మెయన్ ఫీచర్

మన భద్రతా వ్యవస్థను మనమే నిందించడమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మరో నెల రోజుల్లో అక్టోబర్ 21వ తేదీన విధి నిర్వహణలో అమరులైన పోలీసుల దినోత్సవాలను జరుపుకోబోతున్న తరుణంలో అనంతపురం జిల్లాల్లో చోటు చేసుకున్న ఘటనలు దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయి. ఈ ఘటనకు దారితీసిన పరిస్థితులు, పోలీసులు, కాకలు తీరిన రాజకీయ నాయకుడి మధ్య జరిగిన మాటల తూటాల సంగతి అందరికీ తెలిసిందే. ప్రతి రాజకీయ నాయకుడికి తన పరిధిలో తన వర్గానికి చెందిన ప్రజల హక్కులకు భంగం వాటిల్లితే ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసనలు తెలియచేసే హక్కు ఉంటుంది. లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడీషియరీ మధ్య బయటకు కనపడని సున్నితమైన విభజన రేఖ ఉంటుంది. ఎవరి పరిధిలోవారు తమ విధులను నిర్వహించాలి. విధి నిర్వహణలో ఘర్షణ తలెత్తినా, వైఫల్యాలను ఎండగట్టాలన్నా, సంబంధిత ఉన్నత అధికార వ్యవస్థ దృష్టికి తీసుకెళ్లాలి. లేదా చట్టసభల్లో లోపాలను ఎత్తిచూపాలి. అప్పటికీ మనస్సు కుదటపడలేదనుకుంటే న్యాయ వ్యవస్థను ఆశ్రయించాలి. ఈ వివాదాలను నడిబజార్లో కవ్వింపు చర్యలకు పాల్పడి, ఒకరినొకరు సవాళ్లు విసురుకుంటే వ్యవస్థలు నిర్వీర్యమవుతాయి.
కాలు జారితే శరీరానికి గాయమవుతుంది. నోరు జారితే మనసుకు గాయమవుతుంది. ఆలోచనలను నియంత్రించలేం. కాని నాలుకను అదుపులో పెట్టుకోవచ్చు. నాలుకకు నరం లేదు. నాలుక చేసే నష్టం అపారం. నాలుక శక్తివంతమైంది. హృదయాన్ని గాయపరిచే పదునైన ఆయుధం, అందుకే నోటిని అదుపులో పెట్టుకోవాలి. జాగ్రత్తగా పదాలు వాడాలి. ఈ సూత్రం లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్‌కు వర్తిస్తుంది. ప్రజాస్వామ్యంలో పరిపాలనను అందించే రాజకీయ నాయకత్వానికి, శాంతి భద్రతలను పరిరక్షించడానికి ప్రాణాలు సైతం లెక్కచేయకుండా పోరాడే పోలీసు వ్యవస్థకు మధ్య ఘర్షణలు జరుగుతుంటాయి. ఇవి సర్వసాధారణమైన అంశం. ప్రజా సంఘాలు, పౌర హక్కుల సంఘాలు, అణగారిన వర్గాల సంఘాలు తమ హక్కుల సాధన కోసం రాజ్యంపై పోరాడే క్రమంలో హక్కులకు భంగం వాటిల్లుతుంటుంది. ఈ క్రమంలో పోలీసులకు, ప్రజా సమూహాలకు మధ్య సంఘర్షణ అనివార్యమవుతుంది. ఒక్కోసారి అదుపుతప్పిన మూకలను నియంత్రించేందుకు పోలీసులు లాఠీచార్జీ, గాలిలో కాల్పులు జరిపి, చివరి సారిగా కాల్పులకు పాల్పడుతుంటారు. ఒక రాజ్య సార్వభౌమాధికారాన్ని నిలబెట్టేందుకు పోలీసుల బలప్రయోగం చేస్తుంటారు. ఈ పరిస్థితి తలెత్తరాదని పోలీసులు కోరుకుంటారు. కాని విధి లేని పరిస్థితుల్లో పోలీసులు శాంతి భద్రతల పునరుద్ధరణకు చట్టబద్ధమైన పరిమితులకు లోబడి బలప్రయోగానికి దిగుతారు. అభియోగాలు వస్తే ప్రభుత్వం విచారణ సంఘాలను నియమించి బాధ్యులపై చర్యలు తీసుకుంటుంది. కస్టోడియల్ డెత్స్, రేప్‌ల విషయంలో న్యాయ స్థానాలు బాధ్యులైన వారికి కఠినమైన శిక్షలు విధించిన కేసులు కోకొల్లలు.
పోలీసులు సమాజంలో ఒక భాగం. పోలీసులు లేని సమాజం లేదు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఈ రోజు భారతదేశంలోనే కాకుండా, యావత్తు ప్రపంచంలో పోలీసులు లేకుండా ఒక్క క్షణం కూడా ఏ వ్యవస్థ పనిచేయలేని స్థితికి చేరుకుంది. ప్రజాస్వామ్య వ్యవస్థలు వచ్చిన తర్వాత విధుల నిర్వహణలో భాగంగా సరిహద్దులకు లోపల శాంతి భద్రతల నిర్వహణ పోలీసులదే. సరిహద్దుల్లో శత్రువులు చొరబడకుండా ఉండేందుకు సైన్యం ఉంటుంది. పేరు ఏదైనా వీరు చేసే పనులు ఒకటే. ప్రతి పోలీసు, జవాను మరణించేందుకు సిద్ధపడి ఈ ఉద్యోగాల్లో చేరుతారు. ప్రపంచ చరిత్రలో రక్షక భటుల వ్యవస్థను కాదని మనుగడ సాధించిన రాజ్యాలు లేవు. అలా అని చెప్పి రక్షక భటుల ఆగడాలు మితిమీరితే ప్రజలు తిరుగుబాటుచేస్తారు. రాచరికంలో కూడా రక్షక భటుల సహాయంతోనే రాజు పాలించేవాడు. ఎవరెన్ని కబుర్లు చెప్పినా, అటవిక రాజ్యమైనా, ప్రజాస్వామ్యమైనా, కమ్యూనిస్టు ప్రభుత్వమైనా, తిరుగుబాటుదార్ల ఆధీనంలో ఉన్న ప్రాంతమైనా అక్కడ పోలీసులదే కీలకపాత్ర. పోలీసు వ్యవస్థ కఠినమైంది, సున్నితమైంది. అందరి విమర్శలకు లోనవుతుంటుంది. విమర్శలకు జవాబు చెప్పే అధికారం పోలీసు శాఖకు ఉండదు. కాలానుగుణంగా పోలీసు సంఘాలు కూడా ధీటుగా స్పందించే పరిస్థితిని రాజకీయ పార్టీలే కల్పించాయి. పేరుకు ప్రజాస్వామ్యమైనా పోలీసుల అండదండలు లేకుండా ప్రభుత్వాలు మనుగడ సాధించలేవు. పోలీసుల్లో నిఘా విభాగం, తీవ్రవాదం, ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు రకరకాల పేర్లతో నిఘా సెల్స్ పనిచేస్తుంటాయి.
సమాజంలో, ప్రభుత్వ పాలనలో ఏ విధంగా చూసినా అవిభాజ్యమైన పోలీసు వ్యవస్థను కించపరచడం, వారిని న్యూనతకు గురి చేయడం, వారిని తక్కువ చేసి మాట్లాడడం, మానసికంగా కృంగిపోయే విధంగా రెచ్చగొట్టడం, తిరుగుబాటుతత్వాన్ని ప్రేరేపించడం అప్రజాస్వామ్యం. ఇదే జరిగితే, ఒక రాజ్యం లేదా రాజకీయనేతల పతనానికి దారితీస్తుంది. పోలీసులు విధి నిర్వహణలో తప్పుచేస్తే ఫిర్యాదు చేసేందుకు వ్యవస్థలు ఉన్నాయి. జిల్లా ఎస్పీకి, డీజీపీకి ఫిర్యాదు చేయవచ్చు. అధికార పక్షంలో ఉండే నాయకుడైతే ఎకాఎకిన ముఖ్యమంత్రి వద్దకు వెళ్లి ఆధారాలతో పోలీసు చర్యలను ఎండగట్టవచ్చును. కోర్టులకు వెళ్లి కేసులను నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చును. వామపక్ష తీవ్రవాద సిద్ధాంతాన్ని పాటించే మావోయిస్టులు కూడా పోలీసులను వ్యక్తిగతంగా దూషించిన సందర్భాలు లేనేలేవు. పోలీసులు విధి నిర్వహణలో భాగంగానే రాజ్యం ఆదేశాల మేరకు గాలింపు చర్యలను చేపట్టి ఆత్మరక్షణలో భాగంగా పరస్పర ఎదురుకాల్పులకు పాల్పడుతుంటారు. ఈ ఎన్‌కౌంటర్లలో అటు నక్సలైట్లు, ఇటు పోలీసులు కూడా ప్రాణాలు కోల్పోతుంటారు. మావోయిస్టుల దాడిలో తాజాగా అరకు ఎమ్మెల్యే సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోము మృతి చెందారు. గిరిజన బిడ్డలు మావోయిస్టుల ఘాతుకానికి బలికావడం దిగ్భ్రాంతి కలిగించింది. ఒకవేళ ఎన్నికల్లో పోటీ చేసి వామపక్ష తీవ్రవాద సంఘాలు అధికారంలోకివస్తే పోలీసుశాఖ వారి ఆదేశాలను శిరసావహిస్తుంది. మావోయిస్టు సానుభూతి సంఘాలు, పౌర హక్కుల సంఘాలు కూడా ప్రభుత్వాలపైన, పోలీసుల మొత్తం చర్యలను తప్పుబడుతుంటాయి. దీనికి సంబంధించి నిర్దేశించిన పదజాలాన్ని మావోయిస్టులు ఎప్పుడూ వాడుతుంటారు. అంతేకాని పోలీసులను వ్యక్తిగతంగా అవమానించరు. అనేక సందర్భాల్లో కొన్ని చోట్ల నక్సలైట్లు లేదా ఉగ్రవాదులు దాక్కుని ఉన్నారని తెలిస్తే పోలీసులు, సైనికులు ప్రాణాలకు తెగించి ముందుకెళ్లి వారిని చంపి, ఆ క్రమంలో కాల్పులకు లోనై అమరులవుతుంటారు.
వామపక్ష తీవ్రవాదం విసిరిన పంజాకు ప్రజల మన్ననలు పొందిన కేపీ వ్యాస్, ఉమేష్ చంద్ర, పరదేశీ నాయుడు లాంటి సీనియర్ అధికారులు బలయ్యారు. 1968 శ్రీకాకుళం సాయుధ తిరుగుబాటు నుంచి 2014 వరకు నక్సల్స్‌కు, పోలీసులకు మధ్య జరిగిన భీకర పోరులో 553 మంది పోలీసులు, 6446 మంది నక్సలైట్లు, 2924 మంది పౌరులు మరణించారు. కేంద్ర హోంశాఖ విడుదల చేసిన గణాంక వివరాలను విశే్లషిస్తే 1999 నుంచి 2018 వరకు భారతదేశంలో వామపక్ష తీవ్రవాదం వల్ల 2691 మంది పోలీసులు, 7869 మంది పౌరులు, 3274 మంది నక్సలైట్లు మరణించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆంధ్ర, ఒడిశా సరిహద్దుల్లో బలిమెల రిజర్వాయర్‌లో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో 35 మంది గ్రేహౌండ్స్ బలగాలకు చెందిన యువ పోలీసులు మరణించారు. ఈ సంఘటన యావత్తు భారతదేశాన్ని దిగ్భ్రాంతి కలిగించింది. మరణించిన పోలీసులందరూ 30 ఏళ్ల లోపు వారే. చాలా మందికి అప్పుడే పెళ్లిళ్లయ్యాయి. ఈ ఘటన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పోలీసు చరిత్రలో అతి పెద్ద విషాదం. ప్రతి ఘటించే శక్తి, సత్తా ఉన్నా, అనివార్యమైన పరిస్థితుల్లో ప్రత్యర్థులపైన కాల్పులు జరిపేందుకు వీలు లేని కాలం దాపురించడంతో వీరు నేలకొరిగారు.
రాజకీయ ప్రత్యర్థుల ఆత్మస్థైర్యం తీసేందుకు రాజకీయ నేతలు ఏ పదాలను వాడుకున్నా, అది వారి ఇష్టం. కాని రాజ్యంలో ప్రధాన అంగమైన కార్యనిర్వాహక వ్యవస్థ, అధికార యంత్రాంగం, పోలీసు వ్యవస్థ ఆత్మస్థైర్యం దెబ్బతినే విధంగా తూలనాడే స్థితికి ఏ రాజకీయ పార్టీ దిగజారరాదు. 2015లో తెలంగాణ రాష్ట్రంలోని నల్లగొండ జిల్లాలో ఖాండ్వా జైలు నుంచి తప్పించుకుని పారిపోయి వచ్చిన ఉగ్రవాదులను పట్టుకునేందుకు వీరోచితంగా పోరాడి పోలీసు ఎస్సై సిద్ధయ్య, కానిస్టేబుల్ నాగరాజు అమరులయ్యారు. సీఐ బాలగంగిరెడ్డి గాయాలతో బయటపడ్డారు. వీరి త్యాగనిరతి వల్లనే ఉగ్రవాదులు పోలీసులకు చిక్కారు.
ఒక పోలీసుకు విశ్రాంతి ఉండదు. రాజ్యం కోసం ప్రతి క్షణం విధుల్లో ఉంటాడు. అప్రమత్తంగా ఉంటాడు. ఏ క్షణమైనా ఏమైనా జరగవచ్చనే అనుమానంతో, ప్రాణాంతకమైన దాడి జరగవచ్చని అనుమానిస్తుంటాడు. జీవితంలో చాలా కాలం పాటు చీకటిలో జరిగేవన్నీ చూస్తారు. మంచీ, చెడూ వింటారు. అనుభూతి చెందుతారు. ఆ అనుభవాలన్నీ ఉంటాయి. ప్రతి రోజూ ప్రజలతో మమేకమవుతారు. ఉత్సాహంగా ఉండేవారిని, దుఃఖంతో సతమతమయ్యేవారిని, దేశద్రోహులను, మూర్ఖులను ఎదుర్కొంటారు. వారే పోలీసులు. వారిని అభినందించాలి. పోలీసులు ఏమరుపాటున ఉంటే అరకులో ఏం జరిగింది ? విధి నిర్వహణలో తలెత్తే వైఫల్యాలను పోలీసు శాఖ సరిదిద్దుకుని ముందుకు పోవాలి. అలాగే ప్రజాప్రతినిధులు కూడా చిన్న చితకా తప్పిదాలుంటే సరిచేసుకుని పరిపాలనలో భాగస్వామ్యం కావాలి. రాజకీయపార్టీలపై పోలీసు వ్యవస్థ నోరుపారేసుకోవడం మంచి పరిణామం కాదు. లెజిస్లేచర్, లా ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగాలు సవాళ్లకు ప్రతిసవాళ్లు విసురుకుంటే విద్రోహ శక్తులు రెచ్చిపోతాయి. దీని వల్ల ప్రజాస్వామ్యానికి ముప్పువాటిల్లుతుంది. ’అటు పోలీసులు, ఇటు ప్రజాప్రతినిధులు పంతాలను విడనాడి రాజ్యాంగ విధులకు అంకితం కాని పక్షంలో తీవ్రపరిణామాలు తలెత్తుతాయి. ఒకప్పుడు పోలీసు శాఖలో పదవ తరగతి వరకు చదువుకున్న వారే చేరేవారు. ఈరోజు ఉన్నత విద్యావంతులు ఈ శాఖలో చేరుతున్నారు. పోలీసులు కూడా మాన్యువల్‌కు కట్టుబడి విధులు నిర్వహించాలి. లక్ష్మణరేఖ దాటితే, ప్రజల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. ప్రజలు పిరికివారైతే, ప్రపంచంలో ఏ మిలిటరీ లేదా పోలీసు వ్యవస్థ కూడా వారిని కాపాడలేదు’ అని జాతిపిత మహాత్మాగాంధీ అన్న మాటలు అక్షర సత్యం.

--కె.విజయశైలేంద్ర 9849998097