మెయిన్ ఫీచర్

తెలుగులో విదేశీ కవితా ప్రక్రియలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగులో మనకు హైకు, రుబారుూ, గజల్, సానెట్, లిమరిక్, ఏక పంక్తి, కత్‌అ, ఎపిటాఫ్ వంటి విదేశీ కవితా ప్రక్రియలు కనిపిస్తు న్నాయి. ఈ విదేశీ కవితా ప్రక్రియలలో హైకు దాదాపుగా ఒక విఫల ప్రక్రియ అయింది తెలుగులో. నిజానికి హైకు అందం, శిల్పం, గొప్ప తనం తెలుగుకు తెలియరాలేదు. తెలుగులో ఏకపంక్తి కవిత, గజల్, ప్రక్రి యలు చలామణిలో ఉన్నాయి. రుబాయి ఉంది అన్న స్థితిలో ఉంది.
ఏక పంక్తి కవితల్ని ‘‘ఏక వాక్యకవిత’’ అంటున్నారు. అది సరి కాదు. ఒక వాక్యం ఎన్ని పంక్తులు లేదా ఎన్ని వరుసలలో ఐనా ఉండచ్చు. మనకు 20, 30 పంక్తులకు పైగా సాగిన ఏక వాక్యాలున్నాయి. ఒక కవి తన భావ వ్యక్తీకరణను ఒక పంక్తిలో చెప్పడం ఏక పంక్తి అవుతుంది. ఈ ఏక పంక్తిలో ఒకటి, రెండు వాక్యాలు ఉండొచ్చు. నిజానికి ఏక వాక్యాలు అన్నవి ఎప్పటినుంచో ఉన్నాయి. కానీ ఇటీవల తెలుగులో ఏక వాక్యాలకు ఆద్యులు, ఏక వాక్య గురువులు, ఏక వాక్య విశారదులు పుట్టుకొచ్చారు. ఇది హాస్యాస్పదం. అంతేకాదు ఏక వాక్యాలు అనడం తప్పు అని కూడా తెలియనివాళ్ళు వేలకు వేలు ఏక వాక్యాలు రాశామంటూ రికార్డ్‌లు సృష్టించేశారు. ఇది తెలుగుకే అవమానం. ఇది గర్హనీయం.
గజల్ ప్రక్రియ కాఫియా దోషాలతోనూ, గజల్ తనానికి దూరంగానూ ఉండడమే కాదు తెలుగు భాషనే భ్రష్టుపట్టించేసింది. తెలుగులో గజల్, గజల్ కాని అజల్‌గా ఉంది. ‘తెలుగు గజల్ కాదు తెలుగులో గజల్’ రావాల్సిన అవసరం ఉంది. ఇక రుబారుూ, ఏది రుబారుూ కాదో అదే రుబాయిగా తెలుగులో ప్రచారంలోకొచ్చింది. రుబారుూ అన్నది ఒక ఛందో ప్రక్రియ అన్న ప్రాథమిక ఎరుక లేకుండా పోయింది తెలుగులో.
హైకు
తెలుగులోకి వచ్చిన తొలి విదేశీ కవితా ప్రక్రియ హైకు. 1923లో దువ్వూరి రామిరెడ్డి మర్మ కవిత్వం అన్న తమ వ్యాసంలో జపాన్ కవి బషో హైకులను ‘హొక్కులు’ అన్న శీర్షికతో అనువదించి పద్యాల ద్వారా తెలుగుకు పరిచయం చేశారు. తరువాత కట్టమంచి రామలింగారెడ్డి 1931లో రాళ్లపల్లి అనంత కృష్ణశర్మ ‘గాథా సప్తశతి’ అనువాదానికి రాసిన పీఠికలో కొన్ని జపనీస్ హైకులను తేటగీతి ఛందస్సులో 2 పాదాలుగా అనువదించారు. ఆ తరువాత 1950లో సంజీవదేవ్ కొన్ని హైకులను వచన కవితలుగా అనువదించారు. నొగుచి అనే జపాన్ కవి హైకు గురించి ఇలా అన్నారు. ‘‘క్లుప్తంగా చెప్పి బోధపరచడం హైకు వైష్టం’’. విశ్వ కవితా రూపాలలో హైకు ఒక విప్లవం. హైకుకు ఆది కవి బషో (1644-94). ‘‘పాత కొలను, కప్ప లోపలికి దూకింది, నీళ్ల చప్పుడు’’. ఇది బషో రాసిన ఒక హైకు. హైకు అన్న పదంలో ‘హై’ అంటే వినోదకర అనీ, ‘కు’ అంటే కవిత అనీ అర్థాలు. ఇక్కడ ‘కు’ హ్రస్వమే. హై-కు- అన్న రెండూ చైనీస్ బై-కియా-నుంచి వచ్చాయి. హైకు అన్నది శిల్పాత్మకమైన ఒక ప్రక్రియ. హైకు శిల్పంలో ఋతువుల్ని సూచించే పదాలు, ఇంకా చిత్రణలు, ఘటనలు, రెండు చిత్రణల కలయిక, రెండు ఘటనల కలయిక లేదా చిత్రణ, ఘటన కలయిక అన్నవి ముఖ్యం. హైకు అన్నది నిర్వచనంలా ఉండదు. వివరణలా ఉండదు. హైకులో ఉపమ, రూపకం లాంటి అలంకారాలు ఉండవు. ప్రక్రియ పరంగా హైకు 5-7-5 జిఒన్ (్చజ్యశ) లతో ఒక పాదంగా రాయబడుతుంది. 3 పాదాలలో హైకు ఉండడం ప్రపంచానికి ఇంగ్లిష్ ద్వారా అందిన తప్పు. తొలిసారి హైకు పేరుతో స్వీయ రచన చేసినది గాలి నాసర రెడ్డి. 1990లో ఆంధ్రభూమి దినపత్రికలో ఆయన రాసిన 5 హైకులు అచ్చైనాయి. వాటిలో మొదటిది - నదిలో ఈత / చంద్రుడి శకలాలు / గుచ్చుకున్నాయి. మూడు పాదాలలో 5-7-5 అక్షరాలతో ఈ రచనలు ఉన్నాయి. 1991లో పెన్నా శివరామకృష్ణ రహస్య ద్వారం పేరుతో హైకులు అన్న ఒక సంకలనాన్ని ప్రచురించారు. ఇస్మాయిల్, బి.వి.వి.ప్రసాద్, తలతోటి పృధ్వీరాజ్ వంటి పలువురు కవులు హైకులు అన్న రచనలు, సంపుటాలు వెలువరించారు. కవి ఉప్పల ధడియం వెంకటేశ్వర 2003లో 5-7-5 మాత్రలతో 3 పాదాలతో హైకులు అని రాశారు. హైకులు అన్న రచనలు చేసిన తొలి కవయిత్రి రత్నమాల. నిజానికి మన మాత్రలు జపనీస్ జిఒన్‌లకు ప్రత్యామ్నాయం. హైకులను 5-7-5 మాత్రలతో ఒక పాదంలో రాయడం సరైన పద్ధతి. ఆ పద్ధతిలో ఈ వ్యాస రచయత 2017లో ఫేస్‌బుక్ రాసిన తొలి శాస్ర్తీయమైన హైకు - ‘మంచులో ఆలయం- రవి చూశాడు.’
రుబారుూ
హైకు తరువాత రుబారుూ తెలుగుకు వచ్చిన విదేశీ కవితా ప్రక్రియ. ఇది ఫార్సీ నుంచి తెలుగుకు వచ్చింది. ‘రుబ’ అన్నది అరబీ పదం. స్ర్తీ లింగ శబ్దం. ‘‘రుబ’’ అంటే నాలుగవ, నాలుగవది, నాలుగోవంతు అని అర్థాలు. ‘‘రుబా’’ అంటే నాలుగు భాగాలతో ఉన్నది అని అర్థం. ‘‘రుబారుూ’’ అంటే నాలుగు పాదాల కవిత. రుబారుూకి బహువచనం రుబాయియాత్. రుబారుూ అనగానే మనకు తెలిసివచ్చే పేరు ఉమర్ ఖయ్యాం. ఈ ఉమర్ ఖయ్యాం ఫార్సీ రుబారుూలను 1858లో ఎడ్వర్డ్ ఫిట్ జెరాల్డ్ ఇంగ్లిష్‌లోకి స్వేచ్ఛానువాదం చేశారు. తొలి విడతగా 75, మలివిడతగా 110 రుబారుూలతో ఆ అనువాదం ‘ద రుబైయాత్ ఆవ్ (ఆఫ్ కాదు) ఉమర్ ఖయ్యం’ అనే పేరుతో వచ్చింది. అది విశేష ప్రాచుర్యాన్ని పొందింది. మరికొందరు కూడా ఉమర్ ఖయ్యాం రుబారుూలను ఇంగ్లిష్ లోకి అనువదించారు. 1941లో మన దేశానికి చెందిన స్వామి గోవింద తీర్థ ‘ద నెక్టర్ ఆవ్ గ్రేస్’ పేరుతో 1096 ఉమర్ ఖయ్యాం రుబారుూలను ఇంగ్లిష్‌లోకి అనువదించారు. ఇది ఫార్సీ మూలం నుంచి ఏ రుబారుూకి ఆ రుబారుూగా చేసిన సరైన అనువాదం. ఉమర్ ఖయ్యాం రుబారుూలను ఫార్సీ మూలం నుంచి ఏ రుబారుూకి ఆ రుబారుూగా పిఠాపురానికి చెందిన ఉమర్ అలీ షా 1926లో తొలిసారి తెలుగులోకి అనువదించారు. అవి అప్పటి భారతి పత్రికలో అచ్చయినాయి.
మనుజ కోటిలో దెలివిగా మసలవలయు / నెల్ల పనులందు శాంతమై నెసగవలయు / శ్రవణ నయన జిహ్వేంద్రియ శక్తులెంత / గలిగి యున్నను లేనట్లే మెలగ వలయు - ఈ అనువాదం రుబారుూ రూపంలోనే అంటే 1, 2, 4 పాదాలలో అంత్యానుప్రాస (కాఫియా)తో చేయబడింది. తెలుగులో రుబారుూ రూపంలో వచ్చిన తొలి రచన ఇదే. ఆ తరువాత బూర్గుల రామకృష్ణారావు 1927 జూలై సుజాత పత్రికలో ఉమర్ ఖయ్యాం గురించి రాసిన వ్యాసంలో 30 రుబారుూలను పద్యాలలో అనువదించారు. 1928లో దువ్వూరి రామిరెడ్డి పానశాల పేరుతో భారతి పత్రికలో ఖయ్యం రుబారుూలకు స్వేచ్ఛానువాదాలను ప్రకటించారు. 1932లో ఆదిభట్ల నారాయణ దాసు సంస్కృతంలోనూ, అచ్చ తెలుగులోనూ 110 రుబారుూలను అనువదించారు. ఇంకా రాయప్రోలు సుబ్బారావు, దేవులపల్లి కృష్ణశాస్ర్తి, ముద్దుకృష్ణ, చలం, వంటి 25మంది ఫిట్ జెరాల్డ్ ఇంగ్లిష్ రుబారుూలకు తెలుగు అనువాదాలు ప్రకటించారు. 1961లో సామల సదాశివ అంజద్ రుబారుూలు కొన్నిటిని తెలుగులోకి అనువదించారు. కవి దాశరథి రుబారుూ పేరుతో స్వీయ రచనల్ని ప్రకటించారు. సి.నారాయణ రెడ్డి కూడా రుబారుూ అని చెప్పకుండా అటువంటి రచనలు చేశారు.
షేక్ ముహమ్మద్ ముస్త్ఫా (ప్రొద్దుటూరు) 1980లో నాగార్జున విశ్వవిద్యాలయంలో ఎం.్ఫల్. కోసం ‘ఉమర్ ఖయ్యం రుబారుూలు అనుశీలన’ అన్న లఘుసిద్ధాంత వ్యాసం రాసి సమర్పించారు. ఇది తెలుగులో రుబారుూలపై వచ్చిన అత్యుత్తమ రచన.
రుబారుూ అన్నది ‘ఒక ఛందో ప్రక్రియ’. 1-2-4 పాదాలలో కాఫియా (అంత్యానుప్రాస) రదీఫ్ (పునరావృతం అయ్యేపదం)తో రాసే ఏదో ఒక రచన రుబారుూ అవదు. తెలుగులో మాత్రాఛందస్సులో నాలుగు పాదాలు రాసి దాన్ని వృత్తం అనలేము కదా? రుబారుూలకు నిర్ణీతమైన బహర్‌లు (్ఛందస్సు) ఉన్నాయి. వాటిల్లో రాసినవే రుబారుూలు అవుతాయి. రుబారుూ బహర్‌లలో లేని ఆ తరహా రచనలు కత్‌అ లు అవుతాయి. ‘‘కత్ అ’’ అన్నది మరో ఫార్సీ కవితా ప్రక్రియ.
శాస్ర్తీయమైన బహర్‌లో ఈ వ్యాస రచయత రాసిన తొలి తెలుగు రుబారుూ 2015లో కొన్ని ఫేస్‌బుక్ సాహితీ బృందాలలో వచ్చింది. షజ్రయే అఖ్రబ్ శాఖలోని, ‘‘మఫ్‌ఊలు, మఫారుూలు, మఫారుూలు, ఫెఅల్’’ బహర్‌లోని ఆ రుబారుూ ఇది- దైవానికి గీతాలను ఇవ్వాలి మనం / ధ్యానానికి శిల్పాలను చెక్కాలి మనం / ఈ జన్మ ఫలించేందుకు యత్నించి సదా / భావాలను చూడాలని వెళ్లాలి మనం.
కత్‌అ
రుబారుూని పోలి ఉండే మరో ఫార్సీ ప్రక్రియ కత్‌అ. కత్‌అ అంటే ఖండిక అని అర్థం. 2015న ఫేస్ బుక్ సాహితీ బృందాలలో ఈ వ్యాస రచయత రాసిన తొలి కత్‌అ చోటు చేసుకుంది. అది -
సాగి వచ్చే పాటలోనే దాగి ఉంటా తీయగా/ వీచి వచ్చే గాలిలోనే తేలుతూంటా కమ్మగా / పూచి ఉండే పూవులిచ్చే తావినౌతా నా ప్రియా, / జీవితాంతం నేను నీకై ఉండిపోతా ప్రేమగా.
సానెట్
1966లో సానెట్ అన్న విదేశీ ప్రక్రియ తెలుగులోకి వచ్చింది. ఇది 14 పాదాల కవిత. ఇటలి నుంచి ఇంగ్లిష్ కొచ్చిన ప్రక్రియ. ఇటలి కవి జకోమొ ద లింటీని (1200-1250) దీని సృష్టి కర్త. పాశ్చాత్య దేశాలలో ఎక్కువగా ప్రాచుర్యాన్ని పొందిన ప్రక్రియ ఇది. ఇది ఇటలీ పదం. ‘‘శబ్దం’’ అని దీనికి అర్థం. ఇంగ్లిష్‌లో పెటరాక్ (1304-74) కవి ఈ ప్రక్రియను స్థిరపరిచారు. టామస్ వై అట్ (1503-42), షెయ్ క్స్పియర్ (1564-1616) కవులు సానెట్‌ను ప్రచారంలోకి తెచ్చారు. సానెట్ ఒక ఛందో ప్రక్రియ. ఇది 2 భాగాలుగా ఉంటుంది. 8 పంక్తులు ఒక భాగంగానూ, 6 పంక్తులు ఒక భాగంగానూ, మళ్లీ మొదటి 8 పంక్తులూ 2 నాలుగు పంక్తుల భాగాలుగానూ తదుపరి 6 పంక్తులూ 1 నాలుగు పంక్తుల భాగంగానూ, ఆపై చివరి 2 పంక్తులు ఒక భాగంగానూ ఉంటుంది. ‘‘సన్నుతులు’’ పేరుతో అబ్బూరి రామకృష్ణరావు సానెట్‌లను తెలుగుకు తెచ్చే ప్రయత్నం చేశారు. ఊహాగానం ఇతర కృతులు అన్న సంపుటిలో వారి 6 సన్నుతులు ఉన్నాయి. సానెట్ కుండే అంత్యప్రాసల విధానంతో తెలుగు పద్య ఛందస్సులో 14 పంక్తులలో వారు రాశారు. కాశీభొట్ల సత్యనారా యణ, ఎస్.వి.ఎ. రామలింగ శాస్ర్తి, చేపూరి సుబ్బారావు, కోడూరి ప్రభాకర రెడ్డి ప్రభృతులు షెయ్ క్స్పియర్ సానెట్లను తెలుగులో ప్రప్రియ పరంగా కాకుండా పద్యాలలో అనువదించారు.
లిమరిక్
లిమరిక్ ఇంగ్లిష్ నుంచి తెలుగుకు వచ్చిన ప్రక్రియ. 1846లో ఎడ్వర్డ్ లియర్ రాసిన బుక్ ఆవ్ నానె్సన్స్ ద్వారా ఈ లిమరిక్ లు ప్రాచుర్యంలోకి వచ్చాయి. 1700 నాటికే లిమరిక్‌లు ఉన్నాయని చెబుతున్నారు. లిమరిక్ ప్రాథమికంగా జానపదం నుంచి రూపొందింది. తమాషాకు పాడుకునే ఒక అబద్ధాల పాటగా లిమరిక్‌ను పరిగణిస్తారు. లిమరిక్ అంత్యాను ప్రాసతో ఉండే 5 పాదాల ప్రక్రియ. 5 పాదాలకూ ఒకే అంత్యానుప్రాస ఉంటుంది. 1-2-5 పాదాలకు ఒక అంత్యానుప్రాస, 3-4 పాదాలకు ఒక అంత్యానుప్రాస ఉన్న లిమరిక్ లు కూడా ఉన్నాయి ఇంగ్లిష్‌లో. లిమరిక్ ను లిమఋక్‌గా శ్రీశ్రీ తెలుగుకు తెచ్చారు. శ్రీశ్రీ 50 లిమఋక్‌లు రాశారు. వారి తరువాత ఈ ప్రక్రియ కొనసాగలేదు.
ఏక పంక్తి కవిత
అంతర్జాలం ద్వారా తెలుగుకు పరిచయమైన కవితా ప్రక్రియ ఏక పంక్తి కవిత. 2003లో ‘‘పిలిచాను, అందుకున్నాను, వగచాను’’ ఇది ఈ వ్యాస రచయత రాసిన తొలి తెలుగు ఏక పంక్తి కవిత. శాస్ర్తీయమైన జపనీస్ హైకు ఏక పంక్తి కవితే. 17వ శతాబ్దంలోనే హైకు రూపంలో ఏక పంక్తి కవిత ఉంది. ఆ విధంగా తెలుగులో వచ్చిన ఏక పంక్తి కవితకు కాకతాళీయంగా హైకు మూలమయింది.
ఎపిటాఫ్
ఇది గ్రీక్ నుంచి ఇంగ్లిష్‌కు వచ్చి ప్రాచుర్యాన్ని పొందిన ప్రక్రియ. మరణించిన వాళ్ల సమాధులపై లిఖించబడిన వాక్యాలు ఈ ఎపిటాఫ్‌లు. ఇవి ప్రాసలతోనూ, ప్రాసలు లేకుండానూ, కనిపిస్తున్నాయి. ఈజిప్ట్, రోమ్ లలో కూడా ఈ ఎపిటాఫ్‌లు ఉన్నాయి. 15వ శతాబ్దినుంచి ఇంగ్లిష్‌లో ఎపిటాఫ్‌లు కనిపిస్తున్నాయి. మరణించాక ఆ మనిషి సమాధిపై కొన్ని వాక్యాలను కవితాత్మకంగా చెప్పడం ఎపిటాఫ్ అవుతుంది. తెలుగులో ఎపిటాఫ్‌లు ఈ వ్యాస రచయత ద్వారా వచ్చాయి.
శ్రద్ధాసక్తులు ఉన్న కవులు ఈ విదేశీ కవితా ప్రక్రియల్ని సరైన అవగాహనతో రాస్తే ఆ ప్రక్రియల ప్రత్యేకతలవల్ల కవితకు కొత్త మెరుగులు అందుతాయి.

గజల్
తెలుగులోకి వచ్చిన అరబీ-్ఫర్సీ ప్రక్రియ గజల్. గజల్ అనే పదం అరబీ పదం. అరబీలో కసీదా అనే ఒక ప్రక్రియ నుంచి పుట్టిన గజల్ ఫార్సీలోకి వెళ్లి సంపూర్ణత్వాన్ని సంతరించుకుంది. అంతరతుల్ అబసీ, హరిరీ అనేవారు తొలిదశ అరబీ గజల్ కవులు. ఫార్సీలో రూద్ కీ, రూమీ, సాదీ కవులు తొలిదశ గజల్ కవులు. గజల్ పదానికి పూర్వ రూపమైన అరబీ గజ్జాల్ పదానికి లేడి, జింక అని అర్థాలు. ఇరాన్ దేశపు రాగాలలో ఒక రకానికి ఆ పేరు ఉండేది. గజల్ పదానికి వేరు, వేరు అర్థాలున్నాయి. హాఫిజ్ కవి ఫార్సీలో మహోన్నతమైన గజళ్ళు వ్రాశారు. పర్షియన్ రాజుల కాలంలో గజల్ మన దేశానికి వచ్చింది. హజ్రత్ అమీర్ ఖుస్రో గజల్‌కు మన దేశంలో ఊపిరి పోశారు. దక్షిణ భారత దేశపు వలీ దక్కనీ ఉర్దూను గజల్ భాష చేశారు. 1961లో కవి దాశరథి గాలిబ్ గీతాలు పేరుతో కొన్ని గాలిబ్ గజళ్ల షేర్‌లను తెలుగులోకి అనువదించారు. 1963లో తొలి తెలుగు గజల్‌గా దాశరథి ‘‘రమ్మంటే చాలు గానీ రాజ్యాలు విడిచి రానా / నీ చిన్ని నవ్వు కోసం స్వర్గాలు గడిచి రానా- అన్న గజల్ వచ్చింది. 1967లో కొలంబియా రికార్డ్స్‌పై ఈమని శంకర శాస్ర్తి సంగీతంలో దాశరథి రాసిన ‘‘అధరాల వీధిలోన మధు శాలలున్నదాన’’ అన్న గజల్‌ను పి.బి.శ్రీనివాస్ పాడారు. ఇది తొలి తెలుగు గజల్ గానం. సి.నారాయణరెడ్డి తమ అక్షరాల గవాక్షాలు కవితా సంపుటిలో ‘‘కొంత కాలమిటులే యేకాంతమ్మున మేలుకొందు / కనురెప్పల కశ్రువులను కావలిగా నిల్పుకొందు’’ అన్న గజల్‌ను జాగృతుడు అన్న శీర్షికతో ప్రకటించారు. ఆ తరువాత ఆయన 1984 తెలుగు గజళ్ళు శీర్షికతో ధారావాహికగా కొన్ని గజళ్ళు రాశారు. తెలుగులో గజల్‌కు ఊపును తీసుకొచ్చిన వారు సి.నారాయణ రెడ్డి. 1978 కడప ఆకాశవాణి కేంద్రంలో ‘‘కల్పనలు సన్నాయి ఊదే వేళ చింతలు దేనికి? / కవితలనె అర్పించు కానుక లోక కల్యాణానికి’’ అన్న గజల్‌ను పి.బి.శ్రీనివాస్ రాసి, స్వర పరిచి, పాడి ప్రసారం చేశారు. తొలి తెలుగు గజల్ గాయకులు, వాగ్గేయకారులు పి.బి.శ్రీనివాస్. దాశరథి, పి.బి.శ్రీనివాస్, సి.నారాయణరెడ్డి ఈ ముగ్గురూ తెలుగు గజల్ ముమ్మూర్తులు. ఈ వ్యాస రచయత రాసిన ‘‘నవ్వుతూ నువ్వుండి పోతే నాకు తోడయి ఓ ప్రియా/ఉండిపోదా సౌఖ్యమంతా నాకు నీడయి ఓ ప్రియా’’ గజల్ అంతర్జాలంలో వచ్చిన తొలి తెలుగు గజల్. ఆపై శాస్తీయమైన బహర్ (్ఛందస్సు)లో వచ్చిన తొలితెలుగు గజల్ కూడా అదే. స్వరూపరాణి తొలి తెలుగు గజల్ కవయిత్రి.

- రోచిష్మాన్, 9444012279