మెయిన్ ఫీచర్

భవరోగాలను దూరం చేసే బాబావైద్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాబా రూపం సత్, చిత్‌ల సంగమ స్వరూపం. సదానందకరం. బాబా దర్శన మాత్రంతోనే మనో చాంచల్యాలు, మనో వైకల్యాలు, మనో మాలిన్యాలు పటాపంచలైపోతాయి. దుర్మార్గులు సన్మార్గులుగా మారతారు. మనసులోని చెడు ఆలోచనలు, చెడు తలంపులు, దుష్టబుద్ధులు అంతరించిపోతాయి. బాబా ముఖారవిందం శుద్ధ చైతన్యానందానికి ప్రతిబంధం. బాబా మోములోని దివ్యకాంతి అజ్ఞానపు చీకట్లను తొలగించి గొప్ప శాంతిని కలిగిస్తుంది.
తొలినాళ్లలో ప్రజలు బాబా దర్శనంతోనే సర్వశుభాలూ పొందేవారు. రోగులు ఆరోగ్యవంతులయ్యేవారు. పలువురి కోరికలు నెరవేరేవి. బాబా శిరిడీకి వచ్చిన తొలిరోజుల్లో వైద్యం చేసేవారు. బాబా అపర ధన్వంతరి. బాబా చేయి సంజీవని. మందులు, పసర్లతో పనిలేకుండానే బాబా పలు రోగాలను తన హస్తస్పర్శతో ఎడబాపేవారు. కుష్టురోగులు రోగ విముక్తులయ్యేవారు. గుడ్డివారికి చూపు వచ్చేది. కుంటి వారికి నడక వచ్చేది. బాబాకు ఇన్ని శక్తి, సామర్థ్యాలు ఎలా వచ్చాయో ఎవరూ కనుగొనలేకపోయేవారు. అంతులేని శాంతిని ప్రసాదించే బాబాకీర్తి నలుదిశలా వ్యాపించింది. బాబా మహిమాన్వితాల గురించి ఆశ్చర్యంగా చెప్పుకునేవారు. ఎక్కడెక్కడి నుంచో జనం తండోపతండాలుగా బాబా దర్శనానికి షిర్డీ వచ్చేవారు. బాబా ఎదుట నిశ్శబ్దంగా కూర్చుని మనసులను శుద్ధపర్చుకునేవారు భక్తులు.
జనం తాకిడి పెరగటంతో చావడిలో, మసీదులో ఉత్సవ వాతావరణం నెలకొనేది. కొందరు బాబాను కీర్తిస్తూ భజనలు చేసేవారు. కొందరు తాము బాబా గురించి తెలుసుకున్నది, చూసింది, విన్నది మరెందరికో చెబుతుండేవారు. చాలామంది తమ కోరికలను బాబా ఎదుట చెప్పుకుని తీర్చమని వేడుకునేవారు. ఇంకొందరు బాబా ఏం చెబుతారా? అని కనిపెట్టుకుని చూస్తుండేవారు. బాబా ఇదంతా పట్టనట్టు వౌనంగా ధుని ఎదుట కూర్చుని ఆత్మానుసంధానంలో మునిగి ఉండేవారు. రోజుల తరబడి అక్కడే, అలాగే గడిపేవారు. ఒక్కోసారి స్నానం చేసేవారు. కొద్దిరోజులు స్నానపానాలు లేకుండా కూర్చున్నచోటే ఉండిపోయేవారు. బాబాకు బాహ్యాడంబరాలు గిట్టేవికావు. అసలు బాబాకు బాహ్య స్పృహే ఉండేది కాదు. శిరిడీకి చేరిన తొలిదినాల్లో బాబా తెల్లని తలపాగా, శుభ్రమైన ధోవతి, చొక్కా ధరించేవారు. మొదటిరోజుల్లో వైద్యం చేసేవారు. రోగులను పరీక్షించి వారికి ఔషధాలు ఇచ్చేవారు. బాబా హస్తవాసి గొప్పది. బాబా చేతితో ఇచ్చిన మందులు మంచి గుణం చూపించేవి. దాంతో బాబాకు గొప్ప హకీం (వైద్యుడు)అనే పేరు వచ్చింది. బాబా తానుచేసిన వైద్యానికి ప్రతిగా చేయి చాచేవారు కాదు. రోగులు ఏమైనా ఇచ్చినా తీసుకునేవారు కాదు. ఉచితంగా చికిత్సలు చేసేవారు. కుష్టురోగులకు స్వయంగా మందులు పూసి కట్లుకట్టేవారు. దెబ్బలు తగిలినవారికి గాయమైనచోట పైపూతలు పూసేవారు. ఎందరో పేదలు బాబా అనుగ్రహంతో, హస్తవాసితో స్వస్థత పొందేవారు.
బాబా నిస్వార్థపరులు. తనకోసం, తన సొంతానికి ఎప్పుడూ ఏమీ ఎవరినుంచీ కోరలేదు. ఏమీ దాచుకోలేదు. నిరంతరం ఇతరుల ఆత్రుతలను తీర్చటానికే తాపత్రయపడేవారు. ఒక్కోసారి ఇతరుల వ్యాధుల్ని తనపైకి తీసుకుని తాను బాధ అనుభవించేవారు. సకలాన్నీ సృష్టించి పాలించే వాడికి ప్రత్యేకంగా తనకంటూ ఏం ఉంటుంది? తనకంటూ ఏం కావాలి? విశ్వమే బాబాది. బాబాయే విశ్వం. బాబా హస్తవాసి తాకి నయంకాని రోగం ఉండేది కాదు. ఇంకా విశేషమేమిటంటే, బాబా వైద్యం తీరు విచిత్రంగా ఉండేది. సాధారణంగా బాబా ఆచరించమని చెప్పే వివిధ వైద్య విధానాలు సాధారణ వైద్యంలో వికటిస్తాయి. కానీ, బాబా ఆ పద్ధతులను ఉపయోగించే రోగాలను నయంచేసేవారు. ఇటువంటి అనుభవాలను పొందిన వారిలో వైద్యులుకూడా ఉన్నారు. అటువంటి లీలలను మననం చేసుకుందాం.
కళ్లవాపునకు నల్ల జీడిపిక్కల ఔషధం
ఒక భక్తునికి కళ్లు వాచి బాగా ఎర్రబడ్డాయి. శిరిడీలో అతని రోగాన్ని నయంచేసే వైద్యుడు దొరకలేదు. ఇతర భక్తులు అతనిని బాబావద్దకు తీసుకువెళ్లారు. సామాన్యంగా అటువంటి రోగ పీడితులకు అంజనములు, ఆవుపాలు, కర్పూరంతో చేసిన ఔషధములను వైద్యులు ఉపయోగిస్తారు. కాని, అతనికి బాబా చేసిన చికిత్స విలక్షణమైనది. నల్లజీడి గింజలను నూరి రెండు మాత్రలుగా చేశారు. ఒక్కొక్క కంటిలో ఒక్కొక్క దానిని పెట్టి గుడ్డతో కట్టుకట్టారు. మరుసటిరోజు ఆ కట్లను విప్పి నీళ్ళను ధారగా పోశారు. రోగికి కండ్లలోని పుసి తగ్గి కంటిపాపలు తెల్లబడి శుభ్రమయ్యాయి. నల్లజీడి పిక్కలను నూరి కళ్లలో పెట్టినా సున్నితమైన కళ్లు మండనే లేదు. బాబా చేసిన వైద్యంలో అటువంటి చిత్రాలు ఇంకా ఎన్నో ఉన్నాయి.

సాయి విద్యా ఫౌండేషన్ ప్రచురించిన ‘సాయి జీవనం మోక్షమార్గం’ నుంచి స్వీకృతం. పుస్తకం లభించు స్థలం ‘సాయి విద్య ఫౌండేషన్, ఫ్లాట్ నెం.4, సాయిబాబానగర్ కాలనీ, కూకట్‌పల్లి, హైదరాబాద్-72, ఫోన్:040-23441123. ఎల్.ఐ.జి.49, ధర్మారెడ్డి నగర్, ఫేస్-1, కూకట్‌పల్లి, హైదరాబాద్-72, ఫోన్:040-23445566