ఎడిట్ పేజీ

దర్యాప్తు సంస్థలు ఇక దండగేనా..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అధికారం అనుభవిస్తున్న నాయకులు రాజకీయ లబ్ధికో, కొన్ని వర్గాల ఒత్తిళ్ల ఫలితంగానో- హంతకులను వదిలేసేలా నిర్ణయాలను తీసుకుంటే దేశంలో ఇక దర్యాప్తు సంస్థలు ఎందుకు? న్యాయస్థానాలు సుదీర్ఘం కాలం పాటు విచారించి దోషులుగా నిర్ధారిస్తే, శిక్షలను అమలు చేయకుండా తాత్సారం చేయడం వల్ల రాజ్యాంగాన్ని పరిరక్షించినట్లవుతుందా? దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య జరిగి 27 సంవత్సరాలు గడిచింది. ఈ కేసులో దిగువ కోర్టు 26 మంది నిందితులను దోషులుగా నిర్ధారించి, అందరికీ మరణ శిక్ష ఖరారు చేసింది. అన్ని కోర్టులను దాటుకుని ఈ కేసు సుప్రీం కోర్టుకు చేరుకుంది. సర్వోన్నత న్యాయస్థానం 26 మంది దోషుల్లో 19 మందిని నిర్దోషులుగా విడిచిపెట్టింది. ఏడుగురు దోషుల్లో నలుగురికి మరణ శిక్ష ఖరారు చేసింది. మిగిలిన ముగ్గురికి జీవిత ఖైదును విధించింది. ఇందులో నళిని అనే దోషికి 2002 ఏప్రిల్‌లో అప్పటి తమిళనాడు గవర్నర్ ఫాతిమాబీ మరణశిక్షను రద్దు చేసి జీవిత ఖైదుగా మారుస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మిగిలిన ముగ్గురికి మరణ శిక్షను అమలు చేయాలి.
కాని సుప్రీం కోర్టు 2014 ఫిబ్రవరిలో వీరికి మరణ శిక్షను అమలు చేయడంలో రాజకీయాధికారం విఫలమైనందున, విపరీతమైన జాప్యం జరిగినందుకు జీవిత ఖైదుగా మార్చింది. జైలులో ఉన్న పెరారివాలన్ తాను 27 ఏళ్లుగా జీవిత ఖైదును అనుభవిస్తున్నానని, తనకు శిక్ష నుంచి మినహాయించాలని సుప్రీం కోర్టును అభ్యర్థించారు. ఈ కేసులో పెరారివాలన్‌ను విడిచిపెట్టే నిర్ణయం గవర్నర్ మాత్రమే తీసుకోవాల్సి ఉంటుందని సుప్రీం పేర్కొంది. మరణశిక్షను తప్పించుకునేందుకు దోషులు జైల్లో ఉండి చేసిన న్యాయ పోరాటం ఫలించింది. 27 ఏళ్లుగా జైల్లో ఉన్నందున తనను విడిచిపెట్టాలని నళిని దరఖాస్తు పెట్టుకుంది. శిక్షలు తప్పించాలని కోరుతూ ఎప్పటికప్పుడు ఈ దోషులు పెట్టుకున్న పిటిషన్లు సుప్రీంలో విచారణకు వచ్చినప్పుడల్లా కేంద్రం తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చింది.
కాగా, తమిళనాడు మంత్రివర్గం ఇటీవల సమావేశమై ఈ కేసులో నళిని, టి.సుతీంద్రరాజా అలియాస్ సంతనం, శ్రీహరన్ అలియాస్ మురగన్ (నళిని భర్త), ఏజీ పేరారివాలన్ అలియాస్ అరివు, రాబర్ట్ పేయాస్, ఎస్ జయకుమార్ అలియాస్ జయకుమారన్, రవిచంద్రన్ అలియాస్ రవికి క్షమాభిక్ష పెట్టాలని గవర్నర్‌కు సిఫార్సు చేస్తూ తీర్మానం పంపారు. రాష్ట్ర ప్రభుత్వానికి రాజ్యాంగం ప్రకారం ఖైదీలకు క్షమాభిక్ష పెట్టాలని సిఫార్సు చేసే అధికారం ఉంది. ఈ అధికారాన్ని దుర్వినియోగం చేస్తే న్యాయ సమీక్ష చేసే అధికారం సుప్రీంకు ఉంది. గవర్నర్‌కు రాజ్యాంగంలోని 161వ అధికరణ కింద జీవిత ఖైదును అనుభవిస్తున్న ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించే అధికారం ఉంది. మొత్తం ఏడుగురు దోషుల్లో నళిని, మురగన్, సంతనం, పేరారివాలన్‌కు పడిన మరణశిక్షను సుప్రీం రద్దు చేసి జీవిత ఖైదుగా మార్చిందన్న విషయాన్ని గుర్తించాలి.
రాజీవ్ గాంధీ హత్య కేసులో నిందితులను పట్టుకునేందుకు సీబీఐ, తమిళనాడు పోలీసులు విశేషమైన కృషి చేశారు. కాని ఏమి లాభం? అధికారంలో ఏ పార్టీ ఉన్నా, రాజకీయ నాయకత్వ దివాళాకోరు విధానాల వల్ల రాజీవ్ హత్య కేసులో దోషులు ఎప్పటిప్పుడు బలమైన లాబీ అండదండలతో మరణశిక్షను తప్పించుకున్నారు. తాజా పరిణామాలను విశే్లషిస్తే, అన్నీ అనుకున్నట్లుగా జరిగితే గవర్నర్ అమోదం తెలిపితే- ఏడుగురు దోషులు జైలు నుంచి విడుదలవుతారు.
హంతకులను విడుదల చేస్తే ప్రజలకు ఎటువంటి సందేశం ఇచ్చినట్లవుతుంది ? రాజీవ్ గాంధీ ఒక శక్తివంతమైన నాయకుడు. దేశానికి ఐదేళ్లపాటు ప్రధానిగా పనిచేశారు. మరణించే నాటికి ఆయనకు 50 ఏళ్ల వయస్సు మాత్రమే. 125 సంవత్సరాల ఘన చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా సేవలందించారు. ఆయన హత్యతో భారత్ సమర్థమైన నాయకత్వాన్ని కోల్పోయిందని రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల నేతలు అంగీకరిస్తారు. 21వ శతాబ్ధాన్ని ప్రభావితం చేసిన అత్యంత గొప్ప నేతల్లో రాజీవ్ గాంధీ ఒకరు. భారత్‌కు దిశ, దశ మార్గనిర్దేశనం చేసే సమయంలో రాజీవ్ గాంధీ ఎల్‌టీటీఇ ఉగ్రవాదుల మారణకాండకు బలయ్యారు. 1991 మే 21వ తేదీన తమిళనాడులో చెన్నైకు సమీపంలో శ్రీపెరంబదూర్‌లో హత్యకు గురయ్యారు.
1991 నుంచి 2018 వరకు పరిస్థితులను విశే్లషిస్తే పీవీ నరసింహారావుప్రభుత్వం ఐదేళ్లు అధికారంలో ఉంది. దేవెగౌడ, ఐకే గుజ్రాల్ , వాజపేయి నేతృత్వంలో కొన్నాళ్లు పాలన సాగింది. 2004 నుంచి 2014 వరకు యుపీఏ చైర్‌పర్సన్‌గా సోనియాగాంధీ, ప్రధానిగా మన్మోహన్‌సింగ్ సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. 2014లో బీజేపీ ప్రభుత్వం నరేంద్రమోదీ ఆధ్వర్యంలో అధికారంలోకి వచ్చింది. రాజీవ్ హంతకులకు మరణశిక్ష అమలు కాకుండా రకరకాల న్యాయపరమైన మీమాంసతో జాప్యం చేశారు. గతంలో పనిచేసిన రాష్టప్రతులు కూడా మరణశిక్షను రద్దు చేసి క్షమాభిక్ష పెట్టాలని కోరుతూ పెట్టుకున్న దరఖాస్తులను తేల్చేందుకు ఏళ్లతరబడి తాత్సారం చేశారు. దీని ఫలితంగా సర్వోన్నత న్యాయస్థానం జోక్యం చేసుకుని క్షమాభిక్ష పిటిషన్లను పెండింగ్‌లో పెట్టడం వాంచనీయంకాదని, నలుగురు దోషులకు కూడా మరణ శిక్షను రద్దు చేసి జీవిత ఖైదుగా మార్చింది.
ఈ కేసులో ఏడుగురు దోషులు జైల్లో 27 ఏళ్లుగా ఉండవచ్చు. కాని అంత మాత్రాన వారిని విడిచిపెట్టాలా? వారు చేసిన నేరం ఎటువంటిది? ఇంతకాలం జైల్లో ఉన్నారు, వదిలిపెడితే ఏమవుతుంది? అనే భావం ఇటీవల చాలామందిలో కనపడుతోంది. ఇటువంటి ఉదాసీన భావం, నిర్లిప్తత, కర్మ సిద్ధాంతం, చూసీచూడనట్లు ఉంటే వైఖరి, పోతే పోనీ అనే భావన వల్లనే భారత్ విదేశీ దురాక్రమణలకు లోనైంది. రాజీవ్ హంతకులను ఉరితీస్తే ఏమో అవుతుంది ? కొత్త సమస్యలను తెచ్చుకున్నట్లవుతుంది. తమిళులు మనోభావాలను గాయపరిచినట్లవుతుంది అనే ఒక రకమైన చెప్పుకోలేని, తార్కికతకు నిలబడని, ఊహాజనిత భావనలతో అధికారంలో ఉన్న రాజకీయ నాయకత్వం సతమతమైంది.
వాస్తవానికి ఎల్‌టీటీఈని ఏ నాడూ తమిళులు నెత్తినపెట్టుకోలేదు. అక్కడ ఉన్న స్థానిక పార్టీలు ఓట్ల కోసం శ్రీలంక తమిళుల సమస్యను పరిష్కరించాలని డి మాండ్ చేశాయి. ఈ కేసు ను ఎంతో లోతుగా న్యాయస్థానాలు విశే్లషించాయి. దిగువ కోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకు చక్కటి తీర్పులు ఇచ్చాయి. కొన్ని వందల రాత్రులు న్యాయమూర్తులు ఈ కేసు గురించి ఆలోచించారు, సమీక్షించారు. ప్రత్యక్షంగా హంతకులు శ్రీపెరంబదూర్‌లో ఘటనా ప్రదేశంలో ఉన్నట్లు వీడియో దృశ్యాలు, ఫోటోలు లాంటి తిరుగులేని ఆధారాలు ఉన్నాయి. తమిళనాడు ప్రభుత్వం రాజీవ్ హంతకులు ఏడుగురిని వదిలిపెట్టాలని సిఫార్సు చేయడంపై దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఏడుగురు హంతకులను వదిలిపెడితే తీవ్రమైన పరిణామాలు ఉంటాయని, అనుమతించే ప్రసక్తిలేదని కేంద్రం సుప్రీం ఈ ఏడాది ఏప్రిల్‌లో స్పష్టం చేసింది.
ఏడుగురు దోషుల్లో నలుగురు శ్రీలంక జాతీయులు ఉన్నారు. విడిచిపెట్టిన తర్వాత వారు ఎక్కడికి వెళతారు? శ్రీలంక ప్రభుత్వం వారిని అనుమతిస్తుందా? ఈ కేసును రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తుచేయలేదు. సీబీఐ దర్యాప్తు చేసింది. సీబీఐ దర్యాప్తుచేసిన కేసులో దోషులను వదిలిపెట్టాలన్న రాష్ట్ర మంత్రిమండలి సిఫార్సును గవర్నర్ ఆమోదిస్తారా ? గవర్నర్‌కు 161వ అధికరణ కింద ఉన్న అధికారాన్ని మళ్లీ సుప్రీం కోర్టులో సవాలు చేసే అవకాశం లేకపోలేదని న్యాయకోవిదులు అంటున్నారు. ఇదే జరిగితే మళ్లీ బంతి కేంద్రం కోర్టులోకి వెళుతుంది. శిక్షపడిన వారిని మానవతాద్పక్పథంతో వదిలిపెట్టే అధికారం గవర్నర్‌కు మాత్రమే ఉంటుందని సుప్రీం సెప్టెంబర్ 6న స్పష్టం చేసింది.
రాజీవ్ గాంధీ హంతకులను వదిలిపెట్టరాదని, తమిళనాడు ప్రభుత్వ నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో వ్యతిరేకించింది. ఆ పార్టీ సీనియర్ నేత రణదీప్ సుర్జీవాలా మాట్లాడుతూ ఉగ్రవాదం, ఉగ్రవాదుల విషయంలో కాంగ్రెస్ పార్టీ రాజీపడదని పేర్కొన్నారు. గతంలో సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పలుసార్లు రాజీవ్ గాంధీ హంతకులకు క్షమాభిక్ష విషయంలో ఉదారవైఖరిని ప్రదర్శిస్తూ ప్రకటనలు చేశారు. ఈ ప్రకటనలు వారి పెద్దబుద్ధికి నిదర్శనం. ఈ దేశంలో మానవ, పౌరహక్కుల సంఘాలు కూడా న్యాయపరమైన డిమాండ్‌లు చేస్తున్నాయి. ఇటీవల మావోయిస్టు పార్టీ సానుభూతిపరులని ముద్రవేసి పది మందిని అరెస్టు చేశారు. సాయిబాబా అనే ప్రొఫెసర్‌కు మావోయిస్టు పార్టీతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలు రుజువు కావడంతో కోర్టు శిక్ష విధించింది. క్షణికావేశంలో హత్యలు చేసి ఏళ్లతరబడి జైల్లో వేలాది మంది ఖైదీలు మగ్గుతున్నారు. 27 ఏళ్లుగా ఒక మహిళ జైల్లో ఉండడంపై కూడా మీడియా హైలెట్ చేసింది. ఇది బాధాకరమైన అంశమే. న్యాయసమస్య ఎదురైతే, పోలీసులు చిన్నకేసు పెడితే లాయర్ దగ్గరకు వెళ్లి ఫీజు చెల్లించి కోర్టులో పోరాడే వారు ఎంత మంది ఉన్నారు? రాజీవ్ హత్యకేసులో దోషుల తరఫున జైలు లోపల, బయట, కోర్టులో న్యాయపండితులు పోటీపడి వాదించారు. న్యాయవాదులుగా అది వారి వృత్త్ధిర్మం. కాని ఈ మాత్రం న్యాయ సహాయం సామాన్యుల్లో ఎంత మందికి లభిస్తోంది. హైప్రొఫైల్ కేసు కావడంతో, ఏమి చేసినా సులభంగా దేశ వ్యాప్తంగా పేరు వస్తుందనే భావన కూడా దీనికి కారణం. విశాల దృక్పథంతో, మానవత్వం ఉంటే అందరి పట్ల సమానత్వంతో వ్యవహరించాలి. ప్రాంతం, మతం, వర్గం ప్రాతిపదికన లేదా ఏళ్లతరబడి జైల్లో ఉన్నారనే కారణంతో రాజీవ్ గాంధీ హంతకులను విడిచిపెట్టాలని తమిళనాడు ప్రభుత్వం సిఫార్సు చేయడం మంచి పరిణామం కాదు. ఇదే జరిగితే ప్రపంచ దేశాల్లో భారత్‌కు వారసత్వంగా వస్తున్న బలహీనత మరోసారి బహిర్గతమవుతుంది. ఏంతో మంది ఉగ్రవాద సానుభూతిపరులను జైళ్లలోకి నెడుతున్నారు. వామపక్ష తీవ్రవాదంతో సంబంధం ఉందనే కారణంపై అరెస్టు చేసి కేసులు నమోదు చేస్తున్నారు. ఇందులో అభం శుభం తెలియని విద్యార్థులు, గిరిజనులు, పౌర హక్కుల సంఘాల నేతలు ఉన్నారు. అత్యంత శక్తివంతమైన, ప్రజాదరణ కలిగిన నేత హత్య విషయంలో దోషులను వదిలిపెడితే దర్యాప్తు ఏజన్సీలపై ప్రతికూల ప్రభావం పడుతుంది. సీబీఐ, పోలీసు విభాగాల్లో నిష్క్రియాపరత్వం పేరుకుపోతుంది.

- కె.విజయ శైలేంద్ర, 98499 98097