మెయిన్ ఫీచర్

శరదృతువులో శక్తి ఆరాధన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆధ్యాత్మిక చింతనను, సర్వమానవ సౌభ్రాతృతను, సౌహార్థ్భావాల్ని పెంపొందిస్తూ, నూతన తేజోత్సాహాన్ని కలుగజేస్తూ జీవనసరళిని సుసంపన్నంచేసేవే పండుగలు. ధర్మార్థ కామ మోక్షములు అనేవి నాలుగు పురుషార్థములు. వీటిలో- అర్థ కామాల్ని ధర్మబద్ధంగా అనుభవించి మోక్షాన్ని పొందాలని బోధించేవి పండుగలు. భారతీయ సంస్కృతిలోని సామరస్యము, సమైక్యతను ప్రకటిస్తూ దైవప్రీతి, పాపభీతి, సంఘనీతిని అలవరచి సంస్కరించేవి పండుగలు.
మన మహర్షులు వారి దివ్యజ్ఞాన దృష్టితో కాల భేదములలో, ఋతు ధర్మములతో వచ్చే మార్పులను దృష్టిలో ఉంచుకొని నైతిక ధార్మిక సామాజిక వైజ్ఞానిక ఆధ్యాత్మిక విలువలను మానవునికి అలవరచడానికి పోషించడానికి అవకాశం కలిగించేవి పండుగలు పర్వదినములు.
మానవ హృదయంలో ఎప్పుడూ మంచికి చెడుకి సంఘర్షణ జరుగుతూనే ఉంటుంది. అదే అధర్మం, ధర్మం. దైవ సంపత్తిని పొందితే మనలోని స్వార్థం, అధర్మం, పశుత్వం, రాక్షసత్వం నశించి, మానవతా విలువలు గుర్తింపబడతాయి. అజ్ఞానాంధకారం తొలగి, జ్ఞానజ్యోతి, వెలుగు ద్యోతకమవుతుంది. భారతదేశంలో యుగయుగాలుగా పండుగలు పర్వదినములు విశిష్టమైన అంతరార్థములతో కూడి, ఆధ్యాత్మికతను ధార్మికతను పెంపొందించేవిగా ఉంటున్నాయన్నది సత్యం.
అటువంటి పండుగలలో శ్రీదేవీ శరన్నవరాత్రుత్సవములు ప్రధానంగా పేర్కొనబడతాయి.
ఆశ్వయుజ మాసం ఉత్తమం..
పేరునుబట్టి మనకు, స్ర్తి శక్తిని ఆరాధించే పండుగని, ఆ ఆరాధనకు శరదృతువులో అందునా ఆశ్వయుజ మాసం శ్రేష్ఠమని, నవరాత్రులుగా చేసే పూజ అని, కనుక గొప్ప ఉత్సవమని అర్థవౌతుంది.
ఆరాధనా ఉపాసనా మార్గాలు ఎన్ని వున్నా, మాతృభావనతో చేసే ‘శక్తి’ ఆరాధనలో, పిల్లలు తప్పటడుగులు వేసినా, త్రికరణశుద్ధిగా జగన్మాతను విశ్వసించి ఆరాధించేవారికి కన్నతల్లిలాగా కారుణ్యం వాత్సల్యం అనుగ్రహిస్తుంది జగన్మాత.
నిర్గుణ, నిరాకార నిరంజన పరబ్రహ్మ పరమాత్మను, పురుష రూపంగా గాని, స్ర్తి రూపంలోగాని, మరో రూపంలోగాని భావించి ఆరాధించే విధానం- భారతీయ సంస్కృతిలో ఉన్నది.
జగన్మాత సగుణ నిర్గుణ స్వరూప స్వభావాలు, పరతత్త్వం లోకకల్యాణార్థం తల్లిగావించిన దుష్టశిక్షణ, శిష్టరక్షణ, ఆత్మజ్ఞానసిద్ధి మున్నగునవి- శ్రీదేవీ భాగవతం, ఉపనిషత్తులు, శ్రీదేవీ సప్తశతి, ఆదిశంకరులు అనుగ్రహించిన ‘సౌందర్యలహరి’ త్రిపుర సుందరీ మానస పూజాస్తోత్రం, మంత్రమాతృకా పుష్పమాస్తవం, శ్రీలలితా సహస్ర నామావళి, శ్రీదేవీ ఖడ్గమాలాస్తోత్రం మున్నగువాటిలో చక్కగా వర్ణింపబడి, వివరింపబడినాయి.
జగత్కల్యాణానికి జగన్మాతగావించిన దుష్టరాక్షస సంహారంలో భాగమే- మధుకైటభుల సంహారం, మహిషాసుర వధ, దుర్గమాసుర సంహారం, చండ ముండ, శుంభ నిశుంభుల వధ మొదలగునవి. సూక్ష్మంగా పరిశీలిస్తే ఇవన్నీ మనలో జరిగే అంతర్యుద్ధాలే. మనలోని పశుత్వాన్ని అణచి, రాక్షసత్వాన్ని రూపుమాపి, నాటుకున్న మానవత్వ విలువలను ఫలవంతం చేసి, అంతర్లీనంగా ఉన్న దైవతత్వాన్ని దేదీప్యమానంగా ప్రజ్వలింపజేసి, పరిమిత జీవితకాలంలో ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసికొనే జ్ఞానాన్ని విజ్ఞతను అనుగ్రహించి, జీవిత చరితార్థతను ప్రసాదించేది శ్రీదేవీ శరన్నవరాత్రి మహోత్సవములలో జగన్మాత ఆరాధన. ఆ తల్లియే ‘శ్రీదేవి’.
శరదృతువే ఎందుకు ..?
వసంతాది ఆరు ఋతువులలో ముఖ్యంగా చెప్పుకోదగినది శరదృతువు. శరదృతువులో చంద్రుని కాంతి ఎక్కువగా ప్రసరితమవుతుంది. ఆశ్వయుజ కార్తిక మాసములు కలిసి శరదృతువు. అశ్వనీ నక్షత్రంలో పౌర్ణమి వచ్చే మాసం ఆశ్వయుజమాసం. ‘అశ్వినో ఆశ్వయుజౌ’ అనటంచేత, అశ్వినీ నక్షత్రానికి, అశ్వినీ దేవతలు అధిదేవతలు. అశ్వనీ దేవతలు సూర్యపుత్రులు. ఈ మాసంలో సూర్యుడు కన్యారాశిలో సంచరిస్తాడు. కన్యారాశి శక్తితత్త్వానికి స్ఫూర్తిదాయకం. అందుకే శక్తిపూజలు, ఆరాధన, ఉపాసన కన్యామాసం శరదృతువులోనే జరగటానికి గల కారణం.
కన్యారాశికి వెనుక రాశి సింహరాశి. సింహరాశికి అధిపతి రవి. సింహ కన్యరాశులు రెండూ ఆకాశంలో 180 డిగ్రీల నిడివిలో ఉదయిస్తున్నపుడు సింహం జగన్మాతకు ధ్వజంగాను అస్తమిస్తున్నపుడు వాహనంగాను కనుపిస్తుందని పురాణములు పేర్కొన్నాయి. అందుకే శ్రీదేవి సింహవాహినిగా పిలువబడుతోంది.
హస్త చంద్ర నక్షత్రం శరదృతువులో, ఆశ్వీయుజమాసంలో చంద్ర నక్షత్రమైన హస్తానక్షత్రంలో, సూర్యుడు కన్యారాశిలో ఉండగా, శ్రీదేవీ శరన్నవరాత్రుత్సవములు కలశస్థాపన చేసి ప్రారంభిస్తారు. మరల చంద్ర నక్షత్రమైన శ్రవణా నక్షత్రంలో శమీ పూజ చేసి, ఉద్వాసన పలుకుతారు. ఇది శరదృతువు విశేషం.
శరత్, వసంతాలు రెండు ఋతువులు, యముని కోరలుగా చెప్పబడ్డాయి. ఈ ఋతువులు రోగ కారకములని జన నష్టాన్ని కలిగిస్తాయని, దేవీ భాగతం పేర్కొన్నది.

‘‘సర్వ రోగోపశమనం సర్వోపద్రవ నాశనం
శాన్దిదం సర్వారిష్టానాం నవరాత్ర వ్రతమ్ శుభమ్’’

సర్వరోగములను, సర్వ ఉపద్రవములను పోగొట్టి, సర్వారిష్టాల్ని పారద్రోలి సుఖశాంతుల్ని కటాక్షించేది- శ్రీదేవీ శరన్నవరాత్ర వ్రతం అని పేర్కొన్నది స్కాంద పురాణం. ఇంతవరకు, శ్రీదేవీ, శరదృతువు గురించి తెలిసికొన్నాం. ఇపుడు ‘నవ’ శబ్దం గురించి వివరించుకుందాం.
నవ శబ్ద వివరణ
‘నవ’ అంటే తొమ్మిదని, క్రొత్త అని సామాన్యార్థాలు. కాని ‘నవ’ అంటే ‘పరమేశ్వరుడని’ నిర్ణయ సింధువు తెలుపుతుంది. ‘రాత్రి’ అంటే పరమేశ్వరి అనే అర్థం ఉన్నది. కనుక, నవరాత్రి అంటే- పార్వతీ పరమేశ్వరులని అర్థం. నవరాత్రి వ్రతమంటే- పార్వతీ పరమేశ్వరుల, శివశక్తుల, ప్రకృతీ పురుషుల ఆరాధన లేక వ్రతము, పూజ అని అర్థం.
నవరాత్రి వ్రతమంటే తొమ్మిది రాత్రులు చేసే వ్రతమని చెపుతారు. ‘సూయతే స్తూయతే ఇతి నవః’ అనగా నవ శబ్దమునకు స్తుతింపబడుతున్నవాడని అర్థం. పరమాత్మ నవ స్వరూపుడు. శబ్ద రూపమైన వేదం, ప్రకృష్టమైన నవ స్వరూపం. అదే ఓంకార ప్రణవనాద స్వరూపం. ‘నవో నవో భవతి జాయమానః..’ పరమాత్మ నిత్యనూతనుడు. అందరిచేత స్తోత్రం చేయబడుచున్నవాడు. శివ శక్తులకు భేదంలేదు. అందుకే జగన్మాతకు ‘శివా’ అనే నామం కూడా ఉన్నది.
రాత్రి శబ్ద వివరణ
జగన్మాత రాత్రి రూపిణి. పరమేశ్వరుడు పగలు. జగజ్జనని ఆరాధనే రాత్రివ్రతం. రాత్రి దేవియే మహాకాళి, మహాలక్ష్మి, మహా సరస్వతీ రూప నామములతో పూజింపబడుతోంది. అందుకే తల్లికి ‘కాళరాత్రి’ అని పేరు. రాత్రి దేవియే సత్త్వ, రజస్తమో గుణములతో మహాసరస్వతి, మహాలక్ష్మి, మహాకాళి రూపములతో ఆరాధింపబడుతోంది. ఆమెయే కాలరాత్రి, శివరాత్రి, మహారాత్రి, మోహరాత్రియని కీర్తింపబడుచున్నది. మోహరాత్రి అంటే కృష్ణాష్టమినాడు రాత్రి పుట్టి, కంసాదులను మోహింపజేసి, శ్రీకృష్ణుని నందుని ఇంటికి తీసికొని పోవుటకు సాయపడిన జగన్మాత, యోగమాయ.
కాల రాత్రిం బ్రహ్మ సంస్తుతాం వైష్ణవీం స్కందమాతరమ్
సరస్వతీ మదితిం దక్ష దుహితరం నమామః
పావనాం శివమ్
వేదమంత్రము ననుసరించి, కాలరాత్రి అంటే లక్ష్మీ సరస్వతి పార్వతి అని అర్థం. ‘శబ్దాతిగః శబ్ద సహః శిశిరః శర్వరీకరః’ అన్న విష్ణు సహస్ర నామస్తోత్రంలో శర్వరీ అంటే ‘రాత్రి’ అని అర్థం. అలాగే ‘కాలరాత్య్రాది శక్త్యాది వృతా స్నిగ్థౌదనప్రియా’ అన్న లిలతా సహస్రనామ స్తోత్రంలో కూడా ‘కాలరాత్రి’ గురించి చెప్పబడింది. రామాయణంలో, హనుమంతుడు రావణాసురునికి జ్ఞానబోధ చేస్తూ సీతామాత కాలరాత్రి స్వరూపిణి అని, ఆమె జోలికి పోయినా, అవమానంచినా, మొత్తం లంకను భస్మం చేస్తుందని, నిన్ను సర్వనాశనం చేస్తుందని, అయితే భక్తిశ్రద్ధలతో వినయ విధేయతలతో ఆరాధిస్తే, జ్ఞానాన్నిచ్చి, మోక్షాన్నిస్తుందని హెచ్చరించిన విషయం, దేవీ శరన్నవరాత్రుత్సవములలో రాత్రి శబ్దానికి స్ఫూర్తినిస్తుంది.
పూజలో ఎక్కువ తక్కువలెందుకు?
నవ అనగా తొమ్మిది అహోరాత్ర దీక్షగా, రాత్రి పగలు తొమ్మిది రోజులు చేసేవారున్నారు. రాత్రి శబ్దానికి అర్థం తీసికొని తొమ్మిది రాత్రుళ్ళు పూజ చేసేవారున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. అయితే రెండు సంవత్సరముల క్రితం పది రోజులు, దశమి ఒక రోజు పదకొండు రోజులు పూజ చేశాం. మరి ఈ సంవత్సరం 8 రోజులు, ఒక రోజు దశమి పూజ. ఎందుకీ ఎక్కువ తక్కువలు? తిథులు చంద్రగమనాన్ని బట్టి గణనం చేస్తారు. నవరాత్రుత్సవములలో రాత్రి అంటే తిథి అని అర్థం. ‘రాత్రి శబ్దస్య తిథి వాచకత్వాత్’ అనేదాన్ని బట్టి రాత్రి అనగా తిథి అని అర్థం. తొమ్మిది తిథులు, పాడ్యమి మొదలు నవమి తిథి వరకు శ్రీదేవీ పూజ చేస్తారు. తిథులు హెచ్చుతగ్గులొస్తాయని చెప్పుకున్నాం. కనుక శ్రీదేవీ శరన్నవరాత్ర పూజలో ఎనిమిది తిథులు వచ్చి ఎనిమిది రాత్రులు పూజించినా తొమ్మిదిరోజులు ఆచరించినా నవరాత్రమే అవుతుంది. ‘అష్టరాత్రౌ న దోషాయం’ స్మృతి వాక్యం.
పాడ్యమి విశిష్టత
నిర్ణయ సింధువులో, పాడ్యమి అంటే ‘బుద్ధి’ అని చెప్పబడింది. అమరకోశంలో చెప్పబడినట్లు మనుష్యుల బుద్ధియే- శారాదేవి. పాడ్యమి నుండి శారదా దేవిని ఆరాధిస్తే, మంచి బుద్ధిని ప్రసాదిస్తుంది. సర్వశుభములు చేకూర్చుతుంది. కనుక, దేవీ నవరాత్రుత్సవములను శుక్లపక్ష పాడ్యమి నుండే ప్రారంభిస్తారు.
మహోత్సవం అంటే...
‘ఉత్ సూతే హర్ష అనేన ఇతి ఉత్సవః’ - మనలో ఉన్న ఆనందాన్ని పైకి వ్యక్తీకరించటాన్ని ‘ఉత్సవం’ అని అంటారు. ఇది పెద్ద ఉత్సవం. కనుక మహోత్సవం. ఇది శ్రీదేవీ శరన్నవరాత్రి పూజా మహోత్సవానికి, అంతరార్థం.
శ్యామలాంబికే భవాబ్థి తరణే, శ్యామకృష్ణ పరిపాలిత జనని కామితార్థ ఫలదాయకి కామాయి సకలలోక సాక్షి..’ అంటూ జగన్మాతను ఆర్తితో ఆరాధించిన వాగ్గేయకార త్రయాద్యుడు, లయబ్రహ్మ శ్యామశాస్ర్తీ వారి కీర్తన శ్రీదేవీ శరన్నవరాత్రుత్సవములు పాడ్యమి రోజు పూజకు స్ఫూర్తినిస్తుంది.
చలించని మనస్సు, భ్రమించని దృష్టివలన ఏకాగ్రత సాధ్యమవుతుంది. నిష్కామబుద్ధితో తోటివారికి తోడ్పడుతూ, విద్యుక్త ధర్మాన్ని సక్రమంగా నిర్వర్తిస్తూ విశ్వకల్యాణాన్ని కాంక్షిస్తే ఏకాగ్రత సాధ్యమవుతుంది. అదే ధ్యానం. ధ్యానయోగాన్ని ప్రసాదించేది శ్రీదేవీ శరన్నవరాత్రి పూజ.

-పసుమర్తి కామేశ్వరశర్మ 94407 37464