మెయిన్ ఫీచర్

మారిన జీవనశైలితో.. మెదడుకు ‘మగత’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆధునిక పోకడలతో, అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీతోపాటుగా మెదడుకు కొంత భారం తగ్గిందనుకొంటున్నారు కదా! వాస్తవికంగా ఆలోచిస్తే మెదడులో జరగాల్సిన అభివృద్ధి ఆగిపోతుందేమోననే భయం వేస్తోంది. మెదడును ఎంతగా వాడుకుంటే అంతగా దాని పనితనం పెరుగుతుంది. కానీ ప్రస్తుత పరిస్థితులు అందుకు భిన్నంగా తయారవుతున్నాయి. మనిషి శరీరంలోని ఏదైనా అవయవం పనిచేయకపోతే నొప్పి, బాధ అనిపిస్తుంది. వెంటనే ఆ అవయవం పూర్తిగా బాగు అయ్యేంతవరకు శ్రద్ధ వహిస్తున్న మనిషి, అదే ఉజ్వలమైన భవిష్యత్తును మన కళ్లముందుకు తీసుకువచ్చే ప్రధానమైన అవయమైన మెదడును ఎలా వాడుకోవాలో తెలియకనో ఏమో మెదడు పనితీరుపై శ్రద్ధ చూపడం లేదు.
నిజానికి మతిమరుపులన్నీ అల్జీమర్స్ వ్యాధికి దారితీయవు. సంబంధిత విషయంపై ఆసక్తి లేకపోయినా తాత్కాలికంగా మతిమరుపు రావచ్చు. అల్జీమర్స్‌తో మనిషి జ్ఞాపకాలు మాయం, మెదడు పనితీరును క్రమేపీ దారుణంగా దెబ్బతీస్తుంది. ఉద్యోగి ఉదయానే్న లేచి ఆఫీసుకు బయలుదేరుదామని సిద్ధమయ్యాడు- తీరా టై కనిపిచడంలేదని లేదా వెహికల్ కీ కనిపించడంలేదని భార్యపై చిందులు వేసే సంఘటనలు కోకొల్లలు. కిరాణా షాపులోకి వెళ్లి ఏదైనా వస్తువులు కొంటే వెంటనే కాలిక్యులేటర్ తీసుకొని లెక్క చేసి డబ్బులు ఎంత ఇవ్వాలో చెబుతున్నాడు. నోటితో చేయాల్సిన చిన్న చిన్న లెక్కలకు కూడా కాలిక్యులేటర్‌ను ఉపయోగిస్తూ తన మెదడు మొద్దుబారే విధంగా తయారుచేసుకుంటున్నాడు. ఎందుకిలా జరుగుతోంది? మారుతున్న కాలానికి అనుగుణంగా మనిషి జీవితాలు, జీవన విధానాలలో మార్పులు, చేర్పులు చోటుచేసుకుంటున్నాయి. ప్రపంచాన్ని అరచేతిలోనే వీక్షిస్తున్న మనిషికి అపుడపుడు విచిత్రమైన కష్టాలు వచ్చిపడుతున్నాయి. సమయానికి గుర్తుకురాని యూజర్ ఐడిలు, పాస్‌వర్డ్‌లు, సీక్రెట్ కోడ్‌లతో మతిమరుపు వచ్చిందేమోనని అనుమానాన్ని కూడా మెదడే గుర్తుచేస్తుంది.
మెదడును చలాకీలా పనిచేయించుకోవడం మన చేతుల్లోనే ఉంది. ఇందుకోసం కొన్ని చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. ఇవి జ్ఞాపకశక్తి మెరుగుపరచుకోవడానికి దోహదం చేస్తాయి. మెదడు సమర్థవంతంగా పనిచేయాలంటే ధ్యానం, యోగా, పోషక విలువలు గల ఆహారం, శారీరక మరియు మానసిక వ్యాయామాలు ఎంతో దోహదం చేస్తాయి.
డిమెన్షియా, అల్జీమర్స్‌లు సరిగ్గా ఈ జ్ఞాపకాలను మాయం చేస్తాయి. మన ఆలోచన, ప్రవర్తనలనూ దెబ్బతీస్తాయి. రోజువారీ పనులపైనా తీవ్ర ప్రభావం చూపుతాయి. డిమెన్షియా రకాల్లో తరచుగా కనబడేది అల్జీమర్సే. అల్జీమర్స్ సాధారణంగా 65 ఏళ్ల తర్వాత వస్తుందంటారు. అలాగని చిన్న వయసులో రాకూడదని ఏమీ లేదు.
మనుషులకు దేవుడు ప్రసాదించిన అవయవమే మెదడు. మనిషి జీవితం జ్ఞాపకాలతోటే గడిచిపోతుంది. మన నోటినుండి వచ్చే ప్రతిమాట, మన బంగారు భవిష్యత్తుకోసం వేసే ప్రతి అడుగు. రోజు చేసే పనులన్నీ జ్ఞాపకాలతో ముడిపడినవే. మన పేరు, మనం ఉన్న ఊరు, మనతో వున్న కుటుంబ సభ్యుల పేర్లు మరిచిపోతే ఒక్కసారిగా ఊహించండి. చివరికి మనల్ని మనమే మరచిపోతే...
2015 నాటి ప్రపంచ అల్జీమర్స్ నివేదిక ప్రకారం.. మన దేశంలో 41 లక్షలమంది అల్జీమర్స్‌తో బాధపడుతున్నారు. 2050 నాటికి ప్రపంచవ్యాప్తంగా డిమెన్షియాతో బాధపడేవారిలో 50 శాతం ఆసియాలోనే ఉంటారని హెచ్చరిస్తున్నారు కాబట్టి వీలైనంతవరకు మెదడుకు పని చెప్పడం ఉత్తమం.
ఒకప్పుడు మతిమరుపు అనేది తాతలు, అమ్మమ్మలు, బామ్మలు, నానమ్మలు, వృద్ధులలో ఉండేది కానీ, ఇది ప్రస్తుతం అందరినీ వేధిస్తున్న సమస్య. విద్యార్థులకు పరీక్షలలో ప్రశ్నలకు జవాబులు గుర్తుకురాక వేదనకు గురయ్యేవారెందరో. వాస్తవానికి గత దశాబ్దకాలం నుంచి గమనిస్తే మనం మెదడును పూర్తి స్థాయిలో వాడుకోవడం లేదనే చెప్పాలి. ప్రతి అవసరానికి ఏదో ఒక సాధనం మీద ఆధారపడుతూ మెదడు వాడకాన్ని పూర్తిగా తగ్గించేసాం. దీనివల్ల మెదడు పూర్తి స్థాయిలో పనిచేయక డిమోన్షియా, అల్జీమర్స్ వంటి తీవ్ర మతిమరుపు సమస్యల ముప్పు పెరుగుతోంది. మనసును కలచివేసి విషాదాలను నింపే చెడు జ్ఞాపకాలను మరచిపోవటం అనేది మనిషికి దేవుడిచ్చిన వరం అంటారు. ఈ మరుపు మితిమీరడంవల్ల జీవితాలు బుగ్గిపాలు అవుతున్న సంఘటనలు కోకొల్లలు. అల్జీమర్స్ వ్యాధి మూలంగా మెదడులోని జీవకణాలు ఏకకాలంలో మృత కణాలుగా తయారుకావడం మూలంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మతిరుపును కవర్ చేయడానికి నానా తంటాలు పడుతూ ఉంటారు. ఈ క్రమంలో మరిన్ని తప్పులు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రాథమిక దశలోనే దీనిని గుర్తిసే త నియంత్రించడం సులభం అవుతుంది.
నివారణ లేదు..
అల్జీమర్స్ వ్యాధికి గురైతే పూర్తిగా నివారణ వీలుకాదు, ఒత్తిడికి దూరంగా ఉండడంవల్ల నియంత్రణ చేయవచ్చు. అల్జీమర్స్‌ను ప్రారంభంలోనే గుర్తిస్తే నియంత్రణ సాధ్యపడుతుంది. అల్జీమర్స్ వున్న వ్యక్తికి కుటుంబ సభ్యుల సహాయ, సహకారాలు ఎంతో అవసరం. రోజూ చేసే పనులను కుటుంబ సభ్యులు గుర్తుచేస్తుండాలి. మతిమరుపును తగ్గించుకోవడానికి తాము చేసే పనులను ఒక పుస్తకంలో రాసుకోవడం అలవాటు చేసుకోవాలి.
జ్ఞాపకశక్తి లేదని వారిని అవహేళన చేయకూడదు. ఒంటరిగా ఉండకుండా టీవీ, పత్రికలు, పుస్తకాలు, మాగజైన్లు ఏర్పాటుచేసుకోవాలి. మానసికంగా ఒత్తిడికి గురికాకుండా ఆత్మవిశ్వాసం పెంపొందుతుంది. ప్రశాంతమైన వాతావరణం ఉండే విధంగా చూడాలి. సమతుల ఆహారం తీసుకుంటూ, వ్యాయామం చేయాలి.
నిద్రమాత్రలతో..
ప్రస్తుతం ఒత్తిడితో కూడిన జీవన విధానంతో రాత్రిళ్లు నిద్ర సరిగా రాకపోవడం, తెల్లవారి ఆఫీసులో టేబుల్‌పైన నిద్రపోతే బాస్‌తో తిట్లు తప్పవని, ఏదో ఒక నిద్రమాత్రల వేసుకుంటూంటారు. ఇలా మాత్రలతో నిద్ర అలవాటుగా మారుతుంది. రోజు నిద్ర మాత్రలు వాడడంవల్ల అల్జీమర్స్ ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని గుర్తించాలి.
కొత్త విషయాలు
నేర్చుకోవడం
మెదడులో సమాచార ప్రసారం ఒక నాడీకణం నుంచి మరో నాడీ కణానికి ప్రసరిస్తూ ఉంటుంది. కొత్త విషయాలతో నాడీ కణాలమధ్య కొత్త బంధాలు ఏర్పడుతాయి. ఇలాంటి కొత్త బంధాలు మెదడును చురుకుగా తయారుచేస్తుంది. కొత్త భాష, సంగీతం, వంటలు.. మొదలగునవి.
మనకు మనమే ఏదో ఒక పనిని కల్పించుకొని దానిలో నిమగ్న కావడం, కొత్త వ్యక్తులను కలవడం, పరిచయాలు, ఆలోచనా విధానాలలో మార్పు చేసుకోవడం, సాధారణంగా మనం ఏ వృత్తిలో వుంటే ఆ వృత్తివారినే కలుస్తూ ఉంటాం. మంచిదే కాని, ఇతర వృత్తులవారిని కలిస్తే వైవిధ్యభరిత ఆలోచనలు వస్తాయి. కొత్త విషయాలు తెలుస్తాయి.
వ్యాయామాలు
ఏక పాదాసనం- ఒక కాలుపై నిలబడి చేసే వ్యాయామాలు శరీర నియంత్రణకు, జ్ఞాపకశక్తి మెరుగ్గా ఉండటానికి దోహదం చేసే నాడీ కణాలను ప్రేరేపిస్తాయి.
రోజూ కనీసం అరగంటసేపు శారీరక వ్యాయామం చేస్తే శారీరక ఆరోగ్యానికి, మానసిక ఆరోగ్యానికి మేలు చేస్తుంది. రోజులో 6 నుంచి 7 గంటలపాటు నిద్రపోవడం వల్ల జ్ఞాపకాలు స్థిరపడతాయి. ఏకాగ్రత కుదురుతుంది. మెదడు చురుకుగా పనిచేస్తుంది.
మానసిక వ్యాయామం
మెదడుకు పదునుపెట్టే పదకేళీలు, సుడోకు, లాజికల్ సమస్యల సాధన, పజిల్స్, అబ్రివేషన్స్ గుర్తుకుతెచ్చుకోవడం, ధ్యానం లాంటివి చేస్తూ ఉండాలి.
పోషకాహారం
మెదడు క్షీణతను తగ్గించడానికి విటమిన్ బి6, బి 12, ఫోలిక్ ఆమ్లం కలిగిన ఆకుకూరలు, చికెన్, గుడ్లు వంటి వాటిలో ఉంటాయి. విటమిన్ సి అధికంగా వుంటే నిమ్మ, బత్తాయి, విటమిన్-ఇ (విషయ గ్రహణశక్తి) దంపుడు బియ్యం, మరియు విటమిన్ కె అధికంగా వుంటే అరటి, గోబీ పువ్వులాంటివి తీసుకోవాలి.
మెదడుకు నిరంతరం శక్తి అందితేనే ఏకాగ్రత కుదురుతుంది. పొట్టు తీయని ధాన్యాలు తింటే నిదానంగా జీర్ణమవుతూ రక్తంలోకి నెమ్మదిగా గ్లూకోజు విడుదల అవుతూ మెదడుకు నిరంతర శక్తి అందుతుంది కాబట్టి దంపుడు బియ్యం, రాగులు, సజ్జలు, జొన్నలు వంటి తృణధాన్యాలు తినడం అలవాటు చేసుకోవాలి.
మెదడుకు కీలకమైన కొవ్వు ఆమ్లాలు మన శరీరం తయారుచేసుకోలేదు. వీటిని ఆహారం ద్వారానే పొందాలి. చేపలు, అవిసెలు, సోయాబీన్స్ వంటివి తరచుగా తీసుకోవడం వల్ల మెదడు పనితీరు, గుండె పనితీరు మెరుగవుతుంది. విటమిన్-డి లోపం వల్ల జ్ఞాపకశక్తి సన్నగిల్లుతుంది. విటమిన్-డి సమృద్ధిగా లభించే చేపలు, గుడ్డు పచ్చసొన, పాలు తీసుకోవడం ద్వారా జ్ఞాపకశక్తి సన్నగిల్లకుండా ఉంటుంది.
న్యుమోనియా, ఫ్లూ , పంటి చిగుళ్ల వ్యాధి ద్వారా వచ్చే బాక్టీరియా వల్ల మెదడుకు హాని కలుగుతుంది. ఇలాంటి అంటువ్యాధులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి లేదా వెంటనే తగ్గిపోయే విధంగా చర్యలు చేపట్టాలి. జ్ఞాపకశక్తి, ఆలోచనా నైపుణ్యాలను పెంపొందించే జింక్, ఒత్తిడిని తగ్గించే మెగ్నీషియం, మూడ్‌ని ఉత్సాహపరిచే సెరటోనిన్ అధిక మొత్తంలో లభించే గుమ్మడి గింజలు తీసుకోవాలి. అల్జీమర్స్ ఆలోచనలు, ప్రవర్తనలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. నిరంతరం చదవండి, ఎక్కువ కాలం జీవించండి, అల్జీమర్స్‌ను నిరోధించండి.

-డా. అట్ల శ్రీనివాస్‌రెడ్డి కౌన్సిలింగ్ సైకాలజిస్ట్, 97039 35321