ఎడిట్ పేజీ

‘విషనగరి’గా మారనున్న ఫార్మాసిటీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచంలోనే ఒక ప్రముఖ ఔషధ పరిశ్రమ కేంద్రంగా హైదరాబాద్ పేరొందింది. దేశంలో మరెక్కడా లేని విధంగా ఔషధ పరిశ్రమల స్థాపనకు ఇక్కడ పారిశ్రామిక వేత్తలు ఆసక్తి చూపు తున్నారు. ఈ ఆసక్తిని సొమ్ము చేసుకోవడం కోసం తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ శివారులలో శ్రీశైలం రోడ్‌పై సుమారు 20 వేల ఎకరాలలో ఫార్మా సిటీ ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తున్నది. ఔషధ పరిశ్రమలు అనగానే ప్రజలకు ప్రాణాంతకమైన విష వాయువులను విరజిమ్మే కాలుష్యమే గుర్తుకువస్తుంది. అమెరికా, ఐరోపా దేశాలు తమ దేశాలలో అటువంటి పరిశ్రమలను ప్రోత్సహించకుండా భారత్ వంటి దేశాలలో ఏర్పాటు చేసేలా వ్యూహం పన్ని, ఇక్కడి ప్రజలను కాలుష్యంతో రోగగ్రస్తులను కావించి, ఇక్కడ ఉత్పత్తి చేసిన మందులతో తమ ప్రజల ఆరోగ్యం కాపాడుకొనే కుట్రపూరిత విధానాలను అమలు చేస్తున్నాయి. ఈ కుట్రకు హైదరాబాద్ ప్రజలు బలి కావలసి వస్తున్నది.
ఇప్పటికే హైదరాబాద్‌లో నెలకొన్న పటాన్ చెరువు, జీడిమట్ల, చౌటుప్పల్, కొత్తూరు వంటి పారిశ్రామికవాడలు కాలుష్యాన్ని విరజిమ్ముతూ ఉండడంతో ఆయా ప్రాం తాలు- జన జీవనానికి దుర్లభంగా మారేటట్లు చేసుకొంటున్నాము. ఆ పరిసరాలలోని అనేక గ్రామాల ప్రజలు మందుల పరిశ్రమల నుండి వచ్చే వ్యర్ధనీరు, గాలి, అత్యంత ప్రమాదకర ఘన పదార్థాల కాలుష్యంతో సతమతమవుతున్నారు. మూడు దశాబ్దాలుగా పటాన్ చెరువు ప్రాంత ప్రజలు ఎన్నో పోరాటాలు చేస్తున్నా రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రేక్షక పాత్రకు పరి మితమవుతోంది. గత పదేళలుగా ఏర్పాటు చేస్తున్న పరిశ్రమలు స్థానిక వనరులను విపరీతంగా కాలుష్యం కావిస్తున్నా, ప్రజలు ప్రభుత్వానికి విన్నవించుకొంటున్నా పట్టించుకున్న నాథుడే కనిపించడం లేదు. ప్రజలు రకరకాల కాలుష్యాలతో, అత్యంత ప్రమాదకర రసా యనిక చర్యల బారిన పడుతూ అనారోగ్యాలకు గురవుతున్నారు. వైద్యం కోసం ఉన్న ఆస్తులను తెగనమ్ముకోవాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి.
ఈ పరిశ్రమలు నిబంధనల ప్రకారం అవసరమైన నీటిని ట్యాంకర్ల ద్వారా తెచ్చుకోవడం మినహా బోర్లు వేయరాదని నిబంధనలు ఉన్నా అందరూ యథేచ్చగా వేస్తున్నారు. వాటితో భూగర్భ జలాలు కాలుష్య మవుతున్నాయి. పరిసర ప్రాంతాల ప్రజలకు తాగునీరు కరువవుతోంది. కాలుష్యానికి ఆస్కారం లేని సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగిస్తామని పరిశ్రమలు ఎన్ని తియ్యటి కబుర్లు చెబుతున్నా లాభాపేక్ష పట్ల తప్ప ప్రజల ఆరోగ్యం పట్ల వారెవ్వరూ శ్రద్ధ చూపడం లేదు. వాటిని అదుపు చేయగల సామర్ధ్యం ప్రభుత్వంలో కనిపించడం లేదు. ఇటువంటి దారుణ పరిస్థితులలో ఫార్మా సిటీ పేరుతో ఒకే చోట కొన్ని వందల ఔషధ పరిశ్రమలను ఏర్పాటు చేసే ప్రయత్నం ఇప్పుడు జరుగుతున్నది. వీటిలో ప్రమా దకరమైన రసాయనాలు నిల్వ చేస్తూ ఉంటారు. చిన్నపాటి ప్రమాదం జరిగినా భోపాల్ విషవాయు ప్రమాదం కంటే పలు రెట్ల ఘోర విపత్తుకు దారితీసే ప్రమాదం ఉంది. ఇటువంటి అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా, చట్ట ప్రకారం జరగవలసిన గ్రామసభలు జరిపి ప్రజా భిప్రాయం సేకరించకుండా ఔషధ పరిశ్రమలకు కేంద్ర ప్రభుత్వ పర్యావరణ మంత్రిత్వ శాఖ జెట్ వేగంతో అనుమతులు ఇవ్వడం విస్మయం కలిగిస్తుంది.
ఇక్కడ బిజెపి నేతలు టిఆర్‌ఎస్ ప్రభుత్వంపై ఎన్ని విమర్శలు కురిపిస్తున్నా ఢిల్లీలో బిజెపితో ఆ పార్టీ నేతలు చేదోడుగా ఉంటున్నారని చెప్పడానికి ఫార్మా సిటీకి వేగంగా వచ్చిన అనుమతులే సాక్ష్యంగా నిలుస్తాయి. బహుశా బిజెపి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నా అంత వేగంగా అనుమతులు వచ్చి ఉండేవి కావేమో! అందుల్లనే ప్రభుత్వం ఏర్పాటు చేయదలచిన ఫార్మా సిటీకి ‘విషనగరి’ అని ప్రముఖ పర్యావరణ వేత్త డాక్టర్ నర సింహారెడ్డి పేరు పెట్టారు.
ప్రజలను ముందుగా సంప్రదించకుండా, వారి అనుమతితో సంబంధం లేకుండా ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్‌ను ప్రకటించడం సర్వత్రా విమర్శలకు గురవుతున్నది. పూర్తిస్థాయి ప్రాజెక్ట్ నివేదికను బహిరంగ పరచడం లేదు. గోప్యంగా విషవాయువులను ప్రజలపైకి నెట్టే ప్రయత్నం జరుగుతున్నది. కొత్త పారిశ్రామిక విధానం సందర్భంగా పరిశ్రమలు నెలకొల్పడం కోసం 2.5 లక్షల ఎకరాల భూమి బ్యాంకు ఉన్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. అంత భారీగా భూములు పరిశ్రమల కోసం అందుబాటులో ఉంటే ఇప్పుడు ఫార్మాసిటీ పేరుతో సాగు భూములు 20 వేల ఎకరాల వరకు సేకరించే ప్రయత్నం ప్రభుత్వం చేయవలసిన అవసరం ఏమిటి? ఫార్మా సిటీకి సంబంధించిన మాస్టర్ ప్లాన్ తయారు కాక ముందే అసైన్డ్ భూములు, అటవీ భూములు, పట్టా భూముల సేకరణను చేపట్టడం పలు అనుమానాలకు దారితీస్తున్నది. భూ సేకరణ వేలాది కుటుంబాలలో చిచ్చు రాజేస్తున్నది. కలహాలు సృస్టిస్తున్నది. భూసేకరణ సందర్భంగా చట్ట ప్రకారం కాకుండా ఇష్టం వచ్చిన్నట్లు, ఒక్కొక్క రైతుకు ఒక్కొక్క విధంగా పరిహారం ఇస్తున్నారు. భూమి ఉన్న రైతుల సమస్యలు ఒక విధంగా ఉండగా, అసలు భూములు లేని కూలీలు, ఇతర పనులు చేసుకొనే వారి పరిస్థితులు అగమ్య గోచరంగా ఉన్నాయి. ఇంతటి భారీ స్థాయిలో ఫార్మా సిటీ ఏర్పాటు అవసరం ఏమిటనే విషయంలో ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేక పోతున్నది.
కొత్తగా పరిశ్రమలు రావని, ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో ఉన్న పరిశ్రమలను ఫార్మాసిటీకి తరలిస్తామని, పరిశ్రమల విస్తరణకు అవాకాశం కల్పిస్తామని ప్రభుత్వం చెబుతున్నది. కొత్తగా పరిశ్రమలు పేట్టుకొనేవారు, పరిశ్రమలను విస్తరించాలనుకునేవారు వ్యర్థ్యాలను నేరుగా సముద్రంలో పడవేసి వీలు ఉండడంతో విశాఖపట్నం వద్ద పరవాడ ఫార్మా సిటీ వైపు వెడుతున్నారు. హైదరాబాద్‌లో ఉన్న పరిశ్రమలేవీ నగర శివారుకు, 50 నుండి 70 కి.మీ దూరం తరలించడానికి సిద్ధపడడం లేదు. ఇక్కడి నుండి పరిశ్రమలు తరలించాలంటే ఇక్కడున్న తమ స్థలాలను వాణిజ్య సముదాయాలుగా మార్చుకొనే అనుమతులు ఇవ్వడంతో పాటు, ఫార్మా సిటీలో తమకు పలు రాయి తీలు కల్పించాలని గొంతెమ్మ కోర్కెలు కోరు తున్నారు. అసలు ఎన్ని పరిశ్రమలు వచ్చినా 20 వేల ఎకరాల అవసరం ఏమిటనే ప్రశ్న తలెత్తుతున్నాయి. గృహ నిర్మాణ ప్రతిపాదనలు ఉండడంతో దానైని రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మార్చే ప్రయత్నమే ఎక్కువగా కనిపిస్తున్నది. వ్యవసాయం చేసుకొంటున్న భూములను లాగేసుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని ప్రోత్సహించడం ప్రభుత్వానికి తగునా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఫార్మాసిటీ, ఆ చుట్టుపక్కల ఇప్పటికే అనేక రియల్ ఎస్టేట్ వెంచర్లు వెలుస్తున్నాయ. పెద్ద ఎత్తున భూముల క్రయవిక్రయాలు జరుగుతున్నాయి. ఫార్మా సిటీ పేరుతో విష వాయువులు విరజిమ్మే ప్రాంతంలో నివాసం కోసం స్థలాలు, ఇళళు అమ్మే ప్రయత్నం జరుగుతూ ఉండడం విచారకరం. స్పష్టమైన, పర్యావరణ పరమైన సమస్యలను దృష్టిలో ఉంచుకొనే అభివృద్ధి ప్రణాళికలు తయారు చేయడం పట్ల ప్రభుత్వాలు తగు శ్రద్ధ చూపకపోడంతో ఇటువంటి అనర్థాలు జరుగుతూ ఉంటాయి. ఔటర్ రింగ్ రోడ్‌కు సమాంతరంగా మరో రింగ్ రోడ్‌ను ఏర్పాటుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది. అది కార్యరూపం దాల్చితే ఫార్మా సిటీ భూముల విలువ అనేక రేట్లు పెరుగుతుంది. ఆ విధంగా రైతుల నుండి భూములను లాక్కొని పారిశ్రామిక వేత్తలకు భూముల విలువ భారీగా పెరిగే సదుపాయం ప్రభుత్వమే కల్పిస్తున్నట్లు అవుతోంది.
ఈ ప్రమాదకర పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని తెలంగాణలోని ఔషధ పరిశ్రమల బాధితులు, యాచారం, మేడిపల్లి తదితర గ్రామాల ప్రజలు సమావేశమై ఈ విషయమై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను నిలదీసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలను సంప్రదించకుండా, ప్రజాభిప్రాయ సేకరణ సమావేశాలలో స్థానిక ప్రజలు పాల్గొనకుండా చేసి, కనీసం వారికి తగు సమాచారం కూడా ఇవ్వకుండా చేయడంతో- 1986 పర్యావరణ పరిరక్షణ చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అనుమతులు అన్నింటిని రద్దు చేయాలని జనం కోరుతున్నారు. అసలు ఫార్మా సిటీ ఆలోచననే మానుకోవాలని స్పష్టం చేస్తున్నారు.
గ్రామజ్యోతి కార్యక్రమం ద్వారా ప్రజలే తమ అభివృద్ధి ప్రణాళికలను తయారు చేసుకొంటారని, ఆయా ప్రణా ళికలను బట్టే జిల్లా, రాష్ట్ర స్థాయి ప్రణాళికలు రూపొం దిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ప్రకటించారు. కానీ ఫార్మాసిటీ విషయంలో అటువంటి ప్రయత్నమే కనబడటం లేదు. ఫార్మా సిటీ వల్ల 232 గ్రామాల ప్రజలకు విష వాయువులు, కాలుష్య జలాలు వ్యాపిస్తాయని పర్యావరణ వేత్త డా. టి ఇంద్రాసేనారెడ్డి స్పష్టం చేశారు. 12 గ్రామాలకు చెందిన ఆరు లక్షల మంది ప్రజలు నిరాశ్ర యులవుతారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కాగా, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే ఇటువంటి పారిశ్రామిక ప్రగతి గురించి ప్రధాన రాజకీయ పార్టీలు నిర్దిష్ట విధానమే అవలంబించడం లేదు. కాంగ్రెస్ మాత్రమే తమ పార్టీ అధికారంలోకి వస్తే ఫార్మా సిటీ ప్రతిపాదనను విర మించుకుంటామని ప్రకటించింది. బాధిత గ్రామాల ప్రజలకు ఆ పార్టీ నేత కోదండరామిరెడ్డి బాసటగా ని లుస్తున్నారు. తెలంగాణ జన సమితి పార్టీ నేత ప్రొఫెసర్ కోదండరామ్ కూడా ఈ ప్రాజెక్ట్‌ను వ్యతిరేకిస్తున్నారు. మిగిలిన పార్టీలు ఈ విషయంలో ఒక విధంగా అవకాశవాద ధోరణి ప్రదర్శిస్తున్నాయ.
కేంద్రంలోని తమ ప్రభుత్వమే పర్యావరణ అ నుమతులు అడ్డదిడ్డంగా ఇవ్వడంతో బిజెపి నేతలు వౌనం వహిస్తున్నారు. టిడిపి నేతలు సైతం మాట్లాడటం లేదు. ఇక అధికారంలో ఉన్న టిఆర్‌ఎస్ సహజంగానే మద్దతుగా నిలుస్తున్నది. ఇటువంటి సున్నితమైన అంశాలపై రాజకీయాలకు అతీతంగా పార్టీలు నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది. తెలంగాణ ప్రజలను కాలుష్యం బారి నుంచి రక్షణ కల్పించే విధంగా తమ ఎన్నికల ప్రణాళికలలో అన్ని రాజకీయ పార్టీలు స్పష్టమైన హామీలు ఇవ్వాలి. కాలుష్యానికి అవకాశం లేని ప్రత్యామ్నాయ పారిశ్రామిక అభివృద్ధి ప్రణాళికల పట్ల దృష్టి సారించవలసిన అవసరం ఉంది.

-చలసాని నరేంద్ర