మెయిన్ ఫీచర్

‘హీరో’లు ఎంత కాలం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అభినయానికి అత్యంత ఆత్మీయులు, అనితర సాధ్యమైన నట విశ్వరూపానికి నిజ వారసులు తెలుగు వెండితెరను బంగారుతెరగా మార్చేసిన మహనీయ నటీనటులు. తెలుగు సినిమా ప్రపంచ సినిమా ముఖ చిత్రాన్ని అగ్రభాగం ఆక్రమించడానికి తొలి కారకులు... యస్వీఆర్, ఎన్టీఆర్, ఏఎన్నార్, సావిత్రి, గుమ్మడి వంటి వారితోపాటు మరి కొందరున్నారు. సినిమా పాత్ర పోషణలో అఖండులు. సన్నివేశానుసారంగా సంభాషణలు తమదైన శైలిలో అద్భుతంగా పలుకగల ఉద్ధండులు. అందుకే వారు నటించిన ఎన్నో సినిమాలు తరాలు మారుతున్నా తరతరాలకు అవి ఆణిముత్యాలు. చాలావరకు నూత్న సినీ ప్రవేశకులకు అవి అపురూప సినీ పాఠ్యపుస్తకాలు.
అక్కినేని, నందమూరి హీరోలుగా, కథానాయకులుగా, కథన గమన సహ పాత్రధారులుగా ఎన్నో విభిన్న పాత్రల్ని అలవోకగా పోషించి, నవరసాల్ని అవలీలగా ఆవిష్కరించి ప్రేక్షకుడికి కనువిందు చేసిన మహానటులు. ఎవరి అండదండలతో అడుగిడలేదు సినిమా లోకంలోకి. ఎవరి వారసులుగానూ పరిచయంకాలేదు సినీ ప్రపంచానికి. అక్కినేని ఒక నాగేశ్వరరావుగానే, నందమూరి ఒక రామారావుగానే సామాన్య సహజ నటులుగానే సినిమా రంగంలోకి అరంగేట్రం చేశారు. ఎవరికివారే ఒక పంథా ఎన్నుకున్నారు. విలక్షణ బ్రాండ్‌లు నిలుపుకున్నారు. లెజెండ్‌లయ్యారు! మహానటులుగా ప్రేక్షక హృదయాల్లో చెరిగిపోని ముద్రవేశారు. వెలకట్టలేని విలువైన సినిమా అభిమానుల్ని సంపాదించుకున్నారు. అలా వారి తర్వాత నట వారసులుగా బాలకృష్ణ, నాగార్జునలు చిత్రసీమలో కాలుమోపారు. ఇక వారి బాటలో కృష్ణ, కృష్ణంరాజు, చిరంజీవి వంటి మరికొందరి వారసులుగా కొనసాగుతున్న పలు హీరోల సందడిని సక్సెస్‌ని తెరపై నేడు చూస్తూనే ఉన్నాం. అలాగే భారీ చిత్రాల నిర్మాతలుగా రాజ్యమేలిన ఇంకొందరు నిర్మాతల వారసుల్ని వెండి తెరపై వీక్షిస్తూనే ఉన్నాం.
సరే! ప్రతిభ లేనిదెవరూ రాణించజాలరన్న నానుడికి పట్టంగడుతూ వారసులంతా ప్రేక్షకుల మెప్పుపొందుతూ బాక్సాఫీసు పెట్టె నింపుతూనే ఉన్నారు. దాన్ని పక్కనపెట్టి అసలు విషయానికి వచ్చేద్దాం. బాలకృష్ణ, నాగార్జునలు బడా హీరోలుగా సుస్థిర స్థానం ఏర్పరచుకునేసరికి వాస్తవానికి ఎన్టీఆర్, ఏఎన్నార్‌లు వెండి తెరనుండి దాదాపుగా (ఒకటీ అరా, మరీ గంతులేసే పాత్రలుకాక) వైదొలగారు హుందాగా. కాబట్టి సినిమా అభిమానులు కూడా తండ్రీ కొడుకులకి తమ అభిమానాన్ని ఏక కాలంలో పంచడానికి, చూపడానికి ఇబ్బంది (పడలేదు) ఎదురవలేదు. ఉన్నంతలో తండ్రుల్లాగే బాలయ్య, నాగ్‌లిద్దరూ తెలుగు సినిమా చరిత్రలో నిల్చిపోయి తమకంటూ గుర్తింపుని తెచ్చిపెట్టే కొన్ని ‘అపూర్వ’ సినిమాల్లో నటించి భేష్ అన్పించుకున్నారు.
చిక్కొచ్చి పడిందెక్కడంటే నాగ్ తిరిగి తన వారసులుగా తనయులు నాగచైతన్య, అఖిల్‌లను వెండితెరకు పరిచయం చేసాడు. అంతవరకు ఓకే! వాళ్ళ టాలెంట్, శ్రమ ఎన్నుకునే సినిమాల్నిబట్టి హీరోలుగా(పాపులర్) నిలదొక్కుకోవడమనేది ఆధారపడి ఉంటుందనేది జగమెరిగిన సినీ సత్యం. అయితే కొడుకులు యంగ్ హీరోలుగా చలామణీ అవుతున్న తరుణంలో కూడా తానింకా రిటైర్ అవకుండా హీరో పాత్రలు చేస్తూ వాళ్ళ ఎదుగుదలకు (స్టార్స్‌గా) ఆటంకమవుతున్నాడని సినీ మేధావుల బహిరంగ అభిప్రాయం. అక్కినేని నాగేశ్వరరావు అబ్బాయి నాగార్జున ఎదుగుదలకోసం అతడిని హీరోగాచేసి తను సహాయ పాత్రలతో ఇద్దరూ ఇద్దరే, కలెక్టర్ గారబ్బాయి, అగ్నిపుత్రుడు (అలాగే రామదాసులో కూడా) వంటి సినిమాలు చేసాడు. అలా తన పిల్లల్ని ముందుంచి తను వెనకుండకుండా ఇంకా హీరో పాత్రలకోసం పాకులాడుతున్నాడని కొందరి వాదన. ఏదేమైనా తండ్రిగా తాను సైడైపోతే కొడుకులు హీరోలుగా బెటరవుతారని అంటున్నారు అభిమానులు. ఆలోచించాల్సిందేనేమో! మోక్షజ్ఞ తెరపైకింకా రాలేదు కాబట్టి బాలకృష్ణ విషయంలో పై మ్యాటరు చెల్లుబాటుకాకపోవచ్చేమో గానీ.. కొడుకు హీరోగా ప్రవేశిస్తే మాత్రం బాలయ్య కూడా నెమ్మదిగా సినిమాలు తగ్గించుకుంటేనే కొడుకుకి బంగారు భవిష్యత్ ఉంటుందంటున్నారు సినీ క్రిటిక్స్. చిరంజీవికీ విషయంలో ఇబ్బంది ఎదురవలేదు. రామ్‌చరణ్ హీరోగా ఎంట్రీ ఇచ్చే సమయానికి చిరు రాజకీయాలంటూ సినిమాలకు కాస్త దూరంగా ఉన్నాడు. మరెందుకో ఏమో గానీ ఖైదీ నెంబర్ 150 అంటూ హిట్ మూవీతో తిరిగి అడుగుపెట్టి, ‘సైరా’ అంటూ మరో సినిమాను రూపొందిస్తూ, కొరటాల శివతో న్యూసినిమా గురించి చర్చిస్తున్నా.. కొడుకు హీరోగా మంచి ఫామ్‌లోఉన్న తరుణంలో తండ్రి ‘హీరో’గా సంబరపడడం (ఎంత బాక్సాఫీసుని షేక్ చేసినా) అవసరమా అంటోంది ప్రేక్షక గణం. నిజమేనేమో!
కాబట్టే, తనవారు తనకు పోటీ లేరు కాబట్టే ప్రభాస్ ఇమేజ్ అంతలా పెరిగిపోయిందని సినిమా పెద్దల ఉవాచ. కాదనెవరనగలరు?
మోహన్‌బాబు విషయంలోనూ ఇదే చిక్కొచ్చిపడుతోంది ఆయన వారసులకు. ఒకట్రెండ్ హిట్స్ ఇచ్చినా విష్ణు, మనోజ్‌లింకా స్టార్ హీరోలుగా వెల్ సెటిల్ కాలేకపోతున్నారు. వాళ్ళు ఎంచుకున్న మూస కథల ధోరణితో పాటు మోహన్‌బాబు కూడా ఇంకా ఈ కాలంలో హీరోగా సినిమాలు చేస్తూ వాళ్ళ ఎదుగుదలకి అడ్డుపడుతున్నాడన్నది ప్రేక్షక మహాశయుల్లోని మనసులో మాట. తనయులు హీరోలుగాచేస్తూ తనూ హీరోగాచేస్తూ సక్సెసివ్వకుండా ప్రేక్షకుల్ని కన్‌ఫ్యూజ్ చేస్తూ ఎందుకీ తలనొప్పి వ్యవహారమంటూ ప్రతిఒక్కరూ చెవులు కొరుక్కుంటున్నారు.
మహేష్‌బాబు విషయంలో కృష్ణ లైన్‌క్లియర్ చేసేసాడు కాబట్టి ఆయనకేం హీరోగా ఎదురులేదన్నది సినీ ప్రియుల వాదన. అందుకే ఘట్టమనేని అభిమానుల అండతో సక్సెస్ సినిమాలబాటలో మహేష్‌బాబు స్టార్‌గా దూసుకుపోతున్నాడని సినీ విమర్శకులు సైతం సెలవిస్తున్నారు. మహేష్‌బాబు ఒకవైపు, అవకాశం ఉండి కృష్ణ మరోవైపు ఏక కాలంలో హీరోలుగా చేసేస్తూపోతే మాత్రం మహేష్‌బాబుకింత స్టార్‌డమ్ దక్కేదికాదన్నది సినిమా పరిశ్రమ వర్గీయుల పలుకు. కాదనలేమేమో!
అందుకే వెటరన్ హీరోలు కాస్త ఆలోచించండి. హీరో వెంకటేష్‌కీప్రాబ్లం ఎదురుకాక పోవచ్చునేమో? ఆయన కొడుకు అర్జున్ హీరోగా స్టార్టయ్యేసరికి బహుశా వెంకటేష్ సినిమాల్లో సోలో హీరోగా కొనసాగకపోవచ్చు. ఇప్పుడైతే రానా అన్నయ్య గారబ్బాయి కాబట్టి పెద్దగా కాంట్రవర్సీ కావడం లేదు.
మొత్తానికి వెటరన్ హీరోలు కాస్త సీరియస్‌గా ఆలోచించి సెటిల్డ్ నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని మాత్రం చెప్పొచ్చు. ఇతరులకి సినిమా పరిశ్రమలో అవకాశం దొరకకుండా హీరోలంతా తమ వారసుల్ని దింపేస్తున్నారన్న ‘అపవాదు’ ఎలాగూ ఉండనే ఉంది. ‘అపవాదు’అని ఎందుకు అనాల్సి వచ్చిందంటే దమ్మున్నోడే దివిటీ అక్కర్లేకుండా దారి వెతుక్కుంటాడు. నిలదొక్కుకుంటాడు. ప్రూవ్ చేసుకుంటాడు. సక్సెస్ కొడతాడు. స్టార్ అవుతాడు. పదికాలాలపాటు ప్రేక్షకుల మనసుల్ని చూరగొంటాడు. కాబట్టి మీ వారసత్వ హీరోల టాలెంట్‌కి మీరే అడ్డుపడకుండా ఉంటే వారి ప్రతిభ ఏంటో సత్తా ఏంటో నిరూపించుకుంటారు కదా! అటు వారసుల్నీ దింపేసి ఇటు మీరూ సినిమాల్లో కొనసాగితే కొత్తవాళ్ళకేదీ దిక్కు! మనమేకాదు పక్కోడూ పైకి రావాలి కదా! అదేకదా నీతి!
సీనియర్ ఎన్టీఆర్ వారసులు బాలయ్య, హరికృష్ణ, తారకరత్న, జూనియర్, కళ్యాణ్‌రామ్... రేపు మోక్షజ్ఞ! అక్కినేని తర్వాత తరం వారిని చూస్తే నాగ్, సుమంత్, సుశాంత్, నాగచైతన్య, అఖిల్, సుప్రియ ఇలా...! కృష్ణ కుటుంబంనుండి రమేష్, మహేశ్, సుధీర్‌బాబు, అమ్మాయి మంజుల... వగైరాలు! కొణిదెల చిరంజీవిని పరికిస్తే పవన్‌కళ్యాణ్, నాగబాబు, రామ్‌చరణ్, అల్లుఅర్జున్, అల్లు శిరీష్, తేజ్, వరుణ్‌తేజ్, నీహారిక.. ఇప్పుడిప్పుడే స్వంతల్లుడు మొదలగువారు! మంచు మోహన్‌బాబు ఇంట్లో విష్ణు, మనోజ్, లక్ష్మి...! ఇలా కుటుంబ వారసత్వ నటీనటులు!! అబ్బో... లిస్ట్ పెరుగుతోంది.
హీరోల కొడుకులు, బంధువులే హీరోలు కావాలా! అంటే సమాధానం లేదు కానీ వారసుల్లాంటి మొలకల్ని ఎదగనీయకుండా ఆయా వంశముల హీరోలు మర్రి ఊడల్లా అడ్డుపడుతున్నారని సినిమా తలకాయలంటున్నాయి. తన తర్వాత తనవారు వారసులుగా కొనసాగాలనుకోవడం ఆశ. మానవ సహజం. కాదనలేదెవరు. కానీ.. వారసులతోపాటు సరిసమానంగా తానూ వెండితెరను అంటిపెట్టుకొని ఉండాలని ఉబలాటపడడం అత్యాశే అవుతుంది. ఇది ముమ్మాటికీ అసహజం. సమర్ధించలేరెవరు.
సక్సెస్‌లొస్తే వస్తాయేమో అది సుడి! అంతమాత్రాన అరవైలు దాటుతున్నా ఆశగా వెర్రిగా ‘హీరోలు’ అన్పించుకోవడం కోసం కుర్ర హీరోల్లా ‘గెంతుతూ’ ఇంకా వెండి తెరను వదలకపోవడం మాత్రం సరికాదు. ఒక వృక్షం తన జాతిమొక్కల్నే కాదు, ఇతర వర్గీయ మొలకల్ని సైతం ఎదగనీయాలి. అది ప్రకృతి ధర్మం. మహామహులైనవారు రాజ్యకాంక్ష మితిమీరిన రారాజులు సైతం ఒక దశలో సింహాసనం నుండి వైదొలగి తమ వారసులైన రాకుమారుల్ని పట్ట్భాషక్తుల్ని చేసి.. వారుచేస్తున్న సుభిక్ష రాజ్య పరిపాలనను కనులారా తిలకిస్తూ.. ఆనందపడుతూ జీవితం గడిపిన వారెందరో చరిత్రలో ఉన్నారు. చరిత్రగా మిగిలారు. అది మరచి కాంక్షను వలచి వగచి మన తెలుగు హీరోలు పోకూడదని సినీ పండితుల ఉద్బోధ. ఓకే అనేద్దాం! తథాస్తు!!

ఎనుగంటి వేణుగోపాల్