మెయన్ ఫీచర్

హోదా నాటకంలో విజేతలు, పరాజితులు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొన్ని విషయాలు ముందుగానే తెలిసిపోతే పెద్ద ఆశ్చర్యం ఉండదు. కానీ మీడియా మిడిమేళం, నేతల హడావిడి వల్ల అలాంటి అంశాలు కూడా ఉత్కంఠగా మారుతుంటాయి. ప్రత్యేక హోదా వ్యవహారం కూడా అలాంటిదే. హోదా వస్తే తప్ప ఏపీకి తెరవు లేదని తెలుసు. కానీ కేంద్రం ఇప్పట్లో ఇవ్వదనీ తెలుసు. తెలుగుదేశం పార్టీ దానిపై ఢిల్లీని గద్దించలేని నిస్సహాయురాలనీ తెలుసు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో విగతజీవురాలయింది. దాని నుదుటన ఇప్పట్లో అధికార రాత లేదు. అందుకే రాజ్యసభలో ఉన్న వారి తో ప్రైవేటు మెంబరు బిల్లు పెట్టించింది. ప్రైవేటు మెంబరు బిల్లు పాసయి చట్టంగా రూపుదిద్దుకున్న దాఖలాలు లేవు. అయినా, హోదా సాధిస్తామని అధికారంలేని అనాధల సంఘానికి అధ్యక్షురాలయిన కాంగ్రెస్ పార్టీ చేసే హుంకరింపులు తెలుగు మీడియా తెరలకు 24 గంటల వార్తలయి కూర్చుకున్నాయి. ప్రైవేటు మెంబర్ బిల్లు ఓటింగులో నెగ్గితే ప్రభుత్వం నైతికంగా ఓడినట్లే లెక్క అని, మెడమీద తల ఉన్న ఎవరికైనా తెలుసు. మరి ఏ ప్రభుత్వమైనా తన ఓటమిని కోరుకుంటుందా? ఏదో ఒక సమస్య తెరపైకి తెచ్చి, వాయిదా వేయించి గండం గట్టెక్కించి పిండాన్ని బయట పడేయించదూ?! బిజెపి కూడా అదే చేసింది.
బిజెపినే కాదు. కాంగ్రెసూ అదే చేస్తుంది. అయితే, ఇక్కడ ఆశ్చర్యం ఏమిటంటే.. రాష్ట్రంలో ఒక్కటంటే ఒక్క సీటుకూ దిక్కులేని కాంగ్రెస్, మూడురోజుల నుంచి హోదాపై హడావిడి చేయడం. తాను హత్యచేసిన మనిషి, సమాధి వద్దకు వెళ్లి సంతాపం ప్రకటించడమంటే ఇదే. ఒకరకంగా కాంగ్రెస్ చేసింది సాహసమే. ఎందుకంటే తనకు కొత్తగా పోయిందేమీలేదు. తనపై ఉన్న విభజనపాతకం కొంత తగ్గుతుంది. నష్టమేమైనా వస్తే అది తెదేపా, భాజపాకు మాత్రమే. తెదేపా ప్రధానిని నిలదేసేంత ధైర్యం చేయదని, బిజెపి కూడా హోదాపై తెదేపాను లెక్కచేయదని కాంగ్రెస్‌కు తెలుసు. అందుకే ఢిల్లీ వేదికగా కాంగ్రెస్ పార్టీ హోదా డ్రామాను రక్తికట్టించింది. చివరకు చాణక్యుడిగా పేరున్న చంద్రబాబు కూడా కాంగ్రెస్ ఉచ్చులో చిక్కుకోవలసి వచ్చింది. ఆరకంగా తెదేపా, భాజపాలను విజయవంతంగా ఇరికించడంలో కాంగ్రెస్‌వారు సఫలీకృతులయ్యా రు. అంటే హోదా నాటకంలో కాంగ్రెస్ గెలిచిన ట్టే. ప్రధాన పాత్రధారి కెవిపికి ఉత్తమ కథానాయకుడు అవార్డు ఇవ్వకపోతే అన్యాయం చేసినట్టే.
ఇక కాంగ్రెస్ ఉచ్చులో చిక్కుకుని, ఆ పార్టీ దారిలో నడవక తప్పని పరిస్థితి తెచ్చుకున్న తెదేపా కూడా, హోదా నాటకంలో రజత బహుమతి అందుకుంది. హోదాపై తన దుస్థితి మిత్రపక్షమైన భాజపాకు తెలుసు కాబట్టి, తన పోరాట స్థాయి కూడా అది అర్ధం చేసుకుంటుందన్న ‘అవగాహన’తో తెదేపా కూడా ఢిల్లీ రంగ స్థలం మీద రెచ్చిపోయింది. తన ప్రత్యర్ధి కాంగ్రెస్ బిల్లు పెట్టింది కాబట్టి తాను మద్దతునీయనంటే జనంతోపాటు, కాంగ్రెసుకూ తెదేపా దొరికినట్టే. మీకు పార్టీలు ముఖ్యమా? రాజకీయ ప్రయోజనాలు ముఖ్యమా? అని బాబు వ్యతిరేక మీడియా ఆక్షేపించనూవచ్చు. అందుకే తెదేపా కూడా నాటకాన్ని రక్తికట్టించి, తనకు కాంగ్రెస్ శత్రువయినా, రాష్ట్ర ప్రయోజనం కోసం మద్దతు ప్రకటించినట్లు ప్రచారం చేసుకుని నటవిరాట్టయింది.
ఇక బిల్లు ఓటింగు వరకూ రాకుండా మధ్యలో ఆప్ పార్టీ ఎంపి పిల్లచేష్టను తెరపైకి తీసుకువచ్చి, సభను వాయిదా వేయించిన బిజెపి కూడా హోదా నాటకంలో కన్సొలేషన్ ప్రైజు కొట్టేసింది. రాజకీయ పార్టీలకు కొన్ని అస్త్రాలు రిజర్వులో ఉంటాయి. వాటిని ఎప్పుడంటే అప్పుడు బయటకు తీయవు. ఇదిగో.. ఇలా పీకలమీదకొచ్చినప్పుడు వాటిని బ్రహ్మాస్త్రంలా సంధించి, ప్రత్యర్ధుల మాడు పగలగొడుతుంటాయి. రామాయణంలో పిడకలవేటలా, హోదాపై హాట్ టాపిక్ కాస్తా, ఆమ్ ఆద్మీ ఎంపి పార్లమెంటు వీడియో వ్యవహారం రాజ్యసభలో వివాదంగా మారి, వాయిదాకు దారితీస్తుందని ఎవరూ ఊహించలేదు. రాజకీయమంటే అదే మరి!
అసలు ఈ నాటకంతో సంబంధం లేని తెరాస కూడా తన వంతుపాత్ర పోషించడమే ఆశ్చర్యం. బిల్లు ఓటింగు వరకూ వస్తే, తామూ మద్దతునిస్తామని తెరాస ఉత్తరాధిపతి తారకరాముడు బాంబు పేల్చారు. అసలు ఏపి ప్రత్యేక హోదాతో తెరాసకు ఏం సంబంధం? ఏపికి హోదా వస్తే తెలంగాణకు వచ్చే లాభమేమిటి అని కదా అందరి ఆశ్చర్యం?! అదే మరి కేసీఆర్ లాజిక్కు. ప్రైవేటు బిల్లుతో ఏపీకి హోదా వస్తే, తర్వాత తమనూ అదే పంక్తిలో కూర్చోబెట్టాలన్నది తెరాస అసలు తెలివి.
ఈ మొత్తం వ్యవహారంలో రాజకీయ పార్టీలు విజేతలయితే, పరాజితులు మాత్రం ప్రజలు. పాపం మీడియా హడావిడితో ఢిల్లీలో ఏదో జరుగుతుందని భ్రమించి, హోదా వచ్చేస్తుందని అపోహపడి సాయంత్రం వరకూ చకోరపక్షుల్లా, టీవీలకు అతుక్కుపోయిన వెర్రిబాగుల జనాల అమాయకత్వానికి జాలిపడక తప్పదు. చాలామంది మేధావులనుకునే మహానుభావులు కూడా హోదాపై ఏదేదో జరిగిపోతోందని కథనాలు, వ్యాసాలు రాసి, సానుభూతికి పాత్రులయ్యారు.
* * *
‘నిద్రాదేవత నిన్ను వరించుగాక నిర్భాగ్య దామోదర’.. లోక్‌సభలో వాడివేడి వాదనలు జరుగుతున్న క్రమంలో నిరసన స్వరంతో సభ నుంచి తన పార్టీ నిష్క్రమించినా, నిద్రాదేవతతో ముచ్చట్లాడుతూ మైమరిచిన కాంగ్రెస్ పార్టీ ఆశాకిరణం అవునో కాదో తెలియని రాహుల్‌బాబును చూసి న తర్వాత.. పాతకాలపురోజుల్లో మన పెద్దలు చెప్పిన ఈ పద్యం గుర్తుకురాక మానదు! చాలామంది ప్రజాసమస్యలను చర్చించేందుకు, వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి, పరిష్కారం కోసం పోరాడేందుకే పార్లమెంటుకు వెళతారన్న భావనను సోనియా పుత్రరత్నం తన నిద్రతో పటాపంచలు చేశారు. అదృష్టం కలసి వచ్చి, లౌకికపార్టీలన్నీ తన నీడన చేరి, వచ్చే ఎన్నికల్లో గెలిస్తే ఈ దేశానికి ప్రధాని కావాలని కలలు కంటున్న రాహుల్, నిజంగానే కలల్లోనే జీవిస్తున్నట్లున్నారు. ఇలాంటి యువ చైతన్యమూర్తి ఏలుబడిలో నిజంగా దేశం వెళితే, దాని పరుగు, పురోగతి కూడా నిద్రలోనే నడుస్తున్నట్లే ఉంటుంది. గాంధీ కుటుంబానికి చివరి ఆశాదీపమైన రాహుల్, ఈ వయసులోనే దేవెగౌడతో పోటీ పడుతున్నారు. ఇలా లోక్‌సభలో యువరాజావారు సుఖనిద్ర పోవడం ఇది రెండోసారి మాత్రమే.
పని ఒత్తిళ్లతో ఎవరైనా కునుకు తీయడంలో తప్పులేదు. కానీ, దేశంలో ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా అక్కడ ప్రచారం చేసి, సొంత పార్టీని ఓడించిన ఘనత సాధించిన రాహుల్‌కు, ఇప్పుడు చేయడానికి పెద్ద పని కూడా లేదు. పార్టీపరంగా తీసుకుంటున్న నిర్ణయాలన్నీ రాహుల్ ప్రమేయం లేకుండానే వృద్ధజంబూకాలు సోనియమ్మ సైగతో లాగించేస్తున్నారు. ఇక మరి యువరాజాకు చేయడానికి పనేముంది?
అక్కడికీ ఆత్మపరిశోధన పేరుతో కేరళ, కాకపోతే గుట్టుచప్పుడు కాకుండా ఏ మలేసియాకో, ఏ థాయ్‌లాండుకో వెళుతూనే జీవితం గడుపుతున్న రాహుల్‌బాబు కంటే సుఖపురుషుడు ఈ ప్రపంచంలో ఎందరుంటారు? అలాంటి అదృష్టం ఎంతమందికి పడుతుంది? స్నేహితులను బట్టి అతను ఎలాంటి వాడోఅంచనా వేయవచ్చు. అలాగే పార్టీ నాయకుడిని చూసి పార్టీ భవిష్యత్తు చెప్పవచ్చని రాహుల్‌ను చూస్తే మొట్టమొదట అర్ధమవుతోంది!
* * *
అక్షరాలా రెండు కోట్లు తీసుకుంటున్న మన బంగారు తెలంగాణ బ్రాండ్ అంబాసిడరు సానియా మీర్జా కనిపించడం లేదని ఎవరన్నారు? తెలంగాణను హరితవనంగా మార్చేందుకు కేసీఆర్ నుంచి కేటీఆర్ వరకూ రోడ్డుమీదకు వచ్చారు. తెలంగాణకు బ్రాండ్ అంబాసిడర్‌గా రెండు కోట్లు తీసుకుని సానియామీర్జా, ఆ ఈవెంటుకు ఎందుకు ప్రచారం కల్పించలేదన్న విమర్శలకు జవాబుగా, ‘తాను సైతం’ రెండు మొక్కలు నాటుతూ రాకెట్ రాణి మీడియాకు ఫొటోలు రిలీజు చేసింది. బ్రాండ్ అంబాసిడరు నుంచి అంతకుమించి ఆశించడం కూడా అత్యాశే అవుతుందేమో? ఏమో? ఆమె నాటిన మొక్క రేపు మహావృక్షమవుతుందేమో? ఎవరికి తెలుసు!

మార్తి సుబ్రహ్మణ్యం సెల్: 9705311144