2004లో నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబునాయుడు ప్రభుత్వం ఓటమి చెందడానికి ప్రధాన కారణం ఓటర్ల జాబితా నుండి సుమారు 40 లక్షల మంది పేర్లను ఎన్నికల కమిషన్ తొలగించడం. మొదట్లో గుంటూరు జిల్లాలో బోగస్ పేర్లను ఓటర్ల జాబితాలో చేర్చారని అంటూ కాంగ్రెస్ నేత కాసు వెంకట కృష్ణారెడ్డి ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసారు. దానిపై నాటి ప్రధాన ఎన్నికల కమిషనర్ లింగ్డో కమిషన్ సలహాదారైన కేజీ రావును పరిశీలనకు పంపారు. కేజీ రావు గుంటూరు జిల్లాలోని పలు చోట్ల ఇంటింటికీ వెళ్లి ఓటర్ల జాబితాలను పరిశీలించి, రెండు లక్షలకు పైగా పేర్లను తొలగించారని కనుగొన్నారు. ఒకే జిల్లాలో ఇన్ని బోగస్ పేర్లు ఉంటే రాష్ట్రం అంతా మరెన్ని ఉన్నాయో అని లింగ్డో ప్రత్యేక పరిశీలన చేయించారు. ఈ పరిశీలనను అడ్డుకోవాలని ప్రకటించిన చంద్రబాబు చివరి ప్రయత్నంగా ప్రధాని వాజపేయిని కలిసినా ప్రయోజనం లేకపోయింది. రాజకీయ విధానాల పరంగా ఏమాత్రం పొసగని కరుణానిధి, ఫరూక్ అబ్దుల్లా వంటి వారితో కలసి వాజపేయి ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగారు.
స్వతంత్ర భారత దేశంలో బహుశా వాజపేయి మంత్రివర్గంలోనే ఎటువంటి అరమరికలు లేకుండా స్వేచ్ఛగా చర్చలు జరుగుతూ ఉండేవి. మంత్రివర్గంలో మమతా బెనర్జీ, జార్జి ఫెర్నండెజ్, నితీష్ కుమార్, రామ్ విలాస్ పాశ్వాన్ వంటివారు ఉండేవారు. వీరు అన్ని అంశాలపై సుదీర్ఘంగా మాట్లాడుతూ ఉండేవారు. అయినా వారెవ్వరినీ కట్టడి చేసే ప్రయత్నం చేయకుండా, అందరికీ అటువంటి అవకాశం ఇచ్చేవారు. పైగా వాజపేయి తన హయాంలో ప్రభుత్వం చేసే పని వ్యాపారం కాదంటూ ఆయన చేపట్టిన ప్రైవేటీకరణ, పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ వంటి భారీ సంస్కరణలకు తెరలేపారు. ఎన్నడూ లేని విధంగా ప్రత్యేకంగా పెట్టుబడుల ఉపసంహరణ మంత్రిత్వ శాఖను ఏర్పరచి, దానికి ప్రముఖ జర్నలిస్ట్ అరుణ్ శౌరిని మంత్రిగా నియమించారు. ఐదేళ్ల పదవీకాలంలో 32 ప్రభుత్వ రంగ కంపెనీలు, హోటళ్లను ప్రైవేట్ పరం చేశారు. డిజినె్వస్ట్‌మెంట్ చేయదగిన కంపెనీలను గుర్తించిన తర్వాత వాటిని త్వరితగతిన ఆమోదించడానికి క్యాబినెట్ కమిటీని నియమించారు.
సాధారణంగా ప్రభుత్వాలు చిన్న చిన్న ఆస్తులను, భూములను ప్రైవేటుపరం చేస్తేనే పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని, ప్రభుత్వంలో ఉన్నవారు ముడుపులు తీసుకున్నారని ప్రతిపక్షాలు విమర్శలు కురిపిస్తాయ. కాని వాజపేయి ప్రభుత్వంలో భారీ స్థాయిలో పెట్టుబడుల ఉపసంహరణ జరిగినా ప్రధానమంత్రి పైన గాని, ఆ శాఖ నిర్వహించిన మంత్రి పైన గాని ఒక్కటంటే ఒక్క విమర్శ కుడా రాకపోవడం గమనార్హం. అది వాజపేయి సమర్థతకు, పారదర్శకంగా పరిపాలన పట్ల చూపిన శ్రద్ధకు నిదర్శనమని చెప్పాలి. ఆ విధమైన ప్రభుత్వాలు మనం ఇంతకు ముందెన్నడూ చూడనే లేదు. బహుశా ఇక ముందు కూడా చూడలేకపోవచ్చు.
వాజపేయి ఉదారవాదిగా కనిపించినా ఆయనకు సైద్ధాంతికంగా బలమైన అభిప్రాయాలు ఉన్నాయి. ఒక విధంగా నెహ్రూ సామ్యవాద ధోరణులు, ఇందిరాగాంధీ సంక్షేమ కార్యక్రమాల ప్రభావం ఆయనపై ఎక్కువగా ఉంది. అందుకనే భాజపాను కాంగ్రెస్ పార్టీకి ‘కార్బన్ కాపీ’గా మార్చారనే విమర్శలకు అవకాశం ఇచ్చారు. ఆయన ప్రవచించిన ‘గాంధేయ సామ్యవాదం’ సంఘ్ పరివార్‌లో తీవ్ర విమర్శలను ఎదుర్కొన్నది. సిద్ధాం తపరంగా ఈ వాదాన్ని బిజెపిలోనే నాడు విజయరాజే సింధియా తీవ్రంగా వ్యతిరేకిస్తూ నాలుగు పేజీల పత్రాన్ని పార్టీ జాతీయ కార్యవర్గం ముందుంచారు.
జనసంఘ్ నేత దీనదయాళ్ ఉపాధ్యాయ ‘ఏకాత్మ మానవతావాదం’ ప్రతిపాదించి కొద్ది రోజులకే మర ణించారు. ఆ వాదాన్ని ముందుకు తీసుకు వెళ్ళే ప్రయత్నం నాడు జనసంఘ్‌లో గాని, తర్వాత బిజెపిలో గాని జరగనే లేదు. అందుకు కూడా వాజపేయి ప్రధాన కారకులని చెప్పక తప్పదు. కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయ ఆర్థిక, రాజకీయ, సామాజిక విధానాలు ప్రతిపాదించే ప్రయత్నం ఎవ్వరు చేసినా సహకరించలేదని చెప్పాలి. అటువంటి ప్రయత్నం చేసిన బలరాజ్ మధోక్, సుబ్రమణ్య స్వామి, గోవిందాచారి వంటి వారు పార్టీకి దూరం కాక తప్పలేదు.
పత్రికా స్వాతంత్రం పట్ల అమితమైన విశ్వాసం ఉన్న నేతలలో వాజపేయి అగ్రగణ్యుడని చెప్పవచ్చు. 2002లో గుజరాత్ అల్లర్ల సందర్భంగా తన ప్రభుత్వాన్ని ఘాటుగా విమర్శిస్తూ సంపాదకీయాలు రాసిన హెచ్‌కే దువాను తన మీడియా సలహాదారునిగా నియమించుకోవడం అందుకు నిదర్శనం. తనకు వ్యతిరేకంగా వార్తలు రాస్తున్న సంపాద కులు, యాజమాన్యాలు, జర్నలిస్టులతో మాట్లాడమని ఒక్కసారి కూడా వాజపేయి కోరలేదని దువా చెప్పడం గమనార్హం. విలక్షణమైన వ్యక్తిత్వాన్ని కలిగి వాజపేయి వంటి నేతలను మరింక చూడలేమని చెప్పవచ్చు.

- చలసాని నరేంద్ర