మెయన్ ఫీచర్

సమాచార హక్కు చట్టానికి సామాన్యుడే రక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఏదో.. వాళ్లు సమాచారం అడుగుతారు, ప్రభుత్వానికి ఇబ్బంది లేనిది వెంటనే ఇచ్చేయమని చెబుతాం, ఇవ్వలేదనుకోండి.. ఆ దరఖాస్తు వివిధ దశల్లో ఏడాదిపాటు తిరుగుతుంది. ఏడాది గడచిన తర్వాత అనేక మార్లు ఆ పిటిషన్లను సమీక్షించి అప్పటికీ ఆ అధికారి సమాచారం ఇవ్వకపోతే వెయ్యి రూపాయిలో, రెండు వేల రూపాయిలో జరిమానా వేస్తాం.. అంతకు మించి ఇందులో అర్థం కనిపించడం లేదు. అనవసరంగా సమాచారం అడిగేవారు ఎక్కువయ్యారు.. దీనివల్ల ప్రభుత్వానికి పెద్ద పని, లేనిపోని సమాచారం సేకరించి, పదేళ్ల క్రితం నాటి వివరాలు తియ్యాలంటే ఆ సెక్షన్ అధికారికి అదో మూడు నెలల పని..’- ఇదంతా చెప్పింది సమాచార హక్కు కమిషనర్‌గా పనిచేసిన ఓ మహానుభావుడు. అసలు సమాచార హక్కు వచ్చిందే అందుకు అనేది గుర్తించకుండా, సమాచార హక్కును దాని నిర్వాహకులే కాలరాసే రోజు వచ్చేసింది. ఒక సమాచారం అడిగితే మూడు నెలలు ఎందుకు పడుతుంది..? ఆ విషయం ఎందుకు ఆలోచించడం లేదు? రాష్ట్రంలో ఎన్ని స్కూళ్లు ఉన్నాయని అడిగితే జవాబు చెప్పడానికి సంవత్సరం సమయం తీసుకుంటారా? ప్రభుత్వానికి ‘ఇరకాటంలో లేని’ సమాచారం వెంటనే ఇవ్వొచ్చా? ఇవ్వనక్కర్లేదా? సమాచారం ఇచ్చి తీరాల్సిందే అని చెప్పాల్సిన యంత్రాంగమే అవసరం లేదు, వారు అడుగుతునే ఉంటారు, మీరు పట్టించుకోకండి అని చెప్పే పరిస్థితి రావడానికి కారణం వ్యవస్థలో ఉన్న లోపాలు.
సమాచారం ఇస్తే తమ లోపాలు వెలుగుచూస్తాయి, ఎట్టి పరిస్థితుల్లో ఆ లోపాలు వెలుగుచూడరాదు. కేంద్ర సమాచార కమిషనర్ మాడభూషి శ్రీ్ధర్ ఇచ్చిన తీర్పులు చూసి బెంబేలెత్తిన వ్యవస్థలు చివరికి ఎదురు తిరగడం మొదలుపెట్టాయి. సమాచారం ఇస్తే కొంప మునుగుతుందనుకుంటే అసలు ఆ చట్టానే్న రద్దు చేస్తే అయిపోతుంది కదా..! వెయ్యి రూపాయిలు జరిమానా వేసేందుకు మూడు లక్షల వేతనంతో రాష్ట్రానికి పది మంది కమిషనర్లను నియమించడం ఎందుకు? ఇది సామాన్యుడి ప్రశ్న.
మనకు తెలిసినంత వరకూ సమాచార హక్కు 2005లో వచ్చింది. వాస్తవానికి సమాచార హక్కు చట్టం అంతకు ఎనిమిదేళ్ల ముందు నుండే దేశంలోని పలు రాష్ట్రాల్లో అమలులో ఉంది. ఇంకా పూర్వపరాలకు వెళ్తే సమాచార హక్కు ఉద్యమానికి పెద్ద చరిత్రే ఉంది. ఐక్యరాజ్యసమితి చేసిన మానవ హక్కుల ఒడంబడిక మొదలు, దేశంలో రాజ్యాంగ రచన నుండే సమాచార హక్కు వ్యక్తి స్వేచ్ఛ రూపంలో ఉంది. అత్యవసర పరిస్థితి విధింపు, తదనంతరం ప్రతికలపై ఆంక్షలు, అధికార దుర్వినియోగం హెచ్చుమీరి జనంలో ఆందోళన ప్రారంభమై అది ఉద్యమంగా రూపుదాల్చినపుడు దానిని గమనించిన రాజకీయ పార్టీలు 1977లోనే సమాచార హక్కు దిశగా ఆలోచించడం మొదలుపెట్టాయి. 1977 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా జనతాపార్టీ తరఫున మొరార్జీ దేశాయి తమ ఎన్నికల ప్రణాళికలో ‘గోప్యత లేని ప్రభుత్వం’ అందిస్తామని, ఇంటెలిజెన్స్ విభాగాన్ని, ప్రభుత్వ సంస్థలను ఇక మీదట ఎంత మాత్రం దుర్వినియోగం చేయబోమని ప్రజలకు గట్టి హామీ ఇచ్చారు. 1977లో అధికార రహస్యాల చట్టం-1923లోని అంశాలపై వర్కింగ్ గ్రూప్‌ను నియమించారు. అక్కడి నుండి సమాచార హక్కు ఉద్యమానికి ఒక ఊపు వచ్చింది. స్టేట్ ఆఫ్ యూపీ వెర్సస్ రాజ్‌నారాయణ్ (1975-4,ఎస్‌సిసి,428) కేసులో సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ కేకే మాథ్యుస్ తీర్పు చెబుతూ, సమాచారం తెలుసుకోవడం ప్రాథమిక హక్కు ఎందుకు కాకూడదని ప్రశ్నించారు. 1982లో వచ్చిన జడ్జెస్ కేసు (ఎస్‌పీ గుప్త వెర్సస్ యూనియన్ ఆఫ్ ఇండియా- ఎఐఆర్ 1982 ఎస్సీ 149)లో సమాచారం తెలుసుకునే హక్కు కల్పించాలని పేర్కొంది. 1986లో ముంబై హైకోర్టు జడ్జెస్ కేసును ప్రాతిపదికగా తీసుకుని ముంబై ఎన్విరాన్‌మెంటల్ గ్రూప్ వెర్సస్ పూణె కంటోనె్మంట్ బోర్డు కేసులో సమాచారం ఇవ్వాలని ఆదేశించింది. కుల్వాల్ వెర్సస్ జైపూర్ మున్సిపాల్ కార్పొరేషన్ కేసులో సుప్రీం కోర్టు 1986లో ఇచ్చిన తీర్పు ఒక సంచలనం. భావ ప్రకటనా స్వేచ్ఛ అంటేనే అంతర్లీనంగా సమాచారం తెలుసుకునే స్వేచ్ఛ ఉన్నట్టు అని పేర్కొంది. 1989 డిసెంబర్‌లో అప్పటి ప్రధాని వీపీ సింగ్ దేశ ప్రజలను ఉద్దేశించి ‘ఆకాశవాణి’లో మాట్లాడుతూ ప్రభుత్వ కార్యకలాపాల సమాచారాన్ని ప్రజల ముందుంచుతామని పేర్కొన్నారు.
1994లో మజ్దూర్ కిసాన్ శక్తి సంఘటన రాజస్థాన్‌లో అభివృద్ధి పనుల వివరాలు అందించాలని ఉద్యమించింది. తర్వాత నేషనల్ క్యాంపెయిన్ ఫర్ పీపుల్స్ రైట్స్ టు ఇన్ఫర్మేషన్ (ఎన్‌సిపిఆర్‌ఐ) సమాచార హక్కు చట్టం కోసం పోరు సాగించింది. 1996లో ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ జస్టీస్ పీబీ సావంత్ ఆర్‌టిఐ ముసాయిదాను తయారుచేసి ప్రభుత్వానికి పంపించారు. దీంతో ప్రభుత్వం హెచ్‌డీ శౌరి అధ్యక్షతన 1997 జనవరి 2వ తేదీన ఒక వర్కింగ్ గ్రూప్‌ను ఏర్పాటు చేసింది. 1997 మే 24న ఈ కమిటీ నివేదిక ఇచ్చింది. వెనువెంటనే తమిళనాడు ప్రభుత్వం సమాచార హక్కు చట్టాన్ని రూపొందించింది. కేంద్ర ప్రభుత్వం సైతం సమాచార స్వేచ్ఛ బిల్లును 2000లో రూపొందించి లోక్‌సభలో ప్రవేశపెట్టగా అది అక్కడే రెండేళ్లపాటు పెండింగ్‌లో పడింది. 2002 డిసెంబర్ 4న లోక్‌సభ దాన్ని ఆమోదించగా, 2003 జనవరి 6న రాష్టప్రతి ఆమోదముద్ర పడింది. పరివర్తన్ ఎన్‌జీవో, రాలేగావ్ సిద్ధి, గాంధేయ వాది అన్నా హజారే తదితరులు చేసిన కృషితో సమాచార హక్కు చట్టానికి ఒక రూపం వచ్చింది. ఇండియన్ ఎవిడెన్స్ యాక్టులోని సెక్షన్ -123, 124లకు సవరణలు చేయాల్సి వచ్చింది. సీసీఎస్ కాండక్టు రూల్స్-1964లోని రూల్ నెంబర్ 11 ప్రకారం ఎవరూ ప్రభుత్వ రహస్యాలను బహిర్గతం చేసేందుకు వీలు లేదు. ఈ నిబంధన సమాచార హక్కుకు పెద్ద ప్రతిబంధకం.
1997 డిసెంబర్ 22న చేసిన ఆర్కివ్ పాలసీ రిజల్యూషన్ కూడా మరో అడ్డంకి. 30 ఏళ్లలోపు అత్యంత కీలకమైన పత్రాలను సామాన్యులకు అందజేయడానికి వీలు లేదు. వాటిని 30 ఏళ్ల తర్వాతనే కొద్ది మంది ప్రముఖులకు మాత్రమే ఇవ్వొచ్చనేది ఈ తీర్మానం సారాంశం. ఇన్ని అడ్డంకులను అధిగమించి సమాచార హక్కు అమలులోకి వచ్చింది. అంతకంటే ముందే గోవా (1997), రాజస్థాన్ (2000), మహారాష్ట్ర (2000), కర్నాటక (2000), ఢిల్లీ (2000)లో ఈచట్టం అమలు చేశారు. యుపీఎ ప్రభుత్వం సమాచార స్వేచ్ఛను కాస్తా సమాచార హక్కుగా మారుస్తూ 2005లో పాత బిల్లుకు దాదాపు 150 సవరణలతో కొత్త చట్టాన్ని తీసుకువచ్చింది. అంటే సమాచార హక్కు ఉద్యమానికి అపుడే 41 ఏళ్లు గడిచాయి. కాని చట్టంగా అమలులోకి వచ్చి 13ఏళ్లు పూర్తయ్యాయి. అయినా ఇంకా చట్టం అసమగ్రంగానే ఉందనే చెప్పాలి. ప్రభుత్వ కార్యకలాపాలకే ఈ చట్టం పరిమితమైంది. దేశంలో అనేక వ్యవహారాలు ప్రైవేటు భాగస్వామ్యంలో కొనసాగుతున్నా, ప్రైవేటు సంస్థలకు ఈ చట్టంలో చోటు లేదు, ప్రశ్నించే హక్కు లేదు. ప్రభుత్వ నిథులు తీసుకుంటున్న అనేక సంస్థలు తాము దీని పరిధిలోకి రాబోమని తప్పించుకుంటున్నాయి. సైన్యం, న్యాయవ్యవస్థ కూడా రహస్యాల పేరిట సహ చట్టం పరిధిలోకి రాబోమని తేల్చిచెబుతున్నాయి. ఎటు తిరిగి విద్య, వైద్యం, పురపాలక శాఖలు, గ్రామీణాభివృద్ధి సంస్థలే ఈ చట్టానికి బాధ్యులవుతున్నాయి.
అడిగింది ఒకటైతే, సమాధానం ఇచ్చేది వేరొకటిగా ఉంటోంది. దీంతో జనంలో కూడా ఆసక్తి తగ్గుతోంది. వాస్తవానికి అనేక లోపాలు సవరించే దమ్ము , ధైర్యం ఎవరికీ లేదు. కొన్ని ఆంక్షలతో ప్రభుత్వ సంస్థల్లో ఏ అంశంపైనైనా సమాచార హక్కు కార్యకర్త ప్రశ్నించేందుకు వీలున్నా, ఫలానా కేసు ఎందుకు 30 ఏళ్లుగా పెండింగ్‌లో ఉందని న్యాయస్థానాన్ని ప్రశ్నించే హక్కు ఇప్పటికీ ఎవరికీ లేదు. దానికి కారణం రాజ్యాంగం కల్పించిన ప్రత్యేక హక్కులతో న్యాయవ్యవస్థ అన్ని వ్యవస్థలకంటే పైచేయిగా ఉండటమే.
ఎవరికీ తెలియని లోపాలు ఒకొక్కటీ వెలుగుచూడటంతో ప్రభుత్వానికి, అధికార యంత్రాంగానికి కూడా ఇపుడు గుబులు పెరిగింది. చట్టాన్ని పటిష్టం చేసే పేరుతో అనేక సవరణలకు కేంద్రం పూనుకుంది. ఎలాటి ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండానే, దానిలో అంశాలు బహిర్గతపర్చకుండానే ప్రభుత్వం దూకుడును ప్రదర్శించింది. సహచట్టంలోనే 4(1-సి) ప్రకారం ముఖ్యమైన విధానాలను రూపొందించినపుడు ప్రజలపై ప్రభావం చూపించే నిర్ణయాలను ప్రకటించినపుడు వాటికి సంబంధించిన అన్ని వాస్తవాలను ప్రచురించాలని నిర్దేశించినా దానిని కూడా ప్రభుత్వం పక్కన పెట్టింది. సమాచార కమిషనర్ల పదవీకాలం, జీత భత్యాలు, సర్వీసు నిబంధనలతో పాటు సమాచారం తెలుసుకోవడంలోనూ, ఇవ్వడంలోనూ కూడా కొన్ని నిబంధనలను మార్చాలనేది ప్రభుత్వ యోచన. సమాచార కమిషన్ స్థాయిని తగ్గించి తద్వారా చట్టాన్ని నీరుగార్చాలనే ప్రయత్నం సుస్పష్టం. 1996లో బెర్నస్టీన్ వర్సెస్ బెస్టర్ మరియు ఇతరుల కేసులో దక్షిణాఫ్రికా ప్రధాన న్యాయస్థానం ఇతర హక్కుల మాదిరి వ్యక్తిగత గోప్యతకూ కొన్ని పరిమితులు ఉంటాయని చెప్పిన మాట నిజమే, కానీ పుట్టుస్వామి కేసు (2017 ఆగస్టు)లో వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కుగా 9 మంది న్యాయమూర్తుల ధర్మాసనం గుర్తించింది కదా. కెనరా బ్యాంకు వర్సెస్ సీఎస్ శర్మ కేసులో ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలు కూడా వారి వ్యక్తిగత సమాచారమేనని, అది తెలుసుకునే హక్కు లేదని సుప్రీం కోర్టు పేర్కొంది. వ్యక్తిగత సమాచార భద్రత పేరుతో సమాచార హక్కు చట్టానికి శ్రీకృష్ణ కమిటీ చేసిన ప్రతిపాదనలు కూడా అదే దిశలో ఉన్నాయి. ఆర్టీఐ చట్టం 8(1జె) నిబంధనను తొలగించి తాను రూపొందించిన కొత్త నిబంధనను చేర్చాలని శ్రీకృష్ణ కమిటీ సూచించింది. స్థూలంగా చెప్పాలంటే ఒక వ్యక్తి లేదా ఉద్యోగికి హాని కలిగే పక్షంలో ఆ వ్యక్తికి చెందిన సమాచారాన్ని ఇతరులకు ఇవ్వడానికి నిరాకరించవచ్చు. ఈ అంశాన్ని తీసుకుని మొత్తం చట్టానికి వక్రభాష్యం పలికే అవకాశం లేకపోలేదు. ఇప్పటికే సహ చట్టానికి తూట్లు పొడిచే ప్రయత్నాలు మూడు సార్లు జరిగాయి. గత సార్వత్రిక ఎన్నికల సమయంలో లోక్‌పాల్ బిల్లు గురించి హడావుడి చేసిన పార్టీలకు ఆ అంశం ఇపుడు గుర్తుకు రావడం లేదు.
భావప్రకటనకు, స్వేచ్ఛకు విఘాతం కలిగించే ఐటి యాక్టు సెక్షన్ 66(ఎ) రాజ్యాంగ విరుద్ధమని సర్వోన్నత న్యాయస్థానం చెప్పడం అందరిలో ఆనందం కలిగించింది. భావ ప్రకటనా స్వేచ్ఛను కల్పించే అధికరణ 19(1ఎ), వ్యక్తి స్వేచ్ఛ సహేతుక నియంత్రణకు చట్టాలు అక్కర్లేదు. ఏ స్వేచ్ఛ అయినా విశృంఖలత్వానికి సభ్యసమాజ రూపంలో అదుపు, అజమాయిషీ ఉంటాయి.
ఏతావతా సహ చట్టానికి ప్రాధాన్యత తగ్గించడం, నిబంధనలను నీరుగార్చడం చూస్తుంటే ప్రభుత్వంలోని లుకలుకలు ప్రజలకు తెలియరాదనే భయాందోళనలే కారణమనేది నిర్వివాదాంశం. సామాన్య పౌరసమాజ చైతన్యం ముందు ఏ ప్రభుత్వమైనా తలదించాల్సిందే. సామాన్యుడే సహ చట్టానికి శ్రీరామరక్ష.

-బీవీ ప్రసాద్ 98499 98090