ఎడిట్ పేజీ

‘జమిలి’ జోరులో ‘ప్రక్షాళన’ ఊసేది?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశవ్యాప్తంగా ఇపుడు ఒకటే చర్చ.. లోక్‌సభకు, అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరుగుతా యా? విడివిడిగా నిర్వహిస్తారా? అనే రచ్చ ఎక్కువైంది. అసెంబ్లీలకు, లోక్‌సభకు ఒకేసారి (జమిలి) ఎన్నికలు జరిగితే లాభనష్టాలెలా ఉంటాయన్న అంశంపై రాజకీయ పార్టీలు అంచనాలు వేసుకుంటున్నాయి. ‘లాభపడే’ పార్టీలు ‘జమిలి ఎన్నికలు’ జరగాలని కోరుతుండగా, నష్టపోతామని భావిస్తున్న పార్టీలు అసెంబ్లీలకు విడిగా ఎన్నికలు జరగాలని కోరుతున్నాయి. కాగా, ‘జమిలి ఎన్నికల’కు అన్ని రాజకీయ పక్షాలు సుముఖత చూపినా- రాజ్యాంగంలో ఆర్టికల్ 81లోని వివిధ సెక్షన్లకు సవరణలు చేయాల్సి ఉంటుంది. ఆర్టికల్ 81, 331 ప్రకారం లోక్‌సభలో సభ్యుల సంఖ్య 552. అందులో 530 స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. 20 మంది ఎంపీలు కేంద్రపాలిత ప్రాంతాల నుండి వస్తారు. ఇద్దరు ఆంగ్లో ఇండియన్లను రాష్టప్రతి నామినేట్ చేస్తారు. 1950-ప్రజాప్రాతినిధ్య చట్టం షెడ్యూలు-1 ప్రకారం లోక్‌సభ సభ్యుల సంఖ్య 543 మాత్రమే. తర్వాత ఆ సంఖ్యను పెంచారు.
దేశంలో ఏపీ, తెలంగాణ, బిహార్, జమ్మూ కశ్మీర్, కర్నాటక, మహారాష్ట్ర, యూపీల్లో మాత్రమే విధాన పరిషత్‌లు కొనసాగుతున్నాయి. ఈ ఏడాది మిజోరం, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ అసెంబ్లీలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. రానున్న రెండేళ్ల కాలంలో దేశంలో ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి.
లోక్‌సభ, రాజ్యసభ ఎన్నికలకు ఇంతవరకూ కేంద్రం వెచ్చించిన మొత్తం రూ. 8930 కోట్లు, రాష్ట్రాల ఎన్నికలకు వెచ్చించిన మొత్తం రూ. 12వేల కోట్లు. స్వాతంత్య్రానంతరం తొలి లోక్‌సభ ఎన్నికలకు రూ. 10.45 కోట్లు కాగా, 2014లో లోక్‌సభ ఎన్నికలకు చేసిన ఖర్చు రూ. 3,870 కోట్లు. వచ్చే లోక్‌సభ ఎన్నికలకు సుమారు ఆరువేల కోట్ల రూపాయలు ఖర్చు కాగలవని అంచనా. దేశంలో ఏ ఎన్నిక జరిగినా అందులో 50 శాతం వ్యయాన్ని రాష్ట్రాలే భరించాలి. 50 శాతం వ్యయాన్ని కేంద్రం భరిస్తుంది. శాంతి భద్రతలకు, పోలీసుల రక్షణ ఏర్పాట్లుకు మొత్తం వ్యయాన్ని రాష్ట్రాలే భరించాలి. ఇది ప్రభుత్వాలకు సంబంధించిన ఖర్చు. ప్రతి ఎన్నికలో అభ్యర్ధుల వ్యయం చూస్తే అనధికారిక లెక్కల ప్రకారం 50వేల కోట్ల పైచిలుకే. రికార్డుల్లో మాత్రం అది 50 కోట్లకు మించదు. ఇంతటి వ్యయంతో ఎన్నికలు తరచూ జరగడం వల్ల రాష్ట్రాలు ఆర్థిక భారాన్ని మోయాల్సి వస్తోంది. 1951 అక్టోబర్ 28న లోక్‌సభ తొలి సాధారణ ఎన్నికలు ప్రక్రియ మొదలై 1952 ఫిబ్రవరి 21తో ముగిసిన తర్వాత- 1952, ఏప్రిల్ 2న తొలి లోక్‌సభ కొలువుతీరింది. ఆ తర్వాత 16 సార్లు లోక్‌సభకు ఎన్నికలు జరిగాయి. 17వ విడత లోక్‌సభ ఎన్నికలు జరగాల్సి ఉంది.
2019 జూన్ 18 నాటికి ఏపీలో కొత్త ప్రభుత్వం కొలవుతీరాల్సి ఉంది. అరుణాచల్ ప్రదేశ్‌లో 2019 జూన్ 1, ఛత్తీస్‌గఢ్‌లో 2019 జనవరి 5, హర్యానాలో 2019 నవంబర్ 2, మధ్యప్రదేశ్‌లో 2019 జనవరి 7, మహారాష్టల్రో 2019 నవంబర్ 9, ఒడిశాలో 2019 జూన్ 11, రాజస్థాన్‌లో 2019 జనవరి 20, సిక్కింలో 2019 మే 27, తెలంగాణలో 2019 జూన్ 8లోగా ఎన్నికలు జరగాలి. బిహార్ , ఝార్ఖండ్, ఢిల్లీ రాష్ట్రాలకు 2020లో ఎన్నికలు జరగాలి. అస్సాం, బెంగాల్, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాలకు 2021లో ఎన్నికలు జరగాల్సి ఉంది. ముందస్తు ఎన్నికలు నిర్వహించాలని కొన్ని రాష్ట్రాలు, జమిలి ఎన్నికలు నిర్వహించాలని మరికొన్ని రాష్ట్రాలు కోరుతున్నాయి. ‘నీతి ఆయోగ్’ ఈ అంశంపై ఒక నివేదిక తయారుచేసి కేంద్ర న్యాయ మంత్రిత్వశాఖకు పంపించింది. న్యాయశాఖ సూచనల మేరకు జమిలి ఎన్నికలపై ఏప్రిల్ మూడోవారంలో ముసాయిదాను సిద్ధం చేసిన న్యాయ సంఘం (లా కమిషన్) విస్తృత సంప్రదింపులు నిర్వహించాలని కోరింది. దీంతో దేశంలో గుర్తింపు పొందిన ఏడు జాతీయ పార్టీలు, 51 రాష్టస్థ్రాయి పార్టీల ప్రతినిధులతో న్యాయ సంఘం సమీక్ష నిర్వహించింది. ఇందులో ప్రధానంగా వచ్చిన సూచనలు రెండు. మొదటిది వివిధ శాసనసభలను రద్దు చేసి లోక్‌సభ సహా అన్ని అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం. ఇక రెండోది- ఇప్పటికే కాలపరిమితి ముగిసిన శాసనసభలను సుప్తచేతనావస్థలో ఉంచి లోక్‌సభ ఎన్నికలతోపాటు వాటికీ ఎన్నికలు నిర్వహించడం. లేదా దేశంలోని అన్ని శాసనసభలకూ, లోక్‌సభకూ రెండు, మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించడం వంటి ప్రత్యామ్నాయాలతో ‘లా కమిషన్’ నివేదిక తయారుచేసింది. ఈ ఏడాది చివరిలో జరగాల్సిన నాలుగు శాసనసభ ఎన్నికలను ఆరు నెలల పాటు వాయిదా వేసి వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో జరగాల్సి ఉన్న అసెంబ్లీ ఎన్నికలను ముందుకు జరిపి, లోక్‌సభతో పాటు డజను రాష్ట్రాల్లో జమిలి ఎన్నికలు నిర్వహించాలన్న ఊహాగానాలు జోరందుకున్నాయి. వాటన్నింటినీ పూర్వపక్షం చేస్తూ, తక్షణం జమిలి ఎన్నికలు అసాధ్యమని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రావత్ స్పష్టం చేశారు.
చట్టసభల పదవీకాలాన్ని పెంచాలన్నా, కుదించాలన్నా అందుకు రాజ్యాంగాన్ని సవరించి తీరాల్సిందే. మరో పక్క ఓటింగ్ యంత్రాల కొరత, శాంతి భద్రతల పర్యవేక్షణకు పోలీసు, రక్షణ సిబ్బంది కొరత, ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా జరగాలంటే సరిపడా నిర్వాహక సిబ్బంది కొరత ఉండనే ఉన్నాయి. శాసనసభలతో లోక్‌సభ ఎన్నికలు జరిగిన సందర్భాలున్నా, వాస్తవానికి దేశవ్యాప్తంగా ఏకకాల ఎన్నికలు జరిగి ఐదు దశాబ్దాలు కావస్తోంది. 1967లో దేశవ్యాప్తంగా ఒకేసారి జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కొన్ని రాష్ట్రాల్లో కొత్తగా కొలువైన ప్రభుత్వాలు అర్ధాంతరంగా కుప్పకూలడం, లోక్‌సభ ఎన్నికలూ ఏడాది పాటు ముందుకు జరగడంతో జమిలి ఎన్నికల తతంగం కాలగర్భంలో కలిసిపోయింది. ఈపద్ధతి పునరుద్ధరణకు 1983లో ప్రతిపాదనలు పంపించగా, 16 ఏళ్లకు ఆ ప్రతిపాదనలను న్యాయ కమిషన్ సమర్ధించింది. సుదర్శన్ నాచియప్పన్ నాయకత్వంలోని పార్లమెంటరీ స్థారుూ సంఘం 2015 డిసెంబర్‌లో జమిలి ఎన్నికలకు జై కొడుతూ నివేదికను సమర్పించింది. 16వ లోక్‌సభ ఎన్నికల మ్యానిఫెస్టోలో ‘ఒకే దేశం- ఒకే ఎన్నికలు’ అంటూ బీజేపీ ప్రతిపాదించింది. లోక్‌సభ , అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలనే ప్రతిపాదనలకు బీజేపీ మద్దతు ప్రకటించిన నేపథ్యంలో ప్రతిపక్ష కాంగ్రెస్ సహా ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలు స్పందించాయి. ఎన్‌డీఏ మిత్రపక్షమైన జేడీయూ మాత్రం ఈసారికి జమిలి సాధ్యం కాదంటోంది. శివసేన కూడా ఏకకాలంలో ఎన్నికలకు ససేమిరా అంటోంది. అమెరికా, రష్యా ఎన్నికలతో కలసి నిర్వహించడం మంచిదేమో అని కూడా ఎద్దేవా చేసింది.
రాబోయే లోక్‌సభ ఎన్నికలకు 18.95 లక్షల ఈవీఎంలు, 9.3 లక్షల కంట్రోల్ యూనిట్లు వచ్చేనెల చివరికి అందుబాటులోకి వస్తాయి. 16.15 లక్షల వీవీప్యాట్‌లు నవంబర్ చివరికి సిద్ధం అవుతాయి. 2019లో జమిలి ఎన్నికలు నిర్వహించాల్సి వస్తే 24 లక్షల ఈవీఎంలు అవుసరమవుతాయి. ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు అదనంగా కొనుగోలు చేయాల్సిన 12 లక్షల ఈవీఎంలకు రూ.4,500 కోట్లు అదనంగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈఏడాది ఎన్నికలు జరగాల్సిన ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మిజోరం అసెంబ్లీ ఎన్నికలతో పాటు 2019 ప్రారంభంలోనూ, చివరిలో జరగాల్సిన తెలంగాణ, ఏపీ, ఒడిశా, మహారాష్ట్ర, హర్యానా, ఝార్ఖండ్, బిహార్ శాసనసభలకు, లోక్‌సభకు ఎన్నికలను కలిపి నిర్వహించే అవకాశాలపైనా కసరత్తు ముగియలేదన్నది నిస్సందేహం. కాగా, అలాంటి ఆలోచన తమకేమీ లేదని బీజేపీ చెబుతోంది. వాస్తవానికి ఏటా ఐదారు అసెంబ్లీలకు ఎన్నికలు జరపడం ఆయా రాష్ట్రాలకే కాదు, కేంద్రానికి కూడా చెప్పలేనంత ఆర్థిక భారం అవుతోంది. ఏదో కొంత భారం పండిందిలే అనుకుంటే సరిపోదు. ఎన్నికలకు కొద్ది నెలల ముందు, ఎన్నికలు జరిగిన తర్వాత కూడా ఒకటి రెండు నెలలు కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వాలు కుదురుకునే వరకూ ఆరు నెలల పాటు ప్రగతి కార్యక్రమాలపై ఎంతో ప్రభావం చూపుతున్నాయి.
ఇదంతా ఒక ఎత్తయితే ఎన్నికల్లో ధనం, కండబలం, బూత్ ఆక్రమణలు, రిగ్గింగ్, హింస వంటి అక్రమాలు రానురానూ మితిమీరిపోతున్నాయి. అధికార యంత్రాంగాన్ని, ప్రసార సాధనాలను దుర్వినియోగం చేస్తున్న ఈ పరిస్థితుల్లో ఎన్నికల అవ్యవస్థను సాంతం ప్రక్షాళన చేయడం ఏ ప్రభుత్వానికైనా సవాలే. 1967 తర్వాత ఎన్నికల సంస్కరణలు జరపాలన్న డిమాండ్ అధికమవుతూనే ఉంది. ఆ దృష్ట్యా ప్రధానిగా వీపీ సింగ్ ఉన్న సమయంలో 1990 జనవరి 9న ఒక సమావేశాన్ని నిర్వహించారు. తత్ఫలితంగా ఆనాటి న్యాయశాఖామంత్రి దినేష్ గోస్వామి అధ్యక్షుడిగా, ఎల్‌కే అద్వానీ, సోమనాథ్ చటర్జీ, ఈరాసేజియన్ వంటి అగ్రశ్రేణి రాజకీయ నాయకులతో పూర్వ గవర్నర్ ఎల్‌పీ సింగ్, ఎన్నికల సంఘం పూర్వ కమిషనర్ ఎస్‌ఎల్ షక్దర్ వంటి ప్రముఖులతో కలిపి కమిటీని వేశారు. గోస్వామి కమిటీ 107 సిఫార్సులను చేసింది. అవి ఎంతవరకూ అమలు అయ్యాయో ఎవరికివారు అంచనా వేసుకోవాలి. 1993లో భారత దేశీయాంగ శాఖ కార్యదర్శిగా వ్యవహరించిన ఎన్‌ఎస్ వోహ్రా అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ ఎన్నికల సంస్కరణలపై మరో నివేదిక ఇచ్చింది. ఈ నివేదిక ఇంతవరకూ బహిర్గతం కాకున్నా, అంతర్జాలంలో మాత్రం ఉచితంగా అందుబాటులో ఉంది. 1998లో ఇంద్రజిత్ గుప్తా కమిటీ మరో నివేదిక ఇచ్చింది. ఇంద్రజిత్ గుప్తా, సోమనాథ్ చటర్జీ, డాక్టర్ మన్మోహన్ సింగ్, ప్రొఫెసర్ విజయకుమార్ మల్హోత్రా, దిగ్విజయ్ సింగ్ వంటి వారు ఇందులో సభ్యులు. 1999 మేలో ఆనాటి న్యాయశాఖ మంత్రి రామ్ జెఠ్మలానీ ఎన్నికల సంస్కరణలపై ‘లా కమిషన్’ సమర్పించిన 170 పేజీల నివేదికను బహిర్గత పరిచారు. ఈ నివేదికను సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టీస్ పి.జీవన్‌రెడ్డి అధ్యక్షతన ఏర్పడిన 16వ లా కమిషన్ ‘ఎన్నికల చట్టాల సంస్కరణల’ పేరుతో సిద్ధం చేసింది. ఆ తర్వాత భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎంఎస్ వేంకటాచలయ్య అధ్యక్షుడిగా, సుప్రీం మాజీ న్యాయమూర్తి జస్టిస్ సర్కారియా, లోక్‌సభ మాజీ స్పీకర్ పీఏ సంగ్మా, భారత అటార్నీ జనరల్ సోలీ సోరాబ్జీ, సీనియర్ న్యాయవాది పరాశరన్, ‘ది స్టేట్స్‌మన్’ పత్రిక చీఫ్ ఎడిటర్ సీఆర్ ఇరానీ , మాజీ రాయబారి డాక్టర్ అబిద్ హుస్సేన్ తదితరులతో కలిసి 2000 ఫిబ్రవరి 23న రాజ్యాంగ సమీక్ష జాతీయ సంఘాన్ని నియమించింది. ఈ కమిటీ 2002 మార్చి 31న నివేదిక ఇస్తూ 38 సిఫార్సులను చేసింది. ప్రజా ప్రాతినిధ్య చట్టం-1951, ఎన్నికల ప్రవర్తనా నియమావళి-1961 వంటి కీలక చట్టాలను కొన్ని నిబంధనలను మరింత కఠినంగా రూపుదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఎన్నికల విధానంలో చేయాల్సిన మార్పులపై 22 సిఫార్సులతో ప్రధాన ఎన్నికల కమిషనర్ 2004 జూలై 5న అప్పటి ప్రధానికి ఒక లేఖ రాశారు. 2008లో రెండో పాలనా సంస్కరణల సంఘం చేసిన సిఫార్సులపై కూడా ప్రభుత్వం పెద్దగా శ్రద్ధ కనబరచలేదు. 2010 వీరప్ప మొయిలీ కమిటీ, 2012 ఏప్రిల్‌లో అప్పటి ఎన్నికల ప్రధాన కమిషనర్ ఖురేషీ కమిటీ చేసిన సిఫార్సులు ఇంకా అమలులోకి రాలేదు. కాని 2013లో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పులను పరిగణనలోకి తీసుకుని ఎన్నికల కమిషన్ తీసుకొచ్చిన ఇతర సంస్కరణలతో కొంత మార్పు కనిపించింది. సామాన్యుడు సైతం ఎన్నికల అక్రమాలను అడ్డుకట్టవేయాలంటే సమాచార హక్కు చట్టాన్ని పటిష్టం చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో జమిలి ఎన్నికలు దేశాన్ని ఏ దిశగా తీసుకువెళ్తాయి? వేచి చూడాల్సిందే.

-బీవీ ప్రసాద్ 98499 98090