మెయిన్ ఫీచర్

సినిమాలకు సెన్సార్ ఎందుకు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

**వందలుపెట్టి టిక్కెట్ కొనుక్కుని చూసే సినిమాకు కేంద్ర ప్రభుత్వం సెన్సార్ చేయించాలని నిబంధన విధించింది. సినిమాలకు సెన్సార్ అనేది బ్రిటీష్ వారు పరిపాలిస్తున్నప్పటినుంచి వుంది. వారెందుకు అటువంటి నిబంధన పెట్టారు? సినిమాలు మూకీలనుంచి టాకీలకు మారాయి. దేశానికి స్వతంత్రం కావాలనీ, మా దేశాన్ని మేమే పరిపాలించుకుంటామని ఉద్యమాలు జరుగుతున్నాయి. కాంగ్రెస్‌పార్టీ ఉద్యమాలకు సారధ్యం వహించి, సభల ద్వారా ప్రజలను ఉత్తేజితులను చేస్తున్నది. మహాత్మాగాంధీ సహాయ నిరాకరణ వంటి శాంతియుతమైన కార్యక్రమాల ద్వారా బ్రిటీష్‌వారి నుంచి స్వతంత్రం పొందవచ్చునని ప్రజలను ఆ దిశగా నడిపిస్తున్నారు. బ్రిటీష్‌వారు అలా లొంగరనీ విప్లవం ద్వారా స్వతంత్రం సాధించాలనీ సాయుధ పోరాటం మార్గమనీ సుభాష్ చంద్రబోస్ ఫార్వర్డ్ బ్లాక్ స్థాపించారు. ఆయన మార్గమే సరైనదని ఉత్తేజితులైన యువకులు ప్రభుత్వంపై ప్రత్యక్ష చర్యకు దిగారు**.
===================================================

ఇటువంటి క్లిష్ట పరిస్థితులలో సినిమా మాటలు నేర్చింది. సినిమాల ద్వారా ప్రజలను నాయకులు రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తారనీ, ప్రభుత్వం మీద వ్యతిరేకతను పెంచడానికి ప్రయత్నిస్తారనీ బ్రిటిష్ పాలకులు భయపడ్డారు. అందుకే తయారైన ప్రతి సినిమాను ప్రభుత్వం నియమించిన సెన్సార్‌బోర్డు చూసి సర్ట్ఫికెట్ ఇస్తుందని ప్రకటించారు. మార్గదర్శకాలు రూపొందించారు. ప్రాంతీయ భాషలను కూడా సెన్సార్ చేయడానికి కేంద్రాలను ఏర్పాటుచేశారు. సెన్సార్ నిబంధనలు కఠినంగా వుండేలా చూశారు. సినిమాలలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎటువంటి ప్రసంగాలు వుండకూడదు అనేది ముఖ్యమైనది.
1931నుంచి ఇండియాలో సినిమా మూకీనుంచి టాకీ యుగంలోకి అడుగుపెట్టింది. ప్రపంచంలో తొలి టాకీ ‘జాజ్ సింగర్’ నిర్మించిన నాలుగేళ్ళకే తొలి ఇండియన్ టాకీ ‘ఆలం ఆరా’ 1931లో విడుదలైంది. ఆర్దేషిర్ ఎం.ఇరానీ బొంబాయిలో ఇంపీరియల్ స్టూడియో స్థాపించి, విల్‌ఫోర్డ్ డెమింగ్ అనే సౌండ్ టెక్నీషియన్ సహకారంతో మొదటి ఇండియన్ టాకీ ‘ఆలం ఆరా’ని హిందీలో నిర్మించి విడుదలచేశారు. ఇందులో మాస్టర్ విఠల్ హీరో, జుబేదా హీరోయిన్. పది పాటలున్న ఈ చిత్రాన్ని జనం విరగబడి చూశారు.
తొలి ఇండియన్ టాకీ ‘ఆలం ఆరా’ నిర్మాణంలో తెలుగువారి పాత్రకూడా వుండడం విశేషం. తొలి తెలుగు టాకీ డైరెక్టర్ హెచ్.ఎమ్.రెడ్డి, ఆలం ఆరాకు సహాయ దర్శకుడిగా పనిచేశారు. ఎల్.వి.ప్రసాద్, ఈ సినిమాలో ఆరు చిన్నచిన్న వేషాలువేశారు. తొలి టాకీ సూపర్‌హిట్ అవడంతో అర్దేషిర్ ఇరానీ తెలుగు తొలి టాకీ ‘్భక్తప్రహ్లాద’ తమిళ తొలి టాకీ ‘కాళిదాసు’ని నిర్మించారు. ఆయన తొమ్మిది భాషలలో 250 సినిమాలు నిర్మించి రికార్డ్ నెలకొల్పారు.
స్వాతంత్య్ర పోరాటం ముమ్మరంగా సాగుతున్న రోజుల్లో విప్లవాత్మకమైన సంస్కరణలను, సాంఘిక సమస్యలను ఇతివృత్తాలుగా తీసుకుని తెలుగువారు చిత్ర నిర్మాణం మొదలుపెట్టారు. సారధి స్టూడియోస్‌వారు గూడవల్లి రామబ్రహ్మం దర్శకత్వంలో ‘మాలపిల్ల’ నిర్మించారు. తర్వాత ‘రైతుబిడ్డ’ నిర్మించారు. జమీందారీ ఫ్యూడల్ వ్యవస్థకు వ్యతిరేకంగా నిర్మించిన ‘రైతుబిడ్డ’కు నిర్మాత చల్లపల్లి జమీందారు రాజా యార్లగడ్డ శివరామప్రసాద్ కావడం విశేషం. రైతుబిడ్డ సినిమాకు వ్యతిరేకంగా జమీందార్లు ఉద్యమించారు. వెంకటగిరి జమీందార్లు సినిమా ప్రింట్లు తగలబెట్టించారు. జమీందారుల పలుకుబడి వున్న నెల్లూరు, కృష్ణాజిల్లాలలో రైతుబిడ్డపై జిల్లా మెజిస్ట్రేట్లతో నిషేధం విధింపజేశారు.
రైతుబిడ్డ జమీందార్లకు మాత్రమే వ్యతిరేకమైనందుకు బ్రిటీష్ ప్రభుత్వంపై విమర్శలు లేనందుకు సెన్సార్ సర్ట్ఫికెట్ ఇచ్చారు.
ఆ సెన్సార్ బోర్డు స్వతంత్రం వచ్చాకగూడా అవే రూల్స్‌తో కొనసాగాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా సంభాషణలు వుండకూడదు. ప్రభుత్వ వుద్యోగి లంచం తీసుకున్నట్టు చూపించకూడదు. పెళ్ళికాని యువతి గర్భం ధరించిన సంఘటనలు నిషేధం. నగ్న దృశ్యాలు పనికిరావు.
చాలా సంవత్సరాలు ఇండియన్ సెన్సార్ కఠినంగానే వ్యవహరించింది. రాజ్‌కపూర్ అరవై దశకంలో పద్మిని వీపుభాగాన్ని నగ్నంగా చూపించాడు ఒక పాటలో. దానికి సెన్సార్ బోర్డు అభ్యంతరం తెలియజేసింది. పద్మిని పాత్ర ఒక గిరిజన యువతిది అనీ, వారి వేషం అలాగే వుంటుందని రాజ్‌కపూర్ రుజువులు చూపించి వివరణ యిచ్చిన తర్వాతనే ‘జిష్ దేశ్‌మే గంగా బహతీహై’ రిలీజైంది. ఆ తర్వాత ఎందుకో సెన్సార్ లిబరలైజ్ అయిపోయింది. రాజ్‌కపూర్ రామ్‌తెరీ గంగామైలీ సినిమాలో మందాకిని వక్షాల్ని, సత్యం శివం సుందరం సినిమాలో జీనత్ అమన్‌ని అర్థనగ్నంగాను చిత్రించినా సెన్సార్ కత్తెరపడలేదు. తర్వాతి బికినీలలో నటీమణులను చూపించడం, ముద్దుల దృశ్యాలు మామూలైపోయాయి. సెక్స్ విషయంలో సెన్సార్ ఉదారంగా వ్యవహరిస్తోంది.
ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీని విమర్శిస్తూ తీసిన ‘కుర్చీ’ నిషేధానికి గురైంది. ఇప్పుడుకూడా రాజకీయ నాయకుల్ని విమర్శిస్తున్న చిత్రాలకే సెన్సార్ అడ్డుపడుతోంది. ఇప్పుడు సెన్సార్ బోర్డుకి అంత అవసరం లేదనుకోవాలి.
వందలకొద్దీ టి.వీ చానల్స్, ఇంగ్లీషుతోపాటు అన్ని ప్రాంతీయ భాషలలో ఇరవైనాలుగు గంటలు ప్రసారాలు సాగిస్తున్నాయి. రాజకీయ నాయకులు ప్రత్యర్థులపైన అభ్యంతరకరమైన వ్యాఖ్యానాలు చేస్తున్నారు. పరస్పరం వ్యక్తిగత దూషణలు చేసుకుంటున్నారు.
కుల, మత భేదాలు, ప్రాంతీయ భేదాలు రేకెత్తేవిధంగా ఉపన్యాసాలు ఇస్తున్నారు. ప్రజలమధ్య విద్వేషాలు కలిగిస్తూ పబ్బం గడుపుకుంటున్నారు. అధికారంలోవున్న పార్టీ నాయకులు, ప్రతిపక్షంలో వున్న నాయకులు ఒకరినొకరు దూషించుకోని రోజులేదు.
సినిమాలలో ఇటువంటి తిట్టు సంభాషణలు సెన్సార్‌బోర్డు ఒప్పుకుంటుందా? కత్తెర వేస్తుంది. జనం డబ్బులు ఖర్చుచేసి చూసే సినిమాలలో సంభాషణలకు కత్తెర. ప్రతి ఇంట్లోకి టీ.వీ.ల ద్వారా ప్రవేశించే రాజకీయ నాయకుల తిట్టు వ్యాఖ్యలు, ద్వేషం పంచుతూ చేసే సంభాషణలకు ఎటువంటి కత్తెర లేదు. దీనివలన నాయకులంటే ప్రజలకు గౌరవం లేదు. నాయకులు ఒకరినొకరు గౌరవించుకోకపోతే ప్రజలు మాత్రం ఎందుకు గౌరవిస్తారు? రాను రాను ప్రజలు క్రమశిక్షణ కోల్పోతున్నారు. ప్రభుత్వ చట్టాల్ని పాటించరు. చట్టాలుచేసేవారికే అవి చుట్టాలుగా మారాయి.
ఇటువంటి పరిస్థితుల్లో ఒక సినిమాలకు సెన్సార్ ఎందుకు?
సెన్సార్ వుండాల్సింది టీ.వీ. చానల్స్‌కి.

--వాణిశ్రీ