మెయన్ ఫీచర్

మూలధనానికి, ‘పెట్టుబడి’కి తేడా తెలియదా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘కాపిటల్’ పేర కారల్ మార్క్స్ 170 ఏళ్ళ క్రితం ఓ గ్రంథం రాశారు. తరతరాలుగా సమాజంలో జరుగుతున్న క్రయవిక్రయాలు, భూసంబంధాలు ఇతరత్రా విషయాలను ఆయన అందులో విశే్లషించారు. ఆ రచనను తెలుగులోకి తర్జుమాచేశారు. తెలుగు భాషపై సాధికారత తమకే గలదని విశ్వసించే వారి దగ్గరనుంచి మార్క్స్ అంటే పడి చచ్చేవారివరకు ఎందరో కాపిటల్‌ను ‘పెట్టుబడి’గా పేర్కొన్నారు. అందులో ప్రముఖ భాషా సంస్కర్త, రచయిత్రి రంగనాయకమ్మ కూడా ఉన్నారు.
వాణిజ్యశాస్త్రం (కామర్స్) చదివిన వారికి ‘కాపిటల్’ అనే మాట ఎక్కువ పరిచయం. ఆ శాస్త్రంలో ఆ పదం ఎక్కువ దొర్లుతుంది. దానికి వారు చెప్పే అర్ధం ‘మూలధనం’. ఏదైనా వ్యాపారం చేయాలంటే కాపిటల్ (మూలధనం) కావాలి. దాన్ని ఎలా సమకూర్చుకోవాలి? ఎలా దాన్ని క్రమశిక్షణతో ఖర్చుచేయాలన్న విషయాలను ఆ శాస్త్రం చెబుతున్నది. ‘ఇనె్వస్ట్‌మెంట్’ అంటే పెట్టుబడిగా ఆ శాస్త్రం చెబుతోంది.
మరి మార్క్సిస్టులు కాపిటల్ అనే పదాన్ని పెట్టుబడిగా చిత్రీకరిస్తున్నారు. మూల ధనానికి పర్యాయపదంగా పెట్టుబడి అని పేర్కొన్నా సరైన అర్థం తెలిపే పదం ఉండగా పర్యాయపదం ఎందుకు?
సరే మూలధనం వివిధ మార్గాల ద్వారా, సంస్థల ద్వారా, సమకూర్చుకుని వ్యాపారం- వాణిజ్యం ప్రారంభిస్తే అందులో ‘‘లాభం’’ ఆశించడం అత్యంత సహజం. తల్లి తన బిడ్డను చూసి ‘ప్రేమ’ను కనబరచడం ఎంత సహజమో... పెట్టుబడి లేదా మూలధనంతో ప్రారంభమైన వ్యాపారంలో లాభాలకోసం యత్నించడం అంతే సహజం. కాని మార్క్స్, ఆయన అభిమానులు మాత్రం లాభాన్ని ఆశించడం ‘పాపం’గా పరిగణిస్తున్నారు. దాన్ని దోపిడీగా చిత్రీకరిస్తున్నారు. అమానవీయతగా దర్శిస్తున్నారు. అంతేగాక అలా మూలధనం పెట్టుబడిగా పెట్టి వ్యాపారం ప్రారంభించి పది మందికి ఉపాధి కల్పించి, ఉత్పత్తి పెంచినందుకు దూషిస్తున్నారు. కొండొకచో కోపం ప్రదర్శిస్తున్నారు. కొందరిని ‘ఖతం’ చేస్తున్నారు.
ఇతర వ్యక్తులు, సంస్థలనుంచి మూలధనం సేకరించినప్పుడు దాన్ని తిరిగి చెల్లించేందుకు, వ్యాపార నిర్వహణ ఖర్చులు, వేతనాలు చెల్లించేందుకు ‘లాభం’పై ప్రత్యేక ‘శ్రద్ధ’ కనబరచక తప్పదు. కాని మార్క్స్- ఆయన వీరాభిమానుల దృష్టిలో ఇది పరమపాపం! ఇది ఇతరుల శ్రమను దోచుకోవడంగా తర్జుమా చేసి, అందులో రాక్షసత్వాన్ని దర్శించి, చిత్రీకరించి, గోరంతలు కొండంతలుగా చేసి ద్వేషం నింపి తమ ‘జ్ఞానా’న్ని ప్రపంచానికి 170 ఏళ్ళుగా పంచుతున్నారు. అదెంత అజ్ఞానమో ఆ చిత్రీకరణే చెబుతోంది.
పిల్లను చూసి తల్లి ప్రేమను వ్యక్తం చేసినంత సహజమైన రీతినగల ‘లాభం’ ప్రక్రియ వారికి రాక్షసత్వంగా అగుపించడం వింతల్లోకెల్ల వింతగాక ఏమవుతుంది?
ఆడమ్‌స్మిత్, రికార్డోలాంటి ఎందరో మార్క్స్‌కన్నా పూర్వపు ఆర్థిక శాస్తవ్రేత్తలకు ఈ లాభం.. వ్యాపారం మానవ సహజాతాలుగా కనిపిస్తే ఆ పరిధిలోనే వాటిని పరిశీలించి వ్యాఖ్యానిస్తే, కారల్‌మార్క్స్‌కు మాత్రం అందులో కృత్రిమత్వం, దోపిడీ కనిపించడమంటే అతని దృష్టిలోపమే ఆ విశే్లషణలో కనిపిస్తోంది కాని వాస్తవాంశం కనిపించదు. కృత్రిమమే సహజత్వానికన్నా ఎక్కువ ఆకర్షణీయంగా ఉంటుందని మార్క్స్ మరోసారి ఈ విధంగా నిరూపించారు. ఊహాలోకంలో విహరిస్తూ, ఆర్థిక శాస్త్రాన్ని అధ్యయనం చేస్తే అది మార్క్సిజం ఆర్థిక సూత్రాల్లో ఉంటుంది. వ్యాపారం-వాణిజ్యం, మూలధనం, లాభం.. ఊహాలోకంలో విహరించలేవు. కఠిన వాస్తవాలతో అవి కదులుతాయి. కాల్పనిక పద్ధతిలో కారల్‌మార్క్స్ ‘కాపిటల్’ని దర్శించడంవల్ల జరిగిన నష్టం అపారం.
ఈ వౌలిక అంశం దగ్గరే మార్క్స్ తప్పటడుగువేస్తే ఆ తప్పుపై, తప్పుల తడకలపై, ఊహాత్మక అంశాలపై, కాల్పనిక అంశాలపై తన ఆలోచనలు పేర్చి దాన్ని ఒక శాస్ర్తియ సిద్ధాంతంగా ప్రకటించుకోవడం ఎంతటి సిగ్గుచేటు! నిరూపితమైనదే శాస్త్రం.. శాస్ర్తియమవుతుంది తప్ప కల్పన కాస్త సిద్ధాంతమవదన్న ఇంగిత జ్ఞానం మరిచి గత 170 ఏళ్లుగా ఆయన అభిమానులు వీరంగం వేయడం చూస్తే వారెంత కలల వీరులో అర్థమవుతోంది.
బ్రిటన్‌లోని గ్రంథాలలో అనేక గ్రంథాలు అధ్యయనం చేసి, తనకు తోచిన పదాలతో, హెగెల్ లాంటి తత్వవేత్తల మాటలతో ప్రభావితమై ఆలోచనల ‘కూర్పు’ చేస్తే అది సైన్స్ అంతటి శాస్ర్తియత అని ‘కితాబు’ నివ్వడం ఎంతటి అజ్ఞానం? వర్తమానంలో అనేక ఆర్థికాంశాలు అనేక సర్వేలు- పరిశీలనలు- అధ్యయనాలు-సదస్సుల్లో ఉబికివచ్చిన విమర్శ- ప్రశంసల అనంతరం వాస్తవానికి అది ఎంత సమీపంలో ఉందో పరిశీలిస్తూ ‘పట్టం’ కడుతున్నారు. ఈ ప్రక్రియ ఏదీ జరగకుండానే నేరుగా మార్క్స్ బుర్రలో తొలిచిన (మొలిచిన) మాటలు కాగితంపైకి రాగానే అవి ఐన్‌స్టీన్ సాపేక్ష సిద్ధాంతమంత శాస్ర్తియమని గొప్పలుపోవడం ‘‘గప్పాలు’’ కొట్టడం లాంటిదే తప్ప మరొకటికాదు.
మానవుడు అగ్నిని, చక్రాన్ని కనుగొనడాన్ని గొప్ప ముందంజగా అందరూ భావిస్తారు. అలా కొనసాగిన ప్రయాణంలోనే ఆవిర్భవించింది వాణిజ్యం- వ్యాపారం. వాటిని అంటిపెట్టుకుని వచ్చినవే మూలధనం, లాభం. దీన్ని తిరస్కరిస్తూ లాభం ‘పాపం’తో సమానమని పేర్కొనడం అజ్ఞానంగాక ఏమవుతుంది? మూలధనం లేకుండా, లాభం రాకుండా ప్రగతి కొనసాగదన్నది వౌలికాంశం. ప్రగతి ఒద్దనుకుంటే లాభం వదులుకోవాలి. మూలధనం ఇచ్చిన వాడికి డబ్బు ఎగ్గొట్టాలి. అంటే ఇది అనైతికత... అధర్మం... అన్యాయాన్ని ప్రోత్సహించడమే తప్ప మరొకటి కాదు. ఈ సత్యాన్ని ఆలస్యంగా గుర్తించి సోవియట్ యూనియన్, చైనా తూర్పుయూరప్ దేశాలు తిరిగి ‘లాభం’ కక్ష్యలోకి మళ్ళాయి. ఎవరో శత్రువులు, లేదా గ్రహాంతరవాసులు వచ్చి మార్క్స్ సూత్రాలను విడనాడి లాభాలబాట పట్టమని వారిని ఒత్తిడి చేయలేదు. మానవ సహజత్వానికి విరుద్ధమైన అంశాలను స్వచ్ఛందంగానే వదులుకుని, సహజత్వాన్ని పట్టుకోవడంతో ఆయా దేశాల్లో ఆ ‘పరివర్తన’ జరిగింది. మార్క్స్ సూత్రాలు, ఆయన చెప్పిన లాభం పాపమైతే.. కోట్ల మందిని ఆహుతిచ్చిన అనంతరం తిరిగి మొదటికెందుకొస్తారు? ఎందుకు ప్రగతి జరగాలంటే ‘లాభం’ ప్రక్రియను ఆశ్రయించాల్సిందేనని తీర్మానిస్తారు? ఎందుకంటే మార్క్స్ మార్కెట్ రహిత సిద్ధాంతం, ఆర్థిక సూత్రాలు కేవలం కాల్పనిక సాహిత్యానికి ఉపకరించేవి మాత్రమే అని తేలింది. కాబట్టి... నిజజీవితంలో మానవాళిని ముందుకు నడపలేవన్న సత్యాన్ని అవి తెలిపాయి కాబట్టి, అంటే ఇంతకాలం అసత్యమైన, అర్ధసత్యాలైన ఆర్థికసూత్రాల ఆధారంగా కోట్లాది మంది ప్రాణాలను బలితీసుకోవడం, అపార సంపదను ధ్వంసం చేయడం ఎంతటి దారుణమైన విషయమో తలచుకుంటే ఒళ్ళు గగుర్పొడుస్తుంది. ఇందుకోసమా అమూల్యమైన ప్రాణాలను పణంగా పెట్టింది. అపురూపమైన జీవితాలను ఆహుతి ఇచ్చింది. వెలకట్టలేని జ్ఞానాన్ని అగ్నికి ఆహుతి ఇచ్చింది? ఇదా మనం నేర్చిన సంస్కారం- సభ్యత?
ఇంకా విచిత్రమేమిటంటే రష్యా (సోవియట్ యూనియన్), చైనా, తూర్పు యూరప్ తదితర దేశాలకు కనువిప్పు కలిగిన దశాబ్దాల అనంతరం కూడా ఇంకా ఆ అజ్ఞానమే జ్ఞానమని, గొప్ప శాస్తమ్రని, అత్యంత మానవీయ సిద్ధాంతమని భ్రమసి మావోయిస్టులు దేశంలో మారణహోమానికి వర్తమానంలో తెగబడటం? ఇది కళ్ళుండి చూడలేని తనమే తప్ప మరొకటి కాదు. లేదా శాడిజమైనా అయి ఉండాలి.
ఆ శాడిజమైనా పరిమిత కాలానికైతే ఎవరైనా భరిస్తారు. కాని అదే పనిగా, అదే జీవితంగా భావించి అమాయక ప్రజలను వంచిస్తే అదెలా గౌరవనీయమైన రాజకీయమవుతుంది? అతి సింపుల్ విషయమిది. దీన్ని పరిష్కరించలేక గుడ్డెద్దు చేల్లోపడ్డ చందంగా దశాబ్దాలుగా నరమేధాలకు పాల్పడుతూ, విధ్వంసాలకు తెగబడుతూ ప్రపంచంలో ఇదే అత్యున్నత శాస్త్రం, మార్గం, పంథా అని ప్రగల్బాలు పలికితే ఎలా?
ఏది మంచి... ఏది చెడు అని తెలుసుకోవడానికి ఒక జీవితకాలం కావాలా?... ఇప్పటికే భారతదేశంలో రెండుమూడు తరాలు ఈ విధ్వంస సిద్ధాంతానికి ఆకర్షితులై సమాజంలోని అట్టడుగువర్గాలు వర్తమానంలో జీవించే నైపుణ్యాన్ని పట్టుకోనీయకుండా భూతకాలంలో జీవించేందుకు ప్రోత్సహించారు. ఇది అన్నింటికన్నా దారుణమైన విషయం. ఇంతకుమించిన ‘దగా’ మరొకటి ఏముంటుంది? ఆ దగాను ఇంకా కొనసాగించడానికి మావోయిస్టులు ‘కంకణం’ కట్టుకుంటే ఎలా?
ఒకప్పటి కమ్యూనిస్టు దేశాలన్నీ ‘లాభం’ బాటపడితే భారతదేశ పేదలు ఎందుకు ‘నష్టం’ బాట పట్టాలి?... ఎవరి స్వప్రయోజనాల కోసం ఆ ‘మార్గం’ తొక్కాలి? ఎవరిని మెప్పించడానికి ఆ ‘పంథా’లో పయనించాలి? ప్రజలే సుప్రీం అని చెప్పడం కాదు ఆచరణలో చూపాలి. ఆ ప్రజలిప్పుడు తమ ప్రాణాలకు ఏమాత్రం విలువలేదని మావోయిస్టుల తూటాలకు అర్పించడం లేదు. అత్యంత విలువైన తమ జీవితాలను వారికి రాసివ్వడం లేదు. మరి అలాంటప్పుడు తప్పుడు అవగాహనతో, అసత్య ప్రాపంచిక దృక్పథంతో వారి ఉసురు ఎందుకు తీయాలి? మేధ... కృత్రిమ మేధ, జ్ఞానం... జ్ఞాన సంచయం, ఇంగితం... విచక్షణ ఇవే ప్రజలను ఉన్నతికి తీసుకెళ్ళే సందర్భంలో మనం శ్వాసిస్తున్నాం. దీన్ని కాదంటే ఆ ‘శ్వాస’ను తీసేయడమేగా?... మరి అది ఆహ్వానించదగ్గదేనా?.. మావోయిస్టులతో సహా అందరూ దీని గూర్చి ఆలోచించాలి!

--వుప్పల నరసింహం.. 99857 81799