మెయిన్ ఫీచర్

ప్రేమ తత్వమే సాయితత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒకసారి షిర్డీకి చెందిన పెద్దమనిషి ఒకరు సాయంత్రం వేళ మసీదు వద్దకు వెళ్లాడు. ఎక్కడా బాబా కనిపించలేదు. తేరిపార చూడగా, మనిషి అవయవాలు మసీదు నాలుగు మూలలా విసిరేసినట్టు కనిపించాయి. వాటిని జాగ్రత్తగా గమనించి బాబా అవయవాలే అని గుర్తించాడు. బాబాను ఎవరో ఖూనీ చేశారని ఆ పెద్దమనిషి భయపడిపోయాడు. ఈ విషయాన్ని మొదట చూసి ఫిర్యాదు చేసింది తానే కాబట్టి మొదట తననే అనుమానిస్తారన్న భయం వేసింది. దీనితో మునసబుకు ఫిర్యాదు చేయాలనే ఆలోచనను మానుకుని భయపడుతూనే ఇంటికి వెళ్లాడు. తాను చూసిన విషయాన్ని ఎవరికీ చెప్పదల్చుకోలేదు. మర్నాడు బాబా ఖూనీ అయిన విషయం గ్రామంలో పెద్ద చర్చ అవుతుందని భావించాడు. ఆ రాత్రంతా ఆందోళనతోనే గడిపాడు. తెల్లారింది. బాబాకు ఏమైందోననే కంగారు, ఆత్రుతతో గబగబా మసీదుకు పరుగెత్తుకుని వెళ్లాడు. ఆశ్చర్యాల్లోకెల్లా ఆశ్చర్యం! బాబా ధుని ఎదుట కూర్చుని కట్టెలు వేస్తూ కనిపించారు. తాను రాత్రి చూసిన దృశ్యం భ్రమ కాదు కదా అనుకున్నాడు. మనసులోనే బాబాకు నమస్కరించి వెనుతిరిగాడు. బాబా చిరుప్రాయం నుంచే యోగ క్రియల్లో నిష్ణాతులు. బాబా యోగస్థితి ఎవరికీ అంతుబట్టనిది.
ప్రేమ తత్వమే సాయితత్వం
బాబాకు, ధనిక, బీద, చిన్నాపెద్దా తారతమ్యాలు లేవు. అందరికీ సమానంగా ప్రేమను పంచారు. మనుషుల పాపాలు తొలగించి జ్ఞాన దీపాలు వెలిగించటానికి, ఆదర్శ జీవనానికి బాటలువేసి, జీవితం పరమార్థాన్ని చాటటానికి ఈ భువిపై మానవ రూపంలో అవతరించిన దైవం సాయిబాబా. పరిపూర్ణ వైరాగ్యం, అపార కారుణ్యం, సంపూర్ణ జ్ఞానం ముప్పేటలా అల్లుకున్న సాయితత్వం ఈ జగత్తులోని సర్వంలోనూ చైతన్యమై ప్రసరిస్తుంటుంది. బాబా తన చక్కని, సరళమైన బోధనలతో ఆదర్శ జీవనానికి బాటలువేశారు. మనిషి ఎలా బతకాలో స్వయంగా జీవించి చూపారు. తన అవతార కాలాన్ని మొత్తం మానవాళి ఉద్ధరణకే త్యాగం చేసిన కారుణ్యమూర్తి బాబా. మనిషి ఎలా నడుచుకోవాలి? ఏది మంచి?, ఏది చెడు? అనేది వివేచించుకునే జ్ఞానాన్ని ప్రసాదించిన మహిమాన్వితుడు బాబా.
భగవంతునిది ఏ మతం?
శ్రీ సాయి అద్భుత అవతారమూర్తి. బాబా హిందువా? మహమ్మదీయుడా? అనేది ఎవరికీ తెలియదు. హిందువే అనుకుంటే మహమ్మదీయునిలా కనిపించేవారు. మహమ్మదీయుడే అనుకున్నంతనే హిందూ ధర్మాచార సంపన్నునిగా తోచేవారు. హిందువుల శ్రీరామనవమి ఉత్సవం, మహమ్మదీయుల చందనోత్సవాలను బాబా ఏకకాలంలో జరిపించేవారు. ఉత్సవాల్లో కుస్తీపోటీలను నిర్వహించేవారు. గెలిచిన వారిని ప్రోత్సహించి బాబా వారికి కానుకలు ఇచ్చేవారు. గోకులాష్టమినాడు గోపాల్ కాలోత్సవం, ఈదుల్ ఫితర్‌నాడు ముస్లింలచే నమాజు చేయించేవారు. బాబా మహమ్మదీయుడే అనుకుంటే హిందువుల మాదిరిగా చెవులు కుట్టి ఉండేవి. హిందువే అనుకుంటే వేషధారణ మహమ్మదీయునిలా ఉండేది. సున్తీని ప్రోత్సహించేవారు.
హిందువైతే బాబా మసీదులో ఎలా ఉన్నారు?. కాబట్టి బాబా నిస్సందేహంగా మహమ్మదీయుడే అనుకుంటే నిత్యం మసీదులో ధునిని వెలిగించేవారు. తిరుగలితో విసురుట, భజన, అన్న సంతర్పణ, గంట వాయించటం.. ఇవన్నీ మహమ్మదీయులకు అభ్యంతరకరమైనవి. కచ్చితంగా బాబా హిందువే అనుకుంటే ఎల్లప్పుడు ‘అల్లామాలిక్’ అని ఉచ్ఛరిస్తుండేవారు.
‘‘మీరెవరు?’’అని చాలామంది చాలాసార్లు బాబాను అడగటానికి ప్రయత్నించారు. కానీ, బాబా మోమును చూడగానే మాటలు రాని మూగలయ్యేవారు.
ఎవరైతే సర్వం త్యజించి భగవంతునికి సర్వస్య శరణాగతి చేస్తారో వారు దేవునిలో ఐక్యమైపోతారు. వారికి అది, ఇది అనే భేదము ఉండదు. ఫకీరులతో కలిసి బాబా మత్స్య, మాంసాలను తినేవారు. తాను తినే పళ్లెంలో కుక్కలు మూతి పెట్టినా బాబా ఏమనేవారు కాదు.
బాబా సచ్చరిత్రలో బాబా హిందువా? మహమ్మదీయుడా? అనే సంశయాలు, శంకలకు సంబంధించిన లీలలు చాలా ఉన్నాయి. అన్ని సందర్భాల్లోనూ బాబా తన సర్వజ్ఞతను చాటుకుని ఎవరు కోరిన రూపంలో వారికి కనిపించి కళ్లుతెరిపించారు. చివరివరకు బాబా ఎవరనేది ఎవరికీ తెలియదు. సృష్టికే ప్రతిసృష్టి చేయగల, విశ్వాన్ని బంతిలాచేసి ఆడుకోగల భగవంతునిది ఏ మతం? ఏ కులం?
మహిమలతో కాదు మానవత్వంతో బతకాలి...
బాబా వాద వివాదాలు, దీర్ఘ చర్చలు ఇష్టపడేవారు కాదు. శాంతానికి, నెమ్మదికి బాబా ఆటపట్టులా భాసిల్లేవారు. పది మాటలు మాట్లాడేచోట ఒక్కమాట మాట్లాడి ఆ విషయాన్ని ముగించమనేవారు. అప్పుడప్పుడు బాబాకు కోపం వచ్చేది. అదీ కొంతసేపే. సంయమనంతో వ్యవహరించేవారు. ఉన్నట్టుండి పరిపూర్ణ వేదాంత తత్వాన్ని బోధించే వారు. అంతలోనే ఆకాశం అరచేతిలో ఇమిడిపోయినట్టు వేదాంత సారాన్ని ఎంతో సరళంగా చక్కని నీతిని ఉపయోగించి చెప్పేవారు.
బాబా చక్రవర్తుల్ని, భిక్షకుల్ని ఒకే రీతిలో ఆదరించేవారు. అందరి అంతరంగాలు తెలిసిన సర్వాంతర్యామి అయి ఉండి కూడా ఏమీతెలియని వారిలా నటించేవారు. సన్మానాలను ఇష్టపడేవారు కాదు. ‘మానవ రూపంలో తిరుగుతున్న సాక్షాత్తూ భగవంతుడు’. బాబా మహిమలతో కాదు మానవత్వంలో బతకాలన్నదే సాయితత్వం చాటే సత్యం. బాబా ఎప్పుడూ తన గొప్పతనాన్ని, మహిమాన్విత శక్తిని ప్రదర్శించలేదు. భక్తుల చెవిలో మంత్రాలు ఊదలేదు, చేతులకు తాయెత్తులు కట్టలేదు.

సాయి విద్యా ఫౌండేషన్ ప్రచురించిన ‘సాయి జీవనం మోక్షమార్గం’ నుంచి స్వీకృతం. పుస్తకం లభించు స్థలం ‘సాయి విద్య ఫౌండేషన్, ఫ్లాట్ నెం.4, సాయిబాబానగర్ కాలనీ, కూకట్‌పల్లి, హైదరాబాద్-72, ఫోన్:040-23441123. ఎల్.ఐ.జి.49, ధర్మారెడ్డి నగర్, ఫేస్-1, కూకట్‌పల్లి, హైదరాబాద్-72, ఫోన్:040-23445566