మెయన్ ఫీచర్

ఎన్నికల్లో నేరస్థులను నిరోధించడం ఎలా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదవీ విరమణ చేస్తున్న చివరి రోజులలో పలు సున్నితమైన అంశాలపై కీలకమైన తీర్పులు ఇస్తూ జస్టిస్ దీపక్ మిశ్రా దేశ ప్రజల దృష్టిని ఆక ట్టుకున్నారు. ఆయనతో పాటు ఇతర న్యాయమూర్తులు కూడా గత పక్షం రోజులలో పలు కీలక తీర్పులు ఇచ్చారు. ఈ సందర్భంగా వచ్చిన తీర్పులలో- క్రిమినల్ కేసు లున్నవారిని చట్టసభలకు ఎన్నిక కాకుండా చేయడం ఎ లా? అనేది ముఖ్యమైనదిగా చెప్పవచ్చు. ఎన్నికల్లో పోటీ చేయడం అనేది దైవం ఇచ్చిన హక్కు గానీ, మానవ హక్కు గానీ కాదు. రాజ్యాంగం ప్రకారం ప్రాథమిక హక్కు కూడా కాదు. ఎన్నికలలో పోటీ చేయాలంటే పలు ఆంక్షలు ఉన్నాయి. లోక్‌సభకు పోటీ చేయాలంటే కనీసం 25 ఏళ్ల వయస్సు, రాజ్యసభకు అయితే 30 సంవత్సరాలు ఉండాలి. కనీసం రెండు సంవత్సరాల జైలు శిక్షకు గురైనా, కొన్ని రకాల నేరాలలో శిక్ష పడినా పోటీ చేయడానికి వీలు లేదు. పార్లమెంట్‌లోకి నేరస్థులు రాకుండా నిరో ధించడానికి ఇవి సమంజసమైన ఆంక్షలని భావించవచ్చు.
అయితే కోర్టులలో కేసుల విచారణ పూర్తి కావడం సుదీర్ఘ ప్రక్రియగా మారుతూ ఉండటం, కోట్ల కొలదీ కేసులు పరిష్కారం కాకుండా ఉండటం, సగం మందికి పైగా న్యాయమూర్తుల పోస్ట్‌లు భర్తీ కాకుండా ఉండటం వంటి కారణాలతో శిక్ష పడే వరకు వేచి చూడకుండా- క్రిమినల్ కేసులుంటే ఎన్నికలలో పోటీ చేయకుండా చేయాలనే డిమాండ్ కొంత కాలంగా పౌర సమాజ సంస్థల నుండి వస్తున్నది. ఇందుకు క్రిమినల్ కేసులున్న వారి సంఖ్య చట్టసభలలో పెరుగుతూ ఉండటం కూడా కారణమే కావచ్చు. క్రిమినల్ కేసులున్న వారు 2009లో 162 మంది లోక్‌సభకు ఎన్నిక కాగా, వారి సంఖ్య 2014 నాటికి 182కు పెరిగింది. అంటే ప్రతి ముగ్గురు ఎంపీలలో ఒకరు క్రిమినల్ కేసులను ఎదుర్కొంటున్నారు. ఇది నిజంగా ఆందోళన కలిగించే అంశమే. ప్రభుత్వ ఉద్యో గులపై దౌర్జన్యం చేయడం, హత్యలకు పాల్పడటం లేదా ప్రయత్నించడం, అపహరణలకు పాల్పడటం, అత్యా చారాలు చేయడంవంటి తీవ్రమైన నేరారోపణలు పలువురు ఎదుర్కొంటున్నారు. ఇటువంటి వారు చట్టసభలలో ఉండటం ప్రజాస్వామ్య వ్యవస్థనే కళంకితం చేస్తుంది. తీవ్ర నేరారోపణలు ఉన్నవారి సంఖ్య పార్లమెంట్‌లో క్రమంగా పెరుగుతున్నది. ప్రతి ఐదుగురు ఎంపీలలో ఒకరు తీవ్ర నేరారోపణలు ఎదుర్కొం టున్నారు. ఇలాంటి వారిని ఎన్నికలలో పోటీ చేయకుండా అడ్డుకొనే అధికారం తమకు లేదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. వారి నేరాల గురించి విస్తృతంగా ప్రచారం జరిగేలా చూడాలని ఎన్నికల కమిషన్‌ను ఆదేశించింది. ఈ విషయంలో పార్లమెంట్ ప్రేక్షక పాత్ర వహిస్తున్నది.
సహజ న్యాయసూత్రాలకు విరుద్ధంగా నేరారోప ణలున్నంత మాత్రాన ఎన్నికలలో పోటీ చేయకుండా చేయడం తగునా? అనే ప్రశ్న తలెత్తుతుంది. రాజకీయ నాయకులలో కొందరు వ్యక్తిగతంగా నేరచరిత్ర గలిగిన వారున్నా, చాలామంది రాజకీయ కారణాల వల్ల ఆరోప ణలను ఎదుర్కొంటున్నారు. రాజకీయ ప్రత్యర్థులను రాజద్రోహం వంటి కాలం చెల్లిన చట్టాల కింద అరెస్ట్ చేస్తున్న సమయంలో- రాజకీయ విబేధాల ఫలితంగా కేసులు నమోదు చేయడం సహజంగా జరుగుతోంది. వ్యక్తిగతంగా హత్యలు, మానభంగాలు, అపహరణలు వంటి తీవ్రమైన నేరాలకు పాల్పడటం ఒక అంశమైతే, రాజకీయ ప్రత్యర్థులపై అటువంటి కేసులు నమోదు చేయడం మరో అంశంగా పరిగణించాలి. రాజకీయ ఉద్యమాలలో పాల్గొన్న వారిపెనా నేరారోపణలతో కేసుల నమోదు జరుగుతున్నది. కర్ఫ్యూను ధిక్కరించినా, ప్రజా సమస్యలపై ఉద్యమించినా, శాంతియుతంగా ప్రదర్శనలు జరిపినా కేసుల నమోదు జరుగుతున్నది.
దశాబ్దాల తరబడి అయోధ్య అంశాన్ని న్యాయస్థానాలు తేల్చకుండా కాలయాపన చేస్తూ ఉంటే సహజంగానే ప్రజలలో అసహనం పెరిగే అవకాశం ఉంది. అయోధ్యలో రామమందిరం నిర్మాణం కోసం ఉద్యమించిన వారిపై తీవ్రమైన ఆరోపణలతో నమోదైన కేసులను ఈ సందర్భంగా పరిగణనలోకి తీసుకోవచ్చు. రాజీవ్ గాంధీ, వంగవీటి మోహన రంగా వంటి నేతలు హత్యలకు గురైనప్పుడు వారి అనుచరులు సృష్టించిన విధ్వంసాలకు సంబంధించి చట్టం ప్రకారం చర్యలు తీసుకోకుండా, రాజకీయ ఉద్యమాలలో పాల్గొన్న వారిపై చర్యలకు పాల్పడటం ప్రశ్నార్థకం అవుతోంది. హింసాయుత మార్గం చేపట్టి, పోలీసులు, సాయుధ దళాలపై దాడులకు పాల్పడుతున్న మావోయిస్టులు, పలు తీవ్రవాద బృందాల ఉద్యమాలను రాజకీయ ఉద్యమాలుగా పరిగణించవచ్చా? అనే ప్రశ్న తలెత్తుతుంది. వారు కూడా రాజకీయ ఉద్యమాలే చేస్తున్నారు కాబట్టి వారికి కూడా ఎన్నికలలో పాల్గొనే అవకాశం కల్పించగలమా? గత అర్ధ శతా బ్దికాలంలో మావోయిస్టులు వేలాదిమంది సాయుధ దళాల వారినే కాకుండా అమాయకులను సైతం హత మార్చారు. వారిలో ఎంతమందిని చట్టం ముందుకు తీసు కువచ్చి, తగు శిక్షలు విధించగలిగాము? ఈ విషయంలో పౌర సమాజం ప్రేక్షకపాత్ర వహించడం లేదా ?
కొద్ది రోజుల క్రితం ఢిల్లీ వైపు బయలు దేరిన కిసాన్ క్రాంతి మోర్చా రైతులు తమను అడ్డుకున్న పోలీస్ వలయాన్ని ట్రాక్టర్‌లతో ఛేదించే ప్రయత్నం చేశారు. వీరి నేరాలను- తుపాకులతో విశాఖ ఏజెన్సీలో ప్రజా ప్రతినిధులను కాల్చి చంపిన మావోయిస్టుల చర్యతో సమానంగా చూడగలమా? ప్రజా ఉద్యమాల సంద ర్భంగా జరిగే నేరాలు ఉద్దేశ పూర్వంగా, రాజకీయ సిద్దాంతం రంగు పులిమి దారుణమైన హింసాకాండకు, విధ్వంసానికి దిగడాన్ని వేరు చేసి చూడగలగాలి.
1999 ఎన్నికల సందర్భంగా- అంతకు ముందు ఎన్నికలలో గెలుపొందిన వారిలో క్రిమినల్ కేసులు ఉన్న వారి జాబితాను లోక్‌సత్తా అధినేత డా. జయప్రకాశ్ నారాయణ్ ప్రకటించి సంచలనం కలిగించారు. ఆ తర్వాత రాజకీయ సంస్కరణల సంఘం, నేషనల్ ఎలక్షన్ వాచ్ వంటి సంస్థలు ప్రతి ఎన్నికల సందర్భంగా అంతకు ముందు గెలిచిన, పోటీ చేస్తున్న, గెలుపొందిన వారి నేర చరిత్ర గురించి నివేదికలను బహిరంగ పరుస్తున్నాయి. 1991 నుండి నామినేషన్ ఫారం తో పాటు అభ్యర్థులు తమ ఆస్తులు, అప్పుల వివరాలను, తమపై ఉన్న క్రిమినల్ కేసుల వివరాలను అభ్యర్థులు విధిగా సమర్పించ వలసి ఉంది. అయితే ఇటువంటి చర్యలు ప్రజలపై ఎటువంటి ప్రభావం చూపుతున్నాయనే అంశాన్ని పరిశీలించాలి. ఇటువంటి నివేదికల వల్ల, అఫిడవిట్‌లో తమపై ఉన్న క్రిమినల్ కేసులను బహిరంగ పరచిన కారణంగా ప్రజలు తాము అనుకున్న వారికి వోటు వేయకుండా ఎక్కడైనా ఉన్నారా? ఇటువంటి ప్రకటనలు అభ్యర్థుల గెలు పోటములపై ప్రభావం చూపుతున్నాయా ? ఈ అంశాన్ని గమనిస్తే మనకు నిజంగానే తీవ్ర నిరాశ కలుగుతుంది. కొన్ని పౌర సమాజ సంస్థలు, మీడియా సంస్థల సమాలోచనలకు మాత్రమే క్రిమినల్ కేసులు ఉపయోగ పడుతున్నాయి గాని ఓటర్ల నిర్ణయంపై ప్రభావం చూపడం లేదని చెప్పక తప్పదు.
సహజంగానే మన ఓటర్లు నేరస్థులను ఎన్నుకోవడానికి అంతగా ఇష్టపడరు. అటువంటి వారికి సామాజిక గౌరవం చెప్పుకోదగినంతగా ఉండదు. మరో దారిలేక లేదా భయం, వత్తిడుల కారణంగా లేదా కులం, మతం వంటి అంశాల ప్రాతిపదికగా వోటు వేయవచ్చు. పార్లమెంట్ ప్రత్యేకంగా ఒక చట్టం తీసుకుని రావడం ద్వారా నేరారోపణలు గలవారిని ఎన్నికలలో పోటీ చేయకుండా చేయలనకొంటే రాజకీయ వేధింపులను మరింత తీవ్రతరం చేసి, తప్పుడు కేసుల నమోదుకు దారితీస్తుంది. స్వచ్ఛమైన అభ్యర్థులను ఎన్నుకోవడానికి దారి తీయదని గమనించాలి.
ప్రస్తుతం అనేక అంశాలపై విప్లవాత్మకమైన చట్టాలు మన దేశంలో ఉన్నా, ఆచరణలో ప్రభావం చూపలేక పోతున్నవి. పార్లమెంట్ మరో చట్టం తీసుకు వచ్చినంత మాత్రాన పెద్దగా ప్రయోజనం ఉండబోదు. ప్రస్తుతం ఉన్న క్రిమినల్ చట్టాల పరిధిలోనే సత్వర గతిన నేర విచారణలు పూర్తి అయ్యేలా చేస్తే క్రిమినల్ నేరాలలో పాల్గొన్నవారిని ఎన్నికలలో పోటీ చేయకుండా చేయవచ్చు. ఇందుకు ముందుగా న్యాయవ్యవస్థలో సంస్కరణలు అవసరం. దీనికి న్యాయవ్యవస్థ సిద్ధంగా ఉందా? క్రిమినల్ కేసుల విచారణలో కోర్టులు ప్రదర్శిస్తున్న ఉదాసీనత, నిర్లక్ష్య ధోరణులను పరిశీలించే ప్రయత్నం చేయకుండా పార్లమెంట్ మరో చట్టం చేయాలనీ సూచించడం తమ బాధ్యతను మరొకరిపైకి నెట్టడమే కాగలదు. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకొనే ప్రయత్నం కాగలదని గమనించాలి. నేడు జైళ్లలో ఉన్న వారిలో 80 నుండి 90 శాతం వరకు నేరారోపణలు ఎదుర్కొంటున్న వారే. అనేక మంది తమపై మోపబడిన కేసులో లభించే గరిష్ట శిక్షా కాలం కన్నా నేర విచారణ కోసం జైళ్లలో ఎక్కువ కాలం గడుపు తున్నారు. ఇది ఒక విధంగా ఆత్యంత అమానుషమైన నేర న్యాయ వ్యవస్థ అని చెప్పవలసిందే. ముందుగా ఈ విషయంలో న్యాయవ్యవస్థ విప్లవాత్మకమైన మార్పులకు సిద్ధం కావాలి.
రాజకీయ పార్టీలు ఎన్నికలలో విజయావకాశాలు గలవారిని అభ్యర్థులుగా ఎంపిక చేసుకో వలసిందే. ఈ విషయంలో నైతిక అంశాలను పరిగణనలోకి తీసుకొనే పరిస్థితులు ఇప్పుడు లేవు. నేరారోపణలు ఎదుర్కొంటున్న వారు పలు రాష్ట్రాలలో మంత్రులుగా కొనసాగుతున్నారు. ఇటువంటి వారిని తమ ప్రతినిధులుగా ఎన్నుకోకుండా ప్రజలలో చైతన్యం తీసుకు రావలసిన అవసరం ఉంది. అవినీతిపరులు, నేరస్థులు నేడు రాజకీయ పార్టీలలో, ప్రభుత్వాలలో నిర్ణయాత్మక పాత్ర వహించే పరిస్థితులు నెలకొన్నాయి.
స్వచ్ఛమైన అభ్యర్థులు ఎన్నిక కావాలంటే ముందుగా రాజకీయ పార్టీలలో సంస్కరణలు అవసరం. మన దేశంలో దాదాపు అన్ని పార్టీలలో ఒకే కుటుంబ పెత్తనం కొనసాగుతున్నది. ప్రాంతీయ పార్టీలు కుటుంబ పార్టీలుగా మారాయి. ఒకే వ్యక్తి, ఒకే కుటుంబానికి చెందిన వారు దశాబ్దాలుగా ఆయా పార్టీల అధ్యక్షులుగా, ముఖ్యమంత్రులుగా కొనసాగడం ప్రజాస్వామ్యమా? ఈ మధ్యనే మృతిచెందిన కరుణానిధి సుమారు అర్ధ శతాబ్దకాలం పాటు డీఎంకే అధ్యక్షుడిగా కొనసాగటం గమనార్హం. కాంగ్రెస్ పారీకి చిరకాలంగా ఒక కుటుంబమే గత్యంతరంగా మారింది. శివసేనకు ఉద్దవ్ థాకరే, సమాజ్‌వాదీ పార్టీకి అఖిలేశ్ యాదవ్, జేడీ ఎస్ లో హెచ్ డి కుమారస్వామి, డీఎంకేకు ఎంకే స్టాలిన్ నేతృత్వం వహిస్తున్నారు. టీఆర్‌ఎస్‌లో కేటీఆర్, తెలుగుదేశంలో నారా లోకేష్, ఆర్‌జేడీలో తేజస్వి యాదవ్ వారసులుగా రాణిస్తున్నారు. విధానాలు కాకుండా వ్యక్తులు, కుటుం బాలు నిర్ణయాత్మకంగా మారుతూ ఉంటాయో అటువంటి చోట ఎటువంటి విలువలకు ఆస్కారం ఉండదు. వ్యక్తి ఆరాధనకు ఆస్కారం లేని సిపిఎంలో సైతం జ్యోతిబసును సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా కొనసాగేటట్లు చేయడం, బీజేపీలో 30 ఏళ్ళ పాటు వాజపేయి, ఎల్ కె అద్వానీ తప్ప మరో నాయకుడికి ప్రాధాన్యత లేకుండా చేయడం... ఇవ్వన్నీ ప్రజాస్వామ్య పటిష్టతకు సహకరించవు. ముందుగా రాజకీయ పార్టీలలో అంతర్గత ప్రజా స్వామ్యానికి చట్టబద్దమైన ఏర్పాట్లు అవసరం. ఐదేళ్ల మించి ఒకే వ్యక్తి అధ్యక్షుడిగా ఉండకుండా, 10 ఏళ్లకు మించి ఒకే వ్యక్తి ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా లేకుండా చేయగలగాలి. అటువంటి సాహసం చేయడానికి మన నేతలు సిద్ధంగా ఉన్నారా ?

--చలసాని నరేంద్ర