మెయిన్ ఫీచర్

ఒంటరితనంతో మనోవైకల్యం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేటి ఆధునిక యుగంలో కొందరు అందరితో ఉన్నట్టే ఉంటారు.. అయినా ఏదో తెలియని ఒంటరితనంతో బాధ పడుతుంటారు. ఇంట్లో కుటుంబ సభ్యులు, చుట్టూ స్నేహితులు ఉన్నా సరే- కొందరు యువతీ యువకులు సోషల్ మీడియాలో నిండా మునిగిపోతుంటారు. నిజం చెప్పాలంటే ఈ మాయరోగం2 యువతనే కాదు, రానురానూ అన్ని వయసుల వారినీ పట్టి పీడిస్తోంది. రోజుకు రెండు గంటలకంటే ఎక్కువ సేపు 3సోషల్ మీడియా2లో విహరిస్తున్నవారు మానవ సంబంధాలకు దూరమవుతున్నారని వైద్య నిపుణులు చేస్తున్న హెచ్చరికలు అక్షర సత్యాలు. ఒంటరితనానికి అలవాటు పడడం, చిన్న చిన్న సమస్యలను సైతం ఎదుర్కొనలేక పోవడం వంటి మానసిక అవలక్షణాలకు ముఖ్యంగా యువత చేరువవుతోంది. కొన్ని కుటుంబాల్లో ఇంకా బంధుత్వాలు కనిపిస్తున్నాయంటే అవి ఆర్థికపరమైనవి, తాత్కాలికమైనవి.
‘ అంతర్జాలం’లో లీనమవుతూ ఫేస్‌బుక్, ట్విట్టర్, యూ ట్యూబ్ వంటి సామాజిక మాధ్యమాలతో మమేకమవుతున్న వారు మానవ సంబంధాలను, కుటుంబ బంధాలను సైతం విస్మరిస్తున్నారు. సోషల్ మీడియాకు బానిసలవుతున్న వారిలో సామాజిక స్పృహ కరవవుతోందని, ఉన్మాద లక్షణాలు పొడసూపుతున్నాయని నిపుణులు తేల్చిచెబుతున్నారు. సంపన్నుల వలే విలాసంగా జీవించాలని తపన పడడం, తప్పు చేసైనా డబ్బు సంపాదించాలన్న నేర ప్రవృత్తి వంటివి యువతలో పెరిగిపోతున్నాయి. యువతకు మంచి చెడుల గురించి చెప్పడానికి బదులు- ఉమ్మడి కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నం కావడం మరో విషాదకర పరిణామం.
ఇలాంటి జీవితం మనకొద్దు..
నేటి ఉరుకులు, పరుగుల జీవితంలో మనోభావాలను ఇతరులతో పంచుకునే వెసులుబాటు లేకుండా పోతోంది. ‘ముచ్చట్లు చెప్పుకోవడానికి ముగ్గురు దోస్తులు లేరు, కష్టసుఖాలు పంచుకోవడానికి తోబుట్టువులు లేరు’ అన్నట్టు నేటి పరిస్థితి కనిపిస్తోంది. కుటుంబ బంధాలు, ప్రేమానురాగాలు, ఆప్యాయతలు అగుపించడం లేదు. ప్రస్తుతం చాలామందిలో మనసారా నోటి నుంచి పలకరింపు మాటలు లేవు, ఆత్మీయమైన చేతి స్పర్శను మరిచిపోయి ఎన్నాళ్లవుతుందో? కష్టసుఖాలు, నవ్వడం, ఏడవడం, అరవడం, గెంతడం.. అన్నీ సోషల్ మీడియాలోనే గడిపేస్తున్నారు. జీవితంలో ఇంతగా అల్లుకుపోయిన సోషల్ మీడియా మన జీవితాలను బాగుచేస్తున్న దాఖలాలు తక్కువే. కొడుకు వచ్చి ఓదారుస్తాడని కన్నవారు ఎన్నో ఆశలతో ఫోన్‌చేస్తే- వీడియోకాల్ చేసి.. కన్నీళ్లు కార్చేస్తూ.. నాన్నా నాకు సెలవు దొరకడం లేదు..’అని ఆ పుత్రరత్నం అంటే ఆ తల్లిదండ్రులను ఓదార్చేవారు ఎవరు?
తమ కొడుకు గొప్పవాడు కావాలని పెద్ద కార్పొరేట్ స్కూల్‌లో, ఖరీదైన కాలేజీలో, ఏసీ హాస్టల్‌లో ఉంచి అప్పు చేసి మరీ చదివించిన తల్లిదండ్రులకు చివరికి దక్కేది నిరాశే. ‘నాగరిక ప్రపంచంలో ’ మునిగిపోయిన ఆ కుర్రాడికి తన తల్లిదండ్రుల ఆప్యాయత, ప్రేమ, అనురాగం రుచి తెలియదు కదా. డబ్బుతోనే చదివాడు గనుక- విలువలు తెలియవు, సాంప్రదాయాలు తెలియవు. తోబుట్టువులు, బంధువులు, ఇరుగుపొరుగు వారితో ఎలాంటి అటాచ్‌మెంట్ లేకుండానే హాస్టల్‌లో ఏ.సి.రూమ్‌లో ఒక్క యంత్రం లాగా పెరిగిన ఆ అబ్బాయి పెరిగి పెద్దవాడయిన తర్వాత కూడా యంత్రాలతోటే గడపడానికి ఇష్టపడుతాడు. మానవ సంబంధాల గురించి తెలియనివాడు ఒంటరిగానే పెరుగుతాడు. ఒంటరిగానే అతని జీవితం ముగుస్తుంది. ఇలాంటి జీవితం యువతకు వద్దు.
మానవత్వం ఎక్కడ?
పనిచేశాం అలసిపోయాం. శారీరక శ్రమను మరిచిపోవడానికి కాసేపు ఒంటరిగా కూచుంటే ప్రశాంతత దొరుకుతుంది. కానీ ఒంటరితనం మనసుకు సంబంధించినది. కాసేపు ఏకాంతం దొరికితే అపురూపంగా ఆస్వాదిస్తాం. కానీ ఎప్పుడూ ఒంటరిగానే ఉండాల్సివస్తే.. మనిషిని అది భయపెడుతుంది. ప్రస్తుతం మానవాళి ఎదుర్కొంటున్న కొత్తకొత్త రోగాలకు, ఉద్వేగాలకు, ఉన్మాద చర్యలకు, ఆత్మహత్యలకు కారణం- ’భయంకరమైన ఒంటరితనమే’. ఆధునిక సాంకేతికతతో స్వేచ్ఛగా విహరిస్తూ తనకుతానుగా అన్నింటికీ, అందరికీ దూరం అవుతూ- మనోభావాలను పంచుకోవడానికి ఎవరూ లేకుండా కొందరు జీవనాన్ని వెళ్లదీస్తున్నారు. ఇలాంటి ఒంటరి జీవితాన్ని గడుపుతున్నవారు లక్షల్లో ఉంటారనేది నమ్మలేని నిజం. ఒంటరితనం ఒక్కోసారి ప్రాణాలను తీస్తుంది, ప్రాణాలను తీసుకునేలా చేస్తుంది.
పలు కారణాలు
తల్లిదండ్రుల ప్రేమ లభించకపోవడం వల్ల కొందరు పిల్లలు ఒంటరితనాన్ని ఎదుర్కొనాల్సి వస్తుంది. పిల్లవాడు హైస్కూల్ స్థాయికి వచ్చాడంటే చాలు హాస్టల్‌లో వేయడం నేడు పరిపాటిగా మారింది. దీంతో పిల్లలు తల్లిదండ్రుల, తోబుట్టువుల ఆప్యాయతలకు దూరంగా పెరగడం అనివార్యమవుతుంది. యుక్తవయసు వచ్చేసరికి ఉద్యోగరీత్యా ఉన్న ఊరినీ, తల్లిదండ్రులనీ వదిలి నగరాలకు, విదేశాలకు వెళుతుంటారు. ఈ పరిణామాలు యువత మనసుపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ప్రేమ వైఫల్యం, దాంపత్యంలో విభేదాలు, విడాకులు, తల్లిదండ్రులు దూరం కావడం వంటివి కూడా ఒంటరితనానికి దారితీస్తాయి.
ఇంట్లో కుటుంబ సభ్యులున్నా, చుట్టూ స్నేహితులున్నా కొందరు ఒంటరితనంతో గడిపేస్తుంటారు. సాయంత్రం ఇంటికి చేరాక- కుటుంబ సభ్యులతో కాసేపు మాట్లాడడానికి బదులు వాట్సాప్, ఫేస్‌బుక్‌లతో చాలామంది సమయాన్ని గడిపేస్తుంటారు. కుటుంబ సభ్యుల్లో ప్రతి ఒక్కరూ స్మార్ట్ఫోన్లలో లీనమవుతూ పరస్పరం మాట్లాడుకోవడమే మరచిపోతున్నారు. టెక్నాలజీ సాయంతో మనం ఎటు పోతున్నాం? రాబోయే కాలంలో ఈ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవడానికే భయం వేయకతప్పదు.
సాంకేతిక పరిజ్ఞానం పెరిగి మనుషుల మధ్య దూరం తగ్గింది. సోషల్ మీడియా ఎక్కడెక్కడి వారినో కలిపేస్తున్నది. కానీ మనసుల్ని మాత్రం దూరం చేస్తూ వారిని మరింత ఒంటరివాళ్లనుకూడా చేస్తున్నది ఈ సోషల్ మీడియానే. ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సప్‌లలో.. ఫ్రెండ్స్, ఫాలోయర్స్ లైక్‌లు, కామెంట్‌లు పెరుగుతున్నకొద్దీ మనలో ఒంటరితనం మరింత పెరుగుతున్నట్టే! ఆత్మీయతలకు దూరమై యంత్రాలలో ప్రేమానురాగాల కోసం పరుగులు తీస్తున్నారు ఈ జనం.
మందు ఏమిటి?
ప్రతి ప్రశ్నకు సమాధానం ఉంటుందన్నట్టు మన ఒంటరితనాన్ని మనమే దూరం చేసుకోగలం. మనసుకు మాత్రమే అది సాధ్యం. ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లల పెంపకంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. పేరెంట్స్ పెంపకమే వారి భవిష్యత్తుకు పునాది అవుతుంది. పిల్లలను నలుగురిలో మాట్లాడే విధంగా, కొత్త విషయాలను తెలుసుకోవాలనే తపన పెరుగుతున్నట్లుగా పెంచాలి. వారికి ఇచ్చే స్వేచ్ఛ అదుపులోనే ఉండాలి.
స్లో పాయిజన్..
ఒంటరిగా ఉంటే జీవితాన్ని ఎంజాయ్ చేయవచ్చునని కొందరు యువతీ యువకులు అనుకుంటారు. కలివిడిగా మాట్లాడలేకపోవడం మానసిక సమస్యే. చిన్న కుటుంబాలతో ఈ ఒంటరితనం మరింత ఎక్కువైంది. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాల్లో పిల్లలను తల్లిదండ్రులు కోపంగా ఏమైనా అంటే వెంటనే అమ్మమ్మ, నాన్నమ్మ, తాతయ్యలు వారిని దగ్గరకు తీసుకొని ఓదార్చేవారు. పిల్లలు అన్నం తినడానికి మారాం చేస్తే అమ్మమ్మలు, నాన్నమ్మలు పెరుగన్నం కలిపి చందమామను చూపిస్తూ, పాట పాడుతూ అన్నం తినిపించేవారు. ప్రస్తుత పరిస్థితి ఇందుకు భిన్నంగా మారిపోయింది. సెల్‌ఫోన్‌లో గేమ్ చూపిస్తూ అన్నం తినిపించడం వల్ల చిన్న పిల్లలు సెల్‌ఫోన్లకు బానిసలుగా మారుతున్నారు. మన జీవన విధానాలలో మార్పువల్లనే ఒంటరితనం వస్తుంది. ఒంటరితనం అనేది మానసికంగానే కాకుండా శారీరకంగానూ బలహీనపరుస్తుంది. అనుబంధాలకు దూరమైతే అసహనం ప్రారంభమవుతుంది. ఒంటరితనంతో మానసిక ఒత్తిడి పెరుగుతుంది. ఈ కారణంగా విడుదలయ్యే నెగిటివ్ హార్మోన్స్ మెల్లమెల్లగా అనారోగ్యాలకు దారితీసేలా చేస్తాయి. ఒంటరితనమనేది మెల్లమెల్లగా మన జీవితానే్న అంతం చేస్తుంది. ఇది స్లో పాయిజన్‌లాగా పనిచేస్తుంది.
దీన్ని భరించలేం..
కొద్దిసేపు ఏకాంతం మంచిదే. అదే జీవితమైతే ప్రమాదకరమే. చుట్టూ ఎంతోమంది మనుషులున్నా వారందరితో ఎలాంటి సంబంధాలు లేకుండా ఉండడమే ఒంటరితనమవుతుంది. ఇది వ్యక్తిగతమైన ఒక మానసిక వైపరీత్యం. ఈ స్థితిలో వికృతమైన ఆలోచనలు కలుగుతాయి. నిరాశా, నిస్పృహలు పెరుగుతాయి. జీవితం పట్ల, సమాజం పట్ల ఏహ్యభావం పెచ్చుమీరడంతో విపరీత ధోరణులు అనివార్యమవుతాయి.
పలు సమస్యలు
ఒంటరితనం పలు సమస్యలకు దారితీస్తుంది. డిప్రెషన్, ఆందోళన, మతిమరుపు, మాదకద్రవ్యాల వాడకం, స్కిజోఫ్రీనియా, ఆల్జీమర్స్ లాంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. నడి వయసులో జీవిత భాగస్వామిని కోల్పోయి ఒంటరితనంతో బాధపడేవారు ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని ఎంచుకోకపోతే త్వరగా మృత్యువుకు చేరువుతారు. ఒంటరితనంతో ఉన్నవారు అనారోగ్యానికి లోనైనప్పుడు, చిన్నచిన్న ప్రమాదాలేమైనా జరిగినప్పుడు కావలసినంత ఓదార్పు దొరక్క కోలుకోవడానికి ఎక్కువ సమయం పడుతుంది. కొన్ని సందర్భాలలో ఆత్మస్థైర్యం కోల్పోయి కుంగుబాటుకు లోనైతే అది విపరీత పరిణామాలకు, ఆత్మహత్యలకూ దారితీయవచ్చు. ఒంటరితనం అనేది తెలియకుండానే ఆరోగ్యం మీద పరోక్షంగా ప్రభావం చూపుతుంది. వ్యాధి నిరోధకశక్తి సన్నగిల్లుతుంది. దాహం, ఆకలి వంటివి ఎలా బాధను కలిగిస్తాయో ఒంటరితనమూ అంతకంటే భయంకరమైన నొప్పిని కలిగిస్తుంది.
ఒంటరితనాన్ని జయించండిలా..
ఆత్మన్యూనతా భావం జీవితాన్ని అస్తవ్యస్తం చేస్తుంది. సుఖంగా నిద్రపోనివ్వదు. శాంతంగా బతకనివ్వదు. కాబట్టి స్వేచ్ఛగా జీవించండి. ఇతరులకన్నా మీరు ఎందులోనూ తక్కువకాదన్న భావనతో ఉండండి. నవ్వాలనుకుంటే మనస్ఫూర్తిగా నవ్వండి. దుఃఖం కలిగితే భారం దిగిపోయేంతవరకు ఏడ్చితే మనసు తేలికవుతుంది. నలుగురిలో ఉన్నప్పుడు ఏం మాట్లాడాలో, ఎలా మాట్లాడాలోనన్న ఆలోచన రానీయకూడదు. ఎదుటివారి అభిప్రాయాలు, మాటలను గౌరవించడం నేర్చుకోండి. ప్రతి విషయాన్ని భూతద్దంలో కాకుండా పాజిటివ్‌గా ఆలోచించడం అలవాటు చేసుకోండి. అవసరం లేని ఆలోచనలకు తావియ్యకండి. వృత్తిరీత్యా ఎంతోమందిని కలుస్తాం. ఎన్నో సంఘటనలు ఎదురవుతాయి. వాటన్నింటినీ గుర్తుపెట్టుకోవాల్సిన పనిలేదు. ఎప్పుడూ ఇతరుల కోసం కష్టపడుతున్నామన్న భావనతో ఉండొద్దు. ఈ జీవితం మీది. మీకోసం మీరు జీవించండి. ఈ ఆలోచనే మీకు ఎక్కడ లేని శక్తినిస్తుంది. ఎప్పుడూ తెలిసినవారినే కలవడం కాకుండా అప్పుడప్పుడూ కొత్తవారినీ కలవండి. కాలానే్న శాసిస్తున్న మనం ఒంటరితనాన్ని జయించడం అనేది పెద్ద కష్టమైన పనేమీ కాదు. పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు పరిష్కారాలను తీసుకోగలగాలి. కొత్త ప్రదేశంలో గడిపే పరిస్థితి వచ్చినపుడు అక్కడి వారితో స్నేహభావాలను పెంపొందించుకోవాలి. సోషల్ మీడియా వాడకాన్ని పరిమితం చేసుకుని ప్రత్యక్ష స్నేహబంధాల్ని కొనసాగించాలి. కొద్ది సమయం ఖాళీగా దొరికినా- సాహిత్యం, చిత్రలేఖనం, ఆటలు, ఆధ్యాత్మికం, సంగీతం లాంటి వాటిలో ఏదో ఒక వ్యాపకంలో లీనం కావాలి. రోజూ కొంత సమయం మనసుకు నచ్చిన వ్యాపకంలో నిమగ్నమైతే ఒంటరితనం మన దరిదాపుల్లోకి రాదు.

డా. అట్ల శ్రీనివాస్‌రెడ్డి 97039 35321