మెయన్ ఫీచర్

జాతికి స్ఫూర్తిప్రదాత కొండా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బడుగు, బలహీనవర్గాల ఆశాజ్యోతి, సహకారోద్యమ పితామహుడు, తెలంగాణ ఉద్యమ నాయకుడు నాటి స్వాతంత్య్ర పోరాటం నుంచి నేటి తెలంగాణ ఆత్మగౌరవ పోరాటం జరిపిన ధీరుడు, స్వాతంత్య్ర సమరయోధుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ, ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్ తాలూకాలోని వాంకిడి గ్రామంలో దివంగత కొండా హన్మక్క, పోషెట్టి బాపూజీ దంపతులకు లక్ష్మణ్ బాపూజీ 1915 సెప్టెంబర్ 27న జన్మించారు.
ఆదిలాబాద్ జిల్లా అప్పటికి, ఇప్పటికి వెనకబడిన ప్రాంతమే. అభివృద్ధి అంతంత మాత్రమే. ఆ ప్రాంతం వెనకబాటుతనాన్ని బాపూజీ చిన్నతనంలోనే గమనించాడు. అభివృద్ధిపరచాలని కాంక్షించాడు. తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులో ఉండే వాంకిడి ప్రజలు తెలుగుతోపాటు ఉర్దూ, మరాఠీ భాషలు మాట్లాడేవారు. బాపూజీ తండ్రి వాంకిడి గ్రామంలో ఉంటూ తపాలాశాఖలో ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తుండేవారు. చిన్నప్పటినుంచే విద్యావంతుడు. తాలూకా పరిసరప్రాంతాల్లో ఉర్దూ భాష మాట్లాడటంతో పాటు చదవటం, రాయటం వచ్చిన వ్యక్తిగా గుర్తింపు పొందారు. భాషాపరమైన విషయాల్లో ప్రజలకు చేదోడువాదోడుగా నిలిచేవారు. దీంతో ఆయన అసలు పేరు మరచిపోయి ప్రజలు ‘బాపూజీ’ అని ఆప్యాయంగా పిలుచుకునేవారు. తర్వాతి కాలంలో తండ్రిని మించిన తనయుడిగా పేరుతెచ్చుకున్న కొండా లక్ష్మణ్‌ను సైతం ప్రజలు ‘బాపూజీ’ అని ముద్దుగా ఆప్యాయంగా పిలుచుకునేవారు. 1986లో తిరుపతిలో జరిగిన రాష్ట్ర వెనుకబడిన తరగతుల సభలో సర్కారు జిల్లాలో వెనుకబడిన తరగతుల అభ్యున్నతికి కృషిచేసినందుకు గౌతులచ్చన్న, నిజాం కాలంలో కృషి చేసినందుకు లక్ష్మణ్ బాపూజీకి ఆచార్య అనే బిరుదుతో ప్రభుత్వం గుర్తించింది.
బాల్యం- విద్యాభ్యాసం...
కొండా లక్ష్మణ్ బాపూజీ 3 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడే తల్లి మరణించింది. రాజురా మానిక్‌ఘర్‌లో బాల్యం గడిచింది. 1935లో ప్రాథమిక విద్యను ఆసిఫాబాద్‌లో పూర్తిచేసి పై చదువులకొరకు హైదరాబాద్ వెళ్లారు. సిటీ కాలేజీలో చేరి మెట్రిక్యులేషన్ పూర్తిచేశారు. న్యాయశాస్త్ర విద్య హైదరాబాదులో పూర్తిచేశారు. 1940లో న్యాయవాద వృత్తి చేపట్టారు.
స్వాతంత్య్రోద్యమం, నిజాం విమోచనోద్యమం...
బాపూజీ విద్యార్థి దశలోనే స్వతంత్ర సంగ్రామంలో చురుకైన పాత్ర నిర్వహించారు. ఉప్పు సత్యాగ్రహంలో భాగంగా 1931లో గాంధీజీ మహారాష్టల్రోని చాందా పట్టణాన్ని సందర్శించారు. అప్పట్లో నిజాం పాలనలో భాగంగా రాజురా మానిక్‌ఘర్ పట్టణంలోని ఓ పాఠశాలలో బాపూజీ విద్యాభ్యాసాన్ని కొనసాగిస్తున్నారు. సంస్థానంలో ఉప్పు సత్యాగ్రహంపై నిషేధం అమలులో ఉంది. పాఠశాల యాజమాన్యం సైతం సత్యాగ్రహంలో పాల్గొనరాదని విద్యార్థులకు హుకుం జారీచేసింది. అయితే బాపూజీ వీటన్నింటిని ధిక్కరించి చాందా పట్టణానికి వెళ్లి గాంధీజీని కలిసి వచ్చారు. జాతిపిత ఉపన్యాసానికి ఎంతగానో ప్రభావితుడయ్యాడు. స్వగ్రామం చేరిన వెంటనే తను ధరించిన తెల్ల ప్యాంటును చింపి టోపి కుట్టించుకున్నారు. నిజాం నిరంకుశ పాలన సాగుతున్న సమయంలో గాంధీజీని అనుసరిస్తూ తెల్లటోపి ధరించటమంటే సాహసోపేతమైన చర్యే. ఆనాటి నుంచి నేటివరకు బాపూజీ నెత్తిపై తెల్లటోపి లేనిదే బయటికి వెళ్లరు. పదహారవ ఏట ఖద్దరు ధరించి తనువు చాలించేవరకు అదే ఖద్దరులో దర్శనమిచ్చిన స్వదేశీ ఉద్యమకారుడు లక్ష్మణ్ బాపూజీ.
బాలగంగాధర్ తిలక్ ఆదేశాల మేరకు హైదరాబాద్‌లో గణేష్ ఉత్సవాలను పెద్దఎత్తున నిర్వహించేందుకు తోడ్పాటు అందించేవారు. 1938లో రామానంద తీర్థ ఆధ్వర్యంలో ఏర్పాటైన హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్‌లో చేరి క్రియాశీల నాయకుడిగా ఎదిగారు. కాంగ్రెస్ కార్యకర్తగా 1938లో సత్యాగ్రహ ఉద్యమంలో పాల్గొన్నారు. అప్పటికి వారి వయస్సు 16 ఏళ్ళు మాత్రమే. హైదరాబాద్ గౌలిగూడలో అప్పటి నాయకులు చేపట్టిన సత్యాగ్రహ ఉద్యమంలో పాల్గొని అరెస్టయ్యారు. మూడునెలలు జైలు జీవితం గడిపారు.
1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. అటుతర్వాత వందేమాతరం ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించారు. ఇటు ఉద్యమాలలో పాల్గొంటూ, విద్యను అశ్రద్ధచేసేవారు కాదు. ఈ ఉద్యమాలు హైదరాబాద్ సంస్థానంలో జరగకుండా నిజాం రాజు పెద్దఎత్తున నిర్బంధకాండను విధించారు. అయినప్పటికీ నిజాం ఆదేశాలను ధిక్కరించి ఊరేగింపు నిర్వహించాడు. సుల్తాన్‌బజార్ పోస్ట్ఫాస్ పైన బ్రిటీష్ రెసిడెన్సీపైన జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. రజాకార్ల ఆగడాలకు అంతులేని రోజుల్లో ప్రజలను చైతన్యపరిచేందుకు బాపూజీ చైర్మన్‌గా ‘సిటీజన్ ప్రొటెక్షన్ కమిటీ’ ఏర్పడింది. ఈ కాలంలో మందుగుండు సామాగ్రి తయారుచేయడం, కార్యకర్తల శిక్షణ ఇవ్వడంలో బాపూజీ ప్రధాన పాత్ర పోషించారు.
రాజకీయ జీవితం...
1952లో జరిగిన మొదటి సార్వత్రిక ఎన్నికల్లో బాపూజీ ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్ నియోజకవర్గంనుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి శాసనసభలోకి అడుగుపెట్టారు. డిప్యూటీ స్పీకర్‌గా బాధ్యతలు స్వీకరించి సమర్థవంతంగా పనిచేశారు. 1952-56 మధ్యకాలంలో వచ్చిన తెలంగాణ ఉద్యమంలో కొండా లక్ష్మణ్ బాపూజీ సమైక్యవాదిగా ఉండి ఆంధ్రప్రదేశ్ అవతరణ కోసం తన వంతు కృషిచేశారు. సమైక్య రాష్ట్రం ఏర్పాటు వల్ల తెలంగాణ ప్రాంతానికి జరిగే నష్టాల గురించి చెబుతున్నప్పటికీ అవన్నీ వట్టి అపోహలని అనుకున్నారు. తర్వాత కాలంలో సీమాంధ్ర నేతలు చేసిన అన్యాయాలను, అవమానాలను స్వయంగా అనుభవించిన తర్వాత తన అభిప్రాయాలను మార్చుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుతర్వాత 1957లో నల్గొండ జిల్లా చిన్నకొండూర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించారు. కమ్యూనిస్టులకు బలమైన కోటగా ఉండే నల్గొండ జిల్లానుంచి పోటీచేసి విజయం సాధించటం అప్పట్లో గొప్ప విజయంగా భావించేవారు. నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రతిపక్షాల ప్రశ్నలకు సమాధానం చెప్పటానికి మంత్రులు ఇబ్బందులుపడగా ఎమ్.ఎల్.ఏ.గా ఉన్న బాపూజీ ప్రభుత్వం తరఫున దీటైన సమాధానం ఇచ్చేవారు. ఆ సమయంలోనే సంజీవరెడ్డి ఎ.ఐ.సి.సి. అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. దీనితో రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రిని నియమించాల్సిరాగా బాపూజీ పట్టుబట్టి దళితుడైన దామోదరం సంజీవయ్యను సి.యం. చేయుటలో కీలకపాత్ర పోషించారు. దామోదరం సంజీవయ్య మంత్రి వర్గంలో పనిచేశారు.
1958లో సచివాలయం సమీపంలో హుస్సేన్‌సాగర్ తీరాన (ప్రస్తుత నెక్లెస్ రోడ్డుపై) భూమి కొని జలదృశ్యం (ఇంటిని) నిర్మించుకున్నాడు. మన రాష్ట్రంలో పాదయాత్రలకు స్వీకారం చుట్టింది కొండా లక్ష్మణ్‌నే. 1961లో మూసీ నదికి వరదలు వచ్చినప్పుడు నల్గొండ జిల్లాలో 228 మైళ్ళ దూరం పాదయాత్ర నిర్వహించి ప్రజాసమస్యలు తెలుసుకున్నారు. 1962 ఎన్నికల్లో నల్గొండ జిల్లా చిన్నకొండూర్ నియోజకవర్గంనుంచి పోటీచేశారు. ఆ ఎన్నికల్లో బాపూజీని ఓడించడానికి కమ్యూనిస్టులతోపాటు సొంత పార్టీవారు సైతం ఏకమయ్యారు. ఆ ఎన్నికల్లో బాపూజీ 556 ఓట్ల స్వల్పతేడాతో ఓటమి చెందారు. అయితే, ఎన్నికల్లో అవకతవకలు జరిగాయంటూ బాపూజీ ఆ ఎన్నికను హైకోర్టులో సవాలు చేశారు. కోర్టు ఆదేశాలమేరకు ఆ ఎన్నికను రద్దుచేస్తూ, 1965 తిరిగి ఉప ఎన్నికలు నిర్వహించింది, ఆ ఉప ఎన్నికల్లో బాపూజీ ఘన విజయం సాధించారు. 1967 ఎన్నికల్లో సైతం బాపూజీ భువనగిరి నియోజకవర్గంనుంచి గెలుపొంది కమ్యూనిస్టు కోటలో తనకు తిరుగులేదని నిరూపించుకున్నారు. రాష్ట్ర మంత్రివర్గంలో కార్మికశాఖ, జైళ్లశాఖ, చిన్నతరహా పరిశ్రమలు సమాచార శాఖలు నిర్వహించారు.
1972 ఎన్నికల్లో సైతం బాపూజీ భువనగిరి నియోజకవర్గంనుంచి గెలుపొందారు. నెహ్రూ, ఇందిరాగాంధీలకు అత్యంత సన్నిహితంగా ఉన్నారు. అనేక సందర్భాల్లో ఢిల్లీలోఉంటూ జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. 1972లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా కూడా పోటీపడ్డారు. పి.వి.నరసింహారావు, బాపూజీల పేర్లను అధిష్ఠానం పరిశీలించి చివరకు పి.వి.నరసింహారావును ముఖ్యమంత్రిగా చేసింది. రాష్ట్రంలో చెన్నారెడ్డి, వెంగళరావు వంటి వారితో బద్ద వైరం ఉండేది. ఎమర్జెన్సీ తర్వాత జనతాపార్టీలో కూడా చేరారు. ఆ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. రాజీవ్‌గాంధీ మండల్ కమీషన్‌ను వ్యతిరేకిస్తూ మాట్లాడినందుకు నిరసనగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. తుది శ్వాస విడిచేవరకు ఏ పార్టీలోను చేరలేదు.
సామాజిక - సహకారోద్యమం..
ఒకవైపు రాజకీయ జీవితం కొనసాగిస్తూనే, మరోవైపు సామాజిక ఉద్యమాన్ని కూడా నిర్మించారు. జాతీయస్థాయిలో వెనుకబడిన కులాలను ఏకం చేయటంకోసం భారత వెనకబడిన కులాల సమాఖ్యను ఏర్పాటు చేశారు. బిసిలకు రాజ్యాధికారం దక్కాలని డిమాండ్ చేశారు. కార్మికులను, చేతి వృత్తుల వారిని సమీకరించి సహకార రంగం పరిధిలోకి తీసుకొచ్చారు. చేనేత, గీత, కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, గొర్లకాపర్లు, చర్మకారుల సహకార సంఘాలను ఏర్పాటుచేశారు. దేశంలోనే ప్రప్రథమంగా 1951-52 మధ్యకాలంలో ఆయన కార్మిక సహకార సంఘాలను నిర్మించారు. 1945లోనే సిరిసిల్లలో నిజాం రాష్ట్ర చేనేత మహాసభను ఏర్పాటుచేశారు.
టెక్స్‌టైల్స్ సమస్యలపై 1969 కేంద్ర ప్రభుత్వం నియమించిన అశోక్‌మెహతా కమిటీలో సభ్యుడుగా ఉన్నాడు. 1974 అప్పుడు ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడుగా ఉన్న శివరామన్ అధ్యక్షతన చేనేత సమస్యలపై ఏర్పాటైన కమిటీలో సభ్యుడుగా వ్యవహరించారు. చేనేత కార్మికుల సమస్యలపై ఎన్నో పోరాటాలు నిర్వహించి పరిష్కారానికి కృషిచేశారు. రాష్ట్రంలో అన్ని వృత్తుల వారికి సహకార సంఘాలను ఏర్పాటుచేసి కుల వృత్తుల వారికి ఆర్థికాభివృద్ధికి తోడ్పాటునందించారు. ‘సహకారోద్యమ పితామహుడు’ అని పిలిపించుకున్నారు.
వ్యక్తిగత జీవితం... బాపూజీ గారికి 1948 జూన్ 27న డాక్టర్ శకుంతలదేవి గారితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కూతురు. శకుంతలదేవిగారు 1962 ఇండియా, చైనా యుద్ధసమయంలో సరిహద్దుల్లోకి వెళ్ళి గాయపడిన సైనికులకు వైద్యసేవలను అందించడంతో సైన్యం ఆమెను మేజర్ బిరుదుతో గౌరవించింది. ఆమె 2011లో మరణించారు. పెద్ద కుమారుడు సురేష్ విదేశాలలో చనిపోయారు, మరొక కుమారుడు ఉమేష్ భారత్ సైన్యంలో వైమానిక దళంలో ఉంటూ దేశసేవలో వీర మరణం పొందారు. ఉమేష్ స్మృత్యర్థం బాపూజీ దంపతులు కొంత నిధితో ఉమేష్ మెమోరియల్ ట్రస్టును ఏర్పాటుచేసి పేదలకు సహాయంచేసేవారు. కూతురు పవిత్రవాణి. ఈమె కూడా వైద్యురాలు. బాపూజీ తన ఆస్తిలో 80 శాతాన్ని స్వచ్ఛంద సేవకే వినియోగించారు.
1969నాటి ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో...
1969నాటి ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించి తన మంత్రి పదవిని కూడా తృణప్రాయంగా వదులుకున్నారు. 1969లో తెలంగాణ ఉద్యమానికి మద్దతుగా 12రోజులపాటు దీక్ష చేశారు. అయినప్పటికీ తెలుగు ప్రజలమధ్య వైషమ్యాలు పరస్పర విద్వేషాలు ఉండరాదని కూడా కోరుకున్నారు. 1969 సెప్టెంబర్ 23న రాష్ట్ర అసెంబ్లీలో ప్రసంగిస్తూ తెలుగుజాతి ఒక రాష్ట్రం కింద ఉండనివ్వండి, అనేక రాష్ట్రాల కింద ఉండనివ్వండి- ఏ రాష్ట్రంలో ఉన్నా తెలుగు జాతి గౌరవం పెంచుకునే విధంగా వ్యవహరించాలి అది మనందరికి మంచిది. అని బాపూజీ అన్న మాటలు ప్రజలమధ్య సౌభ్రాతృత్వానికి నిదర్శనం, ఈ మాటలను నేటి ఉద్యమకారులు, రాజకీయ నాయకులు ఆదర్శంగా తీసుకుంటే మంచిది.
మలి దశలో ఉద్యమంలో...
1990లో తిరిగి ప్రారంభమైన మలిదశ తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించారు. స్వాతంత్ర సమరయోధులను కూడగట్టి ఉద్యమంలో పాల్గొన్నారు. తెలంగాణకోసం ఉద్యమిస్తున్న సంస్థలు ఏకమై ఐక్యంగా ఉద్యమించాలని సూచిస్తూ, సభలు, సమావేశాలు నిర్వహించారు. 1997లో ఆయన స్థాపించిన తెలంగాణ ప్రజాపార్టీతో మరోసారి తెలంగాణ నినాదం తెరపైకి వచ్చినా, స్పందన అంతగా రాలేదు. ఆ తర్వాత 2001లో కె.సి.ఆర్. తెలంగాణ రాష్టస్రమితి (టి.ఆర్.ఎస్.)ను నెలకొల్పిన సమయంలో బాపూజీ వెన్నుదన్నుగా నిలిచారు. హుస్సేన్‌సాగర్ తీరాన (ప్రస్తుత నెక్లెస్‌రోడ్)పై ఉన్న తన స్వగృహం జలదృశ్యంలోనే టి.ఆర్.ఎస్. ఆవిర్భావ సభ జరిగిందంటే బాపూజీ కృషి ఎంతో అర్థం చేసుకోవచ్చు.
అలుపెరగని ఆ మహానాయకుడు 98వ వసంతానికి చేరువలో 2012 సెప్టెంబర్ 21న హైదరాబాద్‌లోని అశోక్‌నగర్‌లోని తన స్వగృహంలో కన్నుమూశారు. టి.ఆర్.ఎస్. పార్టీకోసం, కె.సి.ఆర్.కోసం, తానెంతో అపురూపంగా హుస్సేన్‌సాగర్ తీరాన (ప్రస్తుత నెక్లెస్‌రోడ్)పై భూమి కొని నిర్మించుకున్న జలదృశ్యం (ఇంటిని) కోల్పోవడం జరిగింది. టి.ఆర్.ఎస్. పార్టీకోసం, కె.సి.ఆర్. కోసం ఇంత త్యాగం చేసిన బాపూజీ గారిని కడసారి చూడడానికి కూడా కె.సి.ఆర్. రాకపోవడం తెలంగాణవాదులకు మరియు కొండా లక్ష్మణ్ బాపూజీ అభిమానులకు మరింత బాధను కలుగజేసింది.
ఆయన మరణం తెలంగాణ ప్రజలకు అభిమానులకు వెనుకబడిన బి.సి, యస్.సి, యస్.టి, మైనార్టీ వర్గాలకు ముఖ్యంగా చేనేత కార్మికులకు తీవ్ర దుఃఖాన్ని మిగిల్చింది. తన స్వరం మూగబోయినా నాలుగున్నర కోట్లమంది ప్రజల గొంతుకల్లో తన వాణిని వినిపిస్తూనే ఉన్నారు. ఆ మహనీయుణ్ణి చిరకాల స్వప్నం తెలంగాణ రాష్ట్రం జూన్ 2 ఏర్పడడంతో వారి ఆత్మకు పాక్షికంగా శాంతి చేకూరి ఉంటుంది. సర్వజనులకు సమ్మతమైన సామాజిక తెలంగాణ ఏర్పడినప్పుడు ఆయన ఆత్మకు సంపూర్ణ శాంతి కలుగుతుంది. ఇదే మనం ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి.

--అంకం శ్రీనివాస్ నేత