మెయిన్ ఫీచర్

బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహాలయ అమావాస్య నుంచి మహర్నవమి వరకు సాగే ఈ ఉత్సవం తెలంగాణ సాంస్కృతిక సౌరభాల్ని వెదజల్లుతుంది. ఇక్కడ గడపగడపలో బతుకమ్మ తొమ్మిదిరోజులపాటు కనువిందు చేస్తుంది. తొమ్మిది పూర్ణత్వానికి ప్రతీక. నవ విధులకు, నవావరణాలకు ప్రతిబింబంగా బతుకమ్మను తొమ్మిది రకాల పూలతో అలంకరిస్తారు. తంగేడు, గునుగు, కట్ల, రుద్రాక్ష, సీతమ్మజడ, గోరింట, గుమ్మడి, బంతి, మందార, గనే్నరు, బీర, నిత్యమల్లె పుష్పాలను క్రమపద్ధతిలో అమర్చుతారు. మధ్యలో పసుపుతో చేసిన గౌరమ్మను ఉంచుతారు. ఈమె ఈ తొమ్మిదిరోజులు పుట్టింటికి వచ్చినట్లుగా భావించి ..
బతుకమ్మ.. బతుకమ్మ.. ఉయ్యాలో..
బంగారు బతుకమ్మ ఉయ్యాలో..
తంగేడు పువ్వై తరలిరావే తల్లి..
మందార పువ్వై మురిపెంగరా.. కల్పవల్లీ..
పారిజాతమై పరిమళించగరావే..
పున్నాగ పువ్వై పులకించగరావే..
బంగారు బతుకమ్మా..
సింగారాల మాయమ్మా..
బతుకమ్మ.. బతుకమ్మ.. ఉయ్యాలో.. అంటూ తమ మమకారాన్ని చాటుకుంటారు పుట్టింటివారు.
సెప్టెంబరు, అక్టోబర్ నెలల్లో తెలంగాణ ప్రాంతం అంతా పండుగ కోలాహలం కనిపిస్తుంది. అన్ని పండుగల్లో బతుకమ్మ పండుగకు విశిష్టమైన స్థానం ఉంది. దసరా పండుగకు ఎంత ప్రాధాన్యం ఉందో బతుకమ్మ పండుగకు కూడా అంతే ప్రాధాన్యం ఉంటుంది. ఇది మహిళలకు సంబంధించిన పండుగ. వర్షాకాలం ముగిసిపోయి, శీతాకాలం ప్రవేశిస్తున్న సమయంలో వాతావరణం పచ్చగా ఉంటుంది. ప్రకృతి మాత ఆకుపచ్చ చీర కట్టుకున్నట్టుగా ఉంటుంది. రకరకాల పూలతో చెట్లన్నీ విరబూస్తాయి. ముఖ్యంగా గునుక, తంగేడు పూలు విరగకాసి ప్రకృతి మాతకు మరింత అందాన్ని అద్దుతాయి. చెరువులన్నీ కొత్త నీటితో కళకళలాడుతూ ఉంటాయి. ఇలాంటి వాతావరణంలో తెలంగాణా ఆడపడుచులు ప్రకృతి సౌందర్యాన్నంతా ‘బతుకమ్మ’లో పేర్చి వైభవంగా ఈ పండుగను జరుపుకుంటారు.
బతుకమ్మ కథ
బతుకమ్మ పండుగ వెనుక అనేక కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. వాటిలో ముఖ్యమైన కథలు రెండున్నాయి. మొదటి కథ.. మహిషాసురుడితో యుద్ధం చేసిన దుర్గాదేవి అలసటతో సొమ్మసిల్లి, పడిపోయింది. తోటి మహిళలు ఆమెకు సేవలు చేసి పాటలను ఆలపిస్తూ, ఆమెలో తిరిగి చైతన్యం తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. సపర్యలు చేసి సేదతీర్చారు. తొమ్మిదోనాడు ఆది పరాశక్తి అలసట పూర్తిగా తీరిపోయింది. వెంటనే దుర్గాదేవి విశ్వ చైతన్యమూర్తిగా అవతరించి మహిషాసురుణ్ణి సంహరించింది. లోకంలోని చీకట్లను, చెడులను పారద్రోలి కొత్త వెలుగును ప్రసరింపచేసింది. అందరికీ బతుకునిచ్చిన అమ్మ కాబట్టి ఆమెను ‘బతుకమ్మ’గా వ్యవహరించి పూజిస్తారు ఆడపడుచులు. ఇక రెండో కథ.. ఒక బాలిక భూస్వాముల అకృత్యాలను భరించలేక ఆత్మహత్య చేసుకుందట. అప్పుడు ఆ ఊరి ప్రజలందరూ ‘నువ్వు చనిపోయినా అందరి మనస్సులో కలకాలం ‘బతుకమ్మా..’’ అని దీవించారట.. అప్పటి నుంచి ఆ బాలికను కీర్తిస్తూ, ఆమెనే గౌరమ్మగా పూజిస్తూ ‘బతుకమ్మ’ పండుగ చేసుకుంటారు.
ఒక రాగి పళ్ళెంలో గునుగు, తంగేడు పూలతో పాటు ఇతర పూలను కలిపి వలయాకారంలో పేరుస్తారు. ఇలా పై వరకు ఒక రంగు పుష్పం తరువాత మరో రంగు పుష్పాన్ని పెడుతూ ఆకర్షణీయంగా తయారుచేస్తారు. ఆ తర్వాత తంగేడు పూలను కట్టగా కట్టి వాటిపై పేరుస్తారు. మధ్యలో కూడా రకరకాల పూలను ఉపయోగిస్తారు. ఈ పూల అమరిక ఎంత పెద్దగా ఉంటే బతుకమ్మ అంత పెద్దగా, అంత అందంగా రూపొందుతుంది. పూలను చక్కగా పేర్చడం పూర్తయిన తర్వాత పైన పసుపుతో తయారుచేసిన గౌరీమాతను పెట్టి చుట్టూ దీపాలతో అలంకరిస్తారు. ఇలా తయారుచేసిన బతుకమ్మను పూజ గదిలో అమర్చి పూజిస్తారు. తరువాత బతుకమ్మను బయటకు తీసుకువచ్చి ఆడపడుచులు బతుకమ్మ చుట్టూ తిరుగుతూ, పాటలతో గౌరీదేవిని కీర్తిస్తారు. ఆడపడుచులు కొత్త బట్టలను కట్టుకుని, ఆభరణాలను ధరించి చాలాసేపు బతుకమ్మని ఆడాక ఆడవారు, మగవారు కలిసి చెరువులో నిమజ్జనం చేస్తారు. తరువాత పళ్లెంలో తెచ్చిన నీటితో ఆడవారు వాయినమమ్మా వాయినం అంటూ వాయినాలు ఇచ్చి పుచ్చుకుంటారు. వేరుశెనగ లేదా పెసలను దోరగా వేయించి పిండి చేసి బెల్లంతో కలిపి సత్తుపిండిని తయారుచేస్తారు. దీనితో పాటు పెరుగన్నాన్ని కూడా బతుకమ్మ ఆడేచోటుకు తీసుకువచ్చి ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుని ప్రసాదంలా తింటారు. బతుకమ్మ పండుగకు వారం ముందు నుంచే ఇళ్లలో హడావుడి మొదలవుతుంది. తెలంగాణా ఆడపడుచులు వారం ముందే పుట్టింటికి చేరుకుంటారు. ప్రధాన పండుగకు వారం రోజుల ముందు నుంచే తెలంగాణా ఆడపడుచులు చిన్న చిన్న బతుకమ్మలను తయారుచేసి ప్రతిరోజూ సాయంత్రం బతుకమ్మను చేసి చుట్టూ తిరుగుతూ బతుకమ్మ పాటలు పాడి, చెరువులో బతుకమ్మను నిమజ్జనం చేస్తారు. బతుకమ్మ పండుగ చివరిరోజు జరిగే వేడుకలను, ఆ వైభవాన్ని చూడటానికి రెండు కళ్ళూ చాలవు. ఆ రోజు సాయంత్రం ఆడపడుచులు అందంగా అలంకరించుకుని ముంగిట్లో బతుకమ్మను పెడతారు. చుట్టుపక్కల వారు కూడా వారి బతుకమ్మలను పెట్టి చుట్టూ వలయాకారంగా తిరుగుతూ పాటలు పాడతారు. చీకటిపడే వేళకి ఆడపడుచులందరూ బతుకమ్మలను తలపై పెట్టుకుని చెరువుకు వెళ్లి, అక్కడ కూడా బతుకమ్మను ఆడి నిమజ్జనం చేస్తారు.
ఇలా ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తుల సమ్మేళన రూపమైన ‘అమ్మ’ను పూజిస్తారు మహిళలు. దీనితో పాటు ప్రేమ, శాంతి, సత్యం, క్షమ, ధ్యానం, అహింస, నిగ్రహం, భూతదయ అనే అష్టపుష్పాలతో, మన మనోపుష్పమైన తొమ్మిదో పుష్పాన్ని కూడా జతచేసి అమ్మను పూజించడమే బతుకమ్మ వేడుక.
*
ఒక్కోరోజు ఒక్కో రూపంలో..
మొదటి రోజు: ఎంగిలిపూల బతుకమ్మ
రెండో రోజు: అటుకుల బతుకమ్మ
మూడో రోజు: ముద్దపప్పు బతుకమ్మ
నాలుగో రోజు: నానే బియ్యం బతుకమ్మ
ఐదో రోజు: అట్ల బతుకమ్మ
ఆరో రోజు: అలిగిన బతుకమ్మ
ఏడో రోజు: సకినాల బతుకమ్మ
ఎనిమిదో రోజు: వెన్నముద్దల బతుకమ్మ
తొమ్మిదో రోజు: సద్దుల బతుకమ్మ

-ఉమ