మెయన్ ఫీచర్

మోదీ ప్రతిష్ఠకు ‘పెట్రో’ సెగ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి ఎన్నికలలో గెలుపొందడానికి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. భాజపాపై ఒకే అభ్యర్థిని నిల బెట్టడం ద్వారా తేలికగా మోదీని ఓడించవచ్చని ఉత్తర ప్రదేశ్‌లో ఇటీవల జరిగిన ఉపఎన్నికల అనంతరం విపక్షాలు ధీమాగా ఉన్నా, అందుకు చేయవలసిన కస రత్తు తగు రీతిలో చేయడం లేదు. ప్రతిపక్షాలలో చీలిక తీసుకురావడం, కొందరిని తమ వైపు తిప్పుకోవడం భాజపాకు పెద్దగా ఇబ్బందికరం కాకపోవచ్చని ఈ మధ్య రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక సందర్భంగా రుజువైంది. మోదీ ప్రభుత్వ విధానాలను ఎండగట్టడంలో కొంతమేరకు ప్రజల దృష్టిని ఆకర్షిస్తూ, ప్రధాన మంత్రి అభ్యర్థిత్వానికి చాలా దూరంలో ఉన్నప్పటికీ- కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ క్రమంగా గుర్తింపు పొందుతున్నారు. అయితే, ఆయన ఎత్తుగడలు ఆశించిన ఫలితాలు ఇవ్వడం లేదు. ఇతర ప్రతిపక్షాలు రాహుల్‌కు పెద్దరికం కట్టబెట్టడానికి సిద్ధంగా లేవు. రాహుల్‌కు ప్రధాన మంత్రి పదవి కట్టబెట్టడం కోసం మోదీంతో విరోధం పెట్టుకోవడం అవసరం లేదని అభిప్రాయంలో చాలామంది విపక్షనేతలు ఉన్నారు.
మోదీ పట్ల పరుష పదజాలం ఉపయోగిస్తున్న మమతా బెనర్జీ, శరద్ పవార్, అఖిలేష్ యాదవ్ వంటి నేతలు రాహుల్ నాయకత్వంలో పనిచేయడానికి సిద్ధంగా లేరు. ప్రాంతీయ పార్టీలకు కాంగ్రెస్ బయట నుండి మద్దతు ఇచ్చి, ప్రభుత్వం ఏర్పాటుకు సహకరించాలని మాత్రమే కోరుతోంది. కర్ణాటకలో వలే ఢిల్లీలో కాంగ్రెస్ ఆ విధంగా ముందుకు వస్తుందని ఆశించలేము. గతంలో కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన చరణ్ సింగ్, దేవెగౌడ, ఐకే గుజ్రాల్, చంద్రశేఖర్ వంటి వారు అర్ధాంతరంగా పదవి నుండి వైదొలగవలసి వచ్చింది. బిజెపి మిత్రపక్షాలు సహా దేశంలో అన్ని ప్రాంతీయ పార్టీలు వచ్చే ఎన్నికలలో ఏ పారీకీ సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసే ఆధిక్యత రాకూడదని, తమ దయాదాక్షిణ్యాలపై ఆధారపడాలని కోరుకొంటున్నారు. అందుకోసం ఇప్పటి నుండే కొందరు నేతలు గొంతెమ్మ కోర్కెలు కోరుతున్నారు. ఎవరు ఎక్కువ సీట్లు ఇస్తే వారితో పొత్తు కోసం సై అంటున్నారు. ఉదాహరణకు ఉత్తర ప్రదేశ్‌లో ఆర్‌ఎల్‌డి అధినేత అజిత్ సింగ్ ఎస్పీ, బీఎస్పీ పుణ్యాన ఉపఎన్నికలలో తమ పార్టీ అభ్యర్థి ఒకరిని లోక్‌సభకు పంపుకో గలిగారు. దీనిని ఆసరా చేసుకొని ఆ రెండు పార్టీలతో, మరోవంక బిజెపితో అజిత్ సింగ్‌బేరాలు ఆడుతున్నారు. 2014 ఎన్నికలలో మొదటి లేదా రెండో స్థానం నిలచిన స్థానాలను మాత్రమే ఆయా పార్టీలకు ఇవ్వాలని ప్రతిపక్షాలు ఒక అవగాహనకు వచ్చాయి. ఆ మేరకు అజిత్ సింగ్‌కు మూడు ఎంపీ సీట్లు మించి రావు. కానీ బిజెపి ఐదు సీట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. చివరి వరకూ ఎస్పీ, బీఎస్పీ లతో బేరసారాలు ఆడుతూ, ఆఖరి క్షణంలో బిజెపి వైపు అజిత్ సింగ్ వెళతారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
బిహార్‌లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. కేంద్ర మంత్రి ఉపేంద్ర కుష్వా గతంలో రెండు సార్లు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తో విభేదించి పార్టీ నుండి బయటకు వచ్చారు. గత ఎన్నికలలో నితీష్ కుమార్ ఎన్డీయేలో లేకపోవడంతో బిజెపి మూడు సీట్లు ఇస్తే, మూడు కూడా గెలిచారు. సహజంగానే ఇప్పుడు బలం పెంచుకొనే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, ఎన్డీయేలో ఉండన వసరం లేదని నితీష్ పేచీ పెడుతున్నారు. రెండు సీట్లు మించి ఇవ్వడానికి బిజెపి సుముఖంగా లేదు. తమ వైపు వస్తే ఆరు సీట్లు ఇస్తామని లాలూ ప్రసాద్ యాదవ్ కుమారులు ఆశ చూపుతున్నారు. దానితో ఎన్నికల నాటికి అటువైపు వెళ్ళక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి.
కాగా, రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో 40 నుండి 50 సీట్లు బిజెపి కోల్పోతుందని కేంద్ర మంత్రి రాందాస్ అథవాలా చెబుతున్నారు. అయినా మోదీయే తిరిగి ప్రధాని అవుతారని అంటున్నారు. అంటే సొంత బలంపై కాకుండా ఇతరుల మద్దతుతో ప్రధాని అవుతారని ఆయన అభిప్రాయం. ఇతరుల మద్దతుతో అధికారం చేబట్టడానికి మోదీ సిద్ధం కాకపో వచ్చు. సొంత బలం కోసం అమిత్ షాతో కలసి వ్యూహరచన చేస్తున్నా రు. ఎన్నికల అనంతరం కేసీఆర్, వైఎస్ జగన్ వంటి నేతల మద్దతు కూడదీసుకునే ప్రయత్నం చేస్తూనే, ఎన్నికలలో సొంత బలం పెంచుకొనే ఎత్తుగడ చేస్తున్నారు. అందుకనే బిజెపి అధికారంలో లేని రాష్ట్రాలపై అమిత్ షా సొంతంగా దృష్టి సారిస్తున్నారు.
ఎన్నికల ఎత్తుగడలు ఇలా ఉండగా, నేడు ప్రధానంగా రెండు అంశాలలో మోదీ ప్రభుత్వం నిస్సహాయ పరిస్థితులలో చిక్కు కొన్నట్లు కనిపిస్తున్నది. ఒక వంక వేగంగా డాలర్‌తో రూపాయి విలువ పడిపోతూ ఉంటే, మరో వంక పెట్రోలియం ఉత్పత్తుల ధరలు భారీగా పెరిగి పోతున్నాయి. పరిస్థితులు దారుణంగా మారుతుండగా, భారత్ వంటి అతి పెద్ద ఆర్థిక వ్యవస్థలకు ఈ పరి ణామాలు ప్రమాదకరం కాబోవని మోదీ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయ పరిణామాల కారణంగా ఇలా జరుగుతున్నందున ప్రభుత్వం చేయగలిగిందేమీ లేదని చేతులు ఎత్తేస్తున్నారు. రుపాయి- డాలర్ మారకం విలువ 70కు తాకుతుందని గత నెలలో కూడా ఊహించలేక పోయాము. లీటరు పెట్రోల్ ధర రూ. 80 దాటి పోతున్నది. ఈ రెండింటి ప్రభావం మొత్తం దేశ ఆర్ధిక వ్యవస్థపై పడుతున్నది. అన్ని రంగాల ప్రజల జీవితాలపై చూపుతున్నది. ఆర్థిక ప్రణాళికలు తలకిందుల వుతున్నాయి. అయినా మోదీ జోక్యం చేసుకొని అత్యున్నత స్థాయిలో సమీక్ష జరిపినట్లు కనిపించడం లేదు. కనీసం ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కూడా అటువంటి ప్రయత్నం చేయడం లేదు. ఆయన తన బ్లాగ్‌లో మాత్రం అంతర్జాతీయ పరిణామాలను ఉటంకిస్తూ భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
నెల రోజులలో రూపాయి మారకం విలువ 2 శాతం పడిపోతే, ఈ సంవత్సరం ఇప్పటికి 12 శాతం పడిపోయింది. మొత్తం ఆసియాలో ఏ దేశపు కరెన్సీ కూడా ఇంత దారుణంగా పడిపోలేదని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. ఈ దుస్థితికి అంతర్జాతీయ పరిణా మాలతో పాటు, స్వదేశీ చర్యలు దోహద పడుతున్నట్లు అంగీకరించే సాహసం చేయడం లేదు. అరుణ్ జైట్లీ ఆర్థిక శాఖ సారధ్యం మరో ఏడు నెలల్లో ముగియనున్నది. ఈ లోగా పెట్రోల్ ధరను రూ 100 కు తీసుకువెడతారని ఉన్నత స్థాయిలోనే నేతలు వేళాకోళంగా చెప్పుకోవడం జరుగుతున్నది.
మే, 2019 నాటికి ముడి చమురు ధర బారెల్ 100 డాలర్లకు చేరుకొంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అంటే ఎన్నికల సమయానికి పెట్రోల్ ధరల మంటలు మోదీ ప్రభుత్వాన్ని ఇరకాడంలో పడవేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయినా ప్రభు త్వంలో ఎటువంటి చురుకు దనం కనిపించడం లేదు. రూపాయి పత నం మరింతగా దూసుకుపోయి రూ. 74 దాటే అవకాశాలు లేకపోలేదు. గత సంవత్సరం కాలంలో పెట్రోల్ ధరలు లీటర్‌కు రూ 10కు పైగా పెరిగాయి. అందుకు ప్రధాన కారణం అంతర్జాతీయ మార్కెట్ లో 40 శాతం మేరకు ధరలు పెరిగిన్నట్లు చెబుతున్నారు. అది పాక్షిక సత్యమే కాగలదు. ధరలను అదుపులోకి తీసుకురావడానికి ప్రభుత్వం చేయవలసిన ప్రయత్నాలు చేయడం లేదు. జీఎస్టీ పరిధిలోకి పెట్రోలియం ఉత్పత్తులను తీసుకువస్తే వినియోగదారులకు చాలావరకు ఉపశమనం కలుగు తుందని చాలామంది సూచిస్తున్నారు. ఈ విషయంలో రాష్త్ర ప్రభుత్వాలు ఒప్పుకోవడం లేదని మోదీ ప్రభుత్వం తప్పించుకొనే ప్రయత్నం చేస్తున్నది. 19 రాష్ట్రాల్లో బిజెపి అధికారంలో ఉండగా- ఒక కీలక రాజకీయ నిర్ణయం ప్రధాని తీసుకొంటే అవి వ్యతిరేకిస్తాయని చెప్పడం హాస్యాస్పదమే కాగలదు.
వినియోగదారులకు ఉపశమనం కలిగించడానికి ముడి చమురు ధరలు అంతర్జాతీయ మార్కెట్ లో బారెల్ 60 డాలర్లుగా ఉన్న సమయంలో దిగుమతి సుంకాన్ని గత అక్టోబర్ లో 2 శాతం తగ్గించారు. ఇంతలో చమురు ధరలు 70 డాలర్ల చేరువలోకి వచ్చాయి. దిగుమతి సుంకం తగ్గించే ప్రతి రూపాయి వల్ల ప్రభుత్వానికి రూ 13,000 కోట్ల ఆదాయానికి గండి పడుతుంది. అందుకనే పెట్రోలియం ఉత్పత్తులపై విధించే పన్నులతో వచ్చే రాబడి ఏమాత్రం తగ్గినా ప్రభుత్వాన్ని నడపడం కష్టం అని అరుణ్ జైట్లీ చెబుతున్నారు. జైట్లీ ఆర్ధిక మంత్రిగా బాధ్యతలు చేబట్టినప్పుడు రూపాయి డాలర్ మారకం విలువ రూ 58.29 గా ఉంది. 51 నెలల్లో 23 శాతంకు పైగా రూపాయి విలువ పడిపోయింది. రూపాయి విలువ పతనం కావడానికి పెరుగుతున్న ముడి చమురు ధరలను కారణంగా ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, దిగుమతులు గణనీయంగా పెరగడం గమనార్హం. ఉదాహరణకు బొగ్గు దిగుమతులు 45 శాతం పెరిగాయి. ఖనిజాల దిగుమతులు 47 శాతం పెరిగాయి. అదే సమయంలో మన ఎగుమతులు పెరగడం లేదు. దాదాపు స్థిరంగా ఉంటున్నాయి. ఆ కారణంగా వాణిజ్యలోటు గణనీయంగా పెరుగుతున్నది.
జులై, 2018లో వాణిజ్య లోటు 18.02 బిలియన్ డాలర్లుగా ఉంది. గత సంవత్సరం ఇదే నెలలో 11.45 బిలియన్ డాలర్లు మాత్రమే లోటు కావడం గమనార్హం. మన వాణిజ్య లోటు పెరుగుతున్న కొద్ధీ రూపాయిపై మరింత వత్తిడి పెరుగుతుంది. చమురు ధరల పెరుగుదలతో పాటు ఆర్థిక వ్యవహారాల నిర్వహణ లోపభూయిష్టంగా ఉండటం ప్రస్తుత ఆర్ధిక దుస్థితికి ప్రధాన కారణమని చెప్పవచ్చు.
పెట్రోల్ ధరలను అదుపు చేయలేక పోవడం, రూపాయి విలువ పతనం కావడం వల్ల ఎక్కువగా నష్టపోతున్నది మధ్య తరగతి ప్రజలు, చిన్న, సన్నకారు వ్యాపారులు. వీరంతా సాంప్రదాయకరంగా బిజెపికి మద్దతుదారులు కావడం గమనార్హం. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో గాని, ఉత్తరప్రదేశ్ ఉపఎన్నికలలో గాని పట్టణ ప్రాంతాలలో బిజెపికి సాంప్రదాయకంగా మద్దతురులుగా ఉన్నవారు ఉత్సాహంగా వోటింగ్ లో పాల్గొనకపోవడం చూశాము. గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయ సంక్షోభం, ఇతర కారణాల చేత పెద్ద సంఖ్యలో బిజెపికి వ్యతిరేకంగా ప్రజలు వోట్లు వేశారు. ఈ పరిణామాలను గమనిస్తే బిజెపి ఓటర్లు ఎవరూ ఇతర పార్టీల వైపు మారే అవకాశం లేదు. అయితే వారు 2014లో వలే విరుచుకు పడి, పోలింగ్ రోజున ఉధృతంగా వోట్ వేయడం పట్ల ఆసక్తి చూపే అవకాశం సన్నగిల్లే ప్రమాదం ఉంది. వ్యతిరేక ఓటర్లు సమీకృతమై బిజెపిని ఓడించే అభ్యర్ధికి మద్దతు పలికే ప్రమాదం ఉంది. ఇటువంటి పరిస్థితులు సహజంగానే భాజపా అంచ నాలను తారుమారు చేసే అవకాశం ఉంది. బిజెపికి వ్యతిరేకంగా మహాకూటమిని ఏర్పాటు చేస్తామన్న విపక్షాల మాటలను మోదీ ఎద్దేవా చేస్తూ, కొన్ని విపక్ష పార్టీలు ఎన్నికల ముందు విడిపోతే, మరికొన్ని ఎన్నికల తర్వాత విడిపోతాయరి చెప్పుకొచ్చారు. ఇక్కడ ఒక అం శాన్ని మోదీ గమనించాలి. 2014 ఎన్నికలలో వలే హామీలకు ఆకర్షితమై, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను సమీకరించుకొనే అవకాశం ఇప్పుడు బిజెపికి లేదు. తమ పనితీరు ఆధారంగా ఓట్లు పొందవలసి ఉంది. ఆ దిశలో ఏ మేరకు వారు కసరత్తు చేస్తున్నారో ఆత్మ పరిశీలన చేసుకోవలసి ఉంది. రూపాయి మారకం, పెట్రోల్ ధరల విషయంలో ప్రధాని సొంతగా బాధ్యతను తీసుకొని పరిస్థితులను పర్యవేక్షించాలి. నీతి ఆయోగ్, ఆర్థిక మంత్రి త్వ శాఖలోని నిపుణులకు ఈ కీలక అంశాన్ని వదిలి వస్తే భారీ మూల్యం చెల్లించవలసి వస్తుందని గ్రహించాలి.

-చలసాని నరేంద్ర